'Kotha Keratam Episode 15' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 30/10/2023
'కొత్త కెరటం! ఎపిసోడ్ - 15' తెలుగు ధారావాహిక
రచన: దినవహి సత్యవతి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి, బిడ్డను కోల్పోతుంది. హాస్పిటల్ లో రామయ్య గారి శిష్యుడు సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి.
డెలివరీ సమయంలో బిడ్డను మిగిల్చి తన భార్య చనిపోయిందని రాజేంద్రతో చెబుతాడు. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెప్పి, తన కొడుకును పెంచుకోమంటాడు. అంగీకరిస్తాడు రాజేంద్ర.
రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోవడం మనవడికి నేర్పుతాడు. భార్గవ బలహీనంగా ఉండటంతో పోషకాహారాలు తీసుకోవాలని చెబుతాడు రామయ్య.
రామయ్య ఇంటి దగ్గర పాతకాలం నాటి మర్రి చెట్టు ఉంది. రోడ్ వెడల్పు చెయ్యడం కోసం దాన్ని కొట్టబోతుంటే, ప్రభుత్వ అధికారులకు చెప్పి ఆపిస్తాడు భార్గవ.
తమ గ్రామంలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీలో భార్గవను చేరుస్తాడు రామయ్య.
గ్రామంలో ఇంకుడు గుంతల ఏర్పాటు ఆవశ్యకత గురించి మునసబుతో మాట్లాడుతారు రామయ్య, భార్గవ.
స్నేహితుడు అనిల్ తండ్రికి క్యాన్సర్ అని తెలిసి బాధ పడతాడు భార్గవ.
ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 15 చదవండి.
స్నేహితుడి దుఃఖం చూడలేక బాధపడుతున్న మనవడిని ఓదారుస్తూ “అయితే ఆయనకి మంచి వైద్యం చేయిస్తే తగ్గే అవకాశం ఉందని చెప్పారా!” సాలోచనగా అన్నారు.
“అవును తాతయ్యా”
“నువ్వో పని చెయ్యి. ఆయన మెడికల్ రిపోర్టులు తదితర వివరాలన్నీ మీ ఫ్రెండ్ ని అడిగి నాకు తెచ్చియ్యి. నాకు తెలిసిన క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నారు. అతడిని సంప్రదించి మీ ఫ్రెండ్ కుటుంబ పరిస్థితులు వివరించి వీలైతే వైద్యానికయ్యే ఖర్చు కూడా తగ్గించమని అడుగుతాను.”
“నిజంగానా. మీదెంత మంచి మనసు తాతయ్యా” భార్గవ ముఖంలో చాలారోజుల తర్వాత నవ్వు చూసి రామయ్య మనసు తేలికైంది.
“ఇంకో విషయం, నువ్వు నీ స్నేహితులూ కూడా ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నామన్నావు కదా! మన కాంప్లెక్స్ లోనే సుమారు 300 ఇళ్ళదాకా ఉన్నాయి. ఫ్లాట్స్ అసోసియేషన్ సెక్రటరీకి విషయం వివరించి ఫండ్ రైజింగ్ కాంపైన్ చేద్దాము. ఇచ్చిన వాళ్ళు ఇస్తారు. మీ స్నేహితులనీ అలాంటిదేదో చేసి డబ్బులు సమకూర్చమని చెప్పు. అలా జమ అయిన మొత్తాన్ని అనిల్ కుటుంబానికి అందచేద్దాము. అలా వాళ్ళ అవసరానికి మనవంతు సహాయం చేసినట్లు అవుతుంది. ఏమంటావు?”
“చక్కటి ఆలోచన. ఊరికే దిగులు పడ్డాను తప్ప ఇలా చేయవచ్చని ఆలోచనే తట్టలేదు ఎందుకని తాతయ్యా ఛ ఛ” నుదురు కొట్టుకున్నాడు.
“అందులో నీ తప్పేమీ లేదురా. ఇటువంటి వార్తలు విన్నప్పుడు బాధతో సహజమైన ఆలోచనా శక్తిని కూడా కోల్పోతాము. పైగా మనవాళ్ళెవరికైనా ఇలా జరిగితేనో అనే భయం కూడా కమ్మేసి బుర్ర ప్రత్యామ్నాయాల గురించి అలోచించదు.”
“మీరు చెప్పింది నిజం. నాకూ అదే భయం వేసింది. అంత కరెక్ట్ గా ఎలా ఊహించారు? మీకు ఇవన్నీ ఎలా తెలుసూ?” వాడి ప్రశ్నలో అమాయకత్వం.
“ప్రతీ విషయం ఎవరో ఒకరు చెప్పక్కరలేదు. వయసు పెరిగే కొద్దీ మన చుట్టూ సమాజంలో జరిగేవాటిని గమనిస్తే చాలా విషయలు గ్రహింపుకు వస్తాయి. దానినే లోకజ్ఞానం అంటారు. చదువుతోపాటే మనిషికి లోకజ్ఞానం కూడా ఎంతో అవసరం. మనిషి సంతోషంగా తృప్తిగా బ్రతకడానికి ఇవన్నీ ఎంతో తోడ్పడతాయి. నువ్వూ అన్నీ అలాగే నేర్చుకోవాలి.”
“తప్పక నేర్చుకుంటాను”
“ఉండు ఇప్పుడే వస్తాను” లోపలికి వెళ్ళి ఒక చెక్ తెచ్చి మనవడి చేతిలో పెట్టారు. అందులో యాభై వేల అంకె వేసి ఉంది.
“అమ్మో ఇంత డబ్బు ఎవరికి తాతయ్యా”
“ఇది అనిల్ నాన్న వైద్యం కోసం నేనిచ్చే సహాయం. దీన్ని నువ్వు సమకూర్చుకోబోయే పైకానికి జోడించి ఇవ్వు”
“ఓ! గ్రేట్ తాతయ్యా మీరు. చెప్పడమే కాదు చేసి చూపిస్తారు కూడా” హర్షం వ్యక్తం చేసాడు.
“ఇందులో నా గొప్పేముందిరా. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు. మనకున్న దాన్లోనే నలుగురికీ సహాయపడగలిగితే అంతకన్నా మించిన సంతోషమేముంటుంది చెప్పు?”
“అయితే నేనూ నా పాకెట్ మనీ కలెక్షన్ దీనికి కలుపుతాను. అమ్మా నాన్నని కూడా అడుగుతాను” ఉత్సాహంగా లేచాడు.
ఆ తరువాత, రామయ్య కాన్సర్ నిపుణుడితో మాట్లాడటం, భార్గవా స్నేహితులూ కలిసి డొనేషన్లు సమకూర్చడం, చక చక జరిగిపోయాయి.
విషయం తెలిసి తల్లి తండ్రి ఇచ్చిన పాతిక వేల రూపాయలు కూడా జమా అయిన మొత్తానికి కలిపి వైద్య ఖర్చుల నిమిత్తమై అనిల్ కుటుంబానికి అందించారు.
వైద్యం సరైన సమయానికి జరిగి ప్రమాదంనుంచి బయటపడ్డాడు అనిల్ తండ్రి.
స్నేహితుడి ముఖం మళ్ళీ నవ్వుతో కళకళలాడడం చూసాక భార్గవ మనసు కుదుట పడింది.
మనవడి సంతోషంలో తానూ పాలు పంచుకున్నారు రామయ్య.
&&&
వారం రోజుల తేడాతో కళ్యాణికీ రాజేంద్రకీ ఆఫీసు పనిమీద విదేశాలకు వెళ్ళాల్సిన పని పడింది. వెళ్ళేముందే, భార్గవకి లంచ్ బాక్స్ రెడీ చేయడం, మామగారికి టిఫిన్ భోజనం తయారు చేయడంవంటి పనులన్నిటికీ మనిషిని ఏర్పాటు చేసింది కళ్యాణి.
కొడుకూ కోడలూ విదేశాలకు వెళ్ళిన మర్నాడు, ఏమీ తోచక, మనవడి గది సర్దుతున్న రామయ్య, అల్మైరాలో అడుగున బట్టల క్రింద వెనకగా పెట్టి ఉన్న సిగరెట్ ప్యాకెట్ చూసి అవాక్కయ్యారు.
ప్యాకెట్ తెరచి అందులో రెండు సిగరెట్లు మాత్రమే ఉండడం గమనించారు!
‘ఈ సిగరెట్ అలవాటు ఎప్పటినుంచీ వీడికి? అబ్బాయికీ కోడలికీ తెలిసే ఉంటుందా? బహుశః తెలిసి ఉండదు. నా ఉద్దేశ్యంలో వాడికి ఇంకా అలవాటుగా మారి ఉండదు. అందుకేనేమో రెండు మాత్రమే ఉన్నాయి ఇందులో! ఒకవేళ ప్యాకెట్లోవన్నీ త్రాగేయగా మిగిలుంటాయా ఇవి?
ఊహు...అలా అయ్యుండకపోవచ్చును! సిగరెట్ అలవాటుంటే భార్గవ దగ్గరకి రాగానే, ఎంత దాచుదామనుకున్నా, గుప్పుమని వాసన తప్పక కొడుతుంది. కానీ నాకలాంటిదేమీ అనిపించలేదు. పైగా సిగరెట్ త్రాగే వాళ్ళ పెదవులు మొద్దు బారినట్లుగా అవుతాయి. అదీ అనిపించలేదు. అంటే భార్గవకి ఇంకా ఇది అలవాటుగా మారలేదని కచ్చితంగా అనుకోవచ్చును’ ఇలా పరిపరివిధాలైన ఆలోచనలతో, ఎటూ నిర్ణయించుకోలేక, దీర్ఘంగా నిట్టూర్చి, ప్యాకెట్ యథాస్థానంలో పెట్టేసారు.
‘ఈ విషయం వాడితో ఎలా మొదలు పెట్టాలి? ఏరా సిగరెట్ త్రాగుతున్నావా ఎందుకు తాగుతున్నావు ఆరోగ్యానికి హానికరం వెంటనే మానేయమని గదమాయిస్తే ఎదురు తిరగవచ్చు. భార్గవ ప్రస్తుతం కౌమార దశలో ఉన్నాడు. స్వయంగా అనిపించకపోయినా స్నేహితుల ప్రోద్బలం, సినిమాలలో చూసీ ఇటువంటి అలవాట్లకు లోనయ్యే అవకాశం ఎంతైనా ఉంది.
మొక్కై వంగనిది మ్రానై వంగునా అని ఇప్పుడు కట్టడి చేయకపోతే ముందు ముందు ఈ అలవాటు మాన్పించడం చాలా కష్టమవుతుంది. ఎలా భార్గవకి తెలియజెప్పడం?’ ఎంత మళ్ళించుకుందామనుకున్నా రామయ్య ఆలోచనలు మనవడి వైపే వెళుతున్నాయి!
ఆరోజు రాత్రి టి.వి. లో వార్తలు చూస్తున్న తాతగారి ప్రక్కన తానూ వచ్చి కూర్చున్నాడు భార్గవ.
వార్తల మధ్యలో సిగరెట్ త్రాగడంవల్ల ప్రబలే క్యాన్సర్ వ్యాథి గురించిన ‘ఈ నగరానికేమైందీ...’ ప్రకటన వస్తుంటే మనవడికేసి చూసారు.
భార్గవ దీక్షగా టి.వి. చూస్తుండడం గమనించి, యాథాలాపంగా “ప్రాణానికి హానికరమని తెలిసీ ఇలాంటి అలవాట్లకెందుకు బానిసలవుతారో జనాలు” నిట్టూర్చారు.
“ఏదైనా ఓవర్ గా తీసుకుంటేనే కదా నష్టం కలిగేది”
“అయితే సిగరెట్ త్రాగడం, డ్రింక్ చేయడం తప్పు కాదంటావు?”
“......”
”నీకెప్పుడైనా సిగరెట్ త్రాగాలనిపించిందా?”
అనుకోకుండా సంభాషణ తనవైపు మళ్ళేటప్పటికి తాతగారి వైపు ఆశ్చర్యంగా కించిత్ సందేహంగా చూసి “ఫ్రెండ్స్ బలవంతం చేస్తే ఒకటి రెండు సార్లు త్రాగాను” అన్నాడు.
మనవడి నిజాయితీకి మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
‘అయితే వీడికింకా అలవాటు కాలేదన్న మాట. ఇదే సరైన సమయం. ఇనుమును వంగదీయాలంటే వేడిగా ఉన్నప్పుడే సమ్మెట పోటు వేయాలి’ అనుకుని “నీకు ఇష్టమయ్యే త్రాగావా?” అన్నారు.
“నాకు ఇష్టంలేదు కానీ వాళ్ళంతా నాకు మంచి స్నేహితులు. నేను వద్దంటే నాతో స్నేహం మానేస్తారేమోనని భయం వేసింది. అందుకే త్రాగాల్సి వచ్చింది” తడుముకోకుండా చెప్పాడు.
“భార్గవా ఇవన్నీ చాలా సున్నితమైన విషయాలు. ఇవాళ ఇది రేపు ఇంకోటి! ఎందులోనైనా నీకంటూ కొన్ని కచ్చితమైన నియమాలని అలవర్చుకుని అనుసరించడం నేర్చుకోవాలి. అయితే ఏదీ ఒక్క రోజులో సాధ్యంకాదు. కానీ దేనికైనా ఆరంభమనేది ఉండాలిగా! ఆంగ్లంలో ‘నౌ ఆర్ నెవర్’ అంటారు. ఆలోచించుకో. లేకుంటే ముందు ముందు చాలా ఇబ్బందుల్లో పడగలవు.”
“కానీ తాతగారూ నా స్నేహితుల మాటేమిటీ? మీరే అంటారుగా జీవితంలో ఎవ్వరికైనా మంచి స్నేహితులు ఉండడం ఎంతో అదృష్టం అనీ”
“అవును అది నిజం. కానీ నీ అభిప్రాయాలని గౌరవించి నిన్ను నిన్నుగా అంగీకరించేవాళ్ళే నిజమైన స్నేహితులు. అటువంటి వారితోనే స్నేహం కలకాలం నిలుస్తుంది. నీకు హాని కలిగించే పని, ఎటువంటిదైనా, ఎవరు బలవంతం చేసినా సరే, చివరికి నీ ప్రాణ స్నేహితుడైనా సరే, చేయకూడదని ధృఢంగా నిర్ణయించుకో.
మంచికీ చెడుకీ విచక్షణ తెలుసుకో. అందుకు ఎంతో మానసిక సంయమనం కావాలి. వద్దని చెప్పడమంటే పోట్లాడడం కాదుగా! ఇలాంటి పరిస్థితులు ముందు జీవితంలో ఎన్నో ఎదురవ్వచ్చు. కట్టె విరక్కుండా పాము చావకుండా పనులు జరుపుకోగలిగే నైపుణ్యం అలవర్చుకోవాలి. ఈరోజు కాదంటే స్నేహితులు బాధపడతారు అనుకుంటే రేపు జీవితాంతం నువ్వు బాధపడతావు.”
తాతగారు చెప్పేదాన్లో నిజముందని అనిపించినా ఆ సంభాషణ రుచించనట్లుగా సోఫాలో ఇబ్బందిగా కదిలాడు. అయితే ఏ కళనున్నాడో, కూర్చున్న చోటునుంచి కదలకుండా, తాతగారు చెప్పినదంతా శ్రద్ధగా ఆలకించాడు.
పది నిమిషాలు తాతా మనవళ్ళ మధ్య ప్రశాంతమైన నిశ్శబ్దం రాజ్యమేలింది.
“థ్యాంక్స్ తాతయ్యా. ఇలాంటి చాలా విషయలు ఈ మధ్యన నన్ను విపరీమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అమ్మనాన్నతో చెప్దామంటే ఏమని చెప్పాలో, చెప్పినా వాళ్ళెలా తీసుకుంటారోనని భయంతో ధైర్యం చేయలేకపోయాను.”
“అమ్మా నాన్నతో మాట్లాడడానికి సంశయం ఎందుకురా?”
“తెలియదు తాతగారు. దాని గురించి తరవాత మాట్లాడుకుందాము. ముందు నే చెప్పేది వినండి, మొన్నటికి మొన్న ఒక ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీలో కొంతమంది డ్రింక్స్ త్రాగుతూ నన్నూ టేస్ట్ చేయమన్నారు. చాలా ఇబ్బంది అనిపించింది కానీ తీసుకోలేదు. అలాంటప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలియక చిరాకూ కోపం వస్తాయి. సరైన సమయానికి సరైన విషయాలపట్ల నాకు అవగాహన కల్పించారు. మీరు చెప్పిన ప్రతీ మాటా గుర్తుంచుకుని ఆచరిస్తాను” చటుక్కున లేచి తన గదిలోకి వెళ్ళాడు.
మనవడు వెళ్ళిన వైపు చూస్తూ ‘భార్గవతో సాన్నిహిత్యం పెంచుకోమనీ, ఎదుగుతున్న కొడుకు మనసుని అర్థం చేసుకుని ప్రవర్తించమనీ అబ్బాయికీ కోడలికీ చెప్పాలి’ స్వగతంగా అనుకున్నారు రామయ్య.
ఎంత వేగంగా వెళ్ళాడో అంత వేగంగానూ వచ్చి చేతిలో సిగరెట్ ప్యాకెట్టు చూపించి “ఇవిగో ఫ్రెండ్స్ బలవంతంగా ఇచ్చిన సిగరెట్స్. కాదనలేక తెచ్చుకున్నాను. ఇప్పుడిక నాకు వీటి అవసరం లేదు” చెత్త బుట్టలో పారేసాడు.
ఆ పలికిన తీరులోనే, ఇకపై మనవడి విషయంలో తాను భయపడాల్సిందేమీ లేదని అవగతమై సమస్య జటిలం కాకుండానే ఓ కొలిక్కి వచ్చిందని సంతోషించారు.
&&&
స్కూల్స్ లో సమాచారాన్ని డిజిటైజేషన్ చేస్తున్న నేపథ్యంలో పిల్లల గురించిన ప్రతీ ముఖ్యమైన విషయాన్నీ తలిదండ్రుల ఫోన్ కి పంపించడం మొదలు పెట్టింది యాజమాన్యం.
అలా భార్గవకి సంబంధించిన నోటీసులూ ఇతర ముఖ్యమైన సమాచారం తన ఫోన్ కే వస్తుండడం, ఆఫీసులో అత్యవసరమైన మీటింగ్ లో ఉన్నప్పుడు కాల్స్ వచ్చి అవరోధం కలిగిస్తుండడంతో ప్రత్యేకంగా కొడుకు ఉపయోగార్థమై ఒక సెల్ ఫోన్ కొని, కాల్ డైవర్ట్ ఫీచర్ తో తన ఫోన్ కి అనుసంధానించుకున్నాడు రాజేంద్ర. దానివల్ల ఎవరు కాల్ చేసినా ముందు భార్గవ ఫోన్ కి వెళుతుంది. ఒకవేళ ఏకారణం చేతైనా భార్గవ ఫోన్ ఆన్సర్ చేయకపోతే అప్పుడు కాల్ రాజేంద్రకి వెళుతుంది.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link: https://spotifyanchor-web.app.link/e/ZMK4M6mZjEb
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya
పేరు: దినవహి సత్యవతి
విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;
వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.
ప్రవృత్తి : రచనా వ్యాసంగం.
సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.
పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.
గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.
పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.
ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.
6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.
ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &
గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);
పంచామృతం!(సత్య! పంచపదులు)
స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in
Comments