top of page
Writer's pictureDinavahi Sathyavathi

కొత్త కెరటం! ఎపిసోడ్ 3


'Kotha Keratam Episode 3' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 3' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి పరిస్థితి సీరియస్ అని చెబుతారు డాక్టర్లు.


హాస్పిటల్ లో సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి. తాను రామయ్య గారి సహాయంతో చదువుకున్నానని చెబుతాడు అతను.

రాజేంద్ర భార్య క్షేమంగానే ఉందనీ, పుట్టిన బిడ్డ మరణించిందనీ చెబుతాడు డాక్టర్.

తనకు కొడుకు పుట్టి రెండు రోజులే అయిందనీ, డెలివరీ కాగానే తన భార్య చనిపోయిందనీ చెబుతాడు సూరజ్.

తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెబుతాడు. తన కొడుకును పెంచుకొమ్మని రాజేంద్రతో చెబుతాడు సూరజ్.


ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 3 చదవండి.


అంతలోనే అటుగా వచ్చిన వ్యక్తులను చూసి “మీలో రాజేంద్ర ఎవరు?” అని అడిగింది.

“నేనే” అనగానే రామయ్యగారు అనే వ్యక్తి ఫోన్ చేయమన్నారని చెప్పి వెళ్ళిపోయింది నర్స్.

“అయ్యో అసలు ఆ విషయమే మర్చిపోయాను సుమా! నాన్నెంత కంగారుపడుతుంటారో? ఇప్పుడే చేస్తాను”

“ఆగాగు మనం అనుకున్నట్లు అంతా సర్దుబాటు చేసాక శుభవార్త చెప్దువుగాని. ముందుగా డాక్టర్ ని కలుద్దాము పద” వారిస్తూ అటుగా అడుగులు వేసాడు సూరజ్.

“ఓ! సరే సరే” ఫోన్ జేబులో పెట్టుకుని, అవసరమైతే పిలవమని కళ్యాణి అటెండర్ కి చెప్పి, సూరజ్ ని అనుసరించాడు.

డాక్టర్ ఛాంబర్ కు వెళ్ళి “మే ఐ కమిన్” తలుపు తట్టాడు సూరజ్.

“కమిన్”

లోనికి వచ్చిన వ్యక్తులను చూసి “ఓ మీరా రండి కూర్చోండి” కుర్చీలు చూపిస్తూ సైగ చేసాడు.

“థాంక్యూ”

“మీ స్నేహితుడిని వెంటబెట్టుకుని వచ్చారేమిటీ విశేషం?” రాజేంద్ర వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు.

“మీతో అత్యవసరమైన పనుండి వచ్చాము”

“చెప్పండి”

తనకీ రాజేంద్ర పరివారానికీ ఉన్న పరిచయం, వాళ్ళు చేసిన సహాయం క్లుప్తంగా చెప్పి “మీకు తెలుసు కదా నా భార్య మగబిడ్డని ప్రసవించి చనిపోయిందనీ, రాజేంద్ర భార్యకి పుట్టిన ఆడబిడ్డ చనిపోయిందని”

“అవునూ. అయితే?” డాక్టర్ భృకుటి ముడివడింది.

“కళ్ళైనా తెరవకముందే తల్లిని కోల్పోయిన నా బిడ్డకి తల్లినీ, బిడ్డని పోగొట్టుకున్న విషయమే తెలియని అపస్మారక స్థితిలో ఉన్న ఆ తల్లికి బిడ్డనీ ఇవ్వమని మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను”

“అంటే?”

“నా బిడ్డని ఇతని భార్యకి ఇచ్చి ఆతడి చనిపోయిన బిడ్డని నేను తీసుకునేలా. అందుకు మీరు తోడ్పడాలని అర్థిస్తున్నాను”

“అదెలా? అది మా ఆస్పత్రి నియమాలకి విరుద్ధం” డాక్టర్ స్వరంలో తీవ్రత.

“నాకు తెలుసు డాక్టర్ అడగకూడనిది అడుగుతున్నానని. కానీ ఈ విషయంలో మానవతా ధృక్పథంతో ఆలోచించి నా బిడ్డకి తల్లి ప్రేమని ప్రసాదించమని, మనవల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వృద్ధ దంపతులు, రాజేంద్ర తల్లిదండ్రుల మనసులలో ఆనందం నింపమని వేడుకుంటున్నాను”

“...............”

“ఇది మీ ఆస్పత్రి. మీరు తలుచుకుంటే తప్పక ఈ సహాయం చేయగలరు ప్లీజ్” ప్రాధేయపడ్డాడు సూరజ్.

దీర్ఘంగా ఆలోచించి “నా మనసు ఇందుకు పూర్తిగా అంగీకరించటంలేదు కానీ దీనివల్ల నలుగురి ప్రాణాలు నిలబెట్టగలనన్న ఒకే ఒక్క ఆలోచన నన్నీ పనికి ప్రేరేపిస్తోంది. అయితే ఈ విషయం ఈ అస్పత్రి దాటి వెలుపలికి పోరాదు. ఆస్పత్రిలో నేను జాగ్రత్తలు తీసుకుంటాను. బయట ఎవరికి ఏం చెప్పుకుంటారో అది మీ బాధ్యత. పరోపకారార్థం చేస్తున్న ఈ మంచి పని వలన నాకూ నా ఆస్పత్రికి ఏమాత్రం చెడ్డ పేరు రాకూడదు. అలా అని మాటివ్వాలి మీరు ఇరువురూ”

“తప్పకుండా డాక్టర్. మమ్మల్ని విశ్వసించండి” సూరజ్ చేతులెత్తి నమస్కరించాడు.

“మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు” డాక్టర్ చేతులు పట్టుకుని ధన్యవాదాలు తెలిపాడు రాజేంద్ర.

“బాబుని జాగ్రత్తగా చూసుకోండి. మంచి పౌరుడిగా తీర్చిదిద్దండి. అంతే చాలు. అభినందనలు” రాజేంద్ర భుజం తట్టారు.

హెడ్ నర్సుని పిలిచి ఏం చేయాలో చెప్పి “మీరు ఈమెతో వెళ్ళండి. అంతా సవ్యంగా జరుగుతుంది” సూరజ్ తో అని “నర్స్... జాగ్రత్త” హెచ్చరించాడు డాక్టర్.

ఇటు సూరజ్ హెడ్ నర్సుని అనుసరించగా అటు రాజేంద్ర కళ్యాణి వద్దకు వెళ్ళాడు.

తనకి ఇవ్వబడిన ఆజ్ఞలను తు.చ. తప్పకుండా ఆచరిస్తూ హెడ్ నర్సు, సూరజ్ రెండ్రోజుల పసిబిడ్డని తీసుకెళ్ళి ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్న కళ్యాణి ప్రక్కన పడుకోబెట్టి ఆమె ప్రక్కలో ఉన్న మృత శిశువుని తీసుకెళ్ళి ఎన్.ఐ.సి.యు. రూములో ఉయ్యాలలో పడుకోబెట్టి వెళ్ళిపోయింది మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి.

పచ్చని పసిమి ఛాయలో ముద్దులు మూటగడుతున్న బిడ్డని చూసి మురిసిపోతూ “నీ బిడ్డ చాలా అందంగా ఉన్నాడు సూరజ్” అన్నాడు రాజేంద్ర.

“థాంక్యూ కానీ నా బిడ్డ కాదు ఇకనుంచీ నీ బిడ్డ. పొరపాటున కూడా మాట తూలకు.”

“సరే సరే సారీ. జాగ్రత్తగ ఉంటాను”

“ఇప్పుడిక అంకుల్ కి చెప్పచ్చు”

“అలాగే. నీకు మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు” రాజేంద్రని ఆప్యాయంగా కౌగలించుకుని, ఉయ్యాలలో బిడ్డని ముద్దు పెట్టుకుని కొద్ది సేపట్లో వస్తానని వెళ్ళాడు సూరజ్.

సూరజ్ కనుమరుగయ్యేదాకా చూసి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, కబురు చెప్పడం ఆలస్యం చేసినందుకు మన్నించమని, విషయం చెప్పి, వెంటనే రమ్మన్నాడు.

ఇంకా స్పృహలోకి రాని కళ్యాణినీ ఆమె ప్రక్కలో తమ బిడ్డ కాని బిడ్డనీ చూసి భావోద్వేగంతో ఆనందభాష్పాలు రాలాయి రాజేంద్ర కనుకొలుకుల్లోంచి.

గడిచిన కొద్ది గంటల సమయంలో జరిగిన సంఘటనలన్నీ తలుచుకుంటే ఇదంతా కల కాదు కదా అనిపించింది… మరుక్షణమే కాదు, ఇది నిజం అన్నట్లుగా దూరంగా చర్చి గంటలు లీలగా వినిపించయి.

బిడ్డని ఆప్యాయంగా తడిమి, కళ్యాణి దగ్గరగా వెళ్ళి నుదుటిపై ముద్దుపెట్టి ముంగురులు సవరించాడు ప్రేమగా.

తల్లీదండ్రీ రాగానే ఎదురెళ్ళి “అమ్మా నువ్వు కోరుకున్నట్లే మగబిడ్డ” శుభవార్త చెప్పాడు.

మనవడిని చూసుకుని వర్ణించనలవికాని ఆనందాతిరేకం ఒళ్ళంతా కమ్మేయగా కాళ్ళు తేలుతున్నట్లనిపించి పడిపోకుండా ప్రక్కనే ఉన్న కుర్చీని ఊత చేసుకున్నారు రామయ్య.

అప్పుడే అక్కడికి వచ్చిన సూరజ్ గబుక్కున వెనుకనుంచి ఆయనని పొదివి పట్టుకుని కూర్చుండబెట్టి “ఎక్కువగా ఉద్వేగ పడకండి మీ ఆరోగ్యానికి మంచిది కాదు” అన్నాడు.

“ఊ! జానకీ నువ్వే గెలిచావు చివరికి” ఆ ఆనందంలో, తనని వెనుకనుంచి పట్టుకున్నది ఎవరో కూడా గమనించకుండా కుర్చీలో కూర్చుంటూ, భార్యతో అన్నారు.

“మనలో మనకి గెలుపు ఓటములేమిటండీ! మీకు మనుమడూ మనకి వంశాంకురం వచ్చాడు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు అంతకంటే ఏమి కావాలి?”

“అంతా ఆ దైవకృప” పైకి చూసి చేతులెత్తి నమస్కరించిన రామయ్య దృష్టి తనకి ఊత నిచ్చిన వ్యక్తి పై పడింది.

“ఎవరు బాబూ నువ్వు?” కుర్చీలో సర్దుకుని అడిగారు.

“చూడండి నన్ను గుర్తు పట్టగలరేమో?” ఎదురుగా వచ్చి నిలబడ్దాడు.

“నాకు తెలుసు. నువ్వు సూరజ్ వి కదూ?” సంతోషం వ్యక్తం చేసింది జానకి.

“చూసారా ఆంటీ ఠక్కున గుర్తుపట్టారు. ఇప్పటికైనా గుర్తొచ్చానా”

“సూరజ్...ఆ...ఆ...అవును. మా ఇంటికి వస్తుండేవాడివి భోజనానికి. అప్పుడు నూనూగు మీసాల కుర్రవాడివి. ఇప్పుడు నీలో చాలా మార్పు వచ్చింది” నవ్వారు.

“అమ్మయ్య గుర్తుపట్టారన్నమాట” తానూ నవ్వి రామయ్య కాళ్ళకి నమస్కరించాడు.

“నువ్వేమిటి బాబూ ఇక్కడ?”

“చిన్న పనుండి వచ్చాను. అనుకోకుండా మిమ్మల్ని కలిసాను”

“అలాగా చాలా సంతోషం బాబూ. ఇప్పుడేం చేస్తున్నావు”

“మీ సహాయంవల్ల డిగ్రీ పాసై ఆ తర్వాత పట్నం వచ్చి పార్ట్ టైం జాబ్ చేస్తూ సి.ఎ. చదివి ఇప్పుడు ఒక కంపెనీలో పని చేస్తున్నాను. అంతా ఆనాడు మీరు చూపించిన ప్రేమాభిమానాలూ మీ ఆశీర్వాదబలమే అంకుల్”

“మాదేముంది నాయన అంతా నీ కృషి, కలిసొచ్చిన అదృష్టం”

“ఆ మధ్య ఒకసారి మీ ఊరొచ్చాను కలుద్దామని కానీ మీరు అక్కడ లేరు. మీ అబ్బాయి వద్దకు వెళ్ళారని తెలిసింది. ఆ తర్వాత చదువులోపడి మరి నాకూ కుదిరింది కాదు మన్నించండి”

“అయ్యో ఫరవాలేదు నాయనా. నువ్వు బాగున్నావు వృద్ధిలోకి వచ్చావు అంతే చాలు” అంది జానకి.

“మీరూ అమ్మా వెళ్ళి చూడండి బాబుని. నేనీలోగా డాక్టర్ వ్రాసిచ్చిన మందులు తెస్తాను” అన్నాడు రాజేంద్ర.

“నేను తెస్తాను. నువ్వు వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు” రాజేంద్ర వద్దనుంచి మందుల చీటీ తీసుకున్నాడు సూరజ్.

కొడుకు సహాయంతో నెమ్మదిగా లేచి లోనికి వెళ్ళారు.

ఇంకా స్పృహలోకి రాని కళ్యాణి చేతిని ఆప్యాయంగా నిమిరి, ప్రక్కన ఉయ్యాలలో, చందమామలాంటి ముఖవర్చస్సుతో ముద్దొస్తూ, నిద్రిస్తున్న మనవడిని చూసుకుని మురిసిపోయారు ఇద్దరూ.

నర్సు ఇవ్వగా పసికందుని చేతులలోకి తీసుకుని నుదుటిపై సున్నితంగా పెదవులు ఆనించి ముద్దు పెట్టుకుని భర్త చేతికిచ్చింది జానకి.

మనవడిని ఆప్యాయంగా చేతులలోకి తీసుకుని హృదయానికి సున్నితంగా హత్తుకుని తన్మయత్వం చెందారు రామయ్య. ఆయన కన్నుల్లోన్చి ఆనందభాష్పాలు అక్షతలై పసికందు శిరస్సుపై రాలాయి.

అప్పటిదాకా కళ్ళుమూసుకుని నిద్రపోతున్న బిడ్డ ఆ మాత్రానికే ఏదో ప్రళయం వచ్చినట్లు ఆరున్నొక్కరాగం అందుకున్నాడు.

ఊహించని ఆ ఏడుపుకి అదిరిపడి బిడ్డని నర్సు చేతికి అందించబోతుంటే రాజేంద్ర తీసుకుని “నువ్వూ ఎత్తుకో బాబుని” అప్పుడే వచ్చిన సూరజ్ చేతులకి అందించాడు.

సూరజ్ చేతులలోకి వెళ్ళగానే బిడ్డ ఏడుపు మానేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

“చూసావుటయ్యా వాడికి నాకంటే నువ్వే బాగా నచ్చినట్లున్నావు” రామయ్య మాటలకి అందరూ హాయిగ నవ్వేసారు.

కన్నబిడ్డని కడసారి హృదయానికి హత్తుకుని తన్మయత్వంచెందిన సూరజ్, తన కన్నుల చెమరింపు ఎవరికీ కనపడనీయకూడదని ఎంత జాగ్రత్త పడినా రాజేంద్ర కంటబడింది.

సూరజ్ చేతుల్లోంచి బిడ్డని అందుకుంటూ స్నేహితుడి చేతులు అభయమిస్తున్నట్లు సున్నితంగా నొక్కాడు.

రాజేంద్ర చేతుల్లోంచి బిడ్డని అందుకుని ఉయ్యాలలో పడుకోబెట్టింది నర్సు.

మళ్ళీ ఏడుపు మొదలెట్టాడు బిడ్ద.

తల్లి ఒడి కోసం తపిస్తున్న బిడ్డ ఏడుపు, బిడ్డ కోసం పరితపిస్తున్న తల్లి హృదయాంతరాళాలను తాకిందేమో, చిత్రంగా కళ్యాణిలో కదలిక కనిపించింది.

ఆశ్చర్యపోయి డాక్టర్ ని పిలవడానికి పరిగెత్తింది నర్స్.

“ఈమె స్పృహలోకి రావడానికి మరో కొన్ని గంటలైనా పడుతుందని అనుకున్నానే అసలేం జరిగింది?”

నర్స్ చెప్పినది విని “ఆశ్చర్యంగా ఉందే” అని కళ్యాణి నాడి పరీక్షించి “ఇంక మీ కోడలికేం ఫరవాలేదు. అయితే ఆపరేషన్ అయింది కనుక మరో వారంరోజులు ఇక్కడే ఉన్న తదుపరి ఇంటికి తీసుకెళ్ళొచ్చు”

రాజేంద్రని ప్రక్కకి పిలిచి మళ్ళీ కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు సూరజ్.

మర్నాటికి పూర్తి స్పృహలోకి వచ్చిన కోడలి తలపై చేయి వేసి “ఎలా ఉన్నావు తల్లీ! మాకు పండంటి మనవడిని బహుమతిగా ఇచ్చినందుకు ధన్యవాదాలు” ఆశీర్వదించారు రామయ్య.

జానకి కూడా కళ్యాణి చేతిలో చేయి వేసి సున్నితంగా నొక్కింది.

అత్తమామల అభిమానానికి కళ్ళు చెమర్చాయి కళ్యాణికి...

గతంలో అకారణంగా తాను వారిపై విసుగు ప్రదర్శించడం, ఏదో వంకన సూటీ పోటీ మాటలనడం గుర్తొచ్చి సిగ్గుతో చితికిపోయింది.

కళ్యాణిలో ఆ హఠాన్మార్పుకి కారణం… తల్లీబిడ్డలలో ఒకరినే బ్రతించగలమనీ, తనకింక బిడ్డలు పుట్టడం కష్టమనీ చెప్పినప్పటికీ తననే బ్రతికించమన్న భర్త కోరిక, అది అత్తమామలు సమర్థించిన విషయం, తనని ఆపరేషన్ టేబుల్ పైకి మారుస్తున్నప్పుడు డాక్టర్ నర్స్ ల మధ్య జరిగిన సంభాషణ, చెవిన పడడమే!

సశేషం...

========================================================================

ఇంకా వుంది..



========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in


181 views1 comment

1 Comment


@paw-sible9072 • 1 hour ago

బాగుందండి ఈ భాగం మరి నూ

Like
bottom of page