top of page

కొడుకు బంగారం


'Koduku Bangaram' - New Telugu Story Written By Susmitha Ramana Murthy

'కొడుకు బంగారం' తెలుగు కథ

రచన : సుస్మితా రమణ మూర్తి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"ఆనంద్ బాబాయ్ గారున్నారా?.."


"నేనేనమ్మా!.. ఎవరు మాట్లాడేది?”


"నేనే బాబాయ్! అనంతయ్యగారి అమ్మాయి సుధని!"


"ఎలా ఉన్నారమ్మా అంతా?.. మీవారు, పిల్లలు బాగున్నారా?"


"అందరం బాగానే ఉన్నాం. డాడీ శ్వా స తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.. ఇప్పుడెలా ఉంది? ఇంట్లోనే ఉన్నారా?.. హాస్పిటల్లోనా?”


"మూడ్రోజుల క్రితం ఆస్పత్రిలో జాయిన్ చేసాను. నీగురించి, అన్నయ్య గురించి అదేపనిగా కలవరిస్తుంటే అన్నయ్యకు ఫోన్ చేసాను. వచ్చి, వెంటనే వెళ్ళిపోయాడమ్మా. మీరంతా వెంటనే రండమ్మా!"


"వారికి సెలవు దొరకలేదు. నెలాఖరులో వస్తాం. డాడీని జాగ్రత్తగా చూడండి బాబాయ్! అన్నయ్య వచ్చి వెంటనే ఎందుకు వెళ్ళిపోయాడు!?.."


"అన్నయ్యకు మన హైదరాబాదుకి బదిలీ అయింది. మీ వదిన, పిల్లలు పుట్టింట్లో ఉన్నారట! నాన్న గారికి ధైర్యం చెప్పి, వారిని తీసుకు రాపడానికి వెంటనే వెళ్ళిపోయాడమ్మా"


"అలాగా బాబాయ్! చాలా సంతోషం! అన్నయ్య ప్రక్కన ఉంటే నాన్న గారు త్వరలోనే కోలుకుంటారు”


"నేనూ అదే అనుకుంటున్నానమ్మా!”


"బాబాయ్ మిమ్మల్ని ఒక విషయం అడగడం మరచిపోయాను"


"ఏఁవిటమ్మా?"


"అదే !.. డాడీని ఆస్పత్రిలో చేర్చేముందు వారి చేతికున్న బంగారు కడియం, నాలుగు ఉంగరాలు, మెడలో ఉన్న గొలుసు తీసి భద్రపరిచారా?.."


"అన్నీ జాగ్రత్తగా నా దగ్గరే ఉన్నాయమ్మా!"


"మీరుండగా బెంగలేదు బాబాయ్! అనుకోకూడదు గాని, ఒకవేళ అనుకోనిది జరిగితే, .. అవి డాడీ గుర్తుగా మాకు ఉంటాయని!.."


"డాడీకి ఏమీకాదు.. ధైర్యంగా ఉండమ్మా!"


"అలాగే బాబాయ్!.. అన్నయ్యతో. మాట్లాడుతాను"


"అలాగేనమ్మా!.. వీలైనంత త్వరగా రండి"


“అలాగే బాబాయ్!”

***

‘ఏఃవిటో!?.. కాలం మారిపోయింది! రక్త సంబంòధాలు కూడా ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి.

సుధ మనస్తత్వంలో ఎంత మార్పు!?.. తల్లి ఒంటిపై ఉన్న బంగారు వస్తువులన్నీ కూతురికే చెందడం ఆనవాయితీ అంది. అప్పుడు సుమారు ఇరవై తులాలు తీసుకుంది. అన్నయ్యకు ఇద్దరూ కూతుర్లే కదరా!.. ఓ రెండు గొలుసులు వారికి ఇవ్వరా—అని తండ్రి అన్నా కాదంది. ఇది కూతురికి మాత్రమే చెందాల్సిన బంగారం, నేను తీసుకుంటేనే అమ్మ ఆత్మకు శాంతి అంది. ఇప్పుడేమో తండ్రి బంగారం గురించి ఎంత తెలివిగా మాట్లాడింది!?..’


సుధ మనస్తత్వంకి ఆనంద్ ఆశ్చర్య పోతున్నాడు.


***

"అనంతయ్య గారు తెల్లవారే ఆస్పత్రిలో పోయారట!"

"అయ్యో పాపం!.. మంచి మనిషి!.."


“పది మందికి ఉపకారం చేసిన మనిషి వారు. ఏఁవిటో..ఈ బతుకులు!?.. ఎప్పుడు పుటుక్కుమంటాయో తెలియదు!"


"మంఛి మారాజు!.. మంచి రోజునే పోయారు. ఆ మహాసాధ్వి పోయినప్పటినుంచి వారిది ఒంటరి బతుకై పోయింది"


"బాధ్యతలు తీరిపోయాయి. పిల్లలను బాగా చదివించారు. మంచి సంబంధాలు చేసారు. వారు పిల్ల పాపలతో హాయిగా ఉన్నారు"


"అందరూ బాగానే ఉన్నారు. పాపం వారిని చివరి దశలో చూసుకోవడానికి ఎవరూ లేకుండా పోయారు. కొడుకు, పిల్లలు బెంగళూరులో, కూతరు, పిల్లలు అమెరికాలో.. వారు ఎప్పుడు వస్తారో ఏమో!?.."


"పిల్లలకు ఎవరైనా ఫోన్ చేసారా?.."


"వారి ఆనంద్ బాబాయ్ ఫోన్ చేసారట!.. ఎప్పుడు వచ్చేది తెలియదు"


"పిల్లలు వచ్చేదాకా ఆనంద్ బాబాయే అన్నీ చూసుకుంటారన్నమాట?.."

"అంతేకదా?"


బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

"అదిగో అబ్బాయి, పిల్లలు వచ్చేసారు. ఇక అమ్మాయి, పిల్లలే రావాలి"


"వారు వస్తారంటారా?.."


"మనకేం తెలుసు?.. వారి అబ్బాయికో, ఆనంద్ గారికో తెలిసుంటుంది."

"అలాగైతే, ఆనంద్ గారిని అడిగి చూద్దాం!.."


"జరగాల్సిన కార్యక్రమం గురించి మనం మాట్లాడుకుంటున్నా వారు నోరు విప్పటం లేదు. వారు ప్రాణ మిత్రుడు పోయిన బాధలో ఉన్నారు"


“అవునవును! వారిది చిన్ననాటి స్నేహం కదా! డిగ్రీ వరకు కలిసీ చదువుకున్నారు. ఒకే ఆఫీసులో ఉద్యోగాలు చేసి. రిటైర్ అయారు"


"అయితే అబ్బాయిని అడుగుదాం"

“అవునవును!.. అబ్బాయినే అడుగుదాం. దిన కార్యక్రమాలు, దాన ధర్మాల వివరాలు పంతులు గారిని అడగమని చెబుదాం"


అందరి మాటలు వింటున్న అనంతయ్య గారి అబ్బాయి, ఆనంద్ భుజాన్ని తడుతూ అర్థింపుగా చూసాడు. ఆనంద్ ఆలోచనలకు భంగం కలిగింది.


అక్కడ ఉన్నవారందరి వేపు చూస్తూ-- "దయచేసి జాగ్రత్తగా నేచెప్పేది వినండి"అనేసరికి అందరూ ఆశ్చర్యంగా ఆనంద్ వేపు చూసారు.


"అల్లుడు గారికి సెలవు దొరక లేదట. నెలాఖరుకి అమ్మాయి పిల్లలతో వస్తుంది"


"అబ్బాయి వచ్చాడుగా! కార్యక్రమం జరిగి పోతుంది”

..ఓ పెద్దాయన అభిప్రాయం


"ఒక తల్లికి పుట్టక పోయినా, స్వంత తమ్ముడిలా చూసుకున్నారు నన్ను. వారి అబ్బాయి, అమ్మాయి, నన్ను స్వంత బాబాయిగానే భావిస్తున్నారు. బతికున్నంత కాలం వారు అందరి బాగు కోసమే పరితపించారు. మరణానంతరం కూడా కొందరికైనా సహాయపడాలన్న సదాశయంతో తన శరీరాన్ని ఫ్రభుత్వ ఆస్పత్రికి డొనేట్ చేసేసారు. ఆస్పత్రి వాళ్ళు ఇప్పుడే వచ్చారు”


ఆనంద్ మాటలకు అందరూ అవాక్కయారు.

"మహానుభావులు!.. పోతూకూడా అందరి బాగు కోసమే ఆలోచించారు!" అనుకుంటూ వారి మంచి మనసుకి అందరూ జోహార్లు అర్పించారు.


ఆనంద్, అనంతయ్య గారి అబ్బాయి, అందరికీ చేతులెత్తి నమస్కరించారు.


**

"అన్నయ్యా! మేము వచ్చి వారం అయింది. కార్యక్రమం అయిపోయింది కాబట్టి మేమిక వెళ్తాం. మనం ఉండి కూడా డాడీని చివరి క్షణాల్లో చూసుకోలేక పోయాం. ప్రాప్తం లేకపోయింది. నీవు కాస్త నయం. ఆస్పత్రిలోనైనా చూసి వెళ్ళావు"


"ఊరుకోమ్మా! బాధపడి ప్రయోజనం లేదు”


"అవుననుకోండి బాబాయ్! మూడు రోజుల్లోనే మా ప్రయాణం. అన్నయ్య ఏమీ మాట్లాడటం లేదు"


"మాట్లాడుకోవడానికి ఏముందమ్మా? నాన్నగారు కోరుకున్నట్లే కార్యక్రమం అయిపోయిందిగా?.."


"అవుననుకోండి!.. నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు. అందుకని ఇప్పుడే లావాదేవీలు..అంటే డాడీ బేంకు ఎకౌంట్, డిపాజిట్లు, వారి బంగారం, ఇంటి విషయం.. అన్నయ్యతో మాట్లాడి, నాకు రావాల్సింది తీసుకోవాలిగా?.."


"డిపాజిట్లేమీ లేవమ్మా! సేవింగ్స్ ఎకౌంటులోంచి యాభై వేలు ఆసుపత్రి ఖర్చులకు తీసారు. ఇంకా ఇరవై వేలుంటాయి అందులో. ఇల్లు అమ్మడం వారికి ఇష్టం లేదు. అన్నయ్య, పిల్లలు కింద పోర్షన్లో ఉంటారు. ఇక్కడకు మీరు వచ్చేస్తీ, మీద పోర్షన్ లో ఉంటారని నాతో అన్నారు. డైరీలో అన్ని విషయాలు వివరంగా రాసానన్నారు. ఒకపారి డైరీ చూడమ్మా!”


"మీ మాటపై నమ్మకం ఉంది బాబాయ్!.. మరి డాడీ బంగారం విషయం?.."


"ఆస్పత్రిలో ఉన్నప్పుడు నాన్నగారు తన మనసులో మాట చెప్పారమ్మా!"


"ఏం చెప్పారు బాబాయ్?"


"బంగారం గురించేనమ్మా! .."


"నన్నే తీసుకోమన్నారా?.."


"అప్పటి విషయం తలచుకుని చాలా బాధ పడ్డారమ్మా! సుధమ్మ-- బంగారంపై కూతురుకే హక్కుంది. ఆనవాయితీ అంది. అన్నయ్యకు ఇద్దరూ ఆడ పిల్లలే! వారికి అమ్మ గొలుసులు రెండు ఇమ్మంటే కాదంది.."


"ఆ తర్వాత ఏం చెప్పారు బాబాయ్?.."


“నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. రేపు గనుక నాకేమైనా అయితే..నా ఒంటిపై ఉన్న బంగారం అంతా కొడుకు పిల్లలకే అన్నారు. ఈ విషయం గురించి కూడా డైరీలో రాసానన్నారు"


‘ ఇలా అయిందేఁవిటి!?.. ఎంతో ఆశతో వచ్చాను. చివరి చూపు లేదు. బంగారం గురించి డాడీ నిర్ణయం ఊహించలేక పోయాను!.. డిపాజిట్లూ లేవు!.. సేవింగ్స్ అకౌంటు ఇంచుమించు ఖాలీ!.. ఇల్లు అమ్మలేం!.. ’


"కాస్త వినబడేట్లు చెప్పమ్మా!.. ఈమధ్య సరిగ్గా వినిపించడం లేదు"


"అదే బాబాయ్! డాడీ..అలా అన్నారా!?.. ఆ బంగారం కొడుక్కే!.. అన్నారా!?.."


"అవునమ్మా! నాన్న గారి చివరి కోరిక అదే!

అది కొడుకు బంగారం!"


/ సమాప్తం /

-----------‐---‐----------------------------------

సుస్మితా రమణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సమ్మెట్ల వెంకట రమణ మూర్తి

కలం పేరు : సుస్మితా రమణ మూర్తి

పుట్టుక, చదువు, వుద్యోగం, స్వస్థలం .. అన్నీ విశాఖలోనే.

విశ్రాంత జీవనం హైదరాబాద్ లో.

కథలు, కవితలు, కొన్ని నాటికలు .. వెరసి 300 పైచిలుకు వివిధ వార, మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి లో కూడా ప్రసారం అయ్యాయి.

బాగా రాస్తున్నవారిని ప్రోత్సహిస్తూ , కలం కదిలితే రాయాలన్న తపనతో

మీ సుస్మితా రమణ మూర్తి.









Comments


bottom of page