top of page

కిన్సుగి

#KiranJammalamadaka, #జమ్మలమడకకిరణ్, #Kinsugi, #కిన్సుగి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #మానసికసంఘర్షణ


Kinsugi - New Telugu Story Written By Dr. Kiran Jammalamadaka

Published In manatelugukathalu.com On 12/03/2025

కిన్సుగి - తెలుగు కథ

రచన: డా: కిరణ్ జమ్మలమడక 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



అర చేతిలో ఒక నాలుగు గవ్వలు తీసుకొని నేలమీద వేస్తే, అన్నీ బోర్లా పడి అష్టా పడటానికి ఆస్కారం ఉంటుంది. అదే ఒక బుట్టెడు గవ్వలను తీసుకొని అన్నీ బోర్లా పడాలి అంటే ఎంత కష్టం? జీవితంలో సంఘటనలు కూడా అలాంటివే. అన్నీ పొందికగా పడాలని అనుకుంటాం కానీ చాలా మటుకు అలా పడవు. ఆ పడని గవ్వలే మనల్ని ఏడిపించే క్షణాలు, మనం పశ్చాత్తాపపడే నిర్ణయాలు, మనం సరిదిద్దుకోవాలనుకునే చర్యలు. 


వాటి పర్యవసానంగా వచ్చే అపరాధ భావం మన ఆనందాన్ని అణచివేస్తుంది, మనల్ని వేధిస్తుంది, మన ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది, మన సంబంధాలను దెబ్బతీస్తుంది. అన్నింటికంటే, మనల్ని ఒంటరివాళ్లను చేస్తుంది. 


నిరాశ నిండిన నిశ్శబ్దంలో, తన గతాన్ని తవ్వుకుంటున్నాడు అవినాష్. గాయం యొక్క నీడలు తనని వెంటాడుతూనే వున్నాయి, ప్రతి జ్ఞాపకం ఒక ముల్లుగా మారి తన అంతరంగాన్ని గుచ్చుతూ ప్రశ్నిస్తోంది ‘ఎందుకు చేసా’వని? ప్రతి క్షణం ఒక వేదన బాధల బరిలో తన జ్ఞాపకాలు ఒక కరగని కరుడు కట్టిన మంచు, అవినాష్ గుండె మంట, ఆ మంచును కరిగించలేదు. అందుకే ఆ జ్ఞాపకాలు అవినాష్ కి ఇంకా తాజాగా తనలోనే ఉండిపోయాయి. 

***

దేశం కోసం ఏదో చెయ్యాలనే తపనతో, షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షలో చివరి అంకమైన ఇంటర్వ్యూ కి చేరుకున్నాడు అవినాష్, ఇంకా మరికొన్ని క్షణాల్లో తన భవిష్యత్తు తెలుస్తుంది. భయం గా, ఉత్సహంగా ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టాడు. 


అది ఒక పెద్ద హాలు, ఎదురుగా ఆర్మీ ఆఫీసర్లు వరసగా కూర్చొని వున్నారు, గది కూడా సైనిక తత్వానికి ప్రతీకగా వుంది, గౌరవం, క్రమశిక్షణ లు కలబోసినట్టుగా చాలా అద్భుతం గా అలంకరించబడివుంది. ఆర్మీ ఆఫీసర్లని చూస్తేనే, ఏదో తెలియని గర్వం, ఒక ధైర్యం, మన దేశం ఎంత భద్రంగా ఉందొ అనే తృప్తి. ఆర్మీ ఆఫీసర్లు, కాబోయే అధికారుల వ్యూహాత్మక చతురతను మాత్రమే కాకుండా వారి నాయకత్వ లక్షణాలను, నైతిక ధైర్యాన్ని కూడా అంచనా వేయడానికి, లోడ్ చేసి ఎక్కుపెట్టిన ఏ కే 47 గన్నుల్లాగా సిద్ధంగా వున్నారు. 


మొదట బెరుకుగా మొదలైన ఈ ప్రక్రియ, మెల్లిగా తుది అంకానికి చేరుకుంది, ఒక సీనియర్ అధికారి కీలకమైన ప్రశ్న వేశాడు.

 

"మీ ఆజ్ఞపై సర్వస్వం త్యాగం చేయడానికి మన సైనికులు సిద్ధంగా వుంటారు, అలాంటి పరిస్థితుల్లో, నువ్వు తీసుకునే నిర్ణయం, వారిని, వారి కుటుంబాలను ప్రాభావితం చేస్తుంది అలాంటి నిర్ణయాలను తీసుకునే ధెర్యం, సమర్ధత నీకు ఉన్నాయని అనుకుంటున్నావా?" 


మొత్తం దేశ రక్షణ వ్యవస్థ తత్వాన్ని నిర్వచించే ప్రశ్న అది ఆక్షణం ఒక సైనిక అధికారి భుజాలపైన ఎంత భాద్యత ఉందొ గుర్తించాడు అవినాష్.. 

***

ఇంతలో బంతి తగలటం వలన కిటికి అద్దం పగిలిన శబ్దం, విసుగ్గా చిరాకుగా, తన ఒంటరితనాన్ని భగ్నం చెయ్యటాని ఒక కుర్రాడు వొస్తాడు అని తెలుసు, ఇప్పుడు ఆ బంతి దొరికేవరకూ అక్కడే తిరుగుతాడు, తనని డిస్టర్బ్ చేస్తాడు, అది తనకు ఇష్టం లేదు, అందుకే ఆ శబ్దం అయినా చోటకు వెళ్లి బంతి కోసం వెతికి ముందే ఇచ్చేద్దామని అవినాష్ అయిష్టంగానే బంతిని వెతుకుతున్నాడు. 


ఇంతలో ఒక 14 ఏళ్ళ వయసు వున్న కుర్రాడు భయంగా లోపాలకి రావటానికి గోడదూకాడు, అది అవినాష్ అదృష్టమో లేక ఆ కుర్రాడి దురదృష్టమో తెలీదు కానీ, ఆ సమయానికి అవినాష్ కూడా బంతిని వెతుకుతూ అక్కడే వున్నాడు, బంతి కోసం ఎవరైనా వస్తారని ఊహించని ఆ కుర్రాడు, ఖంగుతిన్నాడు. సగం నెరిసిన గెడ్డం, చెదిరిన జుట్టు, మాసిన బట్టలు చూసి, ఆ ఇంటి గురించి చెప్పిన దెయ్యం కథలను బాగా వంట పట్టించుకున్న ఆ కుర్రాడు, వొచ్చింది దెయ్యమే అని అనుకున్నాడు, అవినాష్ ని చూడగానే దెయ్యం అని గట్టిగా అరుస్తూ జడుసుకొని కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. 


తన ముందే చిన్న కుర్రాడు కళ్ళు తిరిగి పడిపోవటం చూసిన అవినాష్ కి, ఏంచెయ్యాలో తోచలేదు, అసలే తొందరగా పంపించి తన ప్రపంచం లోకి వెళ్లిపోదామనుకున్న అవినాష్ కి ఈ గొడవ తలనొప్పిగా మారింది, తప్పదన్నట్టుగా ఆ పిల్లాడిని ఇంటిలోకి తీసుకెళ్లి, ఒక సోఫామీద పడుకోబెట్టి, మొహం మీద నీళ్లు జల్లాడు. ఒక రెండు నిముషాలకు స్పృహలోకి వోచిన ఆ కుర్రాడు, ఎదురుగా వున్న అవినాష్ ని చూసి జడుసుకున్నాడు, మళ్ళీ పడిపోతాడేమో అని 

"బాబు, ఏం భయం లేదు నేనూ మనిషినే, ఈ ఇల్లు నాదే " అన్నాడు కాస్త చిరాకుగా. 


ఆమాటతో కొంత తమాయించుకొని, “అంటే.. మేము ఇక్కడికి కొత్తగా వొచ్చామండి, నేను మా ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుతుంటే బంతి మీ ఇంటిలో పడింది, ఇది దెయ్యాలుండే ఇల్లని, మనుషులు ఎవరు ఉండరని నన్ను ముందు భయపెట్టి, బాలు నేనే కొట్టాను కాబట్టి నేనే తేవాలని చెప్పి నన్ను పంపించారండి.. అందుకే వొచ్చానండి” అని గబగబా తన తప్పులేదనట్టు గా చెప్పేసాడు.


 అదంతా విసుగుగా విన్న అవినాష్ "సరే ఇదిగో బంతి, వెళ్ళు” అన్నాడు.


"నాకు మంచినీళ్లు ఇస్తారా ?" మాట కలిపే ప్రయత్నం చేసాడు ఆ కుర్రాడు.

 

"ఆ కూజాలో వున్నాయి వెళ్లి తాగు" అన్నాడు. ఆ దగ్గరకు వెళ్లిన ఆ కుర్రాడు అక్కడ వున్న దుమ్ము, ధూళి ని చూసి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.

 

"మీరు ఒక్కరే వుంటారా" 


" అవును" చిరాకుగా వుంది అవినాష్ కు.

 

"మరి భోజనం ?"


“హోటల్ నుండి తెప్పిస్తా“


ఇంకా మాట్లాడడానికి ఏమి లేకపోవటం తో ఆ కుర్రాడు "హలో నా పేరు భంగ.. మీ పేరు" అనేటంతలో ఎటో ఆలోచిస్తున్న అవినాష్ ఆ పేరు కొత్తగా వింత గా అనిపించింది. 


"అంటే ?" 


"మీ పేరు ఏంటి అని అడుగుతున్నా అండి"


"నా పేరు అవినాష్, నీ పేరుకు అర్థం ఏంటి ?"


"ఓహ్ అదా, చాలా సులువయినా ప్రశ్న, అందరు నన్ను అడిగేదే, భంగ.. అంటే భంగ పరిచేవాడు, ఆపేవాడు అని అర్థం.. "


"ఆ అర్థం నాకు తెలుసు, కానీ దేనిని భంగ పరుస్తావు ? దేనిని ఆపుతావు ?" అన్నాడు అవినాష్ వెటకారంగా.

 

"ఓహ్ అదా.. చాలా మంది ఈ ప్రశ్న దాకా రారు, అర్థం వినటం తోనే నవ్వుకొని వెళ్ళిపోతారు. 

మా అమ్మ చెప్పింది, మన జీవితాల్లో జరిగే సంఘటనలు అస్తవ్యస్తంగా, మనం అనుకున్నట్టు వుండవు కదా వాటిని అలా వదిలేస్తే, వాటి మధ్య దూరం ఇంకా పెరిగి పోయి చివరికి మనం ఎటూ కాకుండా పోతాం, సంఘటనల మధ్య దూరాన్ని భగ్నం చేసి, జీవితాల్లో ఒక పద్దతిని తీసుకురావటమే ఈ నా పేరుకు అర్థం" 


ఇంతలో బయట కుర్రాళ్ళు అరుస్తూవుండటంతో, మళ్ళీ వొస్తా అని వెళ్ళిపోయాడు భంగ.. కానీ అవినాష్ కి తెలియకుండానే ఏదో తెలియని ఒక విషయం చెప్పాడని అనిపించింది, చాలా కాలానికి ఒక చిరు మందహాసం అవినాష్ పెదాలమీద మేరీసీమెరవనట్టు గా కనిపించింది. 

***

శత్రు స్థావరాలను తొందరగా చేరి మట్టుబెట్టే ఉద్దేశం లో వున్న అవినాష్, కి రెండు దారులు ద్వారా అక్కడికి చేరుకునే మార్గాలు కనపడ్డాయి, ఐతే తొందరగా వెళ్ళటానికి ప్రాధాన్యతని ఇచ్చిన అవినాష్, మైన్ డిటెక్టర్ ఇచ్చిన సంకేతాన్ని సరిగా గమనించక షార్ట్ రూట్ తీసుకొని, తన వెంటవున్న సైనికులలో 10 మందిని తనతో పాటు ముందుకు రమ్మని సైగ చేసి ముందుకు నడిచాడు. 


అంతే తనతో పాటు వొచ్చిన వారు ఆ మైన్ పేలుడుకి బలి అయ్యారు, తాను మాత్రం తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డాడు, ఎప్పటికో స్పృహలోకి వొచ్చిన అవినాష్ తాము శత్రుస్థావరాలను చేజిక్కుచ్చుకున్నామనే ఆనందాన్ని తన బెటాలియాన్ లో తనతో వచ్చిన 10 మంది తన వల్లే ఇక లేరనే బాధ ఎక్కువసేపు నిలవనివ్వలేదు. మళ్ళీ డ్యూటీ లో జాయిన్ అవ్వకుండా లాంగ్ లీవ్ తీసుకొని, ఇక్కడే ఉంటున్నాడు. 


మర్నాడు సాయంత్రం, భంగ సరాసరి లోపలకు రావటం కొంత ఆనందాన్ని, కొంత చిరాకును తెప్పించినా ఎందుకో తాను వొస్తాడని ఊహించినట్టు మంచినీళ్లు తాగే కూజాని, గ్లాసుని శుభ్రంగా ఉంచాడు. 


"అవినాష్ అంకుల్, మళ్ళీ బాల్ పడింది, మిమ్మల్ని అడిగి తీసుకుందామని " అన్నాడు భంగ అది అబద్దమని భంగ కు తెలుసు, అవినాష్ కు తెలుసు.


"సరే కూర్చో " అన్నాడు అవినాష్.


"మంచి నీళ్లు.. "


అక్కడ అని సైగ చేసాడు, కొంచెం మొహం విప్పారింది భంగకి, ఇల్లంతా పరికించి చూసాడు, కూజా ఒకటీ శుభ్రంగా వుంది మిగిలిన యిల్లంతా అలానే వుంది. దుమ్ము, పగిలిపోయిన అద్దాలు, మట్టి పట్టిన ఫోటోలు చాలా అపరిశుభ్రంగా వుంది. 


అలా మొదలైన వారి పరిచేయం స్నేహం గా మారటానికి ఎక్కువ రోజులు పట్టలేదు, అవినాష్ కి భంగ తో కబుర్లు చెప్పిన ఒక గంట మాత్రం, తనకు ఒక ఉపశమనం. 


తరువాతి కొద్ది రోజులలో, స్కూల్ తర్వాత అవినాష్‌ని కలవటం భంగ ఒక పనిగా పెట్టుకున్నాడు. మొదట, అవినాష్ ముభావంగా ఉన్నాడు, భంగ చెప్పే ఉల్లాసమైన కబుర్లకు మర్యాదపూర్వక ప్రతిస్పందనలను అందించసాగాడు అవినాష్. 


భంగ పట్టుదలకు నెమ్మదిగా అవినాష్ తన చుట్టూ నిర్మించుకున్న గోడలకు బీటలు రాసాగాయి. భంగ తన స్కూల్ లో, ఆటల్లో రోజు జరిగిన సంఘటనలను పంచుకునేవాడు, తనకు ఇష్టమైన పుస్తకాల గురించి మాట్లాడేవాడు. భంగ చెప్పే కబుర్లు, సంతోషకరమైన క్షణాలు అవినాష్‌ ను కదిలించడం ప్రారంభించాయి. అవినాష్ భంగ కోసం ఎదురుచూడ సాగాడు. అవినాష్‌ హృదయంలోకి జీవితం అనే కొత్త రక్తం తిరిగి వొస్తుందేమో అనే ఆశ కలిగింది, కానీ ఆ మరుక్షణమే తనని తన జ్ఞాపకాలు వేటాడి వేధించసాగాయి. 


ఒక వర్షం కురుస్తున్న మధ్యాహ్నం వేళ, కలిసి కూర్చున్నప్పుడు, భంగ అవినాష్ కళ్ళలో విచారాన్ని గమనించాడు. "ఎప్పుడూ ఎందుకు బాధగా వుంటారు మీరు" అని తెగించి భయం.. భయంగా.. అడిగాడు భంగ. 


అవినాష్ లోతుగా నిట్టూర్చాడు, అతని నీడ అతన్నే చూసి నవ్వుతోంది "నేను చాలా కాలం క్రితం ఒక ఘోరమైన తప్పు చేసాను, నా వల్ల కొంతమంది చనిపోయారు, వారి కుటుంబాలు బాధపడాయి, నన్ను నేను క్షమించకోలేకపోతున్నాను. "

భంగ శ్రద్ధగా విన్నాడు, అవినాష్ దుఃఖంలోని సంక్లిష్టతను గ్రహించడానికి అతని చిన్న మనస్సు ప్రయత్నిస్తోంది. "కానీ మీరు మంచివారని మీకు తెలుసుకదా, అయిపోయింది కదా " 


అవినాష్ నెమ్మదిగా నవ్వాడు, ఆ నవ్వులో "అవకాశం వొస్తే ప్రతివాడు, పక్కోడికి హితబోధ చేసేవాడే, వయసుతో కూడా సంబంధంలేదు " అని తన మనసులోనే నవ్వుకున్నాడు, భంగ తల పైన చిన్నగా నిమిరాడు.

 

“మీ నవ్వుకు అర్థం నాకు తెలుసండి, కానీ ఎప్పటికైనా అంతం ఉండాలి కదా.." అని ఏదో చెప్పబోతుండగా 

"వర్షం తగ్గినట్టువుంది. మీ అమ్మగారు నీకోసం ఎదురు చూస్తుంటారేమో " అన్నాడు అవినాష్.


ఆమాటకు అర్థం అర్ధమయ్యి భంగ వొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అవినాష్ ఎప్పటిలాగే తన ఆలోచనల్లో మునిగిపోయాడు.


అలా రోజులు గడవసాగాయి, భంగ అతికష్టం మీద అవినాష్ ని బయటకు తీసుకెళ్ళేవాడు, తనకి చూడడానికి భయం వేస్తోందని, బతిమాలి సెలూన్ కి, ఫ్రెండ్స్ ని పరిచయము చేస్తానని క్రికెట్ కి తీసుకెళ్ళేవాడు. అవినాష్ కాదనలేదు, మళ్ళీ భంగ అవినాష్ గతాన్ని కదిలించే ప్రయత్నం చెయ్యలేదు, భంగ బోలెడు కబుర్లు చెప్పేవాడు.


ఒక వర్షం కురిసిన సాయంత్రం, భంగ అవినాష్అ ఇంటిలో వుండిపోయాడు, మాటల్లో భంగ తన అనుభవాన్ని పంచుకున్నాడు. 


"మీకు తెలుసా, నేను కూడా నిజంగా గిల్టీగా ఫీల్ అయ్యాను. గతేడాది అనుకోకుండా మా అమ్మకి ఇష్టమైన వాజ్ ని తుడుస్తూ జారవిడిచాను. అది పగిలిపోయింది. ఆ ముక్కలన్నీ జాగ్రతగా ఒక సంచిలోవేసి నా రూమ్ లో దాచేసాను. అది అమ్మమ్మ నుండి వచ్చిన వారసత్వం. ఆ వాజ్ అక్కడ లేదని అమ్మ గమనించలేదు కూడా కానీ నాకు భయంగా అనిపించేది. అమ్మ ఎంత బాధపడుతుందో అని ఆలోచించకుండా ఉండలేకపోయాను. చాలా రోజులు నేను ఆమ్మ తో సరిగా మాట్లాడేవాడినికాదు, ఎందుకంటే నాకు చాలా గిల్టీ అనిపించేది. 


మీ లాగే అద్దాలంటే ఇష్టం ఉండేది కాదు, నామొహం చూస్తే నాకే ఇష్టముండేది కాదు. ఇంటిలో అద్దాలు ఎందుకు పగిలిపోతున్నాయో అమ్మకి అర్థం అయ్యేది కాదు. "


అవినాష్ భంగ వైపు చూశాడు, యుద్ధం లో తనకి తగిలిన బుల్లెట్ల కంటే తీక్షణంగా వున్నాయి భంగ మాటలు. తన ప్రతిబింబం కనిపించింది. సంఘటనల తీవ్రత వేరు కావచ్చు కానీ బాధ తీవ్రత మాత్రం ఒకటే అని గమనించాడు. 


"అప్పుడు ఏం చేసావు?" మెల్లగా అడిగాడు అవినాష్.


భంగ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. "ఒక రాత్రి, మా అమ్మ నేను నా గదిలో ఏడుస్తూ కూర్చోవడం చూసింది. ఏమైంది అని అడిగింది, ఇంక నా వల్ల కాలేదు నేను ఆమెకు జరిగింది చెప్పేసాను. ఆ సంచిలో దాచిన ముక్కలను ఆమె చేతికి ఇచ్చాను. ఆమె కోపంగా ఉంటుందని నేను ఊహించాను. 


కానీ బదులుగా, ఆమె నన్ను కౌగిలించుకొని, 'భంగా, నాకు తెలుసు, నువ్వు కావాలని చెయ్యలేదని. ఒక విషయం నేర్చుకో. తెలియక జరిగేది తప్పు. కావాలని చేసేది మోసం. తప్పులు సహజం, సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యాలి. దాని నుండి నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం నిన్ను నువ్వు క్షమించుకోవటం. అది జరగని క్షణం జీవితమంతా నరకమే” అని మెల్లిగా చెప్పి నవ్వింది. 


కానీ నాకు తృప్తిలేదు “నాకు తెలుసు నేను కావాలని చెయ్యలేదని. మరి ఈ పగిలిన వాజ్ ని ఎలా సరిద్దుతాము? ఇది నీకు అమ్మమ్మ ఇచ్చిందికదా” అన్నాను. 


దానికి మా అమ్మ 'ఎలా ఉందొ ఆలా మార్చలేము, కానీ మనం చెయ్యగలిగింది చేద్దాం. నువ్వెళ్లి ఒక గిన్నెలో కొంత సిమెంట్, నీరు కలిపి తీసుకురా ' అని చెప్పింది. నేను తెచ్చాను. అప్పుడు మా అమ్మ కిన్సుగి గురించి చెప్పింది. పగిలిన కుండలను బంగారంతో రిపేర్ చేసే జపనీస్ టెక్నిక్. పగిలిన కుండల్ని అతికించటాని పెట్టిన కృషి, శ్రద్ద వలన ఆ పగిలిన కుండ మరింత అందంగా, విలువైనదిగా మారుతుందని అమ్మ చెప్పింది. నేను, అమ్మా.. ఆ పగిలిన ముక్కలని సిమెంట్ తో తిరిగి అతికించి మొత్తానికి ఆ పగిలిన వాజ్ ని నిలబెట్టాము. ఆ నల్లని సిమెంట్ మరకలతో ఆ వాజ్ ఇప్పుడు మాకు మరింత అందంగా కనపడింది. అప్పుడు నా మనసు కుదుట పడింది. 


అప్పుడు మా అమ్మ చెప్పింది.. 

'తప్పు జరగటం సహజమే, కానీ జరిగిపోయిందని తలుచుకుంటూ ఏడవటం కన్నా, దాన్ని ఒప్పుకొని, సరిదిద్దే ప్రయత్నం చెయ్యాలి' అని చెప్పింది.” 


భంగ చెప్పటం ఆపి అవినాష్ వైపు చూసాడు. అవినాష్, ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఒక పిల్లవాడు అలాంటి అపరాధాన్ని అధిగమించి దానిని అందంగా మార్చగల శక్తిని పొందగలిగితే, బహుశా అతను కూడా తనను తాను క్షమించుకుని ముందుకు సాగడానికి ఒక మార్గాన్ని కనుక్కోవచ్చేమోనని అవినాష్ కి అనిపించింది. 


ఏదో స్ఫురించింది, కర్తవ్యం అర్థమయ్యింది. అది గమనించిన భంగ, అవినాష్ ని డిస్టర్బ్ చెయ్యటం ఇష్టం లేక అక్కడినుండి మెల్లిగా వెళ్ళిపోయాడు. 


అది కూడా గమనించని అవినాష్, కిటికిదగ్గర వున్న తెరలను పక్కకు జరపడంతో, సూర్యుని బంగారు కాంతి కిరణాలూ అప్పటి దాకా గోడ మీద దెయ్యాల్లాగా వున్న నీడలును కరిగించి, అవినాష్ హృదయాన్ని కొత్త వెలుగుల తో నింపాయి. ఆ వెంటనే తాను పనిచేసిన రెజిమెంటు నుంచి తన ద్వారా నష్టం కలిగిన సైనికుల ఇంటి అడ్రస్లు తీసుకొని బయలుదేరాడు ప్రతి ఒక్కరిని క్షమించమని అడగటానికి, చేతనైన సాయం చెయ్యటానికి. 


ఒక్కొక్క కుటుంబానిది ఒక్కో కథ, ఒక్కో వ్యధ. తనను పరిచేయం చేసుకొన్న క్షణం వారి మొహాల్లో కలిగిన కోపం, ఆశ్చర్యం, నిర్లిప్తత, బాధ అన్నీ గమనించాడు. కానీ వారు అందరు చివరిలో అన్న మాట మాత్రం తనని ఈ అంధకూపం నుండి బయటపడేసింది.

 

"ఉద్దేశాలు ఉన్నతమైనవి అయినప్పుడు, ఎంచుకున్న మార్గం కొన్నిసార్లు తప్పు కావచ్చు. బాధపడకు. దేశం కోసం పోరాడే మీ గురించి, పోరాడిన మా బిడ్డల గురించి గర్వపడుతున్నాము." అని అవినాష్ ని ఓదార్చి క్షమించి పంపించారు. ఆ వెచ్చని ఓదార్పు, తన గుండెల్లో కరుడు కట్టిన బాధని కరిగించింది. 


అవినాష్, మునుపటి అవినాష్ లాగా మారే ప్రయత్నం చేయ్యసాగాడు, భంగ తన పేరు కి వున్న అర్థాన్ని నిలబెట్టుకున్నాడు, అవినాష్ మళ్ళీ ఉద్యోగం లో చేరాటానికి అనుమతి కోరాడు. 


జీవితంలో తెలుసో తెలియకో తప్పులు జరుగుతాయి, విసిరిన గవ్వలని పొందికగా బోర్లా పడితే అది జీవితేమే అవ్వదు, తిరగ పడిన గవ్వలని మనమే మన కృషి తో సరి చేసుకోవాలి. అపరాధం, విరిగిన వాజ్ లాంటిది, దానిని మనం సమయం, శ్రద్ధతో సరిదిద్దుకోవాలి. మనం చేసే పొరపాట్లు, తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం, పగుళ్ళను బంగారంతో నింపటం వంటిది.


మునుపటి లాగ చెయ్యలేక పోవచ్చు కానీ మరింత అందముగా మార్చే అవకాశం మాత్రం వుంది. ఆ ప్రయత్నం చెయ్యని నాడు, ఆ అపరాధం ఒక భారం మై, మనిషి ఎదుగుదలకు, పరివర్తనకు అవరోధంగా మారుతుంది. 


జీవితం అనే విచిత్రమైన గవ్వలాటలో మన ప్రయత్నమే మనల్ని సార్ధకత వైపు నడిపిస్తుంది.. 



*****

కిరణ్ జమ్మలమడక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr: కిరణ్ జమ్మలమడక

 డా. కిరణ్ జమ్మలమడక , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పట్టా పొందారు.ప్రస్తుతం GE  హైదరాబాద్ లో  సీనియర్ సాఫ్ట్వేర్ మేనేజర్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను  నిర్వహిస్తూవుంటారు. పిల్లలు , పెద్దలు  ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకు సాగాలనే ఉద్దేశం తో  కథలు రాయటం కూడా మొదలుపెట్టారు.  "చినుకు","ఆంధ్రభూమి", "తెలుగు వెలుగు ", "తానా","ఖమ్మం ఈస్థటిక్స్" మొదలైన ప్రముఖ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో ఈయన కథలు బహుమతి సాధించాయి. ఆ కథల్లో మిరప మొక్క , మోహపు మరకలు,ఆమె అతడిని జయించెను,  యాత్ర (పిల్లల బొమ్మల పుస్తకం ) మరియు  అతీతం, అస్తిత్వం అనే సైన్స్ ఫిక్షన్ (నవలలు) ప్రేక్షకాదరణ పొందాయి. మరికొన్ని కథలు అంతర్జాలం మాధ్యమం లో కూడా ప్రచురితమయ్యాయి.


Comentarios


bottom of page