top of page
Writer's pictureLV Jaya

కట్నం తీసుకున్నారా? 



'Katnam Tisukunnara' - New Telugu Story Written By L. V. Jaya

Published in manatelugukathalu.com on 24/07/2024 

'కట్నం తీసుకున్నారా?' తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 5)

రచన: L. V. జయ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జాగృతి, ఇంజనీరింగ్ చదివి, IT కంపెనీ లో ఉద్యోగం చేస్తోంది. కట్నాలు తీసుకోడాన్ని, ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు, కట్నం తీసుకోను అన్న అబ్బాయినే చేసుకుంటాను అని వాళ్ళ అమ్మ లతతో చెప్పింది. లత కూడా అందుకు సమ్మతించింది. 


సమర్థ్ తో జరిగిన పెళ్ళిచూపుల్లో, సమర్థ్ కానీ, వాళ్ళ అమ్మ రాధ కానీ, కట్నం ప్రస్తావన తేనందుకు ఆనందపడ్డారు లత, జాగృతి. సమర్థ్ కి, జాగృతి నచ్చి, పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. 


పెళ్లి మాటల కోసం ఇరువైపుల బంధువులు లత ఇంట్లో కలిశారు. అందరి పరిచయాలు అయ్యాక, "అమ్మాయి, అమ్మాయి తరుపు కుటుంబం ఎలా ఉందొ చూసి చెప్తారని మా వాళ్ళని కూడా రమ్మన్నాను" అంది రాధ నవ్వుతూ. 


"పెళ్లి నిశ్చయం అయ్యి, పెళ్లి మాటలకి కదా వచ్చాము. ఇప్పుడు ఇంకా ఏం చూసి చెప్తారు?" అన్నాడు మాణిక్యాలరావు. మాణిక్యాలరావుని ఆగమని సౌంజ్ఞ చేసింది రాధ. 


"మీ వాళ్ళందరిని కలవడం మాకు చాలా సంతోషంగా ఉందండి. " అంది లత. 


"అందరం కలిసాం కాబట్టి, పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చెయ్యాలి అన్న విషయాలు మాట్లాడుకోవచ్చు. మీ పద్ధతులు గురించి చెప్పండి బావగారు" అని మాణిక్యాలరావుని అడిగాడు లత మరిది పార్థసారథి. 

 

"ఆయనకేమి తెలియదు. మా తమ్ముడు దామోదరం, పురోహితుడు కదా. మా పద్ధతులు, లాంఛనాలు గురించి, బాగా తెలుసు. చెప్పరా దామోదరం" అంటూ దామోదరం వైపు చూసింది రాధ. 


దామోదరం, తన లాల్చీ జేబులోంచి, ముక్కపొడి డబ్బాని తీసి, "లాంఛనాలు, పద్ధతులు గురించే కదా. మాట్లాడుకుందాం" అని, నషాళానికి తగిలేలా ముక్కిపోడిని పీల్చి, పిలక ముడి వేస్తూ, "మా వాడ్ని, MBA వరకూ చదివించింది మా అక్క. దాని కోసం ఎంతోకొంత ఖర్చు అయ్యి ఉంటుంది కదా. ఏమంటారు పార్థసారథిగారు?" అన్నాడు దామోదరం, పార్థసారథిని సూటిగా చూస్తూ. 


'కట్నం అడుగుతున్నారా వీళ్ళు?' అన్న అనుమానం వచ్చి, ఏం సమాధానం చెప్పాలో తెలియక, లత వైపు చూసాడు పార్థసారథి. 


లత, తన చేతిలో ఉన్న పర్సులోంచి, కొంత డబ్బు తీసి, మాణిక్యాలరావుకి ఇవ్వమని, పార్థసారథి చేతిలో పెట్టింది. "మాకేమి వద్దండి. ఇలాంటివి ఇప్పుడేం పెట్టుకోకండి. " అన్నాడు మాణిక్యాలరావు. 


"అబ్బాయికి, గిఫ్టుగా ఇస్తున్నాం అన్నయ్యగారు. తీసుకోండి. " అంది లత. 


"గిఫ్ట్ అన్నారు కాబట్టి తీసుకుంటాం. మన అబ్బాయిలో ఎదో వెలితి ఉంది. అందుకే ఏమీ తీసుకోకుండా పెళ్ళికి ఒప్పుకున్నారు అని అనుకుంటారు అందరూ. " అంటూ పార్థసారథి చేతిలోని డబ్బు తీసుకుని, బ్యాగ్ లో పెట్టుకుంది రాధ. తరువాత, అక్క కొడుకు నాగేశ్వరరావు వైపు చూసింది. 


నాగేశ్వరరావు, వక్కపొడి నములుతూ, "అబ్బాయికేనా గిఫ్టులు? కష్టపడి కన్న తల్లికి, తోడబుట్టినదానికి లేవా? ఎక్కడో లెక్క సరిపోవటం లేదే పిన్నీ. " అన్నాడు రాధని చూస్తూ. 


రాధ నవ్వుతూ, "మా నాగేశం, లెక్కల మాస్టారు కదా. వాడికి అన్నిటికీ లెక్క సరిపోవాలి. " అంది లతతో. 

 

లత ఇంర్కొంటా డబ్బు తీసి, "ఇవి మీకు, మీ అమ్మాయికి. మీకు నచ్చినవి ఏమైనా తీసుకోండి వదినగారు. " అంటూ కొంత డబ్బు తీసి, రాధ చేతిలో పెట్టింది లత. 


"కట్నం తీసుకున్నాన్న చెడ్డపేరు నాకు వద్దు. ఇది నా కూతురుకి ఇచ్చేస్తాను" అని తీసుకున్న డబ్బుని బ్యాగ్ లో పెట్టుకుంది రాధ. 


"అబ్బాయి, అత్తగారు, ఆడపడుచు, కానుకలు అయ్యాయి మరి. పెళ్ళిలో, అబ్బాయికి పెట్టేవాటి సంగతి ఏమిటి?" అన్నాడు నాగేశ్వరరావు. 


"వాళ్ళు ఇవ్వాల్సిన ఉంగరం, గొలుసు, వెండి కంచం, గ్లాసు, వెండి జంధ్యం ఇవన్నీ ఎలాగూ ఇస్తారు. వాళ్ళ అల్లుడుకి, ఇంకా ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం. మనమేమి అడగం. ఇస్తే, కాదనం. " వెటకారంగా నవ్వుతూ అన్నాడు దామోదరం. 


"అబ్బాయికి మీరు అడిగినవన్నీ పెళ్ళిలో పెడతాం వదినగారు. " అంది లత. 


"బాబోయ్. మేమేమీ అడగలేదు. మీరే, మీకు కాబోయే అల్లుడికి పెట్టుకుంటున్నారు. చెప్పడం మర్చిపోయాం. పెళ్ళిలో బిందెలు ఆడపడుచుకి వెళ్తాయి. మంచివి పెట్టండి. ఇంకా, మాకు పెట్టే బట్టలు, కంచి కానీ, ధర్మవరం గాని వెళ్లి కొందాం. " అంది రాధ నవ్వుతూ. 


అంతవరకూ అందరి మాటలు వింటూ, సోఫా లో చారబడి కూర్చున్న మరదలు అనసూయని చూసింది రాధ. అనసూయ, వెంటనే, నిటారుగా కూర్చుని, "అమ్మాయికి పెద్దగా బంగారం ఏమీ చేయించినట్టులేరు. చెవులకి, మెడకి అంత చిన్నవి పెట్టుకుంది. " అని అడిగింది లతని. 


"చేయించామండి. ఎప్పుడూ, ఇలా చిన్నవే పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది మా అమ్మాయి. " అంది లత. 


అనసూయని మళ్ళీ చూసింది రాధ. "ఏమున్నాయో ఏమో? చూస్తేనే కదా తెలిసేది. " అంది అనసూయ. 


జాగృతికి ఉన్న బంగారాన్ని తెచ్చింది లత. బంగారాన్ని, కళ్ళార్పకుండా చూస్తూ, "అమ్మాయికి ఏం నగలు ఉన్నాయో చూసి దాన్ని బట్టి మేము పెట్టాల్సినవి పెడదామని అనుకున్నారు మా వదినగారు. అందుకే అడిగాను. ఏమీ అనుకోకండి అక్కయ్యగారు. " అంది అనసూయ లతతో. 


మాట మధ్యలో తన పేరుని తెచ్చిన అనసూయని కోపంగా చూస్తూ, "ఏమీ అనుకోరులే. అమ్మాయికి ఉన్న బంగారం సరిపోతుంది. మేమేమీ పెట్టక్కరలేదన్నమాట అయితే. " అంది రాధ నవ్వుతూ. 


రాధ మాట తీరుకి, ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు లత చెల్లెలు రుక్మిణి, లత తోటికోడలు లలిత. 


'వచ్చినవాళ్ళందరూ మాట్లాడారు, నేనూ ఎదో ఒకటి అడగకపోతే బాగుండదేమో' అనుకున్న రాధ అక్క కోడలు సరిత, "మీరందరూ జాగృతిని ఏమని పిలుస్తారు ఇంట్లో. నా చెల్లెల్ని మేము ఏమని పిలవాలి?" అంటూ జాగృతి దగ్గరికి వచ్చి, కూర్చుంది. 


"రాణి అని పిలుస్తాము. మా ఇంట్లో పుట్టిన మొదటి అమ్మాయి. మీరు కూడా అలానే పిలవచ్చు. " అన్నాడు పార్థసారథి. 


ప్రశ్న అడిగిన సరితని కోపంగా చూస్తూ, "మా ఇంటికి వచ్చాక, ఇంక రాణి ఏంటి?" అంది రాధ. 


"పోనీ, లక్ష్మి అని పిలవండి. ఇంకనుండి, మా అమ్మాయి, మీ ఇంటి లక్ష్మి కదా. మా రుక్మిణి ని కూడా మేము లక్ష్మి అనే పిలుస్తాం. " అన్నాడు రుక్మిణి భర్త కృష్ణమూర్తి. 


"మా అమ్మాయే, మా ఇంటి లక్ష్మి. ఇంటికి వచ్చేది, కోడలు. అంతే. " అంది రాధ. 


జరుగుతున్నదంతా చూస్తున్న జాగృతికి కోపం, చిరాకు పెరిగిపోయాయి. కానీ, అంతమంది పెద్దవాళ్ళ ఎదురుగా ఏమీ మాట్లాడలేక, మౌనంగా ఉండిపోయింది. 'సమర్థ్ అయినా ఏమైనా మాట్లాడచ్చు కదా' అనుకుని, సమర్థ్ ని చూసింది. జరుగుతున్నదాంతో తనకేమి సంబంధంలేనట్టు, మౌనంగా, తలదించుకుని కూర్చున్నాడు సమర్థ్. 


జాగృతి, ఇక అక్కడ ఉండలేక, లేచి, లతని లోపలకి తీసుకు వెళ్లి, "నన్ను కట్నం తీసుకోనివాళ్ళకి ఇచ్చి చేస్తానన్నారు. దీన్నేనా కట్నం ఇవ్వకపోవడం, తీసుకోకపోవడం అంటారు?" అని అడిగింది. 


"గట్టిగా మాట్లాడకు. వాళ్ళందరూ వింటారు. మనం దీని గురించి, వాళ్ళు వెళ్ళాక, మాట్లాడుకుందాం. " అంది లత. 


"వాళ్ళు వెళ్ళాక, ఇంక మాట్లాడుకోవడానికి ఏముంటుంది? నేను చదువుకున్నాను, సంపాదిస్తున్నాను. అయినా కట్నం ఎందుకు ఇవ్వాలి? చదువుకోకపోయినా, సంపాదించక పోయినా ఇవ్వక్కరలేదు. ఏమీ చేతకానివాళ్ళలాగా, మీరే అమ్మాయిని, కట్నాన్ని ఇచ్చి చెయ్యాలా? ఏం వాళ్ళ అబ్బాయికి, అమ్మాయి అక్కరలేదా?" అంది జాగృతి కోపంగా. 


"ష్.. మనం తరువాత మాట్లాడుకుందాం అన్నానుకదా. " అని చెప్పి బయటకి వెళ్ళిపోయింది లత. 


దామోదరం, పెళ్లి రోజుని, నిశ్చయించాక, తీసుకున్న కానుకలతో, సంతోషంగా వెళ్లారు సమర్థ్ తరపువాళ్ళు. 


"జాగృతికి కాబోయే అత్తగారు, ఎవరు ఎంత మాట్లాడాలో, ముందే నిర్ణయించినట్టుంది. ఎవరి పాత్రలు వాళ్ళు చక్కగా పోషించారు. కొడుకుకి ఈ రోజు ఏ పోర్షన్ లేదేమో. జరుగుతున్నదంతా, మౌనంగా, చూస్తూ కూర్చున్నాడు. " అన్నాడు కృష్ణమూర్తి. 


"భర్త మాట్లాడడానికి ప్రయత్నించినా, ఆవిడ మాట్లాడనివ్వలేదు. " అంది లలిత. 


"రాణి అని, లక్ష్మి అని పిలవటం ఇష్టంలేదుట వాళ్ళకి. మన రాణి ఎలా భరిస్తుందో ఏమిటో ఆవిడని?" అంది రుక్మిణి బాధగా. 


"వాళ్ళు కట్నం అడిగారని మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు వదినా " అని లతని అడిగాడు పార్థసారథి. 


"నేను, ముందే కొంత డబ్బు తెచ్చిపెట్టుకున్నాను. వాళ్ళు ఏమీ అడగకపోయినా, నేను సంతోషంగా ఇచ్చి ఉండేదాన్ని. " అంది లత. 


"కానుకల పేరుతొ, కట్నం తీసుకున్నారు. మనకి నచ్చి, ఇచ్చామంటే అర్ధం ఉంది. కానీ వాళ్ళు అడిగి తీసుకున్నారు. ఆ అబ్బాయిని మీరు చదివించినట్టు అయ్యింది. అమ్మా, వీళ్ళు నాకు నచ్చలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పెయ్యండి వాళ్ళకి. " అంది జాగృతి కోపంగా. 


"ఇంతవరకూ వచ్చాక, పెళ్లి వద్దంటే ఎలా? పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. " అంది లత. 


"అమ్మా, ఆవిడ, మాట తీరు, ప్రవర్తన చూసారా ఎలా ఉన్నాయో? వచ్చిన చుట్టాలు అందరూ ఆవిడవైపు వాళ్లే. ఇవన్నీ చూస్తూ కూడా మీకేమి అర్ధం కాలేదా?" అంది జాగృతి. 


"కొంతమంది ఆడవాళ్లు అలా ఉంటారు. అయినా, నువ్వు కలిసి ఉండాల్సింది అబ్బాయితో. అబ్బాయి మంచివాడిలాగా ఉన్నాడు. నిన్ను బాగా చూసుకుంటాడు. నన్ను నమ్ము. ఇంతవరకూ వచ్చాక, పెళ్లి ఆగిపోయింది అని చెడ్డపేరు తెచ్చుకోవద్దు మనం. " అని జాగృతిని బతిమాలుకుంది లత. 


జాగృతి, సమర్థ్ ల పెళ్లి జరిగింది. 


"సమర్థ్ ని MBA చదివించడానికి అయిన ఖర్చు, జాగృతి అత్తగారి నడుముపై తళతళలాడుతోంది. చూసావా" అంది లలిత, రుక్మిణి తో. 


"అవును. అత్తగారు, ఆడపడచు లాంఛనాలు, జాగృతి ఆడపడుచు మేడలో మెరుస్తున్నాయి. " అంది రుక్మిణి. 

 

"అత్తగారు, ఆడపడుచు ఆర్భాటమే ఎక్కువ ఉంది ఈ పెళ్ళిలో. పాపం పెళ్ళికొడుకుని ఎవరూ పట్టించుకుంటున్నట్టు లేరు. " అన్నాడు కృష్ణమూర్తి. 


మాణిక్యాలరావు, రాధకి కనపడకుండా, పార్థసారథి, కృష్ణమూర్తిల దగ్గరకి వచ్చి, "మీరు చేస్తున్న మర్యాదలు చాలా బాగున్నాయి. మావాళ్లు అందరూ కూడా అదే అనుకుంటున్నారు. మా అందరికీ, ఏమీ చెయ్యకపోయినా, మేమెవ్వరం ఏమీ అనుకోము. కానీ, మా ఆవిడకి, కూతురికి మాత్రం ఏమీ తగ్గకుండా చూసుకోండి. " అని చెప్పి వెళ్ళాడు. అది ముందే మాకు అర్ధం అయ్యింది అన్నట్టు మొహాలు చూసుకున్నారు ఇద్దరూ. 


"కట్నం ఎంత తీసుకున్నావేంటి?" అని రాధ చుట్టం అడిగిన ప్రశ్నకు, "కట్నం ఏమీ లేదు. తండ్రిలేని పిల్ల కదా, జాలి పడి, కట్నం తీసుకోకుండానే పెళ్ళికి ఒప్పుకున్నాం. " అంది రాధ, తన కూతురి మెడలో హారాన్ని సర్ది, తన వడ్డాణాన్ని కూడా సర్దుకుంటూ. 


జాగృతి, కట్నం తీసుకోని అబ్బాయినే పెళ్లి చేసుకుందా? ఏమో మరి. 

***

అత్తగారి కథలు - పార్ట్ 6 త్వరలో

L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : LV జయ

నా పేరు LV జయ. 
https://www.manatelugukathalu.com/profile/jaya

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. 
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు


70 views2 comments

2 Comments


Surekha Arunkumar
Surekha Arunkumar
Jul 25, 2024

చక్కగా రాశారు, నిజజీవతంలో జరిగే విషయాలే ఇవి...

Like

కట్నం తీసుకోక పోవడం ఏమిటి? మహా లౌక్యం ప్రదర్శించి, చక్కగా రాబట్టుకున్నారు.


చదువుకున్న ఈ కాలపు ఆమ్మాయిలయినా కట్నం తీసుకునేవాడిని నేను పెళ్లి చేసుకోను అని భీష్మించక పోతే ఎలా?

Like
bottom of page