'Kidnap' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 13/07/2024
'కిడ్నాప్' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
'సమయానికి పెళ్ళాం పేరు గుర్తురావట్లేదే.. అయినా పేరుతో పని ఏముంది.. మేనేజ్ చేద్దాం.. ' అనుకుంటూ పెళ్ళాన్ని పిలిచాడు సుబ్బారావు.
"ఏమోయ్.. ! నా కళ్ళజోడు కనిపించట్లేదు.. కాస్త వెతికి పెట్టరాదు.. "
"అయ్యో.. మీ మతిమండా.. ! కళ్ళజోడు పెట్టుకునే ఉన్నారుగా.. ?" అంది కాంతం గట్టిగా.
"నిజమా.. ! అసలు పెట్టుకున్నట్లుగానే గుర్తులేదే.. "
"అదే గుర్తుంటే.. ఇదంతా ఎందుకు చెప్పండి.. మీ మతిమరుపు మీరూను?"
"పోనీలే.. ఉందికదా.. నేను అలా వాకింగ్ కి వెళ్లి వస్తాను.. " అన్నాడు సుబ్బారావు
"అదిగోరా.. మన సుబ్బారావు వస్తున్నాడు.. " అన్నాడు సుబ్బారావు ఫ్రెండ్ ఆనంద్.
"ఏ సుబ్బారావు.. ? మన కాలనీ అంతా సుబ్బారావులమయమే కదా.. " అడిగాడు అజిత్.
"అదే రా.. అదే.. ఆ మతిమరపు సుబ్బారావు.. " చెప్పాడు ఆనంద్.
"అలా చెప్పు.. అప్పుడే ఈజీ గా అందరికీ అర్ధమవుతుంది. అయినా, ఆయనని అందరూ మతిమరపు సుబ్బారావు అని ఎందుకు అంటున్నారు.. ?"
"నువ్వు ఈ కాలనీ కి కొత్త కదా అజిత్.. నీకు తెల్సి ఉండదు.. చెబుతాను విను.. " అన్నాడు ఆనంద్.
***
ఒకరోజు సుబ్బారావు మాతో పాటే, వాకింగ్ కి వచ్చి.. తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ఇంటి నెంబర్ మర్చిపోయాడో ఏమో.. నాకు ఫోన్ చేసి తన ఇంటి నెంబర్ అడిగాడు. మీ ఇంటి నెంబర్ పది అని చెప్పను. నాకు థాంక్స్ చెప్పి, ఇంటికి వెళ్లిన తర్వాత ఫోన్ చేస్తానన్నాడు. కొంతసేపటికి సుబ్బారావు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది..
"ఒరేయ్ ఆనంద్.. ! మా ఇంటి నెంబర్ పదన్నావు.. కానీ, ఇంటికి తాళం వేసి ఉందేమిటి.. ?"
"కొంత సేపు చూడరా.. చెలెమ్మ ఎక్కడికో వెళ్ళుంటుంది.. వచ్చేస్తుందిలే.. కంగారు పడకు.. "
"అలాగే లే.. నువ్వు టెన్షన్ పడకు.. " అని ఫోన్ పెట్టేసాడు సుబ్బారావు.
ఈ ఫోన్ లో మా ఆవిడ నెంబర్ సేవ్ చేసానో లేదో.. అని డయల్ లిస్ట్ చూసాడు సుబ్బారావు. అందులో లావణ్య అని పేరు గల లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ఇందులో మా ఆవిడ నెంబర్ ఏదో గుర్తుకు లేదే.. అని జేబులో చెయ్యి పెట్టి చూసాడు. ఎప్పుడూ జేబులో ఉండే ఆ పేపర్ ఈ రోజు లేదు.. బహుశా ఇంతకుముందు.. పార్క్ లో సమోసా తిన్న తర్వాత టిష్యూ పేపర్ అనుకుని తుడిచేసి పడేసానేమో. బాగా అలోచించి.. తన భార్య పేరు లావణ్య కాదని, సౌందర్య అని డిసైడ్ చేసుకుని.. ఫోన్ లో ఉన్న ఒకే సౌందర్య నెంబర్ కి ఫోన్ చేసాడు..
ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఫోన్ ఎత్తక పోయేసరికి.. లేని పోనీ ఆలోచనలు బుర్రలో కదిలాయి సుబ్బారావు కి. నా పెళ్ళాన్ని ఎవరో కిడ్నాప్ చేసుంటారు, అందుకే ఫోన్ తియ్యట్లేదు. ఈ రోజుల్లో ఈ కిడ్నాప్ లు చాలా ఎక్కువ అయిపోయాయి. అయ్యో.. ! ఫోన్ లో ఛార్జ్ అయిపోయిందే.. ఇప్పుడు ఎలా.. ? ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే ఏమైనా సలహా ఇస్తాడేమో.. ! అక్కడ కిరానా షాప్ లో నా ఫోన్ ఛార్జింగ్ పెట్టమని అడుగుతాను.
"హలో.. ! కొంచం ఈ ఫోన్ ఛార్జింగ్ పెడతారా.. ? "
"అలాగే.. కొంతసేపు పోయాక రండి.. " అన్నాడు కిరాణా షాప్ యజమాని.
కొంతసేపుపోయాక.. "ఏమండీ.. ! మీ ఫోన్ ఇస్తారా.. ? కొంచం కాల్ చేసుకుని ఇస్తాను.. కావాలంటే డబ్బులు తీసుకోండి.. " అన్నాడు సుబ్బారావు.
"డబ్బులు ఎందుకు.. ?"
"మీ ఫోన్ వాడినందుకు మరి డబ్బులు ఇవ్వాలి కదా.. ?"
"నా ఫోన్ లో బ్యాలన్స్ లేదు.. ఏమి అనుకోకండి.. " అన్నాడు కిరాణా యజమాని.
"పోనీలెండి.. ఏం చేస్తాం.. ?" అనుకుని వెళ్ళిపోయాడు సుబ్బారావు.
జేబులో మళ్ళీ చెయ్యి పెట్టి.. అయ్యో.. ! నా ఫోన్ ఎవడో కొట్టేసినట్టున్నాడే.. ! నా పెళ్ళాన్ని కుడా ఎవడో కిడ్నాప్ చేసాడు.. ఇప్పుడు ఏం చేసేది.. అని అలోచించి.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నాడు సుబ్బారావు.
ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో.. ? ఎవరిని అడగాలి.. ?
"హలో మాష్టారు.. ! ఇక్కడ స్టేషన్ కి వెళ్ళే దారి ఎటో చెబుతారా.. ?" అని అడిగాడు ఆ కిరాణా షాప్ వాడిని.
"తిన్నగా వెళ్లి.. కుడి పక్కకు తిరగండి.. అక్కడే ఉంటుంది స్టేషన్.. " అని చెప్పాడు.
చెప్పిన అడ్రస్ కు వెళ్ళిన సుబ్బారావు..
"నా ఫోన్ పోయింది.. పెళ్ళాం మిస్ అయింది.. మీరు వెతికి పెట్టండి సార్ ప్లీజ్ .. ?"
"ఎంత లక్కీ సర్ మీరు.. ! ఆ కిటుకు ఏదో నాకూ చెప్పరాదు.. ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా.. మా ఆవిడ ఒక్క గంటకు మించి ఎక్కడికి వెళ్ళదు.. టీవీ కే అత్తుక్కుపోతుంది.. బొత్తిగా ప్రశాంతత లేదు సర్.. "
"సర్.. ! మీరే నా కంప్లైంట్ రాసుకోవాలి.. నాకు మీ కంప్లైంట్స్ చెబుతున్నారేమిటి.. ?" అన్నాడు సుబ్బారావు.
"సారీ సర్.. ! ఇంతకీ.. మీ ఫోన్ నెంబర్ చెప్పండి.. ?"
"ఫోన్ నెంబర్.. ఇంత సడన్ గా అడిగితే ఎలా చెప్పండి.. అది నా ఫోన్ లోనే సేవ్ చేసాను.. నాకు ఎలా గుర్తు ఉంటుంది చెప్పండి.. ?"
"పోనీ.. మీ ఆవిడ పేరు.. డీటెయిల్స్ చెప్పండి.. ?"
"మా ఆవిడ.. సౌందర్య.. ఫోన్ చేస్తే ఆన్సర్ చెయ్యట్లేదు.. అందుకే మీ దగ్గరకు వచ్చాను.. "
"అయితే సౌందర్య గారి నెంబర్ చెప్పండి.. ?"
"మీరు అడుగుతారని.. ముందే పేపర్ లో రాసాను.. " అని నెంబర్ ఇచ్చాడు సుబ్బారావు.
"హలో.. ! సౌందర్య గారేనా.. !"
"అవును.. మీరు ఎవరు.. ?"
"టూటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాను.. మీ ఆయన ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు.. మీ గురించి కంగారు పడుతున్నారు.. వెంటనే ఇక్కడకు రండి.. "
"తెల్లగా ఉన్నారా.. ? అయితే మా ఆయానే.. ఇంతకీ మా ఆయనకు ఏమైంది.. ?"
"తెల్లగానే ఉన్నారు.. మీరు రండి.. అన్నీ చెబుతాను.. "
పోలీస్ స్టేషన్ కి వచ్చింది సౌందర్య..
"ఏమండీ.. ! ఇక్కడ ఏం చేస్తున్నారు.. ? మీ కోసం ఇంట్లో దోసెలు వేసి ఉంచాను.. రండి. ఈయన మా ఆయనే" అని స్టేషన్ లో చెప్పింది సౌందర్య..
"మా ఆవిడ ఇంత అందంగా ఉండదే.. " అని సుబ్బారావు కి ఎక్కడో చిన్న డౌట్. అయినా నాకు ఏం గుర్తుంటుంది.. ఆవిడ చెప్పిందే కరెక్ట్.. " అని అనుకున్నాడు.
" మీ ఆవిడ దొరికింది గా.. వెళ్ళవయ్యా.. నీ ఫోన్ వెతికి ఇస్తాం.. ఇక వెళ్ళండి.. "
"థాంక్స్ సర్.. " అని ఇద్దరూ బయటకు వెళ్లారు.
ఈ లోపు కాంతం.. సుబ్బారావు ఫోన్ కి కాల్ చేసింది.. షాప్ వాడు ఫోన్ తీసి.. 'హలో' అన్నాడు..
"ఎవడ్రా నువ్వు.. మా ఆయన ఏడి.. ? ఏం చేసావ్.. ?"
"ఏమో అక్కా.. ఇందాకల ఫోన్ ఛార్జింగ్ పెట్టమని చెప్పి.. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయారు. గుర్తొచ్చింది.. పోలీస్ స్టేషన్ కి దారి అడిగారు.. "
"ఆయనకి మతిమరుపు నాయనా.. ఏమి అనుకోకు.. నేను వచ్చి ఫోన్ తీసుకుంటాను.. "
"అలాగే అక్కా.. " అన్నాడు కిరాణా షాప్ యజమాని.
ఫోన్ తీసుకుని.. పోలీస్ స్టేషన్ కి బయల్దేరింది కాంతం..
పోలీస్ స్టేషన్ దగ్గరకి రాగానే.. సుబ్బారావు చేయి పట్టుకుని సౌందర్య బయటకు రావడం చూసింది కాంతం..
"ఏమండీ.. ! ఏమిటి ఇది.. ? ఎంత మీకు మతిమరుపు ఉందని తిడితే మాత్రం, ఇలా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారా.. ? నా జీవితం నాశనం చేసారు.. "
"ఇంతకీ మీరు ఎవరండీ.. ?" అమాయకంగా అడిగాడు సుబ్బారావు.
"నేను ఎవరా.. ? నీ పెళ్ళాన్ని.. " కోపంగా జవాబిచ్చింది కాంతం.
"ఇంతకీ.. నువ్వు ఎవరే.. మా ఆయనే కావాల్సి వచ్చిందా నీకు ?"
"నా పేరు సౌందర్య.. మా ఆయన తెల్లగా ఉంటాడు.. ఈయనే మా ఆయన.. నేను అలాగే గుర్తు పెట్టుకున్నాను.. "
"తెల్లగా ఉన్నవాళ్ళంతా నీ మొగుడు అనుకుంటే ఎలా పిల్లా.. ? అయినా, సూర్యకాంతాన్ని నేను ఉండగా.. మీకు సౌందర్య కావల్సి వచ్చిందా.. ? ఇంటికి పదండి.. మీ పని చెబుతాను.. " అంది కాంతం సుబ్బారావు ముఖంలోకి కోపంగా చూస్తూ..
ఇప్పుడే మీ పని చెబుతాను.. అని ఫోన్ తీసి ఆనంద్ కి కాల్ చేసింది కాంతం..
"అన్నయ్యగారు.. ! మా ఆయన ఎవరినో పెళ్ళి చేసుకున్నాడు.. మీరు వెంటనే రండి.. "
"అలా ఏమి జరిగి ఉండదు.. నువ్వు బాధ పడకు.. నేను వస్తున్నాను.. " అన్నాడు ఆనంద్.
స్టేషన్ దగ్గరకు వచ్చిన ఆనంద్.. లోపలికి వెళ్లి.. స్టేషన్ లో జరిగిందంతా మొత్తం చెప్పాడు..
"అయినా డాక్టర్ చెప్పింది మరిచిపోయావా చెల్లెమ్మా.. ఒక్కసారి మీ ఆయనకి గట్టిగా మొట్టికాయ వేస్తే.. కొంచం కొంచంగా అన్నీ గుర్తుకొస్తాయి కదా .. "
"అవును కదూ.. "అని గట్టిగా సుబ్బారావు కి మొట్టికాయ ఇచ్చింది కాంతం..
"కాంతం.. నువ్వు వచ్చేసావా.. ? నిన్ను ఎవరు కిడ్నాప్ చేసారు.. ? వాడి పని పడతాను.. "
"హమ్మయ్యా.. ! ఆయన నన్ను గుర్తు పట్టారు.. "
"ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు.. ? " అని అడిగాడు సుబ్బారావు.
ఈలోపు సౌందర్య కోసం ఆమె భర్త వచ్చి..
"సారీ అండి.. మా ఆవిడకి కొంచం మతిమరుపు.. తెల్లగా ఉన్న వారంతా నేనే అనుకుంటుంది.. " అని అక్కడనుంచి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు.
"ఇంతకీ ఎక్కడకి వెళ్ళిపోయావు కాంతం.. ? ఇంటికి తాళం వేసుంది.. "
"నేను ఇంట్లోనే ఉన్నాను.. ఎక్కడకి పోతాను చెప్పండి.. ? మీరు వెళ్ళింది ఆ పక్కవీధిలో పదో నెంబర్ ఇంటికి అయి ఉంటుంది.. మీకు అలవాటేగా.. ఆ ఇంట్లో ఎప్పుడూ ఎవరు ఉండరు.. "
"అవునా.. ?"
"మీ ఆయనని జాగ్రతగా చూసుకో చెల్లెమ్మా.. లేకపోతే చూసావు కదా.. ఏం జరిగిందో.. " అన్నాడు ఆనంద్.
************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments