top of page

కఠిన నిర్ణయం

Writer: Vemparala Durga PrasadVemparala Durga Prasad

#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #KatinaNirnayam, #కఠిననిర్ణయం, #TeluguKathalu, #తెలుగుకథలు


Katina Nirnayam - New Telugu Story Written By - Vemparala Durgaprasad

Published In manatelugukathalu.com On 24/03/2025

కఠిన నిర్ణయం - తెలుగు కథ

రచన: వెంపరాల దుర్గాప్రసాద్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



యజ్ఞ శర్మ గారికి, డాక్టర్, గంభీరంగా మాటలు వెతుక్కుంటూ అడిగిన విధానానికి నవ్వు వచ్చింది. 


“మీ అబ్బాయిని ఒక సారి తీసుకుని రండి” అంటున్నాడు డాక్టర్.


“ఎవరిని తీసుకుని రమ్మన్నారు?.. ఆస్ట్రేలియా లో పాతుకు పోయిన పెద్ద వాడినా, ముంబై లో ఎప్పుడూ బిజీ గా వుండే చిన్న వాడినా?” అని నవ్వేసేరు. మళ్ళీ ఇలా అన్నారు:

“పర్వాలేదు డాక్టర్, నాకు చెప్పండి. నాకు జీవితం మీద పెద్ద ఆశలు లేవు. మా ఇంటావిడ చనిపోయి 4 సంవత్సరాలు అయింది. నేను ఉండేది మా అమ్మాయి ఇంట్లో “ అన్నారు.

 

డాక్టర్ గారికి ఇక తప్పలేదు. “ఏమీ లేదండి. మీకు గుండెల్లో 3 బ్లాకులు వున్నాయి. బైపాస్ ఆపరేషన్ పడుతుంది” అన్నాడు. 


“చూడండి డాక్టర్, నాకు ఈ వయసు లో ఆపరేషన్ చేయించుకునే ఉద్దేశ్యం లేదు. మందులు వల్ల తగ్గదా ? అయినా అదేదో స్టెంట్లు అంటారు కదా.. అవి వేస్తారుట కదా” అన్నారు.

 

“అన్ని సందర్భాల లో స్టెంట్లు కుదరవు. మీకు జాయింట్లో 2 బ్లాకులు వున్నాయి. ఒకటే నరం లో వుంది. ఇలాంటి సందర్భాల లో ఆపరేషన్ తప్పనిసరి” అన్నాడు డాక్టర్. 


“నేను 64 ఏళ్ళు బతికేను. ఇంకా బతికెయ్యాలని నాకు పెద్ద ఆశ లేదు. ఎన్నాళ్ళు నాకు ఆయుర్దాయం ఉంటే అంత బతుకుతాను. దయచేసి, నాకు మందులు మాత్రం రాయండి” అని తెగేసి చెప్పేరు. 


“పోనీ మీ అమ్మాయిని కానీ, అల్లుడుని కానీ.. ” డాక్టర్ మాటలు పూర్తవలేదు.. 


“వద్దు డాక్టర్, ఇప్పటికే, మగ పిల్లల మీద ఆధార పడకుండా, ఆడ పిల్ల దగ్గర ఉంటున్నాను. నా అల్లుడు పైకి చెప్పలేక పోయి నా, అతని మనసులో కూడా నేను బరువుగా తోచకూడదు. ఇప్పటికి నేను రోజు వారీ పనులు చేసుకో గలుగుతున్నాను, మందులు రాసి ఇవ్వండి. వాడుకుంటూ వుంటాను” అని తేలికగా చెప్పేసేరు. 


డాక్టర్ ఇంక చేసేది ఏమీ లేక, మందులు చీటీ రాసి ఇచ్చేసేడు. 


ఇక్కడ యజ్ఞ శర్మ గారి గురించి చెప్పాలి. 

యజ్ఞ శర్మ గారు కాకినాడ లో వేదం చదువుకుని, స్మార్త క్రియలు బాగా తెలిసిన ఒక పురోహితుడు. ఎన్నో పెళ్లిళ్లు, శుభ కార్యాలు చేయించిన దిట్ట. రామారావు పేట లోనే కాక, కాకినాడ లో శుభ కార్యాలు చేయించడం లో మంచి పేరు వున్న పురోహితులు. అపర కర్మ లు చేయించే వాళ్ళని కూడా, ఆయనే నియమిస్తూ వుంటారు. దశ దిన కార్యక్రమాల లో పెద్ద ఘనాపాటి గా వేద పండితుల కి దానాలు ఇప్పించడం ఆయన చెప్పి నట్లే జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఆ వూరికి ఆయన వైదిక కార్యక్రమాల లో పెద్ద దిక్కు. 


ఇంటికి చేరుకున్న యజ్ఞ శర్మ గారిని కూతురు మంజుల అడిగింది.. " నాన్నా డాక్టర్ గారు ఏమన్నారు?”


“ఏమీ లేదమ్మా, గ్యాస్ వల్ల గుండెల్లో బరువుగా అనిపించిందిట.. అంతే” అని తేలికగా చెప్పేసేరు. 


ఆ రాత్రి పడుకున్నారని మాటే కానీ, యజ్ఞ శర్మ గారి మనసు నిండా ఆలోచనలే. అప్పుడు ఆయనకి భార్య మరణించిన సంఘటన గుర్తుకు వచ్చింది. 


యజ్ఞ శర్మ గారి భార్య సావిత్రి గారు గుండె పోటు తో అనుకోకుండా 4 సంవత్సరాల క్రితం మరణించారు. భార్య మరణ వార్త తట్టుకోలేక పోయారు అయన. కొడుకులిద్దరికీ కబురు పెట్టేరు. పెద్ద వాడు వెంటనే రాలేనని, టికెట్ దొరకడం, ఫార్మాలిటీస్ పెద్ద పని అని, తాను వచ్చేదాకా వుంచద్దని, దహన కార్యక్రమాలు జరిపించెయ్యమని నిర్మొహమాటం గా చెప్పేడు. 


చిన్న వాడు కూడా దాదాపు అలాగే చెప్పేడు. ఏదో ప్రాజెక్ట్ పని మీద సింగపూర్ వెళ్ళేడుట, 4 రోజులు పడుతుంది, అప్పటిదాకా ఫ్రీజర్ లో శవం ఉంచితే ఉంచమని చెప్పేడు. తల్లి శవాన్ని వీడియో కాల్ లో చూసేరు కొడుకులు. 

అన్ని విషయాలు తెలిసిన యజ్ఞ శర్మ కి ఆలా ఐస్ గడ్డల్లో తన భార్య ని 4 రోజులు ఉంచడం ఇష్టం లేదు. కొడుకు, అందునా పెద్ద వాడు తల్లి శరీరానికి చితి పెట్టి, దహనం చేయవలసి ఉంటుంది. వాడు రానప్పుడు భర్త చేసినా, కూలి వాడు చేసినట్లే.. అని మనసులో అనుకుని చాలా ఆవేదన చెందేరు. 


తప్పని పరిస్థితుల్లో ఆయనే శవ దహనం కానిచ్చి, కొడుకుల కోసం ఎదురు చూసేరు. చిన్న వాడు 5 వ రోజు కి కి వచ్చేడు కానీ, “ఎలాగూ కార్యక్రమాలు బ్రాహ్మడిని పెట్టి చేయిస్తున్నావు కదా!” అన్నాడు. 


అతని ఉద్దేశ్యం లో పెద్ద కొడుకు చేస్తే చాలు కదా అని. 


“అంత తప్పదంటే, అన్న వచ్చేక, నేను అతని వెనుక వుంటాను లే “ అన్నాడు. పెద్ద వాడు 7 వ రోజు కి చేరుకున్నాడు. 


మొదటి 10 దినాలు దశ దిన కర్మలు యదా విధిగా చేయించాలని చూసిన యజ్ఞ శర్మ గారికి కొడుకులు చేసిన పనికి, తలెత్తుకు లేక పోయారు. అందరికీ విధి విధానాలు చెప్పే ఆయన తన భార్య విషయానికి వచ్చేసరికి, ఒక బ్రాహ్మడిని పెట్టి దశ దిన కార్యక్రమాలు చేయించ వలసి వచ్చింది. 


7 వరోజు వచ్చిన పెద్ద కొడుకు కూడా ఆ కార్యక్రమాలలో పాలుగొన్నా, అవేవి, అతనికి నచ్చినట్లు లేవు. ఏదో తండ్రి కోసం అన్నట్లు తూ తూ మంత్రం గా కానిచ్చాడు. అన్న దమ్ములు ఇద్దరు, తండ్రికి చాదస్తం అని గుస గుసలు పోవడం ఆయన దృష్టికి వచ్చింది. 


ఎందరి ఇళ్ళల్లోనో షోడశ దానాలు చేయించిన వ్యక్తి ఆయన. దశ దిన కర్మ ఎందుకు చేయించాలో ఆయన అనేక మందికి గరుడ పురాణం చదివి వివరించారు చాలా సార్లు. 

మరణించిన జీవుడు విగత శరీరం వద్దకు వచ్చి, అనేక విధాలు గా దుఃఖిస్తూ ఉంటాడు. 


యోగ్యుడయిన పెద్ద కొడుకు దహన కార్యక్రమాలు, నిత్య కర్మ అత్యంత శ్రద్హాశక్తులతో చేయించాలి. అప్పటికి జీవుడు ప్రేత రూపం లో ఉంటాడు. దశ దిన కర్మలు చేయడం వలన, ప్రేతరూపం లో వున్న జీవుడు భౌతిక నేత్రాలకి కనపడని ఒక చిన్న దేహ రూపం సంతరించుకుంటాడు. ఆ రూపం లో వున్న జీవుడు యమ లోకం వెళ్లే దారిలో కొన్ని కష్టాలని అధిగమించవలసి ఉంటుంది. 


వారసులు షోడశ దానాలు చేయడం అనేది, ఆ జీవుడు వైతరణిని దాటడానికి, మరి కొన్ని నరకాలు సునాయాసంగా దాటడం లో కష్టాలు తొలగడానికి, అత్యంత ఆవశ్యం. ఇవన్నీ అయన ఎంతో మందికి ఎన్ని సార్లో వివరించారు. ఇప్పుడు విచిత్రం గా ఆయన ఇంట్లో పరిస్థితి చాలా దయనీయం గా వుంది. 


పిల్లలు చదువుల వెంబడి విదేశాలు, దూరాలు వెళ్ళిపోతే, వాళ్ళ అభివృద్ధి అడ్డుకోవడం ఎందుకని, ఆయన పట్టించుకోలేదు. కానీ, పిల్లలు పూర్తిగా విదేశీ సంస్కృతికి అలవాటు పడిపోయారు. తండ్రి చేసే కర్మ కాండలు అన్నీ వృధా ఖర్చులని, దహనం చేయడం చాలని, ఈ దశ దిన కర్మలు అన్నవి మూఢ నమ్మ కాలు తప్ప ఏమీ కావని, వాళ్ళ నమ్మకం. 


తల్లి విషయం లో వాళ్ళు ప్రవర్తించిన తీరు తో ఆయన గుండె చాలా గాయపడింది. అప్పటి నుండి, ఆయన తాను ఇంక పిల్లల మీద ఆశ పెట్టుకోకూడదని నిర్ణయానికి వచ్చేసేరు. అదీ ఆయన మానసిక స్థితి ఇప్పుడు. 

 తన భార్య కి జరిగినది తెలిసిన ఆయన, తాను మరణించినప్పుడు పిల్లలు ఏదో వేరేగా ప్రవర్తిస్తారని ఊహించలేక పోతున్నారు. 


“తాను పక్కన ఉండడం వల్ల, తన భార్య విషయం లో ఏదో కొన్ని రోజులయినా, శ్రాద్ధ కర్మల లో పిల్లలు పాల్గొన్నారు. హెచ్చరించే వాళ్ళు ఎవరూ లేక పొతే, కొడుకులు తనకి కర్మ కాండలు చేయిస్తారా?” ఇలా ఆలోచిస్తూ పడుకున్న యజ్ఞ శర్మ గారికి ఎప్పుడో తెల్లవారు ఝామున నిద్ర పట్టింది. 


కూతురు లేపటం తో మెలకువ వచ్చింది ఆయనకి. 

" ఏమి నాన్నా, వంట్లో ఎలా వుంది ఇవాళ”.. సత్యం మాస్టారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం వప్పుకున్నట్లున్నావు?” కర్తవ్యమ్ గుర్తు చేస్తున్న కూతురి ప్రశ్నకి ఇహం లోకి వచ్చేరు. 

“బాగానే ఉందమ్మా, బాగా నిద్ర పట్టేసి, మెలుకువ రాలేదు. ఇదిగో.. ఇప్పుడే తెమిలి వెళ్తున్నా” అని పెరట్లోకి దంత ధావనం కోసం వెళ్ళేరు ఆయన. 


ఒక మూడు నెలలు గడిచేయి. మందులు వాడుతున్నారు ఆయన. ఒక వారం క్రితం ఆయన వూళ్ళో వున్న రంగరాయ మెడికల్ కళాశాల కి వెళ్లి వచ్చేరు. తన మిత్రుడు రామ శర్మని తోడు తీసుకుని వెళ్ళేరు. అప్పుడు ఆయన ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. 

***


ఆరోజు కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన యజ్ఞ శర్మ గారు నిద్రకి ఉపక్రమించారు. గుండెల్లో నెప్పి అనిపించింది. అమృతాంజనం తీసి రాసుకున్నారు. డైరీ తీసి, యేవో 4 ముక్కలు రాసి, తలగడ కింద ఉంచేరు. 

ఇంతలో నెప్పి ఎక్కువ అయింది, ఒక్క సారిగా తూలి పడిపోయారు. పక్కన వున్న స్టూలు మీద మంచి నీళ్లు తాగాలని అనిపించింది. లేవలేక పోతున్నారు.. కళ్ళు మూతలు పడుతున్నాయి. “అమ్మాయ్ మంజులా “ అని పిలవాలని అనుకున్నారు. పిలవ లేక పోతున్నారు. ఇంతలో స్పృహ కోల్పోయారు. 


ఉదయాన్నే, లేచిన మంజుల తండ్రి ఇంకా లేవలేదేమిటని వచ్చి చూసింది. మంచం మీద ఉండాల్సిన తండ్రి, కింద అచేతనంగా పడి వున్నాడు. ఒక్క సారి గావు కేక పెట్టింది. ఆమె భర్త ఆనందరావు వచ్చేడు. పరిస్థితి చూసేడు. యజ్ఞ శర్మ గారు కాలం చేసేరని అర్ధం అయింది. 


మంజుల ఏడవడం మొదలు పెట్టింది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చేరు. అందరూ.. ”అయ్యో నిద్రలోనే పోయినట్లున్నారు” అంటూ తలో రకం గా మాట్లాడు కుంటున్నారు. ఇంతలో ఎవరో అంటున్నారు.. "కొడుకులు ఇద్దరూ దగ్గర లేరు పాపం."


ఆయన మంచం మీద తలగడ కింద సగం బయటకి వచ్చిన యెర్ర డైరీ మీద ఆనందరావు ద్రుష్టి పడింది. 

తీసి చూసేడు. అందులో ఇలా రాసి వుంది:


“నేను ఈరోజో, రేపో వెళ్ళిపోతాను. ఈ శరీరం కాల్చడానికి వంతులు వేసుకొనవసరం లేదు. దశ దిన కర్మలు చేయడానికి ఇబ్బందులు పడనవసరం లేదు. షోడశ దానాలు చేయడం అవసరం లేదు. మరణించేక, ఏ పుణ్య గతులు నా ప్రేత శరీరం చేరుతుందో అనే సందేహాల కంటే, ఈ పార్థివ శరీరం ఇహ లోకం లో ఎందరో డాక్టర్లకి ఉపయోగపడితే అంతే చాలు. ఈ జన్మ ధన్యం అయినట్లే. 


అందుకే శోత్రియ బ్రాహ్మణుడిగా పుట్టిన నేను, నా శరీరం రంగరాయ మెడికల్ కాలేజీ వారికి దానం చేసేను. నేను మరణించినప్పుడు చేయవలసిందల్లా, వెంటనే ఆ కాలేజీ వాళ్ళకి కబురు పంపితే చాలు. వాళ్ళువచ్చి, నా పార్థివ దేహం, లేపనాలు పూసి జాగ్రత్త పెట్టుకుంటారు. 

సెలవు.. యజ్ఞ శర్మ ". 


చూసిన మంజుల, ఆనందరావు మ్రాన్పడి పోయారు. శర్మ గారి నిర్ణయం క్షణాల్లో ఆ వీధి అంతటా దావానలం లా వ్యాపించింది. అందరికీ వైదిక విధి విధానాలు వివరించే యజ్ఞ శర్మ గారు ఇంత కఠిన నిర్ణయం ఎలా తీసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. 

 

 సమాప్తం


వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:


నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్


నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో


అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.


రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.


క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.


ధోనీ, రోహిత్ శర్మ అంటే  క్రికెట్ లో చాలా ఇష్టం.


సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.


ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.


వుండేది విశాఖపట్నం.


ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.





 
 
 

Comments


bottom of page