కోడికత్తి పోయింది
- Vagumudi Lakshmi Raghava Rao
- Jul 9, 2024
- 7 min read

'Kodikatthi Poyindi' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 09/07/2024
'కోడికత్తి పోయింది' పెద్ద కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
కోడికత్తి పోయింది.
కోడికత్తి పోయింది.
కోడికత్తి పోయింది.
కోళ్ళ కోటయ్య కోడికత్తి పోయింది.
అది అలాంటి ఇలాంటి కోడికత్తి కాదు.
మహా చరిత్ర ఉన్న కోడి కత్తి.
ఈ విషయం తెలియగానే కోళ్ళ కోటయ్యకు ప్రాణం ఆగినంత పనైంది. తన తనువులో నుండి గుండె మాయ మైనంత పనైంది.
కోళ్ళ కోటయ్య కుడి చేత్తో గుండెను ఒకసారి గట్టిగా పట్టుకున్నాడు.
గుండె కొట్టుకుంటుంది. కోటయ్య "ఫర్వాలేదు. బతికే ఉన్నాను. " అనుకున్నాడు.
కోళ్ళ కోటయ్య గట్టిగా ఊపిరి పీల్చాడు. "అసలు కోడికత్తి ఎలా పోయింది" అని కొంచెం ఆలోచన చేసాడు.
అప్పుడు అతని మెదడులో కొత్త ఆలోచన తళుక్కు మని మెరిసింది.
వెంటనే పెరట్లోకి వెళ్ళాడు. పెరట్లో గడ్డివాము దగ్గర ఉన్న నిచ్చెన తీసుకున్నాడు. యింట్లోకి వచ్చాడు. అటకకు నిచ్చెన వేసి యింట్లో ఉన్న అటక ఎక్కాడు.
అటక మీద ఉన్న పిల్లి కోటయ్యను చూచి, " మ్యావ్" అని అంది.
"మ్యావ్ మ్యావ్ పిల్లి.. నేను ఎలకను కాదు కాదు తల్లి" అని కోళ్ళ కోటయ్య అనుకుంటూ, అటక మీద ఒక పక్కన ఉన్న పాత కాలపు ఇనుప పెట్టెను చూసాడు.
ఆ ఇనుప పెట్టెను కిందికి దించాడు.
పాత గుడ్డ తో పెట్టెను శుభ్రంగా తుడిచాడు.
ఇనుప పెట్టెలో ఉన్న " కుక్కుట శాస్త్రం" బుక్ తీసాడు.
కుక్కుట శాస్త్రం మీద కోళ్ళ కోటయ్యకు మంచి పట్టు ఉంది.
కుక్కుట శాస్త్రం చూసి, కోటయ్య కోళ్ళ జాతకం చెబుతాడు.
కోళ్ళ కోటయ్య కుక్కుట శాస్త్రం పుస్తకాన్ని ఆమూలాగ్రం ఒకసారి ఏకాగ్రత తో చదివాడు.
కుక్కుట శాస్త్రం లో వ్రాయబడ్డ కోడికత్తుల గురించి పదే పదే చదివాడు.
అక్కడ ఉన్న కోడికత్తి బొమ్మలను జాగ్రత్తగా పరిశీలిం చాడు.
తన యింట పదితరాలనుండి తన వారు పందెం కోళ్ళను పెంచుతున్నారు. వాటికి రకరకాల కోడి కత్తులను తయారు చేయించారు. ఆ విషయం కోళ్ళ కోటయ్య కు తెలుసు.
తమ పెద్దలు అన్నిరకాల కోడికత్తులను తయారు చేయించారు. వాటికి భిన్నంగా ఒక కోడికత్తిని తయారు చేయించారు. ఆ కోడికత్తే పోయింది.
ఆ కత్తే ఎందుకు పోయింది? ఎలా పోయింది? ఎప్పుడు పోయింది? అని కోళ్ళ కోటయ్య కాసేపు తీవ్రంగా పోయిన కోడికత్తి గురించి ఆలోచించాడు.
"ఆ.. ఆ కోడికత్తి విజయదశమి నాడు పోయింది. " కోళ్ళ కోటయ్య బాగా ఆలోచించి కోడికత్తి ఎప్పుడు పోయిందో జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు.
ఆ కోడికత్తి అనేకసార్లు గొప్పగా అంటే మహా గొప్పగా పూజలందుకుంది. ఆ కోడికత్తి మీద కోళ్ళ కోటయ్య అనేక పాటలు అల్లాడు. అలాంటి కోడికత్తి పోయింది.
ఆ కోడికత్తి అంటే కోళ్ళ కోటయ్య కు మహా యిష్టం అనే కంటే అదే తన ప్రాణం అంటే సబబుగా ఉంటుంది.
కోళ్ళ కోటయ్య తన పందెం కోడి కోటిమల్లుకు ఆ కత్తి కడితే చాలు, కోటిమల్లు గెలుపు తథ్యం.
కోళ్ళ కోటయ్య కోటిమల్లుకు ఆ కత్తిని కట్టి, దానిని సంక లో పెట్టుకుని, మామిడి తోటలో దక్షిణ దిక్కున గానీ, ఆగ్నేయాన గానీ, ఈశాన్యాన గానీ నిలబడితే, అతనిని చూసినవారంత, "కోటయ్య కోట్ల ఆస్తిని సంకలో పెట్టుకుని మీసం ఎగరేస్తూ, తిరుగుతున్నాడు". అని అనుకునేవారు.
కోటయ్య కోటిమల్లుతోనే 27 ఎకరాల ఆసామి అయ్యాడు.
కోటయ్య కోటిమల్లుకు పంచాంగ చక్రం వ్రాయించాడు.
అందులో దాని పుట్టుపూర్వోత్తరాలు ఉన్నాయి. అది సాధించిన విజయాలు ఉన్నాయి. అది సాధించబోయే విజయాలు ఉన్నాయి. దానికి పెట్టవలసిన మేత వివరాలు ఉన్నాయి. దాని పడకకు, విశ్రాంతి కి సంబంధించిన విషయాలు ఉన్నాయి.
కోటయ్య బంగారు పూతతో కోటిమల్లుకు గంపకూడ తయారు చేయించాడు. తనవూరిని నిద్ర లేపే కోడిపుంజు తనదే అని కోటయ్య మహదానంద పడ్డాడు.
గంపలోని కోడిపుంజు కూతను బట్టి ఆ కోడి ఏ కోడో కోటయ్య చెప్పగలడు. కొక్కిరాయి కోడికూత ఎలా ఉంటుందో, డేగ కోడి కూత ఎలా ఉంటుందో, పింగళి కోడి కూత ఎలా ఉంటుందో, పసుపు కోడికూత ఎలా ఉంటుందో, కోటయ్య చెప్పినట్లు మరెవరూ చెప్పలేరు.
ఆయా కోళ్ళ కూతలను కూసి, ఆయా శబ్దాల తేడాలను కోటయ్య చెబుతుంటే, వినేవారందరూ చెవులు రిక్కించి మరీ వింటారు.
కోడి పందేలంటే ఆషామాషీ కాదనీ, కోటానుకోట్ల రూపా యల వ్యాపారం కోడి పందాలు మీద సాగుతుందని కోటయ్య కు తెలుసు.
కోటయ్య తను సంపాదించిన 27 ఎకరాలలో 9 ఎకరాలు తన పల్లవికి రాసి యిచ్చాడు. మిగతా 18 ఎక రాలను పల్లవి భర్త చరణదాసుకే కమతానికి ఇచ్చాడు.
వ్యవసాయం లో హస్త వాసిగల మనిషి చరణదాసు.
చరణదాసుకు కూడ కోడి పందాలు అంటే యిష్టమే కాని, కోడి పందాలు లోని లోతులు కోటయ్యకు తెలిసినంత గా చరణదాసుకి తెలియదు.
పల్లవి కోటయ్య చెల్లెలవుతుంది.
చెల్లెలంటే స్వంత చెల్లెలు కాదు. తన తండ్రి రెండవ భార్య ఏకైక కూతురు పల్లవి.
కొందరు కోడికత్తిని పల్లవే దొంగిలించింది అన్నారు.
ఆ కోడికత్తి పోతే కోటయ్య యింట సిరివుండదని పల్లవి కి తెలుసు. నిజంగా కోటయ్య యింట సిరి పోతుందా? అంటే అది కోటయ్య ప్రగాఢ నమ్మకం.
అందుకే కోడికత్తిని పల్లవి దొంగిలించిందన్నది కొందరి వాదన.
కోటయ్య బాగా ఆలోచించాడు.
కుక్కుట శాస్త్రం లోతులు బాగా తెలిసిన కోటయ్య కు వారి వాదనలో నిజం లేదు లేదు లేదనిపించింది.
తన తండ్రికి మాట ఇచ్చినందుకు గానూ కోటయ్య తన తండ్రి మరణించాక పల్లవి, ఆమె తల్లి పద్మజ బాధ్యత లను తనే స్వీకరించాడు. పద్మజ కూడా కోటయ్యను సవతి కొడుకులా కాకుండా స్వంత కొడుకులా చూసుకుంది. పల్లవి కూడా కోటయ్యను స్వంత అన్నకంటే ఎక్కువగానే భావించింది.
అన్నంటే ప్రాణమివ్వడానికి సిద్దం అన్నట్లు ప్రవర్తించింది. కాబట్టి పల్లవి కోడికత్తి దొంగిలించిదనడంలో నిజం లేదనుకున్నాడు కోటయ్య..
కానీ తన సవతి తల్లి పద్మజ కోడికత్తి మెడలో దిగడం వలనే మరణించింది.
కొందరు పద్మజను తన కూతురు పల్లవే చంపిందన్నారు. ఎందుకంటే అమ్మ నగల మీద వ్యామోహం అన్నారు.
మరికొందరు పల్లవిని తనకు అనుకూలంగా మలచుకుని, అత్తగారిని చరణదాసే ఆస్తికోసం చంపాడంటారు.
అయితే అందుకు తగిన సాక్ష్యాధారాలు మాత్రం లేవు.
నాడు పద్మజ శవం ఏడాకుల అరటి చెట్టు కింద పడి వుంది. అది మాత్రం నిజం.
ఆమె మెడ పై కోడి కత్తి గాటు ఉంది.
ఒక అరటి ఆకు తెగి పడివుంది.
ప్రస్తుతం తను పట్టిందల్లా బంగారం చేసే కోడికత్తి పోయింది. ఆ కోడికత్తి నాలుగు రకాల పందెం కోడులకు కట్టడానికి అనుకూలంగా ఉంటుంది..
పెద్దలనుండి వారసత్వం గా సంక్రమించిన ఆ కోడి కత్తిని...... కాకి, పచ్చకాకి, కాకినెమలి, డేగా… యిలా రక రకాల పందెం కోడిపుంజుల కాళ్ళకు కట్టి, ఆ కోడి పుంజులను పందెం లోకి దింపితే, యముడు అడ్డం పడినా సరే విజయం ఆ కోడిపుంజులనే వరిస్తుంది.
విచిత్రమైన విషయం ఏమిటంటే కోటయ్య దగ్గర ఉన్న కోటిమల్లు కోడిపుంజును కొందరు కాకి అంటే మరికొందరు కాదు కాదు పచ్చకాకి అంటారు. కొందరు కాకి నెమలి అంటే కాదు కాదు డేగ అంటారు. అసలది ఏ కోడిపుంజో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే కోటిమల్లు పందెం లోకి దిగితే కోట్లు కోట్లు చేతులు మారతాయి.
కోటయ్య చేతితో ఆ కత్తిని కడితేనే కోటిమల్లు పందెం లోకి దిగుతుంది. లేకుంటే దిగదు. బరిలోకి దింపినవారి పనే పడుతుంది.
కోడికత్తితో కోటిమల్లును చూసినప్పుడల్లా కోటయ్య నేను వంద కోట్ల అధిపతిని అని మురిసిపోతాడు.
"వాణి నా రాణి" అన్న పిల్లలమర్రి పిన వీరభద్రుడు
" తోయజ పుష్ప బాంధవుడు తూరుపు కొండకు
రాదలంచె, భూ
నాయకుడన్ శకుంతల, మనంబలరన్ చనుదెంచు
తుమ్మెదల్
మ్రోయకుడీ శుకుంబులు నెలుంగులు సేయకుడీ
పికంబులన్
కూయకుడీ ప్రమాదమని, కూకలు వేసిన భంగి
. “కొక్కురో
కోయని" బిట్టు మ్రోసె తొలి కోడి నికుంజ కిరీట వాకిటన్
అని పంచప్రాణాలు కోడికూతే అన్నట్లు అయిదు పాదాలతో పద్యం వ్రాసిన తొలి కోడి కూత పద్యం కోటయ్య కు గుర్తు కు వస్తుంది. దానిని కోటయ్య గొంతెత్తి పాడితే, డేగ, కాకి, పచ్చకాకులు కలిసి కొక్కొరోకో అని కూసినట్లు ఉంటుంది.
దీని భావమేమి కోటేశా అని ఊరి పెద్దలు అడిగి నప్పుడు, కోటయ్య ఆనందంతో, "సూర్యుడు ఉదయిం చబోతున్నాడు. శకుంతల మనసు ఆనందపడేటట్లు దుష్యంతుడు రాబోతున్నాడు. తుమ్మెదలారా! మీమీ ఝంకారాలు ఆపండి. చిలకల్లారా! సవ్వడి చేయకండి. కోకిల్లారా! మీ పాటలు కట్టిపెట్టండి అని గద్దిస్తున్నట్లు ఆ ప్రశాంత నిశాంతములో పొదరింటి కుటీర ప్రాంతంలో కొక్కొరోకో అని కోడి కూసిం”దని పద్య భావాన్ని ఒకటికి పదిసార్లు కోడి కూసినట్లు చెబుతాడు.
అంతేగాక "కోటిమల్లును చూడర కోట్లుగుంజ" అంటూ పద్యాలల్లుతాడు.
ఏ లచ్చమ్మ కోడి పోయిందో నాకు తెల్వదు గానీ నా కోడి కత్తి మాత్రం మాయం అయ్యింది. దాన్నెలా వెతికిపట్టు కోవాలి అని కోటయ్య తెగ ఆలోచించసాగాడు.
సంక్రాంతి పండుగ దగ్గర పడింది.
కోడిపుంజుల సందడి మొదలయ్యింది.
కుక్కుట శాస్త్రాన్ని కోటయ్య మరలా మరలా ఒకటికి పదిసార్లు చదివాడు.
మరలా అలాంటి కత్తిని ఎలా చేయించాలి? అది సాధ్య మేనా? అని కోటయ్య ఆలోచనలో పడ్డాడు.
పోయిన కోడికత్తిని తెచ్చి ఇచ్చినవారికి ఎకరం పొలం ఇస్తానని కోటయ్య ఊర్లో దండోరా వేయించాడు.
అందరూ కోటయ్య కోడి కత్తిని వెతికే పనిలో పడ్డారు.
కోడి కత్తి ఎక్కడ పోయింది? ఎలా పోయింది? ఎందుకు పోయింది? అని తెలుసుకోవడానికి కొందరు పంచాంగ కర్తలను ఆశ్రయించారు. మరికొందరు చిలక జోస్యం చెప్పేవారిని ఆశ్రయించారు. మరికొందరు అంజనం వేసేవారిని ఆశ్రయించారు.
ఎవరి పద్దతిలో వారు కోడికత్తిని వెతకసాగారు.
ఒకనాడు పట్టణం నుండి కోటయ్య కు ఫోన్ వచ్చింది.
కోడి పందాలంటే ఇష్టపడే ఒక అధికారి ఫోన్ చేసాడు.
కోటయ్య కోడికత్తి పోయిన సంగతిని అధికారికి చెప్పా డు.
అధికారి అరక్షణం అవాక్కయ్యాడు. తర్వాత తెలివి తెచ్చుకున్నాడు.
"మీ యింట్లో ఎవరెవరు ఉంటారో బాగా ఆలోచించండి.
ఆ కోడికత్తి అవసరం ఎవరెవరికి ఉంటుందో మరింత ఆలోచించండి. అలా కోడికత్తిని వెతికి పట్టుకోండి. అత్యవసరం అంటే మీకు నేను అయిదు లక్షలు ఇస్తాను. కోడి పందాలు మాత్రం ఆపొద్దు. ' అని అధికారి ఫోన్ పెట్టే సాడు.
ఇలాంటి ఫోన్ లు కోటయ్యకు పది వరకు వచ్చాయి.
కోటయ్య కోడికత్తిని వెతికే ప్రయత్నం ముమ్మరం చేసాడు. చరణదాసుని పిలిచాడు. అధికారి చెప్పిన దిశగా ఆలోచిద్దాం అన్నాడు.
“కాకి, పచ్చకాకి, కాకి నెమలి, డేగా ఖరీదైన పందెం కోళ్ళు. అంతకంటే ఖరీదైనది మీరు కోటిమల్లుకు కట్టే కోడికత్తి.
నల్లటి ఈకలు గల కాకి తేజస్సు ఆ కోడికత్తిలో ఉంది. ఎర్రటి ఈకలు గల డేగ తేజస్సు కూడా ఆ కోడికత్తిలో ఉంది. అలాగే పసుపు రంగు ఈకలు గల నెమలి తేజస్సు, పచ్చకాకి తేజస్సు, కాకి నెమలి తేజస్సు ఆ కోడికత్తిలో ఉంది. నిజమే అలాంటి కోడికత్తిని మరలా చేయించడం చాలా కష్టం. మనీ ఎంత ఇచ్చినా అలాంటి కోడికత్తిని తయారు చేసేవారు ఇప్పుడు ఎవరూ లేరనే చెప్పాలి.
ఆ కోడికత్తి గురించి మీ మిత్రులకూ, శత్రువులకూ చాలా మందికి తెలుసు. వారిలో ఎవరో ఒకరు కోడికత్తిని అపహరించి ఉంటారని నేననుకుంటున్నాను. " అని కోటయ్యతో చరణదాసు అన్నాడు.
“చరణా... నీ అభిప్రాయాన్ని తప్పుపట్టను కానీ నా మిత్రుల గురించి, శత్రువుల గురించి నీకు పూర్తిగా తెలియదంటాను. వారు కోటిమల్లును మించిన కోటిమల్లు ను తయారు చేయాలనుకుంటారు కానీ వారు నా కోటి మల్లు వంక, కోడికత్తి వంక కన్నెత్తి కూడా చూడరు.
నా శత్రువులు కూడా ఒక్కొక్కసారి కోటిమల్లు మీదే పందాలు కడతారు. అది నాకు తెలుసు. వారు కోటిమల్లు విషయం లో ఏదైనా చెప్పిచేస్తారు తప్పించి చెప్పకుండా తప్పుడు పనులు చెయ్యరు. " చరణదాసు తో అన్నాడు కోటయ్య.
"అయితే ఈ నడుమ మన యింటికి వచ్చి వెళ్ళింది హాస్టల్ లో ఉంటున్న సంజయ్ ఒక్కడే కదా? వాడు హాస్టల్ లో ఉండి ఇంటర్ చదువుతున్నాడు కదా?" అన్నాడు చరణదాసు.
"ఆవునవును. వాడే వచ్చి వెళ్ళాడు. అయినా వాడికి కోడికత్తితో అవసరం ఏముంటుంది? ఏదైనా సరదాగా వాడు కోడికత్తిని ఎత్తికెళ్ళి ఉంటాడంటావా? అవునవును. చెస్తే గీస్తే వాడే ఈ పని చేసి ఉండాలి. ఈ నడుమ వాడి ఆలోచనలు కూడా మారుతున్నాయి.
వాడు చదివే కాలేజీ యజమాని కూడా నాకు బాగా తెలుసు. అతనికి కోడి పందాలంటే మహా యిష్టం. అతని దగ్గర, కొక్కిరాయి, సేతు, వర్ల కోడి పుంజులు ఎక్కువ గా ఉన్నాయి. " అన్నాడు కోటయ్య.
కోటయ్య కాలేజీ యజమాని కి ఫోన్ చేసాడు. కోడికత్తి పోయిన విషయం చెప్పాడు. అలాగే తన సందేహాన్ని కూడా చెప్పాడు.
కాలేజీ యజమాని కోటయ్యని కాలేజీకి రమ్మన్నాడు. కోటయ్య, చరణదాసు హాస్టల్ కి వెళ్ళారు.
కాలేజీ యజమాని సంజయ్ బట్టల బాక్స్ తెప్పించాడు.
కోటయ్య.... కొడుకు బట్టల బాక్సంత వెతికాడు. బాక్స్ లో కోడికత్తి ఉంది. కోటయ్య ప్రాణం కుదుటపడింది.
"ఇదెందుకు తెచ్చావు?" అని కోటయ్య కొడుకుని అడిగాడు.
"ఇది నాకు శత్రువులా తయారయ్యింది. అందుకే తెచ్చాను. " అన్నాడు సంజయ్.
"ఇది నీకు శత్రువా! అదెలా?" సంజయ్ ని కాలేజీ యజమాని అడిగాడు.
"యస్సార్... ఇది నాకు శత్రువే.. నాన్న దీని మీద చూపించే శ్రద్దలో, ప్రేమలో నా మీద ఒక శాతం కూడ చూపించటం లేదు.. నేను హాస్టల్ నుండి యింటికి వెళ్ళి నప్పుడు అమ్మానాన్నలు ఈ కోడికత్తి గురించే ఎక్కు వగా ముచ్చటించుకుంటారు.
తన పెద్దలనుండి తనకు ఈ కోడికత్తి ఎలా వచ్చిందో నాన్న అమ్మకు కథలు కథలు గా చెబుతాడు. అమ్మ ఆ కథలకు మరో నాలుగు కథలను జోడిస్తుంది.
అమ్మ... కనుమనాటి కోడికి కూతలెక్కువ అంటుంది. నాన్న పందెం లో ఓడిన కోడి మాంసం కూర, యింటి కుక్కకు కూడా పెట్టకూడదు అంటాడు.
నాన్న కోళ్ళ మీద
"డేగకూతల మాటున రాగమంత
మనసునందున తారాడు మంచివేళ
పసుపు రంగుల కాకన్న పసిడి పసిడె
యింటిదాన తెలుసుకోవె యిలన నీవు "
అని పద్యాలల్లి అమ్మకు వినిపిస్తాడు.
ఇలా అమ్మానాన్నలు కోళ్ళ గురించి మాట్లాడుకున్న దాంట్లో ఒక శాతం కూడ నా గురించి మాట్లాడుకోరు.
ఎప్పుడన్నా నా ప్రస్తావన వస్తే, కాలేజీ యజమాని గారి దగ్గర ఉన్న కోళ్ళ గురించే నాన్న మాట్లాడతాడు.. మా కాలేజీ యజమాని దగ్గర, ముంగిస, గేరువా, అబ్రాసు, కొక్కిరాయి, పూల వంటి కోడిపుంజులు కూడా ఉన్నా యి అని నాన్న అంటాడు. అంతేగానీ నాగురించి నాన్న వీసమెత్తు కూడా ఆలోచించడు. మాట్లాడడు.
నాన్న నాకు అడిగినవన్నీ యిస్తారు కానీ నా మీద కంటే కోడికత్తి మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తారు. నేడు ఎక్కువ మంది తలిదండ్రులు బిడ్డలకోసం బాగా సంపాది స్తున్నారు. సంపాదనతో పాటు వ్యసనాలను పెంచు కుంటున్నారు. వారి వ్యసనాలు బిడ్డలకు తెలియకూడ దు అని బిడ్డలను హాస్టల్ లో వేస్తున్నారు. అయితే యింటికి వెళ్ళినప్పుడు వారి వ్యసనాలు బిడ్డలకు తెలిసి పోతున్నాయి. కొందరు అమ్మానాన్నలు వ్యసనాలకు అలవాటు పడంగా మనం ఎందుకు పడకూడదు అనుకుంటున్నారు.
మరికొందరు అమ్మానాన్నల్లో మార్పు రావాలి అని ఇలాంటి పనులు చేస్తున్నారు. నాకు అమ్మానాన్నలు కావాలి. అందుకే కోడికత్తిని దొంగిలించాను " అన్నాడు సంజయ్.
కోటయ్య తన తప్పును తెలుసుకున్నాడు. కొడుకును దగ్గరకు తీసుకున్నాడు. సంజయ్ తల నిమురుతూ "నువ్వు ఈ కోడికత్తి కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలిరా సంజయ్. ఇక నువ్వే నా కోడికత్తి" అని అన్నాడు.
ఏడాకుల అరటి చెట్టు సొనతో కోడికత్తిని శుభ్రం చేయాలన్న మూఢ నమ్మకం తో చెట్టుకు కత్తిని గుచ్చడం, చెట్టు ను శుభ్రం చేయడానికి వచ్చిన అత్తగారి మెడకు అది గుచ్చుకోవడం, అప్పుడు కోడికత్తి తన దగ్గరే ఉందన్న విషయం చరణదాసు కు గుర్తుకు వచ్చింది.
శుభం భూయాత్
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


Comments