#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #KommuluThiraganiMagarayullu, #కొమ్ములుతిరగనిమగరాయుళ్ళు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
( ఇది హాస్య కథ కాదు నిజ జీవిత కథ )
Kommulu Thiragani Magarayullu - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 02/12/2024
కొమ్ములు తిరగని మగరాయుళ్ళు - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఈశ్వరయ్య కాలనీ లో ప్రతి నెల.. ఆ కాలని అధ్యక్షులు సంఘ పెద్దల ఆధ్వర్యంలో భార్యాభర్తల తో సకలజన సమావేశాలు జరుగుతుంటాయి.
మొత్తం ఆ కాలనీలో అన్ని అపార్టుమెంటులు కలిపి ఐదు వందల కుటుంబాలు. ఆ నెలలో జరిగిన గుస గుసలు, గసగసాలు, లవంగాలు.. వగైరా వగైరా మొత్తం టాపిక్స్ అన్ని మాట్లాడేసుకుంటుంటారు ఆ సమావేశం లో.
ఒక్కో నెల ఒక్కో టాపిక్ను రైజ్ చేసి దాని మీద చర్చ పెట్టి తద్వారా ఆ పాయింట్ లో మంచి చెడ్డలను సమీ క్షించి ఒకవేళ చెడ్డ ఉన్నట్టయితే పెద్దలు అందరూ సమస్య సామరస్యపూర్వకంగా ఉండేటట్టు కొన్ని సూచ నలు చెప్పి అవి పుస్తకంలో ఫైల్ చేస్తూ ఉంటారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే తమ తమ ప్రవర్తనలు తద నుగుణంగా సక్రమంగా మార్చుకోవాలి. ఎవరైనా తేడా చేస్తే పదివేల రూపాయలు ఫైన్.. !
మిగిలిన మొత్తం భార్యాభర్తల జంటల ఎదురుగా ఈ తప్పు చేసిన భర్తకు కానీ భార్యకు కానీ వార్నింగ్..
అవమానం.
దాంతో తలకాయ తీసుకెళ్లి భర్తలు ప్యాంటుజేబు లో, భార్యలు హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాలి అన్నంత ఘోర అవమానం. , సరే ఆ స్థితి భరించలేక ఎవరికి వారే సెట్ అయిపోతుంటారు. అదీ ఈశ్వరయ్య కాలనీ సిస్టం.
**
అంతా బాగానే ఉంది ఈ నెల టాపిక్కు ఏమిటి అంటే..
''భార్యల వల్ల.. భర్తలు పడే కష్టాలు!''
అధ్యక్షులవారు తమ పీఠం మీద కూర్చొని ఈ మధ్యనే ట్రిమ్ము చేయించుకున్న మీసం సవరించు కుంటూ పాయింట్ రైజ్ చేశారు.
అలా భార్యల వల్ల బాధలు పడే భర్తలు ఎందరు ఉన్నా చేతుల పైకెత్తమన్నారు. గంట.. రెండు గంటలు.. అబ్బే.. అబ్బేబ్బే.. ఎవరూ చేతులు పైకి ఎత్తడం లేదు.. రెండు చేతులకు సంకెళ్లు పడిపోయినట్టు కదపలేని స్థితిలోకి వెళ్లిపోయారు. కొందరయితే మనకు ఎందు కురా బాబు ఈ లేనిపోని గొడవ.. అన్నట్టు మూతికి అడ్డంగా ఎడమ చేతిని పెట్టుకుని ఆ భవనం సీలింగ్ కి ఉన్న పెచ్చులు ఎన్ని ఊడి పోయాయో లెక్కపెట్టడం మొదలు పెట్టినట్టు నటిస్తున్నారు.
ఇద్దరు మాత్రం ధైర్యంగా తమ చేయి పైకెత్తి వెనక్కి తిరిగి చూసి ఇంకెవరూ చేతులు పైకి ఎత్తలేదు అని తెలుసుకుని రెండూ లేని అల్లరి మన కెందుకురా బాబోయ్.. అన్నట్టు తోక ముడిచేశారు. ఆ ఎత్తిన చేయి సైలెంట్ గా క్రిందకు దింపేశారు. అంతేనా సంక లో గోక్కుంటున్నట్టు నటించి సభను రక్తి కట్టించారు. వాళ్ళ ముఖాలు కూడా రక్తి కట్టించుకున్నారు.
అక్కడితో అధ్యక్షుల వారితో సహా సంఘ పెద్దలందరూ మాట్లాడుకొని ఆ పాయింటు డ్రాప్ చేసేశారు.
సమావేశంలో సమయం ఇంకా ఉండడంతో మరో పాయింటు రైజ్ చేయవలసి వచ్చింది. సభను నడి పిస్తున్న పెద్దలుకు.
ఈసారి పాయింటు..
''భర్తల వల్ల భార్యలు పడే కష్టాలు!''
ఈ రివర్స్ దెబ్బకు అక్కడ ఉన్న ఐదు వందల మంది భర్తలు తమ సీట్లు కొంచెం షేక్ ఇచ్చిన అనుభూతికి లోనయ్యారు.
ఓ అరడజను మంది భార్యలు పైకి లేచి.. టైటిల్ ఇంకా పవర్ఫుల్ గా సెట్టింగ్ చేయమన్నారు.
సంఘ పెద్దలు అందరూ సమాలోచనలో పడ్డారు.
ఒక నెలలో కుక్కలను పెంచుకునే ఇంటి ఓనర్ల సమస్య..
మరో నెలలో కాలనీ లో జరిగే పెళ్లిళ్లకు అందరూ వెళ్లకుండా అందరి తరపున ఒక్కరే వెళ్లి ఫుల్లుగా భోజనం లాగిన్చేసి వచ్చే విషయంలో తర్జనభర్జనల సమస్య..
ఇంకో నెలలో ఏ విషయంలోనైనా బయట వాళ్ళు వచ్చి గొడవ పెడితే ఆడవారు మాత్రమే కర్ర పట్టుకు వెళ్లి వాళ్లను తరిమి బుద్ధి చెప్పే విషయం మీద చర్చ..
ఇలా చాలా జరిగాయి కానీ అసలు ఈ విధంగా 'సమస్య టైటిల్' నే పవర్ ఫుల్ గా సెట్టింగ్ చేయమని అడగడం ఇదే ప్రథమం. ఇందులో ఏదో అరకాసులాంటి తిరకాసు ఉంది అనుకుంటూనే పదిమంది పెద్దలు గుండ్రంగా కూర్చుని తమ గుండె కాయను గట్టిగా కుడి చేతితో పట్టుకొని ఎడమ చేతితో బట్ట తలలు తడుము కుంటూ సమస్య టైటిల్ పగడ్బందీగా మార్చారు. అది ఏంటంటే..
''మొండి శిఖండి భర్తల వల్ల అమాయకపు భార్యలు పడే.. శతకోటి దరిద్ర కష్టాలు''.. అంటూ టైటిల్ మార్చారు..
దాంతో అక్కడున్న భార్యామణులు అందరికీ ఆ టైటిల్ మహా ఘోరంగా నచ్చేసి సంతోషించారు.
ఈసారి మళ్లీ సభ ప్రారంభం అయింది. సభ అధ్య క్షులవారు.. ''అలా భర్తల వల్ల అష్టకష్టాలు పడుతున్న భార్యలు అందరూ చేతులు పైకి ఎత్తండి''.. అన్నారు.
ఈసారి ఒక్క భార్యగారు కూడా చేయి పైకి ఎత్తలేదు.
''హమ్మయ'' అనుకున్నారు భర్తలు. తమ పరువు పిండాకూడు కాకపోనందుకు చాలా ఆనందించారు.
తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు దారిలో తమ భార్యలకు కేజీ లడ్డుఉండలు. నాలుగు మూరల మల్లె పూల దండ కొనాలని ఎవరికి వాళ్లే మనసులో ఫిక్స్ అయి పోయా రు. కొందరు జున్ను కొనాలని ఇంకొందరు తాటి తాండ్ర కొనాలని, మరికొందరు కరకరలాడే చెకోడీలు కొనాలని తమ హృదయ అంతర్భాగాలలో గట్టిగా నిశ్చయం చేసుకున్నారు.
ఇంతలో భార్యల గ్రూపు స్థానంలో ఉన్న ఓ నారీమణి పైకి లేచి.. 'ఒక్కో భార్యది ఒక్కో కష్టం.. సమస్య ను అలా హోలు మొత్తంగా కాకుండా పర్సంటేజీ ప్రకారం అడగండి''.. అని అంది.
అర్థమైన అధ్యక్షులవారు..
''సరేనమ్మ.. సరే సరే తల్లి. అడుగుతున్నాను..
వినండి.
ఓ మాదిరిగా అంటే యాభైపాళ్ళు నరకయాతనలతో భర్తలవల్ల బాధలు పడుతున్న భార్యలు చేతులు పైకి ఎత్తండి..'' అంటూ గట్టిగా అరిచారు.
అసలు ఒక్క భార్యామణి కూడా చేయి పైకి ఎత్తలేదు.
''ఈసారి ఇంకొంచెం పెరసెంటేజీ మార్చుతున్నాను.. వినండి బంగారు తల్లులు.. 75 పాళ్ళు నరకయాతనలతో భర్తలు వల్ల బాధలు పడుతున్న భార్యలు చేతు లు పైకి ఎత్తండి.. '' అంటూ మరీ గట్టిగా అరిచారు.. అధ్యక్షులవారు.
ఇప్పుడు కూడా ఒక్క భార్యామణి కూడా చేయి పైకి ఎత్తలేదు.
అధ్యక్షులు వారికి కోపం నరక లోకం, మధ్యలోకం, క్రింది లోకం, పై లోకం, పూర్వలోకం, అదోలోకం, గంధర్వ లోకం, గాడిదగుడ్డు లోకం ఇవన్నీ దాటేసి నషాళానికి అంటుకుంది కోపం.
''అంటే మీ ఉద్దేశం.. నూటికి నూరుపాళ్లు భర్తల వల్ల మీరు భయంకర అష్టకష్టాలు అనుభవిస్తున్నారని సభ్య సమాజానికి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటు న్నారా. అలాగైతే ఇప్పుడు చేయి పైకి ఎత్తండమ్మ.. అమ్మలక్కలు, బంగారుబొమ్మలు సంతోషంగా పైకి ఎత్తండి. మీ కసి తీర్చుకునే అంత పరమానందంగా.. ఓ భార్యామణులు.. మీ చేతులు పైకి ఎత్తండి.
ఇదిగో.. గట్టిగా అన్ని ఖండాలలో వినపడేటంత గట్టిగా లౌడ్ స్పీకర్ లో చెప్తున్నాను.. నూటికి నూరుపాళ్ళు భర్తల వల్ల అష్టకష్టాలు అనుభవించే వాళ్ళు చెయ్యి పైకి ఎత్తండి.. మహారాణులు.. '' అంటూ పెనంమీద పులిలా చిందులు వేస్తూ అన్నా రు అధ్యక్షులవారు.
నో.. కొంచెం కూడా ఎవరూ తల పైకి ఎత్తలేదు ఆ సమావేశంలో ఉన్న భార్యలు.
ఇప్పుడు అధ్యక్షుల వారికి అన్ని అవయవాలు మండి పోతున్నాయి. నెక్స్ట్ ఏ పర్సంటేజీ పెట్టాలో ఆయనకి అర్థం కాలేదు.
''ఇంకా చాలా పెర్సెంటేజీ లు ఉన్నాయి కదా.'' అరిచింది ఓ భార్యామణి.
''ఉంటాయమ్మా.. ఎందుకు ఉండవు. అంతా మీ రాజ్యం అయిపోయింది.. శతకోటి పర్సంటేజీలు ఉంటాయి. ఉండక చస్తాయా..
ఇదిగో అడుగుతున్నా.. లక్షపాళ్లు అక్షరాల లక్ష పాళ్ళు తమ భర్తల వల్ల మహాభయంకరమైన.. అతి క్రూర రాక్షస పద్ధతిలో అష్టకష్టాలు కన్నా ఎక్కువ కష్టాలు పడుతున్న ఓ పరమ పవిత్ర భార్యామ ణులు.. ఇలాంటి వాళ్లు ఈ సభలో ఎవరైనా ఉంటే తమ బంగారపు చేతిని దయచేసి పైకి ఎత్తండమ్మ.. తల్లి'' అంటూ పొలి కేక పెట్టారు అధ్యక్షులవారు.
ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న అక్కడున్న 500 మంది భార్యామణులు ఒక్కసారిగా తమ చేతులు పైకి ఎత్తేశారు.. అంతేనా..
''భర్తలు డౌన్ డౌన్..'' అంటూ గట్టిగా అరిచారు. ఆ కాలనీ ఉన్న మొత్తం గృహాల పునాదులు కొంచెం అటు ఇటు కదలాడాయి ఆ దెబ్బకు.
ఆ అరుపులకు జడుసుకున్న భర్తలు భయపడి బెంబేలు పడిపోయి బయటకు పరిగెట్టేసారు.. తోసుకుంటూ అక్కడున్న ఒకే ఒక్క ద్వారం గుండా.
భార్యలు కళ్ళు తెరచి చుట్టూ చూసే సరికి..
ఆ భార్యల తాలూకు భర్తలు అందరితో పాటు అధ్యక్ష పీఠం మీద కూర్చున్న అధ్యక్షులవారు, మిగిలిన సంఘ పెద్దలు కూడా భూతద్దం పెట్టి వెతికి చూద్దామన్నా ఎక్కడా కనిపించకుండా పోయారు ఆ చుట్టుపక్కల ఫర్లాంగు దూరంలో.
సమాప్తం
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
ఈ కథ "కొమ్ములు తిరగని మగరాయుళ్లు" సాహిత్యభరితమైన, హాస్యభరితంగా రూపుదిద్దుకుంది. ఇది నిజ జీవితంలో మనం అనుభవించే సంఘటనలను ఒక కథరూపంలో అనుసంధానిస్తుంది. ఈ కథ లోని సంఘటనలు, వ్యవహారాలు, దృశ్యాలు ప్రతీ ఒక్కరికీ అలంకరించవలసిన వ్యంగ్యాన్ని కలిగిస్తాయి.
రచయిత నల్లబాటి రాఘవేంద్ర రావు గారు ఎంతో జ్ఞానం, సరదా, హాస్యం తో ఈ కథను అభివృద్ధి చేశారు. ఇలాంటి కథలు మన భవిష్యత్తుకు మంచి ఉపదేశాలు ఇవ్వగలవు.