top of page
Writer's pictureBharathi Bhagavathula

కొండచిలువ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Konda Chiluva' written by Bhagavathula Bharathi

రచన: భాగవతుల భారతి


స్కానింగ్ యంత్రాలను దాటుకుని ఆడపిల్లగా పుట్టటమే సాహసం.

అలాంటిది ఎన్నో రంగాలలో, ఆటంకాల ముళ్ళూ,అన్ని అడ్డంకులు దాటుకుంటూ, ఎదగటం,మాటలేనా!? అనుకుంటూ మనసులోనే ఆమెకు నమస్కారం చేసుకుంటూ ఉంటాను..

ఆ సంఘటన మనసులో మెదిలినప్పుడల్లా...నా పిల్లలనూ అంత ధైర్యం ఉట్టిపడేలా పెంచాలని

అనుకుంటూ ఉంటాను..

ఆడది అబలకాదు సబల అని చెప్పటం కాదు, చేసి చూపిన ఆమె ఎవరు?

ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.


ఇక కథ ప్రారంభిద్దాం

÷/////÷/////÷/////÷

"అమ్మా! నేనూ వస్తానమ్మా! వెంటబడుతున్న,పెద్దపాప అంజలికి," నీకు నచ్చిన కుర్ కురేలు, తెస్తాను, ఇంకేం కావాలో చెప్పు.. తెస్తాను " అని పాపకు నచ్చచెప్పి, ఆమె అడిగిన హిరణ్యాక్ష వరాల లిస్ట్ తీసుకుని, చిన్నపాప పుష్పను తీసుకుని మార్కెట్ కి బయలు దేరాను.

వెడుతూ, దారి పొడుగుతా 'విపరీతమైన రద్దీలో అంజలిని కూడా తీసుకువస్తే, ఇద్దరితో ,కాలు కదపటానికి కూడా వీలయ్యేది కాదేమో. ఇదివరకటికీ , ఇప్పటికీ ఎంతెంత రద్దీలు పెరిగిపోతున్నాయ్! సాయంత్రం ఆఫీసులు స్కూల్స్ వదిలేవేళ , అందరూ ఇదే సమయం లో గుమిగూడతారు. ఈ సమయంలో ఏదైనా జరగవచ్చు, సరైన జాగ్రత్తలు తీసుకోవాలీ" అనుకున్నాను.

మార్కెట్ లో ఓ కూరగాయల దుకాణం ముందు ఆగి, ధర అడగబోతూ, ఎందుకో ఒళ్ళు జలదరించినట్లనిపించి, వెనుదిరిగి చూసా. ఓ స్త్రీ నాకు ఓ రెండడుగుల దూరంలో, నిలబడిఉంది. ఆమె నన్నే చూస్తోంది. నాకు భయంవేసింది, ఆమెను చూస్తే.

దానికి కారణం, ఆమె ఆకారం.

ఆమెను స్త్రీ అని నేనెలా గుర్తించనూ? ఆ లక్షణాలు లేవే.. మళ్ళీ తిరిగి చూసా.

ఇంత లావున, అంతెత్తున, మగవారి పర్సనాలిటీ అనిపించేలా ఉంది. స్నానం చేసిందో, లేదో, శారీరక పోషణ చేయక ఎన్నాళ్ళయిందో, అన్నట్లుగా ఉంది. జుట్టంతా చింపిరి చింపిరిగా, మర్రిపాలతో జడలు కట్టించినట్లుగా, జిఱ్ఱగా ఉంది.

ఆమె నన్నే చూస్తోంది, కారణం తెలీలా.

భయంతో కొంచెం దూరంగా జరిగాను.

చుట్టూ పరికించి చూసాను. నా చుట్టూ చాలామంది ఉన్నారు. నాకు ఆమెతప్ప అనుమానాస్పదంగా ఏం కనిపించలా!

మరి నన్నే ఎందుకు చూస్తోందీ గుచ్చీగుచ్చీ?..

పాపను దగ్గరకు లాక్కున్నాను.

పిల్లలను ఎత్తుకుపోయే బ్యాచ్ కాదుకదా!

ఈ మధ్య పేపర్లో చదివా. టి, వి లోనూ చూసా. పిల్లలను ఎత్తుకుపోయి, ఏవో పసరులు కళ్ళల్లో పిండి, వాళ్ళని గుడ్డివాళ్ళుగా మార్చి, బిచ్చగాళ్లు గా మారుస్తారట. అవయవాల్లో ఏదో ఓ పార్టులో నరం కట్ చేసి రక్తప్రసరణ ఆపేస్తారట. ఇక ఆ అవయవం పనికిరాకుండా పోతుంది అంగవైకల్యం గల పిల్లలను బిచ్చగాళ్లుగా మారిస్తే, డబ్బులు ఎక్కువ వస్తాయిగా.

ఆడపిల్లలలైతే ఇక చెప్పక్కర్లా !

ఇదేమిటీ పరిపరి విధాల పోతోంది మనసూ.

అదీగాక నా లాంటి ఆడవాళ్ళ వెనుకకు జేరి దొంగతనంగా ఇంజక్షన్ చేస్తారు. వాళ్ళు స్ప్రహ కోల్పోతే, తీసుకుపోయి… బాబోయ్ నేనూ అపరాధ పరిశోధక కథలు రాసేస్తున్నానూ,మనసులో..... అంజలి లాగానే , పుష్పనీ ఇంట్లోనే ఉంచితే ఈ బాధ, భయం ఉండేవి కావుగా. ఈ పిల్లలు చెప్పిన మాటవినరుగదా! ఏదైనా జరగరానిది జరిగితే…

భయంతో మనసు వణికింది. ఆమె నా దగ్గరగా జరిగింది.

నేనూ కొంచెం దూరంగా జరిగాను. ఆమె దృష్టంతా నామీదే కేంద్రీకృతమైఉండటం, భయానకం. పిల్లను ఇంకా కుచ్చెళ్ల దగ్గరకు లాక్కున్నాను. ఆమె వంక భయంగా చూసాను.

ఆమె " క్యాబేజ్ కిత్నా రేట్ ? " నన్నే చూస్తూ అడిగింది. ఆ గొంతు విని ఇంకా హడిలిపోయాను. ఆమె మాట్లాడితే బరాబరా కొండచిలువ పాకుతూ పోతున్నశబ్దం భయం గొల్పింది. ఆమెనుండి దూరంగా వేరే దుకాణానికి పోదామని జరిగాను.

అంతే! నా మీదనుండి ఏదో ఎగిరింది.

క్యాబేజ్ విసిరారు, అది గాలిలో, నా తలకు కొద్దిగా రాసుకుంటూ ఎగరటం మాత్రం తెలిసింది.

భయంతో, క్షణం కళ్ళు మూసుకున్నాను.

ఎగిరి దూకిన చప్పుళ్ళు, అరుపులు, గోల..

అందరూ పరుగులెత్తుతున్న చప్పుడు.

‘పట్టికోండి.. పట్టుకోండి..’ ఆ కొండచిలువ గొంతు గరగరలాడుతూ, గర్జించటం వినబడింది.

పాప ఏడుస్తూ నన్ను అతుక్కుపోయింది.

ఏం జరిగిందో, తెలుసుకోటానికి కళ్ళు తెరిచికూడా చూడలేకపోయా. ఎందుకంటే నా తలమీద నుండే క్యాబేజ్ తగిలి ఎగరటం వల్ల తలదిమ్మెక్కిన భావన కళ్ళుతిరిగిపోతున్నాయ్. క్రింద పడిపోబోతున్నాను… పడిపోతున్నాను.. పడిపోయాను.

/////////////////

కళ్ళు విప్పి చూసా. నేనెక్కడున్నానో కాసేపు అర్ధంకాలా. మెల్లగా గుర్తుకువచ్చి, చుట్టూ చూసా. అది హాస్పటల్. ‘ఇక్కడికెందుకు ఎలావచ్చాను?"

“పాపా పుష్పా!" అని అరుస్తూ లేచి కూర్చున్నాను.

అయ్యో! అయిపోయింది, అంతా ఐపోయింది. పాపను ఆ కొండచిలువ, ఆరాక్షసి, ఎత్తుకుపోయింది. దేవుడా! పాపను, అంగవికలంగా మార్చేస్తుంది.

ఎప్పుడన్నా, ఏదన్నా చౌరస్తా లో అమ్మా! పదిరూపాయలుంటే ఇవ్వండమ్మా! అన్నం తిని నాలుగు రోజులయిందీ! అనిచేయిచాస్తే… నేను గుర్తుపట్టలేక పోతే?...

అయినా ఈ ఊళ్ళోనే ఉంచరేమో, గ్యాంగ్ వేరే ఊరికి మార్చేసారేమో! ఆ కొండచిలువ వాళ్ళ నాయకురాలేమో!

"పుష్పా! పుష్పా! " మళ్ళీ గట్టిగా అరిచా.

నా కుటుంబ సభ్యులంతా పరుగెత్తుతూ వచ్చారు, హాస్పటల్ లోని ఆ రూమ్ లోకి.

మార్కెట్ లో జరిగిన సంఘటన గుర్తుకొచ్చి "ఏమండీ! పుష్పని ఆమె ఎవరో ఎత్తుకు పోయిందండీ! " మనసు లో ముద్రింపబడిన ఆమె రూపం కళ్ళముందు కదలాడగా… ఏడ్చాను ఆయన్ని పట్టుకుని.

ఇంతలో "అమ్మా "అంటూ పుష్ప లోపలి కొస్తూ-- పిలిచింది.

"పుష్పా" ..అనబోతూ, నోట్లోమాట నోట్లోనే ఆగిపోయింది నాకు.

మార్కెట్ లో చూసిన చింపిరి, చింపిరి కొండచిలువ గొంతు.. ఆమె చేతిలో పుష్ప చెయ్యి ఉంది. ఆమే పుష్పను వెంటపెట్టుకు లోపలికి తీసుకు వచ్చింది. వస్తూనే.... ఏదో మాట్లాడింది. నాకు అర్ధం కాలా. అక్కడే ఉన్న స్టాఫ్ నర్స్ కావచ్చు

" సీక్రెట్ ఏజెంట్స్ కి చాలా భాషలు తెలిసి ఉండాలి. ఉంటాయ్. ఆమె మాట్లాడింది ఉర్దూ... ఇలా అంటోందండీ "

"మీరు చాలా భయపడినట్లున్నారు. నేను రహస్య పరిశోధన విభాగం నియమించిన, సీక్రెట్ ఏజెంట్ ని. బీహార్ నుండి, ఓ ముఠా దిగిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ కమీషనర్ గారిప్రకటన మీరు టి. విలో చూసే ఉంటారు. ఆ గ్యాంగ్ ని పట్టుకోటానికి, నేను ఈ వేషంలో తిరుగుతున్నాను. "

నర్స్ ఇలా చెప్పగానే.. నేను తేలిగ్గా నిట్టూర్చి "మీరు ఆడవారు, అంత గ్యాంగ్ ని మీరు బాబోయ్..... " అన్నాను కళ్ళు పెద్దవిచేసి.

"నాకు తెలుగూ కొంచెం కొంచెం వచ్చు" అంటూ ముద్దు ముద్దు తెలుగులో తనే మాట్లాడింది. సారాంశం ఇలా కూడబలుక్కున్నాం.

"భలే ఉన్నారే మీరూ! మేం మహిళమనే విషయాన్ని మరిచిపోయి చాలా రోజులయింది. మా వృత్తిలో మేం ఎన్నో సాహసకృత్యాలు చేస్తూనే ఉంటాం. దేశాన్ని రక్షించే పనిలో ప్రాణాల్నీ, మానాల్నీ, ఒడ్డి కాపాడటంలో, పురుషులకు ఏమాత్రం తీసిపోమని క్షణ క్షణమూ నిరూపిస్తాం.

"అవునాఅండీ !" నమస్కారం చేసాను.

మళ్ళీ ఆమే బరబరమని వచ్చీరాని తెలుగులో మాట్లాడింది.. మేం అందరం మళ్ళీ కష్టపడి కూడబలుక్కున్నాం...

"పిల్లలను, మహిళల మెడలో గొలుసులను ఇళ్ళనూ లూటీ చేసే , దోపిడీ దొంగల బీహార్బ్యాచ్ ని వెదికే నేపద్యంలో, వాళ్ళు ఆ మార్కెట్ చుట్టు పక్కల తచ్చాడుతున్నారని కబురందింది. వచ్చాను. మీరు గమనించలేదుకానీ, వాడు మీ పక్కనే ఉన్నాడు. ఏ క్షణంలోనైనా , మీ మెడలో గొలుసు తెంపుకు పోవటానికి చూస్తున్నాడు. నేను తననే చూస్తున్నాను. మీరు పట్టించుకోకుండా నన్నే చూస్తూ ఎందుకో భయపడుతున్నారు. "

"ఆఖరి క్షణంలో, భయంతో మీరు పక్కకి జరగగానే, వాడు మీ మీదకి దూకాడు. అంతే! నేను మీ తలమీంచి చేతిలోని క్యాబేజ్ విసిరాను. ఊహించని పరిణామానికి, వాడు బిత్తరపోయి, ఇవతలకి దూకాడు. నేను అప్రమత్తమయ్యాను. పట్టుకోండని అరిచే సరికి, వెంటనే మీ మీపాపను దగ్గరకు లాగి, కత్తి గొంతు మీద పెట్టి, పారిపోటానికిప్రయత్నించాడు. వెంటనే నేను నా దుస్తుల్లోంచి, చాకు తీసి ఒడుపుగా విసిరాను. ఈ లోపు మార్కెట్ లోని వారంతా, అప్రమత్తమయ్యారు. "

"ఇంకా నయం! వాడు పాపని వదిలి పారిపోవటానికి, ప్రయత్నించాడు. ఎత్తుకుపోతే?!..

వెంటనే జంప్ చేసి, పోలీస్ శిక్షణ లోని, టెక్నిక్ తో కాలు అడ్డం పెట్టి, వాణ్ణి పడేసాను. వాడి అనుచరులు ఇంకో నలుగురు, చుట్టు ముట్టేసారు. ఈ లోపల రహస్య కోడ్ ద్వారా, సిగ్నల్ మా పోలీసులకు చేరిపోయి, వాళ్ళు వచ్చి, వీళ్ళందర్నీ కష్టడీలోకి తీసుకుపోయారు. "

కొన్ని యాక్షన్ చేసి చూపిస్తుంటే అర్దంచేసుకున్నాం.

"కానీ ఈ లోపలే తలకు చిన్న దెబ్బతగిలిందేమో, మీరు మూర్ఛపోయి కన్పించారు. పాప ఏడుస్తోంది. స్థానికుల సహాయంతో మిమ్మల్ని, ఇదిగో, ఈ హాస్పిటల్ లో చేర్పించి, మీ వాళ్ళు వచ్చేవరకూ, మీ పాపకు కాపలా కూర్చున్నాను, వదిలేసి వెళ్ళలేక. మళ్ళీ ఆగ్యాంగ్ తో సంబంధం ఉన్నవాళ్లు ఎవరన్నా వచ్చి పాపమీద దాడి చేస్తారేమో అని" అంది.

"ఆడవాళ్ళయి ఉండీ, ఈ వృత్తి లోకి, అడుగుపెట్టటమే గాక, అంతంత సాహసాలు చేసే మీ లాంటి ఆడకూతుళ్ళందరికీ, వేలవేల ప్రణామాలు అండీ. మీరూపం, మీ గొంతు చూసి ఎంత అపార్థం చేసుకున్నాను. ఈరోజు మీరే లేకపోతే నేనూ, మా పాప.....బాబోయ్ తలుచుకుంటేనే భయంగా ఉంది”అన్నాను.

"అన్నీ సవ్యంగా సాగితే ఆనందమే. లేదంటే ఆడపిల్లల బతుకూ అడుగడుగునా సాహసమే అంటాను నేను. కాదంటారా ? " మళ్ళీ తన భాషలోనే చెప్పి నవ్విందామె.

ఈ సారి ఆ నవ్వులో కొండచిలువ శబ్దానికి బదులుగా, కోకిల పాట వినబడింది.

అందుకే అంటారు. రూపంచూసి మనిషిని అంచనా వేయకూడదని.

మనసులో ఇంకోటి కూడా అనిపించింది, ఆమేకాదు.. సమాజంలో చాపక్రింద నీరులా, నోరు తెరుచుకున్న సొర చేపల్లా, నైతిక విలువలను మింగేస్తూ, పునాదులనూ కూల్చేస్తున్న, రకరకాల మాఫియాల ధ్వంస రచన ఎదుర్కోవాలంటే, ప్రతీ మహిళా, కొండచిలువ అవతారం ఎత్తాల్సిందేనా!?

మా కుటుంబ సభ్యులంతా కూడా, ఆమెకు నమస్కరించారు.

"మా కుటుంబాన్ని కాపాడిన మీకు కృతఙ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడంలేదండీ " అంటూ.

వచ్చీరాని తెలుగులో... మళ్లీ "భలేవారే! ఇది మా వృత్తి. సాహసమే మా ఊపిరి, బై. ఇప్పటికైనా, పరిసరాలు గమనించుకుంటూ , జాగ్రత్తగా ఉండండి " అంది.

తలూపాం.. అలాగే అంటూ వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ...

అప్పట్నించీ అంజలి, పుష్పలకు చదువులోనే కాక మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ ఇప్పిస్తున్నాను. ఆడపిల్లలకి అంతంత చదువులెందుకూ? అంత సాహస కృత్యాలెందుకు? అనే వాళ్ళనుండిఎన్నో వ్యతిరేకతలను ఎదుర్కుంటూ .....

////////////////////////

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


170 views0 comments

Comments


bottom of page