'Kasthuri Ranga Ranga Episode 12' Telugu Web Series
Written By Ch. C. S. Sarma
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
గత ఎపిసోడ్ లో
రంగా పేరు ముందు ఉన్న కస్తూరి అనే పదం గురించి గురించి అడుగుతాడు వసంత్.
క్లుప్తంగా చెబుతాడు రంగా.
సయ్యద్ సర్ ను, పుండరీకయ్యను కలుస్తారు.
ఖాజా గురించిన వివరాలు చెబుతాడు సయ్యద్.
ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 12 చదవండి.
"వసంత్!!..."
"సార్!..."
"వారితో మనం చేసిన సంభాషణ వల్ల నీకు ఏం అర్థం అయింది?..."
"ఈ కేసు తాలూకు వ్యక్తులు అమెరికాలో కూడా వున్నట్టుగా అర్ధం అయింది బాస్..."
బండి గతుకుల్లో పడింది. వూగింది.
"సారీ బాస్..." అన్నాడు వసంత్,
"ఓకే... ఓకే... వసంత్... చూచి అదే మిట్టపల్లాలు... తోలు..." క్షణం తర్వాత...
"వసంత్..."
"సార్!..."
"ఒకవేళ అవసరం అయితే అమెరికా వెళ్లివస్తావా?..."
వసంత్ మౌనం....
"వసంత్!..."
"సార్!..."
"నేను అడిగింది వినపడలేదా!...".
"పడింది సార్!... అది ఏం మామూలు ప్రశ్న కాదు సార్... అమెరికాలో నేను ఇన్విస్టిగేషన్!!..." దీనంగా లాగినట్టు చెప్పాడు.
"యస్!..." ఒత్తి మరీ చెప్పాడు కస్తూరిరంగ.
"సార్!!..." దీనంగా మెల్లగా పిలిచాడు వసంత్.
"ఆ.. చెప్పు...".
"ఆ కార్యం నా ఒక్కడినుంచి కాదు సార్!...”.
"తోటే నేను వస్తే!..."
"మీరు వస్తారా సార్..."
"వస్తే!..."
"రెండు వారాల్లో అమెరికాలో తేల్చాల్సిన లెక్కలనన్నింటినీ తేల్చేసి భారత్‌కు వచ్చేస్తామ్ సార్!..."
"ఒకవేళ.... వసంత్..."
“నీవు ఒక్కడివే వెళ్లవలసి వస్తే !..."
"సార్!..."
"ఆ.. చెప్పు..."
"నాకు ఇంకా పెళ్లికూడా కాలేదు... నా మేనకోడలు నన్నే నమ్ముకొని వుంది. దానికి అన్యాయం చేయడం నాకు మహాపాపం అవుతుంది సార్? ఒంటరిగా నేను అమెరికా వెళితే తిరిగిరాలేను సార్!..." దీనంగా చెప్పాడు వసంత్.
"భయపడకు వసంత్!... అలాంటిదేమీ జరుగదు. నీ వెనక మన రక్షకభటులు వుంటారు నీకు ఎలాంటి అపాయం జరుగకుండా చూచుకుంటూ!..."
"సార్!... చిన్న మనవి!..."
"ఆ... చెప్పు!.....
"మీరు తోటే వస్తానంటే నేను అమెరికా బయలుదేరతాను... ఇంకా ఎవరు వచ్చినా నేను బయలుదేరను..."
కస్తూరి రంగా బిగ్గరగా నవ్వాడు.
ఆ నవ్వును చూచి వసంత్ బిత్తరపోయాడు.
"పట్టుకొనవలసింది... ఆడమనిషిని వసంత్....".
"అయినా మాత్రం... పట్టుకొనవలసింది అమెరికాలో కదా సార్..." దీనంగా అడిగాడు వసంత్.
"వాళ్లు ఇక్కడికే వస్తే?...".
"తప్పక పట్టుకొని మీకు అప్పగిస్తాను!..."
"వసంత్!!..."
"ఇక్కడా పట్టుకొనవలసింది ఆడమనిషినే!... కాని పట్టుకోవడం అంత సులభం కాదు... స్థాన బలిమి..."
వసంత్ రంగా ముఖంలోకి చూచి అవునన్నట్టు తల ఆడించాడు.
కారు విజయవాడలో ప్రవేశించింది.
రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. త్వరగా క్లియర్ అయేటట్టు లేదు. రంగా కారుదిగాడు... నాలుగు అడుగులు ముందుకు నడిచాడు. ముందు బులెట్ పై కూర్చుని వున్న అతనివైపు రంగా చూపు మరలింది... నిలిచింది... కొద్దిగా ముందుకు జరిగి ఆవ్యక్తిని పరీక్షగా చూచాడు. అతని అనుమానం తీరింది. పెదవులపై చిరునవ్వు!...
"వసంత్... నీవు దుర్గమ్మ గుడిముందు వుండు... నేను అరగంటలో వస్తాను..." సెల్ లో చెప్పాడు.
ప్రక్కనేవున్న బులెట్ పై ఓ యువకుడు.
అతన్ని సమీపించాడు రంగా....
"తమ్ముడూ నేను నీ వెనకాల కూర్చుంటాను..." చూపుడు వేలితో తాను ముందు చూచిన వ్యక్తి బైకును చూపుతూ... " దాన్ని ఫాలో చేయాలి..." చెప్పాడు కస్తూరి రంగ.
రంగా వాలకం... మాటతీరును చూచిన ఆ యువకుడు...
"సార్!.. కావాల్సివుంటే మీరు ఈ బండిని తీసుకొని వెళ్లండి సార్!... నేను గుడిముందు వుంటాను. మీరు పని ముగించుకొని అక్కడికి రండిసార్.. ఎంతసేపైనా ఫరవాలేదు...” ఎంతో వినయంగా చెప్పాడు ఆ యువకుడు.
"మీ పేరేమిటి...?"
"కీర్తి ప్రసాద్!.."
"కీర్తి మీ ఇంటి పేరా!..."
"కాదు సార్... నా భార్య పేరు!" సిగ్గుతో తలదించుకొన్నాడు కీర్తి ప్రసాద్.
"ఓ... సూపర్... సూపర్!!... బాగుంది..." నవ్వాడు కస్తూరి రంగ.
కీర్తిప్రసాద్ బండి దిగాడు. "సార్... నేను దుర్గమ్మ గుడిముందు వుంటాను. మీరు వెళ్లి రండి. నా సెల్ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి..." నెంబరు చెప్పాడు. బండి తాళం కస్తూరి రంగా చేతికి ఇచ్చాడు.
"అంటే నన్ను ఒక్కడినే వెళ్లమంటావా!..." రంగా అతను చెప్పిన నెంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చాడు. ట్రాఫిక్ క్లియర్ అయింది. వాహనాలు ముందుకు క్రమంగా సాగాయి. రంగా తాళం తీసుకని బండికి తగిలించి స్టార్ట్ చేసి ముందుకు కదిలాడు.
తాను ముందు చూచిన వ్యక్తిని ఫాలో చేస్తూ బులెట్ ను నడిపాడు. అతను రైల్వే బ్రిడ్జిదాటి బస్ స్టాండ్ కు పోయేదారి ముందు 'యు' టర్న్ తీసుకొని నది ఒడ్డునే దుర్గమ్మ గుడి వెనక నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్లో బండిని నడపసాగాడు. కస్తూరి రంగా అతనికి యాభై అడుగుల దూరంలో బండిని నడిపిస్తున్నాడు.
ఆ వ్యక్తికి కస్తూరి రంగ మీద అనుమానం కలిగింది. రోడ్డులో మధ్య నిర్మాణమైన ఓవర్ చివరన బులెట్ ను ఎడమచేతి వైపున ఉన్న చిన్న వీధిలోకి త్రిప్పి బైక్ దిగి గేట్ తెరచుకొని ఇంట్లోకి పరుగెత్తాడు. అతను లోనికి వెళ్లిన ఐదు నిముషాల్లో ఓ పాతిక సంవత్సరాల వ్యక్తి వచ్చి బులెట్ ను ఇంటి ఆవరణలోకి త్రోసి గేటు బిగించి లోనికి నడిచాడు.
అతను బులెట్ ను లోనికి తోసే సమయంలో కస్తూరి రంగా వీధి చివరకు చేరాడు. ఆ అబ్బాయి చర్యను గమనించాడు. తన బండి వీధి చివరన గోడ వారగా నిలిపి ఆ ఇంటి గేటును సమీపించి..."ఇంట్లో ఎవరండీ!..." పిలిచాడు.
బులెట్ ను లోనికి నెట్టిన అబ్బాయి బయటకు వచ్చాడు. వినయంగా సెల్యూట్ చేశాడు.
"తమ్ముడూ.. మీ పేరు?"
"దివాకర్ సార్!..."
"పదిహేను నిముషాలముందు ఒక వ్యక్తి ఈ బులెట్ పై వచ్చారు. వారు మీకేమవుతారు?..."
"నాకు ఏమీ కారు సార్... మా ఇంట్లో బాడుగకు ఆ పోర్షన్లో వుంటున్నారు...."
"అతన్ని ఒకసారి బయటికి పిలువు తమ్ముడూ!...."
దివాకర్ ప్రక్క పోర్షన్ ద్వారంముందు నిలబడి... "అంకుల్... మీకోసం పోలీస్ ఆఫీసర్ వచ్చివున్నారు... పిలుస్తున్నారు.. రండి" చెప్పాడు దివాకర్.
ఆ వ్యక్తి దివాకర్ ముఖంలోకి దీనంగా చూచాడు. చేతితో అతన్ని సైగతో దగ్గరికి పిలిచాడు. దివాకర్ అతన్ని సమీపించాడు.
"దొడ్డిదారిన బజారు వెళ్లాడని చెప్పు.".. మెల్లగా చెప్పాడు ఆ వ్యక్తి.
కస్తూరిరంగ ద్వారాన్ని సమీపించాడు.
"పున్నయ్య... బయటకురా!...” కస్తూరి రంగ సింహనాదం...
ఆ పిలుపు విన్న అతను ఉలిక్కిపడ్డాడు. 'ఈ పోలీసోడికి నా పేరు ఎలా తెలుసు?... వీడు నన్ను ఎందుకు పిలిచినట్టు?..' మనస్సున భయం... పోక తప్పదు. మెల్లగా ద్వారాన్ని సమీపించాడు.
"పున్నయ్యా!..." జేబునుంచి తాను వుంటున్న హెూటల్ లెమన్ ట్రీ కార్డును తీసి అందించి... నేనెవరో నీకు గుర్తు తెలియడంలా... కానీ నీవెవరవో నాకు తెలుసు. రేపు తొమ్మిదన్నరకు హెూటల్‌కి రా... రూమ్ నంబర్ ఆ కార్డులో వుంది... సరేనా!..." నవ్వుతూ అడిగాడు కస్తూరి రంగ...
పున్నయ్య భయంతో... కన్నీటితో తల ఆడించాడు.
"మిస్టర్ దివాకర్!... థ్యాంక్యూ!..." చెప్పి రంగా వేగంగా వీధిలో ప్రవేశించి బులెట్ ను స్టార్ట్ చేశాడు. ఆ ఇరువురూ ఆశ్చర్యంగా వాకిట నిలబడి చూచారు.
***
"వసంత్!!..." పిలిచాడు కస్తూరి రంగ తన మౌనాన్ని బ్రేక్ చేస్తూ...
"సార్!... " రంగా ముఖంలోకి చూచాడు వసంత్.
ఇరువురూ జాగింగ్ ముగించి స్నానం చేసి డ్రస్ చేసుకొంటున్న సమయంలో వసంత్ ను పలకరించాడు కస్తూరి రంగ.
"వసంత్!... మా నాయనమ్మ ఆ కాలంలో సెవెంత్ వరకు చదివిందట. గొప్ప తెలివి. దైవభక్తి అపారంగా కలిగింది. ఖాళీగా వుంటే శివనామ స్మరణం... ఓం నమశ్శివాయ... ఓంనమశ్శివాయ... అని చేస్తూనే వుండేది. ఆమె చెబుతుండేది...'ఒరే.. రంగా!... 'శత విహాయ భోక్తవ్యం.. సహస్రంస్నాన మాచరేత్... లక్షం విహాయ దాతవ్యం... కోటీం త్యక్తా హరిం భజేత్' ఈ శ్లోకాన్ని నేను అప్పుడపుడు అనుకొంటుంటాను. అర్థం ఏమిటంటే వందపనులు విడిచి పెట్టయినా వేళకు భోజనం చేయాలి. వేయిపనులు విడిచి పెట్టి స్నానం చేయాలి. లక్ష పనులు విడిచి దానం చేయాలి. కోటి పనులు విడిచి దైవ ప్రార్థన చేయాలి... సో... వసంత్ మనం ఇపుడు ఏం చేయాలి..." అతని ముఖంలోకి చూస్తూ అందంగా నవ్వాడు కస్తూరి రంగ.
"బాస్... ఓ మాట చెప్పనా!...
"ఆ... చెప్పు...
"మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు...".
" ఆ... వారూ అదే మాట అంటారు!..."
"ఎవరు సార్!..."
“ఇంకెవరు... మీ వదినగారు సోదరా!.. పద త్వరగా టిఫిన్ చేసి వద్దాం... ఆ పున్నయ్య... కీర్తి ప్రసాద్ వస్తారు... నైన్ థర్టీకల్లా..."
"పదండి బాస్!..."
ఇరువురూ డైనింగ్ హాల్ కి వెళ్లి టిఫిన్ కాఫీ సేవించి గదికి తిరిగి వచ్చారు. రంగా టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నారు. ప్రక్కన వసంత్ కూర్చున్నాడు.
ఒక ముఖ్య ప్రకటన వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం రద్దు... రాష్ట్రపతి పాలన అమలు... త్వరలో...
కాలింగ్ బెల్ మ్రోగింది. వసంత్ వెళ్లి తలుపు తెరిచాడు.
ముందు కీర్తి ప్రసాద్... వెనుక పున్నయ్య నిలబడి వున్నారు.
రంగా సోఫా నుండి లేచి వారి నుద్దేశించి.... "ప్లీజ్ కమిన్!..." నవ్వుతూ చెప్పాడు.
ఇరువురూ గదిలోనికి వచ్చారు. వసంత్ తలుపును మూశాడు.
కీర్తిప్రసాద్... "గుడ్మార్నింగ్ సార్..." సగౌరవంగా సెల్యూట్ చేశాడు.
పున్నయ్య భయంతో చేతులు జోడించాడు.
కస్తూరి రంగ నవ్వుతూ "రండి... కూర్చోండి !..." చెప్పాడు.
ఇరువురూ ఒకే సోఫాలో ప్రక్కప్రక్కన కూర్చున్నా.. యదార్థంగా వారిరువురికి పూర్వ పరిచయం లేదు. కానీ... భయంతో సతమతమవుతున్న పున్నయ్యకు కీర్తి ప్రసాద్ ను తోడుగా భావించాడు. క్షణంసేపు కస్తూరి రంగ ముఖంలోకి చూచి మౌనంగా తలదించుకొన్నాడు.
"ఆ... ఏం తీసుకొంటారు... కాఫీ... టీ... లేక...”
"కాఫీ సార్..." కీర్తిప్రసాద్ చెప్పాడు.
"ఆ.. పున్నయ్యగారూ!... మీకు!..."
రంగా స్టయిల్ మాటను విన్న ముగ్గురూ వులిక్కిపడ్డారు.
"వీడు చూస్తే చెరువులో పిట్టలు పట్టేవాడిలా ఉన్నాడు... వీడికి అంత మర్యాదనా!..." ఆశ్చర్యంగా అనుకొన్నాడు కీర్తిప్రసాద్.
"వచ్చేదారిలో మీ బైక్ పంక్చరు అయింది. ఆ కారణంగా వసంత్ ను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దించమన్నాను. పంక్చరు వేయించాను... ఇదిగోండి... మీ బండి తాళం...
"థాంక్యూ సార్..." కస్తూరిరంగ అందించిన తన బైక్ తాళాన్ని అందుకొన్నాడు కీర్తిప్రసాద్.
"కాఫీ చెప్పనా!..."
అతిథులు ఇరువురూ తలలు ఆడించారు. వసంత్ పాట్ కాఫీ ఆర్డరు చేశాడు. వచ్చి రంగా ప్రక్కన కూర్చున్నాడు...
"కీర్తిప్రసాద్... మీరు కాఫీ త్రాగి వెళ్లవచ్చు. ఫర్ ఎస్టర్‌డేస్ మీ సహాయానికి నా ధన్యవాదాలు..." నవ్వుతూ చేతులు జోడించాడు కస్తూరి రంగ.
"సార్!... నోమెన్షన్ ప్లీజ్!.." చిరునవ్వుతో చెప్పాడు కీర్తిప్రసాద్.
పున్నయ్య బిక్కముఖంతో గది నాలుగు మూలలా చూస్తున్నాడు... 'అయితే నా పక్కనోడు కాఫీతాగి ఎల్లి పోతాడన్నమాట.. ఈ ఇద్దరు పోలీసులు ఆ తర్వాత నన్ను ఏం చేస్తారో... ఏం అడుగుతారో... నన్ను ఎందుకు రమ్మన్నట్టు.... నాతో వీడికేం పని... అసలు వీడెవడు?..... వీడికి నేను, నా పేరు ఎట్టా తెలుసు?... ఈళ్లబారి నుండి నేను ఎట్టా బయటపడేది?...' ఈ ప్రశ్నలన్నింటితో పున్నయ్య సతమతమవుతున్నాడు.
బాయ్ కాఫీ తెచ్చాడు. కప్పుల్లో వంచి నలుగురికీ ఇచ్చాడు.
నలుగురూ కాఫీ త్రాగడం ముగిసింది. బాయ్ ప్లేట్లు కప్పులతో వెళ్లిపోయాడు.
కీర్తిప్రసాద్ నవ్వుతూ లేచాడు. "వెళ్లొస్తాను సార్!.." అన్నాడు.
కస్తూరిరంగ లేచి..."థాంక్యూ బ్రదర్..." కరచాలనం చేశాడు.
కీర్తిప్రసాద్ కస్తూరిరంగాతో కరచాలనం చేసి... జేబునుంచి తన విజిటింగ్ కార్డును తీసి రంగాకు వసంత్ కు ఇచ్చాడు..
అందులో... అడ్వకేట్.. కీర్తిప్రసాద్ అని వుంది. "ఆర్ యు ఏన్ అడ్వకేట్!!.." ఆశ్చర్యంగా నవ్వుతూ అడిగాడు కస్తూరిరంగ.
"యస్ సార్!... అవసరమైతే పిలవండి.. బై!..." నవ్వుతూ చెప్పి కీర్తిప్రసాద్ వెళ్లిపోయాడు. రంగా వసంత్ లు తలుపు దాటి అతనికి బై చెప్పారు.
పున్నయ్య పరిస్థితి పులిబోనులో వున్నట్లుగా వుంది... బిక్కమొఖంతో వారిని చూస్తున్నాడు. 'వాడెవడో మామూలోడనుకొంటే వాడు లాయరా!... ఈళ్లిద్దరూ పోలీసులు!... వీళ్లు ముగ్గురూ దోస్తులు... మరి మన పరిస్థితేందో!...' పున్నయ్య కళ్లల్లో కన్నీరు... తలదించుకొన్నాడు.
"వసంత్... ఈయన మా అమ్మ తమ్ముడు. నాకు మేనమామ.."
"సార్!...".. ఆశ్చర్యంతో నోరు తెరిచాడు వసంత్.
"నేను చెప్పింది నిజం వసంత్!..." కొన్ని క్షణాలు మౌనం తర్వాత "పున్నయ్య మామ... నేను మీ ఒకనాటి రంగణ్ణి. ఆశ్చర్యంగా వుందికదూ!... అబద్ధం కాదు.. నిజం... అంతా దైవనిర్ణయం... కృప...."
"అత్త బాలమ్మ... రాగిణి... రంజనీ ఎక్కడ వున్నారు? అంతా బాగున్నారుగా.... రాగిణి రంజని ఏంచేస్తున్నారు?...."
రంగా వేసిన ఆ ప్రశ్నలను వినేసరికి పున్నయ్య గుండెలో దడ ప్రారంభం అయింది.
"మామా!... నీకు దుర్గాదేవి పెద్దకొడుకు భూషణ్ కుమార్ కు... మంచి స్నేహం కదా... ఆ రోజుల్లోనే... ఆ కారణంగానేగా నీవు మన వూరినుండి హైదరాబాదు మకాం మార్చింది. ఇపుడు ఆయన ఎం.ఎల్.ఏ. గొప్ప పారిశ్రామికవేత్తటకదా!.. ఇపుడు ఆయనకు నీకు స్నేహం ఎలావుంది?... తెగిపోయిందా?... ఇంకా గాఢంగా గట్టిపడిందా!..." వ్యంగ్యంగా అడిగాడు కస్తూరి రంగ...
పున్నయ్య కస్తూరి రంగ ప్రశ్నలకు భయంతో బిక్కముఖం వేశాడు.
----------------------------------------------------------------------------------------
ఇంకా వుంది...
----------------------------------------------------------------------------------------
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.
Comments