top of page
Writer's pictureDinavahi Sathyavathi

కొత్త కెరటం! ఎపిసోడ్ 17


'Kotha Keratam Episode 17' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 09/11/2023

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 17' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి, బిడ్డను కోల్పోతుంది. హాస్పిటల్ లో రామయ్య గారి శిష్యుడు సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి.


డెలివరీ సమయంలో బిడ్డను మిగిల్చి తన భార్య చనిపోయిందని రాజేంద్రతో చెబుతాడు. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెప్పి, తన కొడుకును పెంచుకోమంటాడు. అంగీకరిస్తాడు రాజేంద్ర.


రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోవడం మనవడికి నేర్పుతాడు.


తమ గ్రామంలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీలో భార్గవను చేరుస్తాడు రామయ్య.


స్నేహితుడు అనిల్ తండ్రికి క్యాన్సర్ అని తెలిసి బాధ పడతాడు భార్గవ. తాతయ్య సలహాతో స్నేహితులతో డొనేషన్స్ కలెక్ట్ చేస్తాడు.


భార్గవ సిగెరెట్స్ తాగడం గమనించి, సున్నితంగా కన్విన్స్ చేసి మానిపిస్తాడు రామయ్య.

మార్కులకోసం భార్గవ మీద ఎక్కువ ఒత్తిడి తేవద్దని కొడుకు, కోడళ్ళకు చెబుతాడు రామయ్య.


ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 17 చదవండి.


“భార్గవని చిన్నప్పటినుంచీ చూస్తున్నారు కదా! వాడు ఏకసంథాగ్రాహి. మీరన్నట్లు మార్కులు కొలబద్దలే అయినా కచ్చితమైన ప్రామాణికాలు మాత్రం కాదు. మార్కులతో పాటు విషయ పరిజ్ఞానమూ ముఖ్యమే. అది భార్గవకి కావల్సినంత ఉంది. కాస్త అర్థం చేసుకుని వాడి మానాన వాడ్ని వదిలేస్తే చక్కగా చదువుకుంటాడు. అందుకు మనం సంపూర్ణ సహకారం అందిస్తే చాలు. ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నది”


“సారీ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము” ఇరువురూ ముక్తకంఠంతో పలికారు.

“మనలో మనకి మన్నింపులేమిటర్రా. మనకి కావల్సింది భార్గవ అభివృద్ది. అందుకు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్దాము. అదిగో మాటల్లోనే భార్గవ వచ్చేసాడు. ఆకలేస్తోంది భోజనానికి ఏర్పాట్లు చెయ్యమ్మా” కోడలికి చెప్పి లేచారు.


“ఇదిగో అయిదు నిమిషాల్లో వడ్డించేస్తాను మామయ్యా” వంటింట్లోకి వెళ్ళింది కళ్యాణి.

“హాయ్ భార్గవా స్పెషల్ క్లాస్ ఎలా జరిగిందిరా?” చేతిలో స్కూల్ బ్యాగ్ అందుకుంటూ ఆప్యాయంగా అడిగిన తండ్రిని చూసి ఆశ్చర్యానందాలకి లోనయ్యాడు భార్గవ.


తమ మధ్యన ఈ ప్రేమానురాగాలు కలకాలం ఇలాగే ఉండేలా ఆశీర్వదించమని మనసులోనే దైవాన్ని వేడుకున్నారు రామయ్య.


&&&

దగ్గరుండి మనవడిచేత పదవతరగతి పరీక్షలు దిగ్విజయంగా వ్రాయించి స్వగ్రామంలో పనులు చక్కబెట్టుకుందుకు అచ్యుతాపురం బయలుదేరారు.

వెళ్ళేముందు మనవడిని తనతో రమ్మని అడిగారు.


“ఇప్పుడు రాలేను తాతగారూ. పదవతరగతి రిజల్ట్స్ వచ్చి మళ్ళీ జూనియర్ కాలేజీలో చేరేదాకా నాకు సెలవలే అయినా ఏ కాలేజీలో చేరాలీ, ఏ గ్రూప్ తీసుకోవాలీ వగైరా విషయాలన్నీ ఫ్రెండ్స్ తో చర్చించాలి కనుక నేనిక్కడే ఉండాలి. మీరే పనులు ముగించుకుని త్వరగా ఇక్కడికి వచ్చేయండి. సరదాగా గడుపుదాము. మీ కోసం ఎదురుచూస్తుంటాను”


త్వరలో వస్తానని వాగ్దానం చేసి రామయ్య గ్రామం వెళ్ళి పది రోజులయ్యింది. రోజూ ఫోన్ లో తాతగారితో గంటల కొద్దీ కబుర్లు చెప్తూనే ఉన్నాడు భార్గవ.

ఆ రోజు ఎప్పడూ చేసే సమయందాటినా తాతగారి వద్దనుంచి ఫోన్ రాలేదేమిటా అనుకుంటూండగానే మ్రోగింది ఫోన్.


“హలో తాతగారూ ఎలా ఉ...” భార్గవ మాట పూర్తవనే లేదు.

“ఎవరూ మాట్లాడేదీ?” అవతలినుంచి అపరిచిత స్వరం ప్రశ్నిస్తోంది.


“ముందు మీరెవరో చెప్పండి. ఇది మా తాతగారి ఫోన్. మీవద్దకెలా వచ్చింది?” గదమాయించాడు.

“బాబూ నేను ఈ పొలం ప్రక్కనుంచి వెళుతుంటే ఇక్కడెవరో పెద్దాయన క్రింద పడిపోయి ఉంటే ఏమైందో చూద్దామని వచ్చాను. ఆయన చేతిలో ఫోనులో మొదట ఈ నంబరు ఉంటే నొక్కాను. ఈయన మీ తాతగారా? అయితే వెంటనే బయలుదేరి రండి. పెద్దాయన స్పృహ తప్పినట్లున్నారు. ఈలోగా నేను గ్రామంలో ఎవరికైన చెప్తాను” అవతల ఫోన్ కట్ అయింది.


“అమ్మా! నాన్నా!” ఇంటి కప్పు ఎగిరేలా అరిచాడు.


ఆదివారం కాస్త ఆలస్యంగా లేచే అలవాటున్న రాజేంద్ర దంపతులు, కొడుకు అరుపులకి అదిరిపడి పరిగెత్తి వచ్చారు ఏమైంది ఏమైందంటూ.


“తాతయ్య తాతయ్య” మాట మధ్యలోనే వెక్కి వెక్కి ఏడవసాగాడు.


“తాతయ్యకేమైందిరా సరిగ్గా చెప్పు” వణుకుతున్న స్వరంతో అడిగింది కళ్యాణి.


ఆలోగా తన ఫోన్ లోంచి ఆ ఊరి మునసబుగారికి కాల్ చేసాడు రాజేంద్ర.

“రాజూ నేనే చేద్దామనుకుంటున్నానురా. మీ నాన్నని ఆంబులెన్స్ లో కె.జి.హెచ్. కి తీసుకెళుతున్నాము మీరు అక్కడికే వచ్చేయండి”


“అసలేమైంది బాబాయ్? నాన్నకి స్పృహ వచ్చిందా లేదా ఇంకా?” ఆందోళనగా అడిగాడు.


“ఏమైందో నాకూ తెలియదురా. నాన్న ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు. మీరు వెంటనే బయలుదేరండి.”


“అయ్యో దేముడా” విలపిస్తూ ఉన్న చోటే కుప్పకూలాడు రాజేంద్ర.


హుటాహుటిన బయలుదేరి విశాఖపట్నం చేరుకున్నారు ముగ్గురూ.

ఐ.సి. యు.లో ఉన్న తాతగారిని చూసి భోరుమన్నాడు భార్గవ. కన్నీరు మున్నీరయ్యారు కొడుకూ కోడలూ.


“ఎప్పుడూ లేనిది ఈసారి నన్ను తనతో రమ్మని అడిగారు. ఆయనతో వెళ్ళుంటే ఇలా జరిగుండేది కాదు” అని భార్గవ ఒకటే ఏడుపు.


“నీకు మాత్రం ఎలా తెలుస్తుంది బాబూ. ఇలా జరగాల్సుంది జరిగింది. ఊరికే నిన్ను నువ్వు తిట్టుకోకు” కొడుకుని ఓదార్చింది కళ్యాణి.


“సమయానికి వైద్యం అందడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ కాలూ చెయ్యీ కొంచం కొంకర్లు పోయాయి. అదృష్టవశాత్తూ మాట బాగానే ఉంది మీ నాన్నగారికి. అయితే ముఖ్యమైన విషయం ఆయనని ఇక పై ఒంటరిగా వదలకూడదు. తప్పని సరిగా మనిషి పర్యవేక్షణ అవసరం. ఏమాత్రం నిర్లక్ష్యం తగదు” డాక్టర్ హెచ్చరించడంతో పది రోజులు ఆస్పత్రిలో చికిత్స అనంతరం, డాక్టర్ అనుమతి తీసుకుని, తండ్రిని తమతో హైదరాబాద్ తీసుకొచ్చేసాడు రాజేంద్ర,


కొడుకూ కోడలూ మనవడూ కంటికి రెప్పల్లా కాచుకుని సపర్యలు చేయడంవల్లనూ, నియమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయించడంవల్లనూ త్వరగా కోలుకుని నడిచే స్థితికి వచ్చారు రామయ్య.


“తాతయ్యా ఇంక మీరు ఇక్కడే మాతోనే ఉంటున్నారు. ఒక్కరూ గ్రామంలో ఉండడానికి వీల్లేదు. అంతే” ఆజ్ఞాపించినట్లుగానే అన్నాడు భార్గవ.


“ఇక్కడే ఉంటాను లేరా! కోపం తెచ్చుకోకు మరీ ఈ ముసలి తాతయ్య మీద పడుచు మనవడా”


“మీరేం ముసలివారు కాదు. కొంచం ఏజ్ వచ్చిందంతే” మనవడి మాటలకి పక పకా నవ్వారు.


సుమారు నెలరోజుల తర్వాత పదవ తరగతి ఫలితాలు వెలువడ్డాయి.

భార్గవ స్కూల్లోనూ జిల్లాలోనూ కూడా ప్రథమ స్థానంలో నిలిచాడు.

అన్ని వైపులనుంచీ అభినందనల పూలవర్షం కురిసింది.


మున్ముందు ఏం చదువుదామనుకుంటున్నావని ప్రశ్నించిన ప్రతివారికీ డాక్టర్ చదివి, తమ స్వగ్రామం, అచ్యుతాపురంలో ఒక ఆస్పత్రి నిర్మించి పేదలకి ఉచితంగా వైద్యం చేద్దామనుకుంటున్ననని చెప్పసాగాడు.


భార్గవ ఆలోచనకి ఇంటిల్లిపాదీ ఆశ్చర్యపోయారు.

“ఏరా మాతో ఎప్పుడూ మాట మాత్రమైనా అన్లేదు డాక్టర్ అవ్వాలనుందని?”


“నేనూ అనుకోలేదు నాన్నా ఇప్పటివరకూ. కానీ మొన్నీమధ్య తాతయ్యకి జరిగిన ప్రమాదం, అక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేక మనం పడిన అవస్థలూ చూసాక నిశ్చయించుకున్నాను. మనమంటే డబ్బులు ఖర్చు పెట్టి ఖరీదైన వైద్యం చేయించగలిగాము తాతయ్యకి. కానీ అందరికీ అది సాధ్యమయే పని కాదు కదా. అందుకనే ఆ ఆలోచన వచ్చింది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది కదా. ప్రీమియర్ కాలేజీలలో సీటు దొరుకుతుంది”


“ముందు ఇంటర్మీడియట్ అవ్వాలి కదరా?”


“ఇంటర్ లో కూడా ఫస్ట్ ర్యాంకు కోసం కష్టపడి చదువుతానమ్మా”


“మంచిది బాబూ. నువ్వు తప్పక సాధించగలవు. మాకు నమ్మకముంది నీపైన”


“నిజంగానా అమ్మా. నువ్వలా అన్నాక నాకు ఇంకా ధైర్యం వచ్చింది”


“ఊ...అయితే నేను ఇవాల్టినుంచే కాదు కాదు ఇప్పటినుంచే నా మనవడిని డాక్టర్ భార్గవ అని పిలుస్తాను”


“అప్పుడేనా మీరు మరీనూ తాతయ్యా ముందు డాక్టర్ అవనివ్వండి”


“అవుతావులేరా. నా మనవడి గురించి నాకు తెలుసు. అనుకున్నది సాధిస్తాడు”


“థ్యాంక్స్ తాతయ్యా. పెద్దవాళ్ళ తమపైన ఉన్న నమ్మకమే పిల్లలకి ఎంతో మనోబలాన్ని ఇస్తుంది. నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పేవారు ఎంత బాగా చదివినా ఏం చేసినా పేరెంట్స్ ఒక్క మెచ్చుకోలు మాట కూడా అనేవారు కాదని. ఒక్క మార్కు తక్కువైనా ఎందుకు తక్కువైందని ప్రాణాలు తోడేసేవారనీ, నలుగురిలో చులకన చేసి మాట్లాడేవారనీ. కనీసం అమ్మానాన్నలకైనా నమ్మకముండాలి కదా తాతయ్యా పిల్లల మీద. మన ఇంట్లో చూడండి ఇటు మీరూ అటు అమ్మానాన్నా కూడా నాకు ఎంత సపోర్టివ్ గా ఉంటారో. నిజంగా నేనెంతో లక్కీ ఆ విషయంలో తాతయ్యా” భోజనం ముగించి లేస్తూ అన్నాడు.


కొడుకు అపార్థం చేసుకోకముందే, సమయానికి తగు సలహా ఇచ్చి, తమ కళ్ళు తెరిపించిన సంఘటన గుర్తొచ్చి రామయ్య వైపు కృతజ్ఞతగా చూసారు కళ్యాణి, రాజేంద్ర.


రెండ్రోజుల తర్వాత భోజనాల దగ్గర “ఒరే భార్గవా ఇప్పుడు కాకపోయినా ఇంకొన్నాళ్ళ తరువాతైనా నేను మన గ్రామం వెళ్ళాలిరా. అందుకు నువ్వు అనుమతించాలి” బ్రతిమిలాడారు మనవడిని.

“ఇంకా చాలా టైముందిగా అప్పుడు ఆలోచిద్దాములెండి. అయినా ఇంక మీకు అక్కడేం పని?”

“మరి నా మనవడు అక్కడ ఆస్పత్రి పెడితే నేను లేకపోతే ఎలాగూ?” అమాయకంగా ముఖం పెట్టి అడుగుతున్న తాతగారి వైపు ప్రశ్నార్థకంగా చూసాడు.


ఆయన ముఖంలో నవ్వు చూసాక ఆ మాటల భావం అర్థమై తానూ బిగ్గరగా నవ్వేసాడు కాబోయే డాక్టర్ భార్గవ.


&&&

ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే కొంతమంది స్నేహితులు విదేశీ విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి ప్రయత్నిస్తుండడం ఆసక్తిగా అనిపించి తానూ అలా చదివితేనో అనే ఆలోచన కలిగి, అందుకు అవసరమైన సమాచారం ఇంటర్నెట్ లో వెదికి ఎక్కడెక్కడ ప్రతిష్ఠాకరమైన వైద్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయీ, వాటిలో ఏవి మంచివి, అక్కడ ఫీజులూ ఇత్యాది విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి లండన్ లోని ప్రతిష్టాకరమైన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ (ఇండియాలో ఎం.బి.బి.ఎస్. కి సమానం) చదవాలని నిశ్చయించుకున్నాడు భార్గవ.


ఒకరోజు తల్లిదండ్రులను తాతగారినీ కూర్చోబెట్టి తన అభిప్రాయం తెలిపాడు.

“మన దేశంలోనే ప్రీమియర్ కాలేజీలు ఉన్నాయి కదరా ఎం.బి.బి.ఎస్. చదవడానికి. విదేశాలకు వెళ్ళడం అవసరమంటావా?” తన అయిష్టతను వ్యక్తపరిచింది కళ్యాణి. ఆమె అసలు బెంగంతా అన్ని సంవత్సరాలూ కొడుకుని వదిలి ఉండాలన్నదే.


భార్య అభిప్రాయంతో ఏకీభవించాడు రాజేంద్ర. అతడికీ కొడుకుని వదిలి ఉండడం సుతరామూ ఇష్టం లేదు.


అయితే “వాడు ఎక్కడ చదవాలనుకుంటే అక్కడికే పంపించి చదివించండి” అన్నారు రామయ్య.

“మీరూ వాడినే సమర్థిస్తారేమిటండీ?” కొడుకూ కోడలూ కోపాన్ని వ్యక్త పరిచారు.


“సమర్థించడం కాదురా. నిన్ను అగ్రికల్చరల్ బి.ఎస్.సి. చదివి మన పొలాలు చూసుకోరా అన్నప్పుడు నీకిష్టం లేదని చెప్పి నువ్వు కోరుకున్న చదువు చదివావు, ఆ తర్వాత నీ ఇష్టప్రకారమే వివాహమూ చేసుకున్నావు కదా.”


“అందుకని ఇప్పుడు వాడూ అలా చేయవచ్చంటారు. అంతేనా?” ఉక్రోషంగా అన్నాడు రాజేంద్ర.


“అపార్థం చేసుకోకురా. నీ అభిప్రాయాలకి నేను విలువనిచ్చినట్లే వాడికీ ఆ స్వేచ్ఛనివ్వూ అంటున్నాను. వాడిని వదిలి ఉండలేక మీరిద్దరూ అలా అంటున్నారే కానీ ఒక్కసారి ఆలోచించండి. వాడు ఎల్లకాలమూ మన వద్దనే ఉండడు కదా! వాడి భవిష్యత్తు వాడిని చూసుకోనిద్దాము. వాడిని వదిలి ఉండడం నాకు మాత్రం కష్టం కాదా? మన బలహీనతలూ అభిప్రాయాలు వాడి ముందర కాళ్ళకి బంధాలు కాకూడదు. అన్నీ ప్రక్కన పెట్టి వాడిని మనఃస్ఫూర్తిగా ప్రోత్సహిద్దాము” కొడుకూ కోడలికి నచ్చచెప్పారు.


అందరి అంగీకారం ఆశీర్వాదాలతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి అవసరమైన వ్రాత పరీక్షలు వ్రాసి విజయం సాధించాడు. సీటు సంపాదించాడు భార్గవ.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in



67 views0 comments

Comments


bottom of page