'Kottha Keratam Episode 1' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi
'కొత్త కెరటం! ఎపిసోడ్ - 1' తెలుగు ధారావాహిక ప్రారంభం
రచన: దినవహి సత్యవతి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆపరేషన్ థియేటర్ వెలుపల, తలుపు పైన ఎర్రబల్బు వెలుగుతోంది. కళ్యాణిని ఆపరేషన్ థియేటర్ లోనికి తీసుకుని వెళ్ళాక, లోపలినుంచి ఎవరూ బయటకు రాలేదు బయటనుంచి లోనికీ ఎవ్వరూ వెళ్ళలేదు.
సమయం గడుస్తున్నా లోపల ఏం జరుగుతోందనే దాని గురించి ఎటువంటి సమాచారమూ లేదు.
ఒక పేరొందిన ప్రైవేటు ఆస్పత్రిలో, ప్రసవ సంబంధిత ఆపరేషన్ థియేటర్ బయట కుర్చీలో కూర్చుని, లోపల ప్రసవవేదన పడుతున్న భార్య, కళ్యాణిని, తలుచుకుని ఆందోళన చెందుతున్నాడు రాజేంద్ర.
కొడుకుకి ధైర్యం చెప్తూ ప్రక్కనే దిగులుగా కూర్చుని ఉన్నారు రామయ్య జానకి.
ఇంతలో ఆపరేషన్ రూము తలుపు తెరిచి బయటకి వచ్చిన గైనకాలజిష్ట్ “మిస్టర్ రాజేంద్ర, మీ భార్య కడుపులో బిడ్డ అడ్దం తిరిగింది. ఆపరేషన్ చెయ్యాలి” అని చెప్పారు.
“ఏమంటున్నారు డాక్టర్?”
“అంతకు ముందే ఇంకో ముఖ్యవిషయం కూడా తెలియజేయాలి. మునుపటికంటే ఇప్పుడు ఆమె స్థితి మరింత ఆందోళనకరంగా మారింది, తల్లీ బిడ్డలు ఇరువురినీ కాపాడేందుకు మా ప్రయత్నం మేము చేస్తాము కాని ఇద్దరిలో ఒక్కరినే కాపాడగలము. అయితే ఎవరిని కాపాడాలి అనే విషయంలో మీ నిర్ణయం, అనుమతి కూడా అవసరం” డాక్టర్ చెప్పినది విని హతాశుడయ్యాడు.
“తల్లిని అంటే నా భార్యనే బ్రతికించండి డాక్టర్”
“సరే మీ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అయితే ఆమెకి ఇకపై పిల్లలు పుట్టే అవకాశం ఉండదు”
ఒకదానిపై ఒకటిగా వింటున్న వార్తలు శరాఘాతంలా బాధిస్తుంటే గిలగిలలాడారు రాజేంద్ర, రామయ్య, జానకి.
ముందుగా తేరుకున్న రాజేంద్ర, కృంగిపోతున్న మనసుని అదుపులోకి తెచ్చుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ “అయినా సరే నా భార్యనే బ్రతికించండి డాక్టర్” ధృఢంగా పలికాడు.
కొడుకు నిర్ణయం రామయ్య హృదయాన్ని ముక్కలు చేసింది. జానకి నోట మాటలేదు. ఒకవైపు కోడలు క్షేమంగా బ్రతికి బయటపడాలని కోరుకుంటున్నా మరోవైపు ఆమెకిక తల్లయ్యే అవకాశం లేదని విని హతాశురాలైంది.
‘ఓ భగవంతుడా! ఇంత నిర్దయుడవేమయ్యా, ఎందుకిలా చేసావయ్యా, ఈ జన్మకి మనవడిని కళ్ళజూసుకుని ఒడిలో ఆడించి మురిసిపోయే యోగమే లేదా? మా వంశం ఇక్కడితో ఆగిపోవాల్సిందేనా?’ అనుకుంటూ జానకి మధనపడుతుంటే, మనసులో బాధని దైవానికి విన్నవించుకుంటూ కన్నీరు కారుస్తున్నారు రామయ్య.
!+!+!+!+!
సుమారు మూడు వందల గడపలున్న అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి.
ప్రస్తుతం రామయ్య ఉంటున్న ఇల్లు, సుమారు వెయ్యి గజాల స్థలంలో, నాలుగు వైపులా అందమైన పూల తోట మధ్యలో ఉన్న నాలుగు గదుల డాబా ఇల్లు, ఆయన తండ్రి అచ్యుతరావు కట్టించినది. తండ్రి తదనంతరం ఇల్లుతో సహా స్థిర చరాస్థులన్నీ వారసత్వంగా సంక్రమించాయి రామయ్యకి.
రామయ్య సహృదయుడు స్వతహాగా పరోపకారి. అచ్యుతాపురంలోని ఎలిమెంటరీ పాఠశాలను హైస్కూలు స్థాయికి వృద్ధిచేసారు. దానితో ఆ గ్రామానికేకాక, చుట్టుప్రక్కల ఉన్న మరెన్నో చిన్న చిన్న గ్రామాల పిల్లలకు కూడా హైస్కూలు వరకూ చదువుకునే అవకాశం కలిగింది.
తెలివితేటలు కలిగి చదువుపట్ల ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు హైస్కూలు చదువు పూర్తయ్యే వరకూ ఉపకారవేతనం అందేలా ఏర్పాటు చేసారు.
తండ్రి హయాములో వేసిన రోడ్లను, గ్రామ పెద్దల సహకారంతో, పునరుద్ధరించారు.
పొలాలను కౌలుకి ఇచ్చి ఎన్నో రైతు కుటుంబాలకు జీవనాధరం కల్పించారు.
రామయ్య దంపతులకు లేక లేక కలిగిన ఏకైక సంతానం రాజేంద్ర. ఉన్నత విద్య అభ్యసించి పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తూ తన సహోద్యోగియైన కళ్యాణిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
కళ్యాణి ఒక అనాథ. తలిదండ్రులు పిన్న వయసునే మరణిస్తే చుట్టుప్రక్కల వాళ్ళు దయతలచి అనాథాశ్రమంలో చేర్పించారు. దాతల సహాయ సహకారాలతో చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంది.
మనసు మెత్తనైనా మాట దురుసు కళ్యాణికి, పల్లెటూరి అత్తమామలంటే అకారణమైన అనాదరణ. అత్తవారింటికి వచ్చినప్పుడల్లా పిల్లి మీదా ఎలుక మీదా పెట్టి పెద్దలపై విసుగు ప్రదర్శించేది. కోడలి తీరు బాధ కలిగించినా కొడుకు మనసు నొచ్చుకుంటుందని మౌనంగా భరించేవారు రామయ్య దంపతులు.
పెళ్ళైన ఐదేళ్ళవరకూ సంతానం కలుగలేదు రాజేంద్ర దంపతులకు. అన్ని పరీక్షలూ చేయించుకున్నాక ఇరువురిలోనూ లోపం లేదని తెలిసింది.
కొడుకు తోటి వారందరూ పిల్లాపాపలతో ఆనందిస్తోంటే తమకు ఆ భాగ్యం ఎప్పుడోనని జానకి దిగులుపడేది.
కాలచక్రం భారంగా మరో సంవత్సరం ముందుకు కదిలింది.
గడచిన కాలంలో మనవడి కోసం జానకి మ్రొక్కని మ్రొక్కూ లేదు, తిరగని తీర్థమూ లేదు. ఆమె ప్రార్థన ఆ దైవం ఆలకించాడా అన్నట్లు కళ్యాణి గర్భం దాల్చింది. ఆ శుభవార్త విని రాజేంద్ర కాళ్ళు భూమ్మీద నిలవలేదు. రామయ్య దంపతుల ఆనందం హద్దులు దాటింది.
“జానకీ, మా వంశంలో ఇప్పటివరకూ ఎవ్వరికీ ఆడపిల్లలు లేరు. ఆడపిల్ల ఇంటికి సందడి సిరిసంపదలు తెస్తుంది అంటారు. నాకైతే మనుమరాలే కావాలి”
“అదేమిటండీ అలా అంటారు? ఆడపిల్ల ఇంటికి అందమే కాదనను కానీ తొలిచూలు మగపిల్లాడైతేనే బాగుంటుంది. మన వంశం ముందుకెళుతుంది. నాకైతే మనవడే కావాలి అంతే.. ఆ.. ”
“పోనీలే మనలో మనకి విభేదాలెందుకు! ఎవరైనా ఫరవాలేదు. అయినా మన చేతిలో ఏముంది అంతా ఈశ్వరేచ్ఛ! చూద్దాం ఎవరి కోరిక తీరుస్తాడో ఆ పరమేశ్వరుడు!”
కొడుకు, తన వద్దకి వచ్చి ఉండమన్నా కోడలి తత్వం ఎరిగున్నవారు కనుక ఆత్రాన్ని బలవంతంగా అణచుకుని గ్రామంలోనే ఉండిపోయారు. ఎప్పటికప్పుడు కోడలి యోగక్షేమాలు విచారిస్తూ తగిన సలహాలు ఇస్తూ జాగ్రత్తగా చూసుకోమని కొడుక్కి పదే పదే చెప్తూ వచ్చారు.
పట్నంలో మెరుగైన వైద్యసౌకర్యాలు అందుబాటులో ఉంటాయనీ, కళ్యాణి ప్రసవ సమయానికి తన వద్దకే వచ్చేయమని తల్లిదండ్రులను కోరాడు రాజేంద్ర.
కోడలికి తొమ్మిదో నెల రాగానే వెళ్ళి, ఘనంగా సీమంతం జరిపించి, కొడుకు అభ్యర్థన మన్నించి అక్కడే ఉండిపోయారు.
వంశాంకురం కావాలని జానకీ, మనవరాలు కావాలని రామయ్య లోలోపల ఎంత మనసుపడుతున్నా పైకి మాత్రం ఆ ఊసే రానీయలేదు.
అయితే ప్రసవ సమయం దగ్గరపడే కొద్దీ కోడలి ఆరోగ్యం నాజూకుగా మారడంతో, ఆందోళన చెందినవారై, అంతా సవ్యంగా జరిగితే పుట్టబోయే బిడ్డకి కులదైవం పేరు కలుపుతానని మ్రొక్కుకున్నారు రామయ్య.
ఇచ్చిన తారీకుకి వారం ముందే ఉన్నట్లుండి కళ్యాణికి నెప్పులు మొదలవ్వడంతో ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. ఆక్సిజన్ సిలిండర్ తో సహా అత్యవసర పరికరాలన్నీ అమర్చిన ప్రత్యేకమైన ఐ. సి. యు. గదిలో పురిటి నెప్పులు పడుతోంది కళ్యాణి. ఆమె కోసమే ప్రత్యేకంగా నియమించబడిన నర్సు ప్రక్కనే ఉంది.
కళ్యాణికి నెప్పులు మొదలై గంటలు దాటుతున్నా ప్రసవం కాలేదు. నొప్పులు వేగవంతం చేయడానికి మూడుసార్లు డ్రిప్ పెట్టినా కూడా ప్రసవం అయ్యే సూచనలే కనపడలేదు. నొప్పులు పడీ పడీ కళ్యాణికి శక్తి హరించుకుపోతోంది.
కేస్ షీట్ చూసి, నర్సుకి సూచనలు ఇస్తున్న డాక్టర్ ఎవరో “నమస్తే” అనడం వినిపించి “మీరూ.. ” అని సందేహంగా ఆగిపోయారు.
తనని తాను పరిచయం చేసుకుని “ఆమె నా భార్య కళ్యాణి” అన్నాడు రాజేంద్ర.
“ఓహ్ అలాగా”
“ఇప్పుడెలా ఉంది తనకి?”
“ఆమె పరిస్థితి చూస్తే కాన్పు కొంచం కష్టమయ్యేలా అనిపిస్తోంది” కళ్యాణిని పరీక్షించి చెప్పారు.
“అవునా?”
“అరే అలా కంగారుపడకండి. చూద్దాము” రాజేంద్రలో ఆదుర్దా గమనించి చెప్పారు.
“ఈమె పరిస్థితి అప్ డేట్ ఇస్తూండండి” నర్స్ కి చెప్పి “పదండి మీతో మాట్లాడాలి” అంటూ కదిలిన డాక్టర్ వెనుకే నడిచాడు.
డాక్టర్ తో కలిసి వస్తున్న కొడుకు వైపు ప్రశ్నార్థకంగా చూసారు జానకి దంపతులు.
“కళ్యాణిని చూసే డాక్టర్ ఈయనే” తల్లిదండ్రులకు పరిచయం చేసాడు.
“మా కోడలికి ఎలా ఉంది బాబూ”
“ప్రసవం కష్టమయ్యేలా ఉంది. మరికొంతసేపు చూసి ఆపరేషన్ థియేటర్ కి తీసుకువెళ్తాము. ఆమె బ్లడ్ గ్రూపు అరుదైనది. రక్తం ఎక్కించాల్సిన అవసరం కూడా కలుగవచ్చును కనుక అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోండి”
“ఏమిటీ?” ముగ్గురూ అరిచినంత పనిచేసారు.
“ఆపరేషన్ సమయంలో ఏమి జరిగినా అందుకు బాధ్యత మీదేనని అంగీకరిస్తూ అనుమతి పత్రంపై సంతకం చేసి, అవసరమైన నగదుతో సహా కౌంటర్లో జమచెయ్యండి”
డాక్టర్ వెళ్ళిన వైపే నిర్ఘాంతపోయి చూస్తుండిపోయారు!
!+!+!+!+!
కళ్యాణి గురించిన పరిపరివిధాలైన ఆలోచనలతో కలతచెందుతున్నారు రాజేంద్ర, రామయ్య, జానకమ్మ.
“మీరు వెళ్ళి కొంతసేపు విశ్రాంతి తీసుకోండి. ఈలోగా ఏదైనా అవసరమైతే కబురు చేస్తాను” నీరసంతో సోలుతున్న తండ్రినితో అన్నాడు.
“ఫరవాలేదు రా. ఇక్కడే ఉంటాము”
“అమ్మా నువ్వైనా చెప్పమ్మా నాన్నకి” నిస్సహాయంగా తల్లి వైపు చూసాడు.
“అబ్బాయి చెప్పినట్లు చేద్దామండి” భార్య కూడా బ్రతిమిలాడడంతో సరేననక తప్పలేదు రామయ్యగారికి.
తల్లిదండ్రులని ఇంటికి పంపించి, ఆపరేషన్ థియేటర్ బయట కుర్చీలో దిగాలుగా కూర్చున్న రాజేంద్రకి “హలో మీరు.. మీరు రామయ్యగారి అబ్బాయి రాజేంద్ర కదూ?” భుజం తట్టి ఎవరో అడగడంతో తలెత్తి చూసాడు.
“అవును”
“ఓహ్! ఎంతో కాలం తరువాత మిమ్మల్ని ఇలా ఇక్కడ కలుసుకోవడం నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. అమ్మా నాన్నగారూ ఎలా ఉన్నారు?”
“ఇంతకీ.. మీరూ?”
“నేను సూరజ్ ని.. గుర్తుపట్టలేదా?”
“సూరజ్! పేరు ఎప్పుడో విన్నట్లుంది కానీ గుర్తుకు రావడం లేదు. మన్నించండి”
“అయ్యో ఫరవాలేదు. మీరు అప్పుడు పై చదువులకని పట్నంలో ఉండేవారు. అప్పుడప్పుడూ వస్తుండేవారు. ఆ సమయంలో నన్ను ఒకటో రెండో సార్లు మాత్రమే చూసి ఉంటారు కనుకనే జ్ఞాపకం ఉండి ఉండదు. ఇంతకూ మీరేమిటీ ఇక్కడ ఇలా..ఏదైనా సమస్యా, అమ్మా నాన్నగారూ కులాసాయేగదా?” సూరజ్ స్వరంలో ఆందోళన.
“పెద్దవాళ్ళిద్దరూ క్షేమమే. నా భార్య కళ్యాణికి డెలివరీ. ఆపరేషన్ చేస్తున్నారు” అని “ఇంతకీ మీకు అమ్మా నాన్నా ఎలా తెలుసో చెప్పనే లేదు?”
“నేను వారింట్లో అంటే మీ ఇంట్లో వారాలు చేసుకుని ప్రైవేటుగా చదువుకున్నాను. డిగ్రీ అయ్యాక సి. ఎ. పాసై ఇప్పుడు ఒక పెద్ద కంపెనీలో చార్టెర్డ్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాను. ఇవాళ ఈ స్థితిలో ఉన్నానూ అంటే ఆనాడు మీ తల్లిదండ్రులు చూపించిన ఆదరణే. ఆ మహానుభావులని ఎప్పటికీ మరువలేను” సూరజ్ స్వరంలో కృతజ్ఞత.
“ఓ.. అవునవును మీరు చెప్పినది విన్నాక కొంచం కొంచంగా గుర్తుకు వస్తున్నది”
“అమ్మా నాన్నా కనిపించట్లేదు.. ” ఇటూ అటూ చూసాడు.
“ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. కాసేపు విశ్రాంతి తీసుకోమని ఇంటికి పంపించాను. ఇంతకీ మీరు.. ఇక్కడ?”
“ఒక చిన్న పనుండి వచ్చాను” ఇంకా ఏదో అనబోతుండగా ఆపరేషన్ థియేటర్ బయట ఎర్ర బల్బు ఆగిపోయింది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya
పేరు: దినవహి సత్యవతి
విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;
వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.
ప్రవృత్తి : రచనా వ్యాసంగం.
సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.
పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.
గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.
పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.
ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.
6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.
ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &
గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);
పంచామృతం!(సత్య! పంచపదులు)
స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in
ఆసక్తికరంగా ఉంది. చాలా బాగా రాశారు రచయిత్రికి అభినందనలు.