కోబ్రాల మధ్య వానపాము
- Ayyala Somayajula Subramanyam
- Jan 13, 2023
- 7 min read

'Kobrala Madhya Vanapamu' New Telugu Story
Written By Ayyala Somayajula Subrahmanyam
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఓ దొంగ దైవమయ్యాడు. అక్షరాలు నేర్వనివాడు న్యాయదేవతకి రక్షకుడయ్యాడు. అబద్దము చెప్పాలంటూ శరీరాన్ని నుజ్జునుజ్జు చేసినా నిజం వైపే నిష్ఠగా నిలిచాడు.
అందుకే 28 ఏళ్ళపాటు సాగిన నళిని హత్యకేసు తీర్పులో న్యాయస్థానం ఆ మాజీ దొంగని వేనోళ్ళ ప్రశంసించింది!
సమాజం అంతా చేతులెత్తి నమస్కరించిన
"చిల్లర రాజు" కథ కాని కథ ఇది...............
షాలినీ-శివాణీ లో సెకండ్ షో చూస్తున్న చిల్లరరాజు ధ్యాస సినిమాపైన లేదు. ఆ సినిమా విడిచాక... తాను చేయబోతున్న దొంగతనం గురించే ఆలోచిస్తున్నాడు. తాను
మూడురోజులుగా రెక్కీ నిర్వహిస్తున్న ' విక్టోరియా హోమ్స్" పరిసరాలనే గుర్తు చేసుకుంటున్నాడు.
సిటీ లోని డయాసిస్ కి చెందిన ఉద్యోగినులూ, విద్యార్థినులూ ఉండే హాస్టల్ అందులో ఉంది. ఆ భవంతి పై పిడుగుని నిరోధించే కంభంపైనుండే రాగి తీగపైన రాజు కన్నుపడింది! రాజు ఎప్పుడూ అంతే... పెద్ద పెద్ద వస్తువులూ, బంగారు నగలవైపు వెళ్ళడు. చిన్నా చితకా రాగి వస్తువులూ, నీటిమీటర్లూ, గడ్డి అన్నారం పళ్ళమార్కెట్ కు వచ్చేలోడు బళ్ళ మీద పళ్ళు కిలోలకు కిలోలు దొంగతనం చేస్తాడు.
అవి దొరకనప్పుడు చుట్టుప్రక్కల సబ్ స్టేషన్‌లలో కాపర్‌తీగలు చోరీ చేస్తాడు. పెద్ద వాటి జోలికి అస్సలు వెళ్ళడు. అందుకే చిల్లరరాజూ అని అంటారు.
పగలంతా ఎవరికీ అనుమానం కాకుండా పళ్ళమార్కెట్ లో దింపులు దింపుతుంటాడు. మార్కెట్‌లో హమాలీ గానూ ఉంటాడు! 26 మార్చి 1992న.. సెకండ్‌షో ముగిసి రోడ్లపైన సందడి తగ్గాక మెల్లగా " విక్టోరియాహోమ్స్" దగ్గరకెళ్ళాడు రాజు.
దక్షిణం వైపు కాంపౌండ్ గోడ పక్కనున్న చెట్టుపై నెక్కి లోపలికి దూకబోతుండగా....
అతని కళ్ళ పడ్డారు ఇద్దరు వ్యక్తులు! చేతిలో టార్చ్ తో గ్రౌండ్‌ఫ్లోర్‌మీద నుంచి సెల్లార్ లోకి దిగుతూ కనిపించారు.. అందులో ఒకరు వార్డెన్ అరుల్‌రాజు- ఆ చుట్టు ప్రక్కల అరుల్‌రాజు పెద్దమనిషి గా చలామణి అవుతున్నాడు.
ఇంకొతను అక్కడి కాలేజీలో లెక్చరర్. విక్టోరియా వ్యవహారాలు చూస్తూంటాడు. వాళ్ళని చూసి రాజు ఉలిక్కిపడ్డాడు. ‘ఏ మగ పురుగుని లోపలికి రానివ్వని అమ్మాయిల హాస్టల్ లోకి ఈ ఇద్దరూ ఎలా వచ్చారు.... అదీ ఈ జామున!' అనుకున్నాడు. ఆ ఇద్దరూ తిరిగి వెళ్ళేదాకా వేచి చూద్దామనుకున్నాడు. 05. 30 దాకా వాళ్ళు బయటకు రాలేదు... ఈ లోపు హాస్ట్‌ల్ సైరన్ మోగింది!
అతనికి అప్పుడు తెలియని విషయమేమిటంటే... అతని కెదురుగా ఉన్న భవనానికి ఆవలివైపు ఓ అమాయకురాలు ఘోరహత్యకు గురువుతోంది అనీ, ఆ ఘటన మరో
పాతికేళ్ళు తననీ, తనతో పాటు తన కుటుంబాన్నీ నిజమనే నిప్పుల పైన నడిచేలా చేస్తుందీ అనీ!!!
-----------------
ఆ అమ్మాయి పేరు నళిని. నల్లగొండ జిల్లలో ఆలేరు దగ్గర చిన్న కుగ్రామం. తండ్రి జానయ్య, తల్లి మరియమ్మ. నళిని కి చిన్నప్పటినుంచి పరోపకార బుద్ది. పరులకు సేవ చేయుటలో ఆనందం పొందేది. ఎనిమిదో తరగతి నుంచే తను ఆశా వర్కర్ ట్రైనింగ్ కు వెళతానని చెప్పేది. ఆ విధంగానే 1990 లో తన 17 వఏట విక్టోరియా హోమ్స్ కు చెందిన ట్రైనింగ్ సెంటర్ లో ఆశా వర్కర్ ట్రైనీ గా జాయినయ్యింది.
అందులో ప్రవేశము సులభంగానే దొరికింది. అక్కడే వాళ్ళ కాలేజీలో ప్రీడిగ్రీలో కూడా జాయినయ్యింది. ప్రొద్దునే తనకు ఇచ్చిన ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ ఆరోగ్య సమాచారం కనుక్కునేది. ఆ పిదప తన చదువు. కాలేజీ కి వెళ్ళడం. మళ్ళీ సాయంత్రాలు ఆశా వర్కర్ ట్రైనీ డ్యూటీ. ఇవి తప్ప నళినికి మరో ప్రపంచం తెలియదు.
27 న తనకి పరీక్షలున్నాయి. 26 రాత్రి 8. 30 కే నిద్రకుపక్రమిస్తూ ఉదయాన్నే 4. 00 గంటలకి లేపమని తన సీనియర్ ఆశా వర్కర్ సలీనా కి చెప్పి పడుకుంది. సలీనా ఆ సమయానికే నిద్ర లేపింది. లేచిన నళిని కాసేపు పుస్తకం ముందు కూర్చున్నాక ' మంచి నీళ్ళున్నాయా అక్కా'! అని అడిగింది సలీనా ని.
“అయిపోయాయి, సెల్లార్ లోని కిచెన్ లో ఉంటాయి. కానీ ఇప్పుడు వెళ్ళొద్దు... కిచెన్ లో ఎవ్వరూ ఉండరు' అని చెప్పి మళ్ళీ పడుకుంది సలీనా.
నళిని కాసేపు కూర్చుంది కానీ,... దాహం మరీ ఎక్కువైందేమో కిందికి వెళ్ళింది.
వెళ్ళిన అమ్మాయి 5. 15 దాకా రాలేదు! సలీనా అప్పటికి నిద్ర లేచి నళిని కోసం చూస్తే... తను ఆ ఫ్లోర్ లో ఎక్కడాలేదు.
కిచెన్ ఇన్‌చార్జ్ అచ్చమణి ని లేపింది. కిందగదిలో ఉన్న మరో ఆశావర్కర్ షెఫీ కూడా అప్పటికే తన గది బయట ఉంది. అందరూ కలిసి కిచెన్ కు వెళ్ళారు. అక్కడ వస్తువులు చెల్లా చెదురుగా ఉన్నాయి. ఆ తలుపు రెక్కల మధ్య నళిని 'చున్నీ ' ఇరుక్కుని ఉంది. ఆ తలుపు కింద నళిని చెప్పు కూడా ఉంది. అందిరి లోనూ ఆందోళన మొదలైంది.
ఈ లోగా నళిని తండ్రికి కబురు పంపితే ఆయన కూడా వచ్చారు. పోలీసులు రంగం లోకి దిగారు. సబ్‌ఇనస్పెక్టర్ జార్జ్‌రెడ్డి... కాంపౌండు మొత్తాన్ని జల్లెడ పట్టాడు. చివరగా బావిలోనూ చూస్తే అక్కడ నళిని శవం గా తేలుతూ కనబడింది. ! తండ్రి జానయ్య బోరుమంటూ తల బాదుకున్నాడు. ఆ హోమ్ లోని అమ్మాయిలందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఆ మరుసటి రోజే " బావిలో దూకి ఆశావర్కర్ ట్రైనీ ఆత్మహత్య" అంటూ పత్రికలలో వార్తలొచ్చాయి. తండ్రి జానయ్య ఆ వార్తలని నిరాధారమని ఖండించాడు. నళిని తల వెనకాల రెండు బలమైన గాయా లున్నాయని, మెడక్రింద గోళ్ళ గుర్తులున్నాయని చెప్పాడు. ' ఎప్పుడూ ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించే నళిని ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు. పోలీసులు ఏదో దాస్తున్నారు' అంటూ ఇతర ఆశా వర్కర్లందరూ ధర్నాకి దిగారు.
వారంలోనే ఆ ఆందోళనలు జంటనగరాలు రెండింటిలోనూ తీవ్రమై..... తెలంగాణం అంతటా పాకాయి. దాంతో క్రైమ్ బ్రాంచి డీజీపి దర్యాప్తు కి ఆదేశించారు. క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మొదట చేసిన పని........ అప్పటికే సేకరించి ఉన్న ఆధారాలన్నింటినీ ధ్వసం చేయడం.
----------------
హంతకులని పట్టిస్తాయనుకున్న నళిని దుస్తులూ, చెప్పులూ వంటి వాటిని లేకుండా చేశారు క్రైమ్ బ్రాంచి పోలీసులు. అంతే కాదు, నళిని శవం ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్- వాళ్ళకి పది ఫోటో లిస్తే అందులో నాలుగు దాచేశారు. ఆ నాలుగూ నళిని మెడక్రింద గాయాలని చూపేవే! పనిలో పనిగా శవపంచనామా నివేదికను మార్చారు.
అవి సరిపోక, అసలు నిందితులని కాపాడటానికి వాళ్ళకో బలిపశువు అవసరమయ్యాడు. ఆ బలిపశువు...... " చిల్లర రాజు" రూపంలో వాళ్ళకి కనిపించాడు. నళిని చనిపోయి అప్పటికి వారం రోజులు. ఆమె నేపథ్యం గురించి..... ఆందోళనల గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.
అవి విన్న రాజు ఎవరి దగ్గరో 'అరే.... నేను ఆ రోజు అక్కడే ఉన్నా. అరుల్‌రాజు సార్ ని చూశా!' అన్నాడు. ఆ మాటలు ఓ పత్రికా విలేఖరి చెవిలో పడ్డాయి.
'కాంపౌండులో పలానా రోజు అరుల్‌రాజు గారిని ఓ దొంగ చూశాడట. ' అని పత్రికలలో వార్త వచ్చింది. అంతే.... క్రైం బ్రాంచి పోలీసులు రాజుని అదుపు లోకి తీసుకున్నారు.
-----------------------
రాజుది చిన్నప్పుడే తండ్రి వదిలేసిన కుటుంబం. చదువు లేదు. చిన్ననాటే బాల కార్మికుడుగా మారాడు. టీనేజీ తరువాత దొంగయ్యాడు. నళిని హత్యకు గురయ్యే నాటికి
అతనికి ముప్పై ఏళ్ళు. పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు తనని పట్టుకోవడమూ, వాళ్ళ కళ్ళుగప్పి పరారు కావడం రాజుకేమీ కొత్త కాదు. కానీ ఆ రోజు పరిస్థితి వేరేలా ఉంది. తనకు బాగా తెలిసిన కానిస్టేబుల్, హెడ్డులూ కాకుండా పెద్దపెద్ద అధికారులు వచ్చి కొడుతున్నారు.
పదే పదే వాళ్ళు రెండు విషయాలు చెబుతున్నారు రాజుకు. మొదటిది- ‘నళిని ని నువ్వే చంపావని ఒప్పుకో!' అని.
రెండోది- 'అరుల్‌సార్ అక్కడున్న విషయం ఎవరితోనూ చెప్పొద్దు!' అని.
'ఆ అమ్మాయి నా బిడ్డలా ఉందయ్యా! నేను అబద్దం ఆడను!’ అంటున్నాడతను.
రాజు దొంగ సొమ్ము అమ్మే షాపు యజమాని నీ పిలిచి వాళ్ళనీ వారం రోజులపాటూ కొట్టారు. పోలీసులే ఆ షాపు వాళ్ళకి పది కిలోల వెండి, ఆరు వాటర్ మీటర్లు, ఇచ్చి..... వాటిని రాజే వాళ్ళకి అమ్మినట్లు చెప్పమన్నారు. అలా రాజు పైన నలభై తప్పుడు కేసులు నమోదు చేశారు. రోజంతా తలకిందులుగా వేళాడదీసి కొట్టే వారు. గోళ్ళు పీకి కారం పూసేవారు. కాళ్ళూ చేతులు కట్టేసి... పాదాల పైన లాఠీలతో విరగబాదేవారు.
ఆ థర్డ్‌డిగ్రీ హింస.... 58 రేజుల పాటు సాగింది! ఇక చివరి అస్త్రంగా, నీకు రెండు లక్షలిస్తాం. మీ ఆవిడకి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం. నీ పిల్లల చదువు బాధ్యత కూడా
మేమే తీసుకుటాం. మేం చెప్పినట్టు విను.... " అన్నారు.
దానికి రాజు ' నా కేమీ వద్దు సార్. చనిపోయిన ఆ బిడ్డకి నేను అన్యాయం జరగనివ్వను!' అని చెప్పాడు. మొత్తానికి నళిని మరణాన్ని ఆత్మహత్య గానే ప్రకటించింది క్రైం బ్రాంచి.
వాళ్ళమ్మ ఓ మానసిక రోగి అనీ, నళిని ఎప్పుడూ మానసిక అలజడులతో ఉండేదని... చదువులో వెనక పడేదని చెప్పారు. వాటిలో ఏ మాత్రం నిజం లేదని ఆశావర్కర్లందరూ మండిపడ్డారు.
ఆ నాటి ముఖ్యమంత్రి కేసుని సిబిఐ కి బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటికే రాష్ట్ర పోలీసులు రాజు శరీరాన్ని నుజ్జు నుజ్జు చేసి వదిలారు. ఒళ్ళంతా చీముపట్టి
అస్థిపంజరంలా తయారయ్యి ఇంటికొచ్చాడు రాజు.
---------------
కేసు సీబీఐ చేతికొచ్చిన మూడు నెలలకే సీబీఐ డీఎస్పీ రామ్‌శెట్టి నళినిది ముమ్మాటికీ హత్యేనని తేల్చి ప్రాథమిక నివేదిక అందించారు. మూడు నెలల తరువాత ప్రత్యే
కంగా మరో విలేఖర్ల సమావేశం నిర్వహించారు.
'నేనీ కేసునుంచి తప్పుకుంటున్నాను. అంతే కాదు. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. నా పై అధికారి ఆత్మహత్యేనని చెప్పమంటున్నాడు... అది నాకు నచ్చడము లేదు!' అని కుండబద్దలుకొట్టాడు.
ఈ ప్రకటన అప్పట్లో దేశాన్ని ఊపేసింది. పార్లమెంటులోనూ చర్చకు దారితీసింది. ఇంత జరిగినా 1996 లో సీబీఐ ఇది ఆత్మహత్యేనంటూ ప్రకటించి, కేసు మూసేయాలంటూ కోర్టుకి నివేదించింది. దాంతో తెలంగాణం, జంటనగరాలు అట్టుడికి
పోయాయి. బడా నాయకులంతా రోడ్డెక్కి ధర్నాలు చేశారు. కోర్టు సీబీఐని తీవ్రంగా మందలించింది.
'సమగ్రంగా విచారణ జరపండి'! అంటూ హుకుం జారీచేసింది. మరో మూడేళ్ళు సాగించిన సీబీఐ 'హత్యేనని తెలుస్తోంది. కానీ దోషులెవరో తేల్చుకోలేకపోతున్నాం!' అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. అప్పుడే కాదు....
1999 లోనూ, 2005 లోనూ ఇదే పాట పాడింది! ప్రతీసారీ న్యాయస్థానం తలంటూతూనే వచ్చింది. చివరికి 2007 లో సీబీఐ కాస్త నిజాయితీగా ప్రయత్నించడం మొదలుపెట్టింది.
-------------------
1993-2007 దాకా సీబీఐ తూతూ మంత్రంగా కేసుని విచారించి నప్పటినుంచి చిల్లర రాజును 'విచారిస్తూనే' ఉన్నారు. అప్పటికే రాజు పేరు పత్రికలలో మారు మ్రోగిపోయింది. దొంగ తనాలు మానివేశాడు. కానీ బడికెళితే పిల్లలను అందరూ 'దొంగోడి పిల్లలు' అని వేలెత్తి చూపడం, ఈసడించడం మొదలు పెట్టారు. ఇళ్ళ పనులకి వెళ్ళే రాజు భార్యను పనులు మానిపించేశారు. ఉపాది పోయింది. 'ఓ దశలో అటు సీబీఐ వాళ్ళ పోరూ, చుట్టుప్రక్కల వారి చిన్నచూపు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.
భార్య అడ్డుపడి నువ్వు చస్తే నళిని ని నువ్వే చంపావని తేల్చేస్తారు. ఆ అమ్మాయి కోసమైనా బతుకు! అంటూ చెప్పింది. రాజు విచారణ కెళ్ళే ప్రతీసారి భార్యనూ, పిల్లలనూ వెంట పెట్టు కెళ్ళే వాడు. వాళ్ళ మొహం చూసైనా దయ తలుస్తరేమోనని ఆశ రాజుది!
కానీ 2007 తరువాత సీబీఐ ధోరణి మారింది. చిల్లర రాజుని ప్రధాన సాక్షి( ప్రాశిక్యూషన్ విట్నెస్) గా తీసుకుంది. రాజుతో పాటు ప్రక్క స్కూల్ ప్రిన్సిపాల్ రాఘవ కూడా బలమైల సాక్షిగా మారాడు. సంఘటన జరిగిన రాత్రి అరుల్‌రాజు స్కూటర్ ని తన స్కూల్ ముందు చూశానని చెప్పాడు.
దాంతో తొలిసారి సీబీఐ 2007 లో అరుల్‌రాజు, అతని అసిస్టెంట్ తో పాటు షెఫీ లకు నార్కో ఎనాలిసిస్ టెస్టు చేసింది. ఏడాది తరువాత 2008 లో ఆ ముగ్గురుని అరెస్ట్ చేశారు. నళిని హత్య జరిగిన పదహారేళ్ళ తరువాత జరిగిన అరెస్ట్ అది! ఆ తరువాత న్యాయ స్థానాల జోక్యాలు, నిందితులకు బెయిల్‌లు, సుప్రీంకోర్ట్‌లో అప్పీళ్ళు, విచారణలూ, స్టేలూ చోటు చేసుకున్నాయి.
అప్పుడే- ఈ కేసుని మొదట విచారించిన ఇనస్పెక్టర్ జార్జిరెడ్డి ఉన్నఫళంగా ఆత్మహత్య చేసుకున్నాడు! డైరీ బయటికి 'నళిని ది ఆత్మహత్య' అని రాసుకుని ఉండటం
బయటపడింది. వీటన్నింటితో పాటు పదకొండేళ్ళ తరువాత 2019 ఏప్రిల్ లో నాంపల్లి సీబీఐల ప్రత్యేక న్యాయస్థానం లో తుది విచారణ మొదలైంది. సీబీఐ తన చార్జీషీట్ లో 1993 మార్చి 27 ఉదయం 4. 00 తరువాత..... రాఘవ స్కూల్ కాంపౌండ్ లో ఏం జరిగిందో వివరించింది.
---------------
నీళ్ళ కోసం క్రిందకి వచ్చిన నళిని కిచెన్ లో లైట్ వేయగానే... అప్పటిదాకా చీకటిలో ఉన్న షేఫీ, అరుల్‌రాజు, అరుల్‌రాజ్ అసిస్టెంట్ ఆనంద్ ఉలిక్కిపడ్డారు. యోగా
అభ్యాసం చేయిస్తున్నామని చెప్పి, ప్రపంచాన్ని నమ్మిస్తూ వచ్చిన ఆ ముగ్గురూ.... సామూహికంగా లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్నారు. తన కాలేజీ లెక్చరర్సు కమ్ వార్డెన్,
తన సీనియర్ షెఫీ సామూహికంగా లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్నారు.
ఉన్నతమైన విద్యాసంస్థ, ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తి లో ఉంటూ తమ శిష్యురాలితో ఆ విధంగా ఉండటం చూసి నళిని స్థాణువై పోయింది. పరుగెత్తి గదికి వెళ్ళబోతున్నఆమెను అరుల్‌రాజ్, ఆనంద్ లిద్దరూ కదలకుండా పట్టుకున్నారు. షెఫీ అక్కడున్న చిన్న గొడ్డలితో నళిని తలమీద రెండుసార్లు బాదింది. ఆ దెబ్బకి కుప్పకూలిన ఆమెని మొదట టెర్రస్ మీదకి తీసుకెళ్ళి తోసేయాలనుకున్నారు. మోసుకెళ్ళడం కుదరక... ప్రక్కనున్న బావిలో పడేశారు. అప్పటికి నళిని ప్రాణాలతో ఉంది.
------------------
సీబీఐ చూపిన ప్రతీ సాక్ష్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు నిందితులు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్‌ని ప్రధాన సాక్ష్యంగా తీసుకోలేరని వాదించి నెగ్గారు. అరుల్
రాజు తనకి బలమైన సాక్ష్యం లేదంటూ నిరూపించి విడుదలయ్యారు. అంతేకాదు, నళిని కి న్యాయం జరగాలంటూ పోరాడిన ఆమె స్నేహితులు, క్లాస్‌మేట్స్ అందరూ ప్లేట్ ఫిరాయించారు. వాళ్ళనందరినీ నయానో, భయానో డబ్బులు ఎరవేసి వాళ్ళనందరినీ లొంగతీసుకున్నాడు.
అరుల్‌రాజుకు చాలా పలుకుబడి ఉంది. స్టేట్ ఐజీ, సెంట్రల్ మినిస్టర్, నయీమ్ గాంగ్‌లతో విస్తృత పరిచయాలున్నాయి. సీబీఐ దగ్గర ముఖ్యమైనవి మూడు సాక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, రాజు సాక్ష్యం, రెండు- షెఫీ తన కన్యాత్వము చెరిగిపోలేదని నిరూపించుకోవడానికి 2007 లోనే హైమనోప్లాస్టీ సర్జరీ చేయించుకున్నట్టు దొరికిన ఆధారం. మూడు రాఘవ, అరుల్‌రాజు స్కూటర్ తన స్కూల్ ముందు చూశానని చెప్పడం. ఈ మూడు కారణాలు, ఆధారాలు బలమైన సాక్ష్యాలుగా మారాయి.
రాజుని రెండు రోజుల పాటు డిఫెన్స్ లాయర్లు, ఎన్నెన్నో రకాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. రకరకాలుగా గందరగోళ పరిచారు. ఎంత చేసినా-- అరుల్‌రాజుని చూసింది నిజమని బల్లగుద్ది మరీచెప్పాడు రాజు.... అక్షరాలు రానివాడి మొండితనాన్నే నమ్మింది కోర్ట్. 2020 ఏప్రిల్ తొమ్మిదిన ఇచ్చిన తీర్పులో 28 ఏళ్ళ కేసుకి భరతవాక్యం పలికింది.
అరుల్‌రాజుని, షెఫీ ని దోషులుగా ప్రకటిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రాజు 58 రోజులపాటు ఎదురుకొన్న హింసని, పోలీసుల ప్రలోభాలనీ వివరించింది. అయినా సరే
ఇసుమంతైనా మనసు మార్చుకోని అతని నిబ్బరాని అభినందించింది.
"రాజు దొంగే కావచ్చు. కానీ అతను నిజాయితీపరుడు. మనసులో ఉన్నది దాచుకోవడము తెలియని అతి సామాన్యుడు. తన పరిస్థితుల కారణంగా దొంగతనాలు
చేసుండొచ్చు.... అయినా సత్యం వైపే నిలిచాడు!" అంటూ పత్రికలు కొనియాడాయి.
మన దేశంలో ఎన్ని న్యాయస్థానాలు ఓ దొంగని ఇంతగా అభినందించి ఉంటాయి? రాఘవ ఆధ్వర్యంలో "నళిని కేస్ యాక్షన్ కౌన్సిల్ ఏర్పాటు అయ్యింది.
దానికి రాఘవ కోఆర్డినేటర్. అలా గత 28ఏళ్ళలో వేలసార్లు న్యాయస్థానాల కెళ్ళారు....
వందలాది పిటిషన్ లు వేశారు. లక్షలాది రూపాయులు ఖర్చు చేశారు. తన సొమ్ము కూడా రాఘవ విపరీతంగా ఖర్చు చేశాడు. ఈ సమయంలోనే నళిని తల్లిదండ్రులు
మరణించారు. ఆమె తమ్ముడికి మతి భ్రమించింది
-----------------------------
ఏప్రిల్ తొమ్మిది ఈ కేసు తీర్పు వస్తే... పదవ తారీఖు శ్రీరామనవమి. నిజం కోసం,
సత్యం కోసం, ధర్మం కోసం ఆ దేవుడి లాగే నడిచావయ్యా అంటూ వేనోళ్ళ
పొగిడాయి.
తీర్పు తరువాత విలేకర్లందరూ తన ముందు మైక్ పెట్టినప్పుడు ' నళిని నా బిడ్డ
లాంటిది. నా కూతురికి ఈ రోజు న్యాయం జరిగింది. ' అన్నాడు రాజు కళ్ళనీళ్ళతో,
గద్గదస్వరంతో. చివరగా మరో అభ్యర్థన చేశాడు. ' ఇకపైన నన్ను దొంగ అని రాయకండి. దయచేసి రాయకండి సార్! నా పిల్లలూ, మనవళ్ళు ఇబ్బంది పడుతున్నారు!" అని.
***సమాప్తం***
ఈ కథలోని పాత్రలు,సన్నివేశాలు పూర్తిగా కల్పితం.
ఎవరినీ ఉద్దేశించి రాయలేదు.
కథలోని ప్రదేశాలు, వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు, హోదాల పేర్లు కేవలం సందర్భానుసారం వాడుకోబడ్డాయి.
ఎవరికీ సంబంధించిన కథ కాదు.
- రచయిత అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Komentáře