top of page
Writer's pictureDinavahi Sathyavathi

కొత్త కెరటం! ఎపిసోడ్ 20


'Kotha Keratam Episode 20' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 25/11/2023

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 20' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


జరిగిన కథ:

అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి, బిడ్డను కోల్పోతుంది. హాస్పిటల్ లో రామయ్య గారి శిష్యుడు సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి.

డెలివరీ సమయంలో బిడ్డను మిగిల్చి తన భార్య చనిపోయిందని రాజేంద్రతో చెబుతాడు. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెప్పి, తన కొడుకును పెంచుకోమంటాడు. అంగీకరిస్తాడు రాజేంద్ర.

రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోవడం మనవడికి నేర్పుతాడు.

స్నేహితుడు అనిల్ తండ్రికి క్యాన్సర్ అని తెలిసి బాధ పడతాడు భార్గవ. తాతయ్య సలహాతో స్నేహితులతో డొనేషన్స్ కలెక్ట్ చేస్తాడు.


భార్గవ సిగెరెట్స్ తాగడం గమనించి, సున్నితంగా కన్విన్స్ చేసి మానిపిస్తాడు రామయ్య. మార్కులకోసం భార్గవ మీద ఎక్కువ ఒత్తిడి తేవద్దని కొడుకు, కోడళ్ళకు చెబుతాడు రామయ్య.


ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరుతాడు భార్గవ.

రాజేంద్రను సహోద్యోగి మహేష్ కలుస్తాడు. భార్గవను ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉండడం చూశానని చెబుతాడు.

భార్గవ తిరిగి వచ్చాక అది కేవలం అపోహ మాత్రమేనని చెబుతాడు.



ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 20 చదవండి.


“సరదాకి అడిగాను తాతయ్యా. అంతే! అందుకోసం మీరు ఇంత శ్రమ పడతారని తెలిస్తే అసలు అడిగేవాడినే కాదు. అయినా ఇప్పటివరకూ ఎంతో ఇచ్చారు ఇకపై నేనే మీ అందరికీ అన్నీ ఇవ్వాలి”


కవరులోంచి కాగితాలు తీసి చూసాడు...అవి అచ్యుతాపురంలో కట్టించిన జానకీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని భార్గవ పేరు మీద వ్రాయించిన గిఫ్ట్ డీడ్ తాలూకు లీగల్ డాక్యుమెంట్స్, ఆస్పత్రి ప్లాను వగైరా వివరాలతో కూడిన మరి కొన్ని కాగితాలు.


“వావ్! నిజంగానా తాతగారూ ఆస్పత్రి కట్టించేసారా! ఓ! ఆస్పత్రికి నాన్నమ్మ పేరు పెట్టారే! గ్రేట్. మంచి పేరు మంచి పనీ కూడా తాతయ్యా. అయితే నాకు మాట మాత్రమైనా చెప్పనే లేదు. అమ్మ దొంగలూ అందరూ కలిసి సీక్రెట్ గా ఉంచారన్నమాట సర్ప్రైజ్ చేద్దామని. కానీ...”

సందేహంగా ఆగిపోయిన భార్గవ వైపు ఏం చెప్తాడోనని భయంగా చూసారు మువ్వురూ!


“ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మీకో మాట చెప్పాలి అదీ అదేంటంటే నేనీ ఆస్పత్రి చూసుకోలేను”


“ఏం ఎందుకనీ?” ఉరిమినట్లే అడిగారు రాజేంద్ర, కళ్యాణి.


రామయ్య గుండె గుభేలంది ‘కొంపదీసి వీడు తన ఆలోచనలు మార్చుకున్నాడా ఏమిటీ?’ అనుకున్నారు.


“సారీ అమ్మా, నాన్నా, తాతయ్యా నేచెప్పబోయేది విని మీరు బాధపడొద్దు. నేనొక లండన్ అమ్మాయిని ప్రేమించాను. మీరెవరూ అభ్యంతర పెట్టరనే నమ్మకంతో పెళ్ళి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాను. అక్కడే సెటిల్ అవుతాను. లండన్ లో మేము అంటే నేను మరిద్దరు స్నేహితులూ కలిసి ఒక ఆస్పత్రి పెడదామని నిశ్చయించుకున్నాము. మీరందరూ కూడా అక్కడికే వచ్చేయండి” చెప్పడం ముగించి అందరి ముఖాలలోకీ చూసాడు.


“ఎవరూ ఆ ప్రణవేనా? అప్పుడు అడిగితే మేము కేవలం మంచి స్నేహితులమంటూ పేద్ద డంబాలు పలికావు అంటే మాతో చెప్పినవన్నీ అబద్ధాలేనన్నమాట?”


“అది నిజమే. ప్రణవికి గత సంవత్సరం పెళ్ళైయ్యింది. నేను చేసుకోబోయే అమ్మాయి పేరు జాస్మిన్”


మనవడి మాటలు హృదయాన్ని బ్రద్దలు చేయగా అతికష్టం మీద తనను తాను సంబాళించుకుని “భార్గవా నీకిష్టమైతేనేరా బలవంతమేమీ లేదు. అప్పటికీ ఇప్పటికీ నీ అభిప్రాయాలు మారి ఉండవచ్చు కదా. నీ జీవితం నీ ఇష్టప్రకారం జీవించు. నీ సంతోషమే నాకు కావాలి” తన నిరుత్సాహం మనవడికి తెలియనీయకుండా దాచాలని విశ్వ ప్రయత్నం చేసారు.

కానీ రాజేంద్ర కళ్యాణి మాత్రం అగ్గిమీద గుగ్గిలంలా మండిపడ్డారు.


“అంతా నీ ఇష్టమేనా? ఎవరో పరాయి జాతి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటావా? మేమంతా చచ్చామనుకున్నావా? ఇక్కడ ఆ పెద్దాయన నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో తెలుసా? నువ్వు డాక్టర్ చదివి వస్తావనీ, గ్రామస్తుల బాధలు తీరుతాయనీ, స్వగ్రామంలో నీ పేరు మీద పెద్ద ఆస్పత్రి కట్టించి చకోర పక్షిలా నీ రాకకోసం ఎదురు చూస్తుంటే నువ్వు చేసే నిర్వాకమిదా”


అదంతా నిర్ఘాంతపోయి వింటున్న రామయ్య కొడుకునీ కోడలినీ మందలిస్తూ “ఊరుకోండిరా మీరు. అలా దెబ్బలాడతారేమిటీ మరీనూ! మన ఆశలు మనవి వాడి నిర్ణయాలు వాడివీ. తన జీవితం గురించి ఎటువంటి నిర్ణయం తీసుకునే హక్కు వాడికి ఉంది.


ఇక పెళ్లంటారా జీవిత భాగస్వామితో కలిసి బ్రతకాల్సినది వాడు, మనము కాదు. వాడు ఎక్కడున్నా, ఎవరిని పెళ్ళి చేసుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. మీరూ వాడిని ఆశీర్వదించండి. ఇదే నా ఆఖరి కోరిక అనుకోండి. నా మనవడు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం” ఎంత అణుచుకుందామనుకున్నా అలవికాని దుఃఖంతో గొంతు పూడుకుపోయి మాటలు పెగల్లేదు రామయ్యకి.


కొంతసేపటికి తేరుకుని “నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయిరా మనవడా. ఏమనుకోకూ కూర్చునీ కూర్చునీ అలసటగా ఉంది కాసేపు విశ్రాంతి తీసుకుంటానూ” చేతికర్ర సాయంతో నెమ్మదిగా లేవబోయారు.


రాజేంద్రా కళ్యాణీ కూడా ఇంక చెప్పాల్సిందేమీ లేదన్నట్లు విసురుగా నిష్క్రమించబోయారు.

“ఇది మరీ బాగుంది నన్నిలా ఒక్కడినే వదిలేసి వెళ్ళిపోతారా అందరూ! ఇంతకే అలిసిపోతే మరి అచ్యుతాపురంవరకూ కార్లో ఎలా కూర్చుంటారు తాతగారూ?” చిలిపిగా అంటున్న మనవడివైపు సందేహంగా చూసారు.


అప్పటివరకూ పెదిమల చాటున అతికష్టం మీద అదిమిపెట్టిన నవ్వుని ఇక ఆపుకోలేక బిగ్గరగా నవ్వేసాడు.

“ఎందుకురా ఆ నవ్వు?” అయోమయంగా చూసారు పెద్దలు.


“అదిగో అలా చూడకండి. ఇందాక నేను చెప్పినదాంట్లో కొంతవరకే నిజం ఉంది. అదేమంటే నేనూ ఇద్దరు స్నేహితులూ కలిసి ఆస్పత్రి పెట్టడం. అది లండన్ లో కాదు ఇక్కడే మన అచ్యుతాపురంలో. అక్కడ నాతో కలిసి చదువుకున్న స్నేహితులతో నా ఆలోచనలు చెప్పినప్పుడు అందులో ఇద్దరు డాక్టర్లు నాతో కలిసి మన ఆస్పత్రిలో పని చేయడానికి ఉత్సాహం చూపించారు”


“మరి లండన్ అమ్మాయి జాస్మిన్ తో పెళ్ళీ అదంతా?”


“అదంతా కల్పించానమ్మా మీరేమంటారో చూద్దామని”


“ఓరి భడవా! అంత సీరియస్ గా చెప్తుంటే నిజమే కాబోలు అనుకున్నాను సుమా” మనసు తేలిక పడగా తిరిగి సోఫాలో కూర్చున్నారు రామయ్య.


“క్షణం పాటు హడలగొట్టినా చివరికి మాత్రం మంచి వార్త చెప్పావురా భార్గవా” చప్పట్లు చరిచాడు రాజేంద్ర.


తాతగారి చెంత మోకాళ్ళ మీద కూర్చుని “డాక్టర్ చదివి మన ఊళ్ళోనే ఆస్పత్రి పెట్టడం నా కల, జీవితాశయమని మీకు తెలుసు. అది వదులుకుంటానని ఎలా అనుకున్నారు తాతయ్యా!”


“ఏమోరా నువ్వు అంతలా చెప్తోంటే నిజమే కాబోసు అనుకున్నాను. అందులో తప్పేమీ లేదనిపించింది కూడా”


“మీరెంత అభ్యుదయ భావాలు కలవారు తాతయ్యా. మీ మనవడిని అవ్వడం నిజంగా నా పూర్వజన్మ పుణ్యం”


వెంటనే సూరజ్ జ్ఞప్తికి వచ్చి ముఖాముఖాలు చూసుకున్నారు రాజేంద్ర దంపతులు.

‘మీ పెంపకంలో నా కొడుకు మంచి పౌరుడు అవుతాడనడంలో నాకేమాత్రం సందేహంలేదు’ ఆనాటి సూరజ్ మాటలు గుర్తుకొచ్చి ఇరువురి మనసులూ అతడి పట్ల కృతజ్ఞతతో భారమై కళ్ళు చెరువులయ్యాయి.


“అబ్బో నా మనవడు మాటలు బాగానే నేర్చాడే. అదలా ఉంచి ఒక మాట దాచకుండా చెప్పు నిజంగా నువ్వు ఎవరినైనా ప్రేమించావా పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నావా?”


“అస్సలు అలాంటిదేమీ లేదు తాతయ్యా. చెప్పానుగా ఒక కట్టు కథ అని. ఇప్పుడప్పుడే పెళ్ళి గురించిన ఆలోచనే లేదు. ముందు కెరీర్. ఆ తరువాతే పెళ్ళి. అదీ మనసుకి నచ్చిన అమ్మాయి దొరికినప్పుడే”


“ఇంకో విషయం రా, నీకు గుర్తుందా! సూరజ్ అంకుల్ తన ఆస్తి ఇచ్చారు నువ్వు ఆస్పత్రి కడితే అందులో ఉపయోగించమని”


”అవును తాతయ్యా గుర్తుంది”


“మన ఆస్పత్రికి ఆ డబ్బు కూడా వినియోగించాను”


“ఓ! చాలా మంచి పని చేసారు. అంకుల్ కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి”


“ఆ పని నేను అప్పుడే చేసానురా” తాతగారి సమాధానానికి సంతృప్తుడై లేచి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు.


“ఐ యాం సారీ మిమ్మల్ని బాధపెట్టాను కదూ” కన్నీళ్ళు తుడిచాడు.


“ఇవి ఆనందంతో వచ్చిన కన్నీళ్ళు బాబూ” కొడుకుని ఆప్యాయంగా కౌగలించుకున్నారు.

నెల రోజుల తర్వాత అచ్యుతాపురం చేరుకున్న రామయ్య కుటుంబాన్ని గ్రామస్తులు ఘనంగా స్వాగతించారు.


‘జానకి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి’ ప్రారంభోత్సవం తాతగారి చేతుల మీదుగా ఘనంగా జరిపించాడు భార్గవ.


ఒక చేతితో కర్ర మరో చేతితో మనవడి చేయి పట్టుకున్న రామయ్యగారినీ, తాతగారి చేయి పట్టుకుని నెమ్మదిగా నడిపిస్తూ ఇల్లూ పరిసరాలూ, ఇంటిముందున్న మర్రి చెట్టూ ఆప్యాయంగా చూస్తూ బాల్యం తాలూకు మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ కబుర్లు చెప్తున్న భార్గవనీ, వారి అపూర్వబంధాన్ని చూసి కళ్ళు చమర్చాయి చూస్తున్నవారందరికీ.


&&&

కాలచక్రం మూడేళ్ళు గిర్రున తిరిగి అటు అచ్యుతాపురం గ్రామంలోనూ ఇటు భార్గవ జీవితంలోనూ ఆనందకరమైన మార్పులు తెచ్చింది.


అచ్యుతాపురం గ్రామ పంచాయితీ హెడ్ క్వార్టర్స్ అయింది. గ్రామంలోని పాఠశాల ప్రభుత్వ హయాములోనికి వెళ్ళి జూనియర్ కాలేజీగా మెరుగులు దిద్దుకుంది.

ప్రస్తుతం ఉన్న గ్రామ మునసబు పంచాయితీ ప్రెసిడెంట్ అయ్యారు.

రాజేంద్ర కళ్యాణీ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి అచ్యుతాపురం వచ్చేసారు తాతామనవళ్ళ దగ్గరికి.


భార్గవ, ఆస్పత్రిలో తనతో కలిసి పనిచేస్తున్న డాక్టర్ ధరిత్రిని ప్రేమించి పెళ్ళి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు.

భార్గవ ధరిత్రి దంపతులకి ఆడపిల్ల కలిగింది.

నామకరణ మహోత్సవం రోజున “తాతయ్యా మీ మునిమనుమరాలికి ఏం పేరు పెడతారో మీ ఇష్టం చెప్పండి” అన్నాడు.


“మైథిలి” ఠక్కున చెప్పారు “నాన్నమ్మ పేరు”


“నాన్నమ్మ పేరు జానకి కదా తాతయ్యా?”


“మైథిలి, జానకి అన్నీ సీతాదేవి పేర్లే భార్గవా”


“ఓహో అలాగా! మైథిలి పేరు చాలా బాగుంది తాతయ్యా” బియ్యంలో పేరు వ్రాస్తూ అన్నాడు భార్గవ.

మైథిలి పేరు చెప్పగానే కొడుకూ కోడలు తనవైపు చూడడం కనుచివరలనుండి గమనించినా దీక్షగా భార్గవ వైపే చూస్తున్న రామయ్య మదిలో ఆనాడు మునసబు మనవరాలి విషయమై ఇరువురూ డాక్టర్ ని కలుసుకోవడానికి వెళ్ళినపుడు జరిగిన విషయాలు మెదిలాయి...


మునసబుతో కలిసి ఆస్పత్రిలో అడుగు పెట్టగానే కళ్యాణి ప్రసవం అక్కడే జరిగిందని గుర్తొచ్చి నలువైపులా చూసారు. ఒకచోట ఫలకం పైన పెద్ద ఫోటో క్రింద, ఆస్పత్రి పిల్లల వార్డు ఆధునీకరణకు కోటి రూపాయలు విరాళం ఇచ్చిన దాతలు శ్రీ. డా. సూరజ్, కీ.శే. శ్రీమతి మైథిలి అని వ్రాసి ఉంది. ఫొటోలో నవ్వుతున్న సూరజ్, మైథిలిల జంట.


ఫొటోలో మైథిలిని చూసి ఆ నవ్వూ, ముఖం చిరపరిచితంగా ఉన్నాయే ఎవరాని ఆలోచిస్తుంటే చటుక్కున భార్గవ నవ్వు ముఖం కళ్ళ ముందు మెదిలింది. అంతక్రితం ఒకసారి సూరజ్ ఫోన్ చేసినప్పుడు, తనకి వివాహమైందనీ, భార్య పేరు మైథిలి అనీ, సరిగ్గా భార్గవ పుట్టడానికి రెండు రోజుల ముందే భార్య మగబిడ్డని కని పురిటిలోనే చనిపోయిందనీ చెప్పడం గుర్తొచ్చింది. ఎదురుగా ఉన్న ఫొటో ఆ రోజు తాను విన్న సమాచారం కలిపి క్రోడీకరించి చూస్తే, అప్పటిదాకా మనసుని పట్టి వేధిస్తున్న సందేహాలు పటాపంచలయ్యాయి. భార్గవ, సూరజ్ మైథిలీల కొడుకే అని నిర్థారణ అయింది. అయితే మరి కళ్యాణికి పుట్టిన బిడ్డ ఏమైనట్లని సందేహం కలిగింది. ఎవరిని కనుక్కుంటే తాను అనుకుంటున్నది కచ్చితంగా నిర్థారణ అవుతుందా అని ఆలోచిస్తున్నంతలో మునసబు పని పూర్తి చేసుకుని రావడంతో తిరిగి వచ్చేసారు.


ఆ తర్వాత ఇంకో రోజు వెళ్ళి, ఎవరికీ తెలియకుండా, అక్కడ ఎప్పటినుంచో పని చేస్తున్న హెడ్ నర్సుని మంచి చేసుకుని కూపీ లాగితే, డబ్బుకి ఆశపడి, ఆ రోజు కళ్యాణికి పుట్టిన ఆడబిడ్డ చనిపోతే, డాక్టర్ ఆజ్ఞ మీదట ఆ బిడ్డని సూరజ్ దంపతులకు పుట్టిన మగబిడ్డతో మార్చడం జరిగిందనీ, తనకు అంతవరకే తెలుసనీ, ఈ విషయం ఎక్కడైనా తెలిస్తే తన ఉద్యోగం ఊడుతుందనీ కనుక ఎవ్వరికీ చెప్పవద్దనీ బ్రతిమిలాడింది.


తనకు ముందు పుట్టింది మనవరాలు అని తెలిసాక, ఆ దైవం అలా జానకి ముచ్చట కూడా తీర్చాడని అనుకున్నాడు. ఆ బిడ్డ బ్రతకలేదని విని దుఃఖపడినా అంతా దైవేచ్ఛ అని మనసులోనే దణ్ణం పెట్టుకుని మనసు సరి పెట్టుకున్నాడు. అందుకే ఆ విషయాలేవీ ఎప్పుడూ కొడుకు వద్ద ప్రస్తావించలేదు. చెప్పాల్సిన అవసరమూ లేదనుకున్నాడు, ఏది ఏమైనా భార్గవ తన మనవడే అనుకున్నాడు, తమది దేవుడు కలిపిన బంధం అనుకున్నారు...


తాత కాని తాతకి మనవడు కాని మనవడు...ప్రేమానుబంధాల కడలిలో వారి అన్యోన్యమైన అపురూపమైన బంధం ఒక కొత్త కెరటం!


ఆ సంవత్సరం రామయ్య పుట్టిన రోజున, మునిమనుమరాలు మైథిలిని ఒళ్ళో కూర్చోబెట్టి, ఆయనకి సహస్ర చంద్రదర్శనం వేడుక ఘనంగా జరిపారు రాజేంద్ర కళ్యాణీ, భార్గవ ధరిత్రీ.


ఒకరంటే ఒకరు ప్రాణంగా మసలే ఆ తాతా మనవడు, ఒడిలో చిన్నారి మైథిలితో, నిత్యం ఇంటిముందున్న మర్రి చెట్టు నీడన కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే, వారు వేరు వేరు ఇద్దరు వ్యక్తులు కాదు ఒక్కరే అనిపిస్తారు చూపరులకు.

========================================================================

***శుభం***


కొత్త కెరటం ధారావాహికను ఆదరించిన మా ప్రియమైన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీమతి దినవహి సత్యవతి గారి గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in

134 views1 comment

1 Comment


Satya Kolachina
Dec 18, 2023

సత్యవతి గారూ, మంచి కుటుంబ కథ వ్రాశారు. మీ సీరియల్ నవల 'కొత్త కెరటం' ఈకాలానికి అనుగుణంగా అందరికీ నచ్చే విధంగా ఉంది.

మీకు నా అభినందనలు.

సత్య ఎస్. కొలచిన


Like
bottom of page