top of page
Writer's pictureDinavahi Sathyavathi

కొత్త కెరటం! ఎపిసోడ్ 14


'Kotha Keratam Episode 14' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 25/10/2023

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 14' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి, బిడ్డను కోల్పోతుంది. హాస్పిటల్ లో రామయ్య గారి శిష్యుడు సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి.

డెలివరీ సమయంలో బిడ్డను మిగిల్చి తన భార్య చనిపోయిందని రాజేంద్రతో చెబుతాడు. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెప్పి, తన కొడుకును పెంచుకోమంటాడు. అంగీకరిస్తాడు రాజేంద్ర.

రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోవడం మనవడికి నేర్పుతాడు. భార్గవ బలహీనంగా ఉండటంతో పోషకాహారాలు తీసుకోవాలని చెబుతాడు రామయ్య.

రామయ్య ఇంటి దగ్గర పాతకాలం నాటి మర్రి చెట్టు ఉంది. రోడ్ వెడల్పు చెయ్యడం కోసం దాన్ని కొట్టబోతుంటే, ప్రభుత్వ అధికారులకు చెప్పి ఆపిస్తాడు భార్గవ.

తమ గ్రామంలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీలో భార్గవను చేరుస్తాడు రామయ్య.

గ్రామంలో ఇంకుడు గుంతల ఏర్పాటు ఆవశ్యకత గురించి మునసబుతో మాట్లాడుతారు రామయ్య, భార్గవ.


ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 14 చదవండి.


“అవును అందుకు ఆరంభంగా మీరు గ్రామస్తులని ఒక చోట సమావేశపరిచి ఒక తెర ఏర్పాటు చేస్తే, తన కంప్యూటర్ ద్వారా ఒక ఫిల్మ్ చూపించి ఇంకుడు గుంటలు ఎలా ఏర్పాటు చేసుకోవాలీ, ఆ పద్ధతి విశదీకరిస్తానని అంటున్నాడు మా మనవడు. అదే మీతో సంప్రదించుదామని ఇలా వచ్చాను”

“దానికేం మహాభాగ్యం. మంచి పనికి అలస్యమెందుకు? ఇప్పుడే గ్రామంలో దండోరా వేయిస్తాను. ఆలోగా మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి”


మునసబు వద్ద సెలవు తీసుకుని వచ్చేసారు తాతా మనవడూ.


ఆ తరువాత ఏర్పాట్లన్నీ చక చకా జరిగిపోయాయి. మునసబు ఇంటి ముందున్న విశాలమైన ఖాళీ ప్రదేశంలో పెద్ద తెర ఏర్పాటు చేయబడింది. రామయ్య పట్నంనుంచి ఒక ప్రొజెక్టర్ తెప్పించారు.

తాను పవర్ పాయింట్ లో తయారుచేసిన సమాచారాన్ని ఫిల్మ్ లాగ ప్రదర్శించి గ్రామస్తులకి ఇంకుడు గుంటల గురించి వివరంగా చెప్పాడు భార్గవ...


“ఇంకుడు గుంటల వలన భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ఇవి ఇళ్ళల్లో, పొలాల్లో, రోడ్లప్రక్కనా... ఇలా ఎక్కడైనా నిర్మించవచ్చు... ” అంటూ ఆరంభించి “ఈ ఇంకుడు గుంటల పరిమాణాన్ని నేల స్వభావం, పరిసరాలు, నీటిలభ్యత... వీటన్నిటినీబట్టి నిర్ణయించుకోవాలి. బహిరంగప్రదేశాల్లోను, పొలాల్లోనూ నిర్మించే, చాలా పెద్ద ఇంకుడు గుంటలకు పైన కప్పు అవసరముండదు. వీటి నిర్మాణానికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ... ” అంటూ గ్రామస్తులకి అర్థమయ్యేలా సరళమైన పదాలలో భార్గవ వివరించిన విధానం గ్రామస్తులని ఆకట్టుకుంది.


“మీ మనవడు చాలా తెలివిగలవాడండీ” అని అందరూ పొగుడుతుంటే రామయ్య ఆనందంతో పొంగిపోయారు.


అ తర్వాత రెండు రోజులకి తండ్రితో కలిసి తిరిగి తమ ఊరు వెళుతూ “తాతయ్యా ఇక మీరిక్కడ ఒక్కళ్ళే ఉండొద్దు మా వద్దకు వచ్చేయండి. అందరం కలిసి అక్కడే ఉందాము” అభ్యర్థించాడు భార్గవ.


“అవును నాన్నా నేనూ అదే చెప్దామనుకున్నాను” కొడుకు మాటలకి రాజేంద్ర వత్తాసు పలికాడు.

“అలాగేలేరా. వాడు చెప్తే ఒకటీ నువ్వు చెప్తే ఒకటీనా! కానీ మనవడా మరి నువ్విప్పుడు నాకు ఒక బృహత్కార్యం అప్పచెప్పావు కదా... అదేరా గ్రామంలో నీటి సమస్య తీర్చడం. అది పూర్తయ్యాక ఆలోచిస్తాలే”


“ప్రామిస్?”


“ఇదిగో ప్రామిస్” మనవడి చేతిలో చెయ్యి వేసి ఆప్యాయంగా నొక్కారు.


నాలుగు నెలల్లో మునసబు, రామయ్యల సంయుక్త పర్యవేక్షణలో, గ్రామంలో అందరి ఇళ్ళముందూ, పొలాల్లోనూ ఇంకుడు గుంటల ఏర్పాటు సంపూర్తైంది.

ఆ తరువాతి వారం హైదరాబాదులో మూడు రోజులు జరిగిన రైతు సదస్సుకు గ్రామంలోని రైతులతో కలిసి హాజరై అట్నించటే కొడుకు ఇంటికి చేరుకున్నారు రామయ్య.


మధ్యాహ్నం భోజనమయ్యాక సోఫాలో కూర్చుని టి. వి. చూస్తూ నిద్రలోకి జారుకున్నారు.

అలా ఎంతసేపైందో తెలియదు కానీ “తాతయ్యా ఎప్పుడొచ్చారు?” అని అడుగుతున్న మనవడి మాటలూ,


“హుష్! తాతగారు నిద్రపోతున్నారు లేపొద్దు” అంటూ కోడలు, భార్గవని మందలించడం చెవులను సోకి మెలకువ వచ్చింది.


”ఫరవాలేదమ్మా లేచానులే” సోఫాలో సర్దుకుని కూర్చుని “ప్రొద్దున వచ్చానురా. ఇంతకీ నువ్వొచ్చి ఎంతసేపైంది?”


“ఇప్పుడే తాతయ్యా. మీకు ఇవాళ స్కూల్లో జరిగిన ఒక పెద్ద విశేషం చెప్పాలి. ఉండండి కాళ్ళూ చేతులూ కడుక్కుని వస్తాను” రయ్యిన గదిలోకి పరిగెత్తాడు.


“మీరూ ఫ్రెష్ అవ్వండి మామయ్యా ఆలోగా కాఫీ తెస్తాను” వంటింట్లోకి వెళ్ళింది కళ్యాణి.


తాతగారు కాఫీ త్రాగుతుంటే తాను బోర్నవిటా తెచ్చుకుని ఎదురుగా కూర్చున్నాడు భార్గవ.

“ఊ ఇప్పుడు చెప్పరా స్కూల్లో జరిగిన విశేషం” కాఫీ ముగించి గ్లాసు కోడలి చేతికిచ్చారు.


“రేపు మా స్కూల్లో డిస్ట్రిక్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్స్ప్క్షన్ కి వస్తున్నారు. అందుకోసం ఇవాళ స్కూలంతా శుభ్రపరచాలని మమ్మల్నందరినీ ఒకే క్లాసులో కూర్చోబెట్టారు. అయితే అది అవకాశంగా తీసుకుని తమకి జీతాలు పెంచాలంటూ పనివాళ్ళు స్ట్రైక్ మొదలు పెట్టారు. మా హెడ్ మాస్టర్ గారికి ఏం చేయాలో తోచలేదు పాపం. గత్యంతరం లేక పెద్ద క్లాసు పిల్లలమైన మమ్మల్ని పనిలోకి దింపారు”


“అయ్యో అదేమిటిరా మరీనూ అన్యాయం కదా?”


“ఏం చేస్తాం తాతయ్యా. టీచర్లు చెప్తే చెయ్యాలిగా మరి. పైగా ఎవరు బాగా శుభ్రం చేస్తే వాళ్ళకి పూర్తి ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులు ఇస్తామని చెప్పారు. ఇంకేముంది ఉత్సాహంగా చీపుర్లు తీసుకుని బరబరా ఊడ్చేసి చక చకా మాప్ చేస్తుండగా పక్కనే ఉన్న క్లాసునుంచి బాధగా కేకలు వినిపించి అందరం అటు పరిగెత్తాము. అక్కడ పాపం ఒక చిన్న బాబు కాలు చేత్తో పట్టుకుని వెక్కెక్కి ఏడుస్తున్నాడు. అసలేం జరిగిందో బాబు ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికీ అంతుబట్ట లేదు. అందర్నీ తోసుకుని ముందుకు వెళ్ళి చూద్దును కదా ఆ పిల్లవాడి కాలి మీద ఏదో పురుగు కుట్టిన గుర్తు కనిపించింది కానీ రక్తం ఎక్కువ రావడం లేదు. అది చూడగానే వాడ్ని తేలు కుట్టిందని అర్థమైంది”

“ఆగాగు! ఎవరికీ తెలియంది నీకెలా తెలిసిందిరా?”


“ఆమధ్య నేను అచ్యుతాపురం వచ్చినప్పుడు మన పొలాలు చూడడానికి వెళ్ళామూ, అక్కడొక పాలేరుని తేలు కుట్టిందీ, మీరు ఫస్ట్ ఎయిడ్ చేసారూ గుర్తొచ్చిందా?”


“ఆ... ఆ... అవునురా బాగా గుర్తు పెట్టుకున్నావే! ఊ ఆ తర్వాత... ”


“వెంటనే మా టీచర్ కి చెప్పాను బాబుని తేలు కుట్టిందని. అంతే అందరూ బాబుని మర్చిపోయి ఒకటే హడావిడిపడుతూ తేలు వెతకడంలో పడ్డారు. ఇంకోళ్ళేమో ఆంబులెన్స్ కి ఫోన్ చేయండి వెంటనే అని అరిచారు. బాబేమో నొప్పితో ఒకటే ఏడుపు.


నాకు అర్థమైపోయింది తేలు విషం బాబు శరీరంలో నెమ్మదిగా ఎక్కుతోందని. వెంటనే నా బ్యాగులో అమ్మ పెట్టిన కర్చీఫ్ తీసి బాబు కాలిమీద తేలు కుట్టిన చోట గట్టిగా బిగించి కట్టేసాను”


“అరే! ఆశ్చర్యం! అలాగే చేయాలని నీకెలా తెలుసురా?”


“ఆరోజు పొలంలో మీరు చేసినది అబ్జర్వ్ చేసాను. అది గుర్తుంది”


“భేష్ భేష్. చక్కటి సమయస్ఫూర్తి వాడావురా మనవడా! తర్వాతేమైందీ?” ఆసక్తిగా ముందుకు వంగారు.


“నేనలా చేయడం చూసి మా టీచర్లు కొంతమంది కోప్పడ్డారు. అప్పుడే అక్కడికి వచ్చిన హెడ్ మాస్టర్ అదే సరైన పని. కర్చీఫ్ గట్టిగా కట్టి తేలు విషం బాబు శరీరంలోకి వ్యాపించకుండా అడ్డుకున్నాడు భార్గవ. సమయానికి తెలివి ఉపయోగించి చిన్న బాబు ప్రాణాలు కాపాడావని నన్ను మెచ్చుకున్నారు. ఇంతలో ఆంబులెన్స్ వచ్చింది. బాబుని అస్పత్రికి తీసుకుని వెళ్ళారు”


“నిజంగా నాకెంతో గర్వంగా ఉందిరా నువ్వు చేసిన పనికి. ”


కొడుకు చెప్తున్నదంతా పక్కనే నిలబడి విన్న కళ్యాణి కూడా “శభాష్” మెచ్చుకోలుగా అంది.

“థాంక్స్ తాతగారూ. థ్యాంక్స్ అమ్మా” ఆడుకోవడానికి వెళ్తున్న మనవడిని మురిపెంగా చూసారు రామయ్య.

&&&

రామయ్య భార్గవ ల మధ్యన చక్కటి స్నేహం చిక్కటి అనుబంధం.

ప్రతీ విషయం తాతగారికి చెప్పనిదే తోచదు మనవడికి. అలాంటిది కొన్ని రోజులుగా భార్గవ ముభావంగా ఉండటం స్కూలునుంచి వచ్చీ రాగానే తన గదిలోకి వెళ్ళి తలుపులు బిడాయించుకోవడం గమనించి “నువ్వూ అబ్బాయీ భార్గవని ఏమైనా అన్నారేమిటీ?” కోడలిని పిలిచి అడిగారు.


“లేదు మామయ్యా. చూస్తూనే ఉన్నారుగా మా ఇద్దరికీ అసలు వాడితో కూర్చుని నాలుగు మాటలు మాట్లాడటానికే తీరుబడి ఉండదు ఇంక ఏదైనా అనడం కూడనా?”


కొడుకూ కోడలూ ఉద్యోగాలలో నిరంతరం బిజీగా ఉండడంతో మనవడు ఒంటరితనంతో బాధపడకూడదని తరచూ వచ్చి వెళ్ళడం పరిపాటి అయింది రామయ్యకి.


‘మరేమై ఉంటుందబ్బా! భార్గవ టీనేజ్ పిల్లవాడు. ఈ వయసులో పిల్లలకి ప్రతీదీ సమస్యగానే అనిపిస్తుంది. కొందరు ప్రతీ విషయాన్నీ భూతద్దంలో చూసి బెంబేలు పడితే మరికొందరు అన్నీ తమకే తెలుసుననే భ్రమతో పెద్దల మాట పెడచెవిన పెడతారు. మంచీ చెడుకీ మధ్యన ఉండే సున్నితమైన తారతమ్యాన్ని సరిగ్గా అంచనా వేయలేక పెడదారిన పడతారు మరికొందరు.

మంచి కంటే చెడే త్వరగా పిల్లల మనసుల్ని ఆకట్టుకుంటుందన్నది అక్షర సత్యం. ఇప్పటి కాలంలో ప్రతీ పిల్లవాడి చేతిలో పుస్తకం ఉండే సమయం తక్కువ సెల్ ఫోన్ ఉండే సమయం ఎక్కువగా ఉంది. ఈ ఇంటర్నెట్ వగైరాలు వచ్చాక, తల్లిదండ్రుల కళ్ళుగప్పి, అనవసరమైన సమాచారాన్ని కూడా లోతుగా తరచి చూస్తూ మితిమీరిన ఆందోళనలకి గురౌతున్నారు. ఒకవేళ భార్గవ కానీ అలాంటి దారిలో వెళుతున్నాడా?’ ఆ ఊహతోనే వెన్ను జలదరించింది రామయ్యకి.

రెండ్రోజులైనా భార్గవ ధోరణిలో మార్పు లేకపోయేటప్పటికి ఇక ఉండబట్టలేకపోయారు!


మర్నాడు స్కూలునుంచి వచ్చి ఎప్పటిలానే మాటా పలుకూ లేకుండా తలదించుకుని వెళుతున్న మనవడినిచూసి, వేడి వేడి బోర్నవిటా గ్లాస్ తో గదిలోకి వెళ్ళి అందిస్తూ “కాసేపు అలా బయటకి వచ్చి నా దగ్గర కూర్చో” అన్నారు.


అప్పటికి ఇంకా కళ్యాణీ రాజేంద్రా ఆఫీసులనుంచి రాలేదు.

బోర్నవిటా త్రాగేసి గ్లాసు డైనింగ్ టేబుల్ పైన పెట్టి, తాతగారంటే ఉన్న గౌరవంవల్ల కాదనలేక వచ్చి ముఖం దించుకుని కూర్చున్నాడు.


“ఏమైందిరా ఈ మధ్యన అదోలా ఉంటున్నావు. ఏదైనా ఉంటే నాకు చెప్పవూ?” లాలింపుగా అడిగారు.


వెంటనే తాతగారిని కావలించుకుని భోరున ఏడ్చేసాడు.

పసివాడి మనసులో ఉన్న బాధంతా కన్నీటి రూపంలో కరిగిపోయేదాకా వీపు నిమురుతూ ఉండిపోయారు.


మనవడి దుఃఖం కొంత ఉపశమించాక “ఇప్పుడు చెప్పు అసలేమైందీ?” అన్నారు.


“మరేమో నా స్నేహితుడు అనిల్ నాన్నకి కాన్సర్ అని తెలిసిందట. అప్పటినుంచీ స్కూల్లో ఏడుస్తూనే ఉంటున్నాడు. వైద్యం చేయిస్తే తగ్గే అవకాశం ఉంది కానీ చాలా ఖర్చవుతుంది అన్నారట డాక్టర్లు. వాళ్ళ నాన్నది మరీ అంత పెద్ద ఉద్యోగం కాదట. నాన్నంటే వాడికి ప్రాణం. వాళ్ళ అమ్మకూడా పెద్దగా చదువుకోలేదట. నాన్నకేదైనా అయితే నేనూ చచ్చిపోతానని ఒకటే ఏడుపు. మాకందరికీ కూడా ఏడుపు ఆగట్లేదు వాడినలా చూస్తుంటే. అసలు పూర్ పీపుల్ కే ఇలాంటి కాస్ట్లీ జబ్బులు ఎందుకు వస్తాయి తాతయ్యా? మాకందరికీ వాడికోసం ఏదైనా చేయాలని ఉంది కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియటం లేదు” దుఃఖం ముంచుకొచ్చి గొంతులోంచి మాట పెగల్లేదు భార్గవకి.


‘ఇదన్న మాట వీడి ముభావానికి కారణం. ఇంకేమైందో అని భయపడ్డాను’ అనుకుని తేలికగా ఊపిరి పీల్చుకున్నారు రామయ్య.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in


102 views0 comments

Comments


bottom of page