'Kotha Keratam Episode 19' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 19/11/2023
'కొత్త కెరటం! ఎపిసోడ్ - 19' తెలుగు ధారావాహిక
రచన: దినవహి సత్యవతి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి, బిడ్డను కోల్పోతుంది. హాస్పిటల్ లో రామయ్య గారి శిష్యుడు సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి.
డెలివరీ సమయంలో బిడ్డను మిగిల్చి తన భార్య చనిపోయిందని రాజేంద్రతో చెబుతాడు. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెప్పి, తన కొడుకును పెంచుకోమంటాడు. అంగీకరిస్తాడు రాజేంద్ర.
రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోవడం మనవడికి నేర్పుతాడు.
స్నేహితుడు అనిల్ తండ్రికి క్యాన్సర్ అని తెలిసి బాధ పడతాడు భార్గవ. తాతయ్య సలహాతో స్నేహితులతో డొనేషన్స్ కలెక్ట్ చేస్తాడు.
భార్గవ సిగెరెట్స్ తాగడం గమనించి, సున్నితంగా కన్విన్స్ చేసి మానిపిస్తాడు రామయ్య. మార్కులకోసం భార్గవ మీద ఎక్కువ ఒత్తిడి తేవద్దని కొడుకు, కోడళ్ళకు చెబుతాడు రామయ్య.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరుతాడు భార్గవ.
రాజేంద్రను సహోద్యోగి మహేష్ కలుస్తాడు. భార్గవను ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చూశానని చెబుతాడు.
ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 19 చదవండి.
“అవును” అంది కళ్యాణి ఓ ప్రక్క ఎవరై ఉంటుందా ఆ అమ్మాయి అని ఆలోచిస్తూనే.
“అబ్బో మీ అందరివీ చాలా అభ్యుదయ భావాలేనే?” మెచ్చుకోలుగా అన్నాడు.
రాకరాక వచ్చారు భోజనం చేసి వెళితేగానీ వల్లకాదని అనడంతో భోజనానంతరం మరి కాసేపు కబుర్లతో కాలక్షేపం చేసి వెళ్ళిపోయారు మహేష్ దంపతులు.
ఆ సాయంత్రం కాఫీల వద్ద “అబ్బాయ్! మరికొన్ని రోజుల్లో భార్గవ రాబోతున్నాడు. నీ మిత్రుడు అన్నట్లు ఆ అమ్మాయి గురించిన విషయం నిజమైతే వాడే చెప్తాడు. అంతే కానీ వచ్చీ రాగానే వాడ్ని లేనిపోని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకండి. ”
“అవును మామయ్యా నేనూ అదే అనుకుంటున్నాను”
“నేనూను” రాజేంద్ర కూడా వత్తాసు పలికాక ఆ సంభాషణ అంతటితో ముగిసింది.
సెలవలివ్వగానే తదుపరి ఫ్లైట్ పట్టుకుని ఇంట్లో వాలాడు భార్గవ. రెండు రోజులు తృప్తిగా కంటినిండా నిద్రపోయాక మనుషుల్లో పడ్డాడు.
మూడోరోజు ఫలహారాలవద్ద కబుర్లలో “మీకందరికీ ఒక విషయం చెప్పాలి?” ఉపోద్ఘాతంగా అన్నాడు.
అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న కళ్యాణి, తల్లి సహజమైన ఆత్రుతతో “నువ్వేం చెప్పబోతున్నావో మాకు తెలుసు. షాపింగ్ కాంప్లెక్స్ లో అమ్మాయి గురించేనా?” గబుక్కున అనేసి వెంటనే నాలుక కరుచుకుంది.
”అవును మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు?” ఆశ్చర్యచకితుడయ్యాడు.
“నాన్న ఫ్రెండ్ మహేష్ అంకుల్ నీకూ తెలుసుగా!”
“అవును తెలుసు అయితే?”
“ఆయన అక్కడ నిన్ను చూసారట”
“ఎలా, ఎప్పుడూ?”
“ఆయన ఈ మధ్యన వాళ్ళింట్లో పెళ్ళికని లండన్ వెళ్ళొచ్చారులే”
“ఏమని చెప్పారేమిటీ?”
“మీ మనవడికి పెళ్ళయ్యిందా ఆ అమ్మాయి మీ కోడలా అని అడిగారు?”
“ఆయన నిన్ను పలకరించేలోగానే నువ్వు ఆ అమ్మాయిని చేతులలో ఎత్తుకుని వెళ్ళిపోయావుట”
“ఇంతకీ ఎవరురా ఆ అమ్మాయి, పేరేమిటి? నీ గర్ల్ ఫ్రెండా?” భార్గవని ఏమీ అడగకూడదు అనే విషయానికి తిలోదకాలిచ్చి కొంచం కరకుగానే ప్రశ్నించాడు కొడుకుని.
సమాధానం ఏం చెప్తాడాని అందరూ చెవులు రిక్కించారు.
“ఆమె పేరు ప్రణవి. ఒకప్పుడు నా గర్ల్ ఫ్రెండే కానీ ఇప్పుడు కాదు”
“అంటే?” అయోమయంగా ముఖాముఖాలు చూసుకున్నారు శ్రోతలు.
“ఆ అమ్మాయిని నేను ఇష్టపడిన మాట వాస్తవమే. కానీ ఆ అమ్మాయి అక్కడే పుట్టి పెరిగింది. లండన్ వదిలి రాలేనంది. నేను అక్కడే ఉండడానికి అంగీకరిస్తే పెళ్ళి చేసుకుందామంది”
“మరి నువ్వేమన్నావు?”
“ఏమంటాను! మీకు తెలియదా? నా ఆలోచనలూ ఆశయాలూ చెప్పాను. మాకిద్దరికీ కుదరదని తెలిసాక స్నేహితుల్లానే ఉండాలని నిశ్చయించుకున్నాము. ”
“మరి ఆ రోజు అంకుల్ చూసినదో?”
“అదే చెప్దామనుకున్నాను ఇంతలోనే మీరేవేవో ఊహించుకుని గాభరా పడుతుంటే ఇదంతా చెప్పాల్సొచ్చింది. ఆరోజు నేనూ ప్రణవీ మరికొందరు స్నేహితులూ కలిసి షాపింగ్ వెళ్ళాము. అక్కడ తిరుగుతుండగా ఆ అమ్మాయి హఠాత్తుగా మైకం కమ్మి పడిపోయింది.
మాకేం చేయాలో పాలుపోలేదు.
మిగిలిన ఇద్దరికంటే నేను కొంచం బలంగా ఉంటాను కనుక ప్రణవిని వెంటనే చేతులలోకి ఎత్తుకున్నాను. ఆమె జారిపోకుండా ఆమె చేతులు నా మెడ చుట్టూ వేసారు స్నేహితులు. ఆమెని దగ్గరలో ఆస్పత్రికి తీసుకెళ్ళాము”
“అయ్యో అలాగా పాపం” సానుభూతి వెలిబుచ్చింది కళ్యాణి.
“ఇప్పుడెలా ఉంది ఆ అమ్మాయికి? డాక్టర్ ఏమని చెప్పారు”
“ఆమెకి పి. సి. ఓ. డి. సమస్య ఉందట పీరియడ్స్ అప్పుడు అధికంగా బ్లీడింగ్ అవుతుందట. అయినా మాతో వచ్చింది ఆరోజు”
“అంటే ఏమిటిరా?” అడిగాడు రాజేంద్ర.
“పోలి సిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటారు. ఇది హార్మోనుల సమతుల్యత లోపించడంవలన ఆడవాళ్ళలో కలిగే సమస్య” కళ్యాణి చెప్పింది.
“నీకెలా తెలుసు?” భార్య వైపు ఆశ్చర్యంగా చూసాడు రాజేంద్ర.
“నా స్నేహితురాలి కూతురికి అదే సమస్యట. చెప్పుకుని బాధపడింది”
“అవునమ్మా. ఈ మధ్య చాలా శాతం అమ్మాయిలకి ఈ సమస్య వస్తోంది. ”
“అవును మా ఫ్రెండ్స్ చెప్పగా విన్నాను. కారణాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు!”
“కచ్చితంగా ఇవీ కారణాలని ఇంకా డాక్టర్లే చెప్పలేకపోతున్నాము కానీ చిన్నవయసులోనే మెచ్యూర్ అవడం, అనారోగ్యకరమైన జీవనశైలి, కాలుష్యం వంటివి కొన్ని ఈ పి. సి. ఓ. డి. రావడానికి కారణాలు అవుతాయి. దీనివలన అధిక బ్లీడింగ్ అవడమే కాకుండా శరీరంపై ఎక్కువగా మొటిమలు రావడం, వెంట్రుకలు పెరగడం కూడా ఒక లక్షణం”
“అవును నా ఫ్రెండ్ అది కూడా చెప్పింది. అయితే ఇది వస్తే తగ్గదా?” కళ్యాణి సందేహం.
“పూర్తిగా నివారించలేము కానీ కొంతవరకూ నియంత్రించవచ్చును”
“ఎలా?”
“జీవనశైలి మార్చుకుని, సరైన ఆహారపు అలవాట్లు చేసుకుని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, గైనకాలజిస్ట్, డైటీషియన్, డెర్మటాలజిష్ట్... ఇలా తత్సంబంధిత డాక్టర్లని సంప్రదించి వారిచ్చిన సలహాలు కూడా పాటిస్తే పి. సి. ఒ. డి. సమస్యని చాలామటుకూ నియంత్రించవచ్చును. ”
“ఈ విషయం నా స్నేహితురాలికి చెప్తాను. వాళ్ళ అమ్మాయికి ఉపయోగపడవచ్చు”
“ఇప్పుడు ప్రణవి ఎలా ఉందిరా?” అంతసేపూ తల్లీ కొడుకుల సంభాషణ మౌనంగా విన్న రామయ్య అడిగారు.
“ఫరవాలేదు తాతయ్యా. నీరసంగా ఉంది. కోలుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు”
“నీతోపాటే చదువుతోందా?”
“అవును నాన్నా. ఈ సారి పరీక్షలు వ్రాయలేకపోయింది. మళ్ళీ సారి వ్రాయాలి”
“హూ......... ” దీర్ఘంగా నిట్టూర్చాడు.
“ఏమిటో ఆడపిల్లలకి ఈ సమస్యలు” నిట్టూర్చింది కళ్యాణి.
“మీ అంత కాదుగానీ మగవాళ్ళకీ ఉన్నాయి సమస్యలు” ఫలహారం ముగించి లేస్తూ అన్నాడు రాజేంద్ర.
“ఆ మాటా నిజమేనండీ!” తానూ లేచి “అందరికీ టీ కలిపి తెస్తాను” వంటగదివైపు అడుగులు వేసింది కళ్యాణి.
“పదండి తాతయ్యా మనం హాల్లో కూర్చుందాము” తాతగారికి చేయందించి లేవదీశాడు.
రెండ్రోజుల తర్వాత సాయంత్రం కాఫీలయ్యాక “తాతగారూ అలా పార్కులో వాకింగ్ కి వెళ్ళొద్దామా?” అన్నాడు.
“నేను నడవలేనేమోరా మనవడా?” అశక్తత వెలిబుచ్చారు.
“నేనున్నానుగా చెయ్యిపట్టుకుని నడిపిస్తాను. నెమ్మదిగానే వెళదాము. హడావిడి ఏముందీ ఇప్పుడు!”
“సరే పద నువ్వు లండన్ వెళ్ళిపోతే మళ్ళీ నీతో సమయమెప్పుడు గడపగలనో ఏమో?”
ఇద్దరూ కలిసి నెమ్మదిగా నడవసాగారు...
పార్కులోకి వెళ్ళేలోగానే అలసిపోయి ప్రక్కనే ఉన్న బెంచిపైన కూర్చున్నారు రామయ్య.
మనవడు కూడా పక్కనే కూర్చుని “ఏదైనా చెప్పండి తాతగారూ” అన్నాడు.
కాసేపు ఆలోచించి “స్వర్గానికి ప్రవేశం ఉచితం కానీ నరకానికి వెళ్లాలంటే బోలెడు డబ్బు ఖర్చు పెట్టాలి, ఎలానో చెప్పగలవా?” అని అడిగారు.
భార్గవ ఆశ్చర్యంగా తాతగారి వైపు చూసి "అదెలా?" అన్నాడు.
“ఎలా అంటే జూదం ఆడటానికీ, మత్తుపానీయాలు సేవించడానికీ, పొగ త్రాగడానికీ, పాపాలతో పయనించడానికీ ఇలా అన్ని చెడు పనులు చేయడానికి డబ్బు కావాలి
కానీ మనవడా
ప్రేమను పంచడానికీ, దేవుణ్ణి ప్రార్థించడానికీ, సేవ చేయడానికీ, ఉపవాసం ఉండి దేవునికి అత్యంత దగ్గరగా వసించడానికీ, క్షమించమని అడగడానికీ, చూపులో కరుణ సానుభూతి చూపడానికీ ఇలా ఇంకా మంచి పనులు వేటికీ డబ్బు అవసరం లేదు. అన్నింటికంటే దేవుడిపై నమ్మకం ఉండాలి! మనపై మనకు ప్రేమ ఉండాలి. ఇప్పుడు చెప్పు డబ్బు ఖర్చు చేసి నరకాన్ని ఇష్టపడతావా లేక ఉచితంగా లభించే స్వర్గం వైపు వెళ్తావా?”
తాతయ్య అనుభవాలను ఆసక్తిగా వింటూ ఉండిపోయాడు భార్గవ.
తర్వాతి పది రోజుల సమయం తనవారితో ఆహ్లాదంగా గడిపి లండన్ తిరుగు ప్రయాణమయ్యాడు భార్గవ.
&&&
బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ తరువాత పోష్ట్ గ్రాడ్యుయేషన్ కూడా దిగ్విజయంగా పూర్తి చేసాడు భార్గవ.
‘నా చిన్నారి భార్గవ చూస్తుండగానే ఎంతగా ఎదిగిపోయాడు. ఇవాళో రేపో పట్టా చేత బట్టుకుని భారతదేశం తిరిగి వస్తాడు’ మనవడి గురించిన తీయటి జ్ఞాపకాలలో మునిగితేలుతున్నారు, ఎనభయ్యోపడిలో పడిన రామయ్య.
ఇటు మనవడి చదువు సాగుతుంటే, స్వార్జితం సూరజ్ ఇచ్చిన ఆస్తీ కలిపి, అటు అచ్యుతాపురంలో మనవడి కోసం సకల ఆధునిక సౌకర్యాలూ, పరికరాలతో పెద్ద ఆస్పత్రి కట్టించారు.
మధ్య మధ్యలో కొడుకుని తీసుకుని అక్కడికి వెళ్ళి అన్నీ పర్యవేక్షించుకుని వచ్చేవారు.
అయితే ఆస్పత్రి కట్టిస్తున్న విషయం, భార్గవ స్వదేశం వచ్చాక చెప్పి ఆశ్చర్యపరుద్దామని, గోప్యంగానే ఉంచారు మువ్వురూ.
“నాన్నా! భార్గవ రేపే వస్తున్నాడుట. ఇప్పుడే ఫోన్ చేసాడు” కొడుకు చెప్పిన వార్త రామయ్యని ఆనందసాగరంలో తేలియాడించింది.
వయస్సు పైబడి వినికిడి శక్తి తగ్గి, కళ్ళు కూడా అంతగా సహకరించకపోతుండడంతో ఎక్కువగా వీడియోకాల్ లో చూడడం, మాట్లాడడం చేయలేకపోతున్నారు రామయ్య.
ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు మనవడిని చూస్తానా అనే ఆత్రుతతో ఆ రాత్రి కంటి మీద కునుకన్నది రాలేదు వయో వృద్ధుడికి.
మర్నాడు ఉదయమే కొడుకూ కోడలూ భార్గవని తీసుకుని రావడానికి విమానాశ్రయానికి వెళ్ళాక నెమ్మదిగా లేచి తయారై కూర్చుని మనవడి కోసం ఎదురు చూడసాగారు.
క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. వయోభారంవల్ల కూర్చుని కూర్చునే నిద్ర పోతున్నారు రామయ్య.
“తాతయ్యా నే వచ్చేసా” ఇంట్లోకి అడుగుపెడుతూనే బిగ్గరగా వినిపించిన భార్గవ మధురమైన పిలుపుకి మెలకువ వచ్చింది.
కాళ్ళకి నమస్కారం చేస్తున్న మనవడిని దగ్గరకు తీసుకుని గాఢంగా హృదయానికి హత్తుకున్నారు.
తాతగారి చేతులలో గువ్వలా ఒదిగిపోయాడు భార్గవ.
ఇరువురి కళ్ళూ ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
ఎవరూ కూడా మరొకరినుంచి విడివడాలని ప్రయత్నమే చేయడం లేదు.
“ఒరే తాతగారిని ఉక్కిరిబిక్కిరి చేయకురా నీ వెర్రి ప్రేమతో” తండ్రి సున్నితమైన మందలింపుతో అతికష్టం మీద తాతగారి కౌగిలినుంచి దూరంగా జరిగాడు.
“ఎలా ఉన్నారు తాతయ్యా?” ప్రక్కనే కూర్చుని ఆప్యాయంగా చేయి పట్టుకుని నిమురుతూ అడిగాడు.
“ఇదిగో ఇలా ఉన్నానురా నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అనుకుంటూ అసలు చూడగలనా లేదా అని భయపడుతూ”
”అదిగో మీరలా అంటే నేనసలు మీతో మాట్లాడనంతే ఆ..... ” బుంగమూతి పెట్టాడు.
“సరే సరే అననులే కానీ వెళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకో మళ్ళీ మాట్లాడుకుందాము”
ఆ సాయంత్రం అందరూ టీ త్రాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు “మనవడా నాకోసం లండన్ నుంచి ఏం తెచ్చావురా?” అనడిగారు.
“తెచ్చానుగా ఇదిగో చూడండి హియరింగ్ మెషీన్. ఇది పెట్టుకుంటే మీరూ నేనూ మునుపటిలాగానే కబుర్లు చెప్పుకోవచ్చు”
“ఓ థాంక్స్ రా మనవడా”
“మరి బదులుగా మీరు నాకేమి ఇస్తారు?” కొంటెగా అడిగాడు.
“ఈ వయసులో ఇంకా నీకేమి ఇవ్వగలనురా? అయినా నువ్వు అడిగావు కాబట్టీ ఓ చిరు కానుక మాత్రం ఇస్తాను. అందులో ఏదుంటే అదే అంతకుమించి ఏదీ ఇచ్చే శక్తి లేదురా ఈ ముసలి తాతయ్యకి”
“ఎక్కడికి వెళుతున్నారు? ఏంకావాలో చెప్పండి నేను తెస్తాను” నెమ్మదిగా లేవబోతున్న తాతగారిని వారించాడు.
“ఫరావాలేదురా. అదెక్కడుందో నాకు మాత్రమే తెలుసు” గదిలోకి వెళ్ళి ఒక ఆకుపచ్చని గిఫ్ట్ కవరు తెచ్చి మనవడి చేతిలో ఉంచారు.
========================================================================
ఇంకా వుంది..
కొత్త కెరటం! ఎపిసోడ్ - 20 (చివరి భాగం } త్వరలో..
========================================================================
దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya
పేరు: దినవహి సత్యవతి
విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;
వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.
ప్రవృత్తి : రచనా వ్యాసంగం.
సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.
పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.
గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.
పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.
ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.
6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.
ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &
గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);
పంచామృతం!(సత్య! పంచపదులు)
స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in
Comments