top of page
Writer's pictureDinavahi Sathyavathi

కొత్త కెరటం! ఎపిసోడ్ 9


'Kotha Keratam Episode 9' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి.


డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి పరిస్థితి సీరియస్ అని చెబుతారు డాక్టర్లు. హాస్పిటల్ లో సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి. తాను రామయ్య గారి సహాయంతో చదువుకున్నానని చెబుతాడు అతను.


రాజేంద్ర భార్య క్షేమంగానే ఉందనీ, పుట్టిన బిడ్డ మరణించిందనీ చెబుతాడు డాక్టర్. తనకు కొడుకు పుట్టి రెండు రోజులే అయిందనీ, డెలివరీ కాగానే తన భార్య చనిపోయిందనీ చెబుతాడు సూరజ్. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెబుతాడు. తన కొడుకును పెంచుకొమ్మని రాజేంద్రతో చెబుతాడు.


సమయం చూసుకొని భార్యకు నిజం చెబుతాడు రాజేంద్ర. ముందు బాధపడ్డా సూరజ్ కొడుకుని స్వంత బిడ్డలా చూసుకుంటానంటుంది అతడి భార్య కళ్యాణి.

రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోవడం మనవడికి నేర్పుతాడు. అచ్యుతాపురానికి ఆ పేరెలా వచ్చిందో మనవడికి వివరిస్తాడు రామయ్య.

నాటకాలంటే ఏమిటో చెబుతాడు.


ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 9 చదవండి.


“నాటకం వేసేది అబ్బాయిలైతే నటులు అనీ అమ్మాయిలైతే నటీమణులు అనీ అంటారు”

“మరి నేను వేస్తే?”

“బాలనటుడు”

“ఓ భలే భలే భార్గవ బాలనటుడు” చప్పట్లు కొట్టి నాటకం చూడటంలో నిమగ్నమైపోయాడు.

నాటకం పూర్తై వెళ్ళేటప్పుడు ఉన్నట్లుండి “తాతయ్యా నేనూ పెద్దయ్యాక నాటకం వేస్తాను” అన్నాడు.

“అలాగేలే పద” పిల్లలకి ఏదైనా క్రొత్తగా అనిపిస్తే చాలు తామూ అదే చేస్తామంటూ ఉత్సాహపడతారనుకుని నవ్వుకున్నారు.

అందరూ కలిసి రంగులరాట్నం తిరిగారు. మధ్యాహ్న సమయానికి ఇంటినుంచి తెచ్చుకున్న భోజనం చేసి మళ్ళీ జాతరలో విశేషాలన్నీ చూస్తూ తిరిగినంతసేపు తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు.

మొదటిసారి చూసాడేమో భార్గవకి జాతర ఎంతో నచ్చింది. ఎప్పుడెప్పుడు హైదరాబాదు వెళతానా ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ కి విశేషాలన్నీ ఏకరువు పెడతానా అనుకుంటూ గడిపాడు తక్కిన రోజులన్నీ!

&&&

తండ్రి షష్టి పూర్తి ఘనంగా జరిపించి, జాతర చూసుకుని, పది రోజుల తర్వాత, రాజేంద్ర కుటుంబం హైదరాబాదు తిరిగి వచ్చారు.

ఆ తర్వాత కొన్ని నెలలు పొలం పనులలో బిజీగా గడిచాయి రామయ్యకి. మధ్యలో మనవడిని చూడాలని మనసులాగినా పని ఒత్తిడివలన కదలలేకపోయారు.

అప్పటికే పది సార్లు “తాతయ్యా గమ్మున వచ్చేయండి నాకేం తోచడం లేదు” అంటూ మనవడి ఫోన్లు.

“నీ ఆత్రం బంగారం కానూ! మొన్ననేగా కలుసుకున్నాము. ఇంతలోనే బెంగా! ఇక్కడి పనులు పూర్తి కావద్దూ” ఏదో మనవడిని బులిపించడానికి అన్నారే కానీ ఆయన ధ్యాసంతా మనవడి మీదనే.

ఇలా పనులయ్యాయో లేదో, అలా హైదరాబాదు ప్రయాణమయ్యారు.

అక్కడికి వెళ్ళిన రెండురోజుల తర్వాత, కొడుకు, మనవడి చేతికి ఫోన్ కొనివ్వడం గమనించి “అబ్బాయీ చిన్నవాడికి అప్పుడే ఫోన్ ఎందుకురా?” అన్నారు.

“అది ఫోన్ కాదు నాన్నా ట్యాబ్”

“అయితే అందులోన్చి ఫోన్ చేయలేమా?”

“మామూలు కాల్స్ చేయలేము. దానికి సిమ్ కార్డ్ అనేది ఉండాలి. ఇది స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి కావలసిన సమాచారం సేకరించడానికి సహాయకారి అవుతుంది”

“అందుకు పుస్తకాలున్నాయిగా?”

“అవెలాగూ ఉన్నాయి. ఇంకా సమాచారం కావాలంటే ట్యాబ్ ఉపయోగిస్తుంది”

కొడుకు అంతగా చెప్పినా ఎందుకో సంతృప్తికరంగా అనిపించనప్పటికీ ‘ఇప్పటి చదువులు ఇంతేనేమో. మారుతున్న కాలంతోపాటు నేనూ మారాలనుకుంటా. ఏం చేస్తాం’ మనసుని సమాధానపరుచుకున్నారు.

ఓరోజు ఉదయం కాఫీ ఫలహరాలు ముగించి హాలులో తీరుబడిగా కూర్చుని పేపర్ చదువుతుంటే “తాతాయ్యా తాతయ్యా కు...కు...కుక్క” భయంతో అరుస్తూ పరిగెత్తుకొస్తున్న భార్గవ కనిపించాడు.

ఏమైందిరా అనడగబోయి వాడ్ని తరుముకొస్తున్న కుక్క పిల్లని చూసి ఆగిపోయారు.

“ముందు ఆ కుక్క పిల్లని తరిమేయండి” తాత వెనకాల నక్కి అరిచాడు.

“ఓరి నీ కుక్కల భయం దొంగలెత్తుకెళ్ళా!” కుక్కని తరిమేసి మనవడిని దగ్గరికి తీసుకుని “ఇంత పెద్దవాడివైనా ఇంకా ఈ భయమేమిటిరా! అన్నిట్లో ధైర్యంగా ఉంటావు కుక్కల దగ్గరకొస్తే పిరికివాడివి అయిపోతావేరా?” నవ్వారు.

“మర్చిపోయారా తాతయ్యా, చిన్నప్పుడు నన్ను కుక్క కరిచిన విషయం, అప్పుడే నాన్నమ్మ చచ్చిపోయిన విషయం. అప్పటినుంచీ కుక్కలంటే నాకు భయం పట్టుకుంది. మీకేమో నవ్వులాటగా ఉంది” ఒక ప్రక్క నాన్నమ్మ గుర్తొచ్చి దిగులూ మరో ప్రక్క తాతయ్య నవ్వు కలగలిసి చిర్రెత్తి అరిచాడు.

“అయ్యో అలాంటిదేం లేదురా. ఎప్పటికైనా నువ్వు ఆ భయంనుంచి బయటపడాలీ అంటున్నాను అంతే” మనవడిని సముదాయించారు.

ఆ మర్నాడు పేపర్ చదువుతున్న తాతగారి ప్రక్కన కూర్చుని “మిమ్మల్ని ఒకటి అడగనా?”

“అడగారా మనవడా”

“మరీ అప్పుడొక సారి ఒక దయ్యం సినిమా చూసి నేను భయపడుతుంటే హనుమాన్ చాలిసా చదువు భయం పోతుంది అన్నారు కదా”

“అవునూ”

“అయితే కుక్కల భయం పోవడానికి కూడా అలాంటి మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి ప్లీజ్”

“ఓరి వెర్రీ! అలా ప్రతీదానికీ మంత్రాలు ఉండవు. భయం ధైర్యం రెండూ మనలోనే ఉంటాయి. ఏదైనా నమ్మకంతో చెయ్యాలి. అదే మనల్ని కాపాడుతుంది”

‘తాతయ్య చెప్పింది నిజం. ఇక లాభం లేదు ఎలాగైనా ఈ కుక్క భయంనుంచి బయటపడాలి’ అనుకుని తన స్నేహితులు ఎవరెవరి ఇంట్లో కుక్కలు ఉన్నాయి, వాటిని ఎలా మచ్చిక చేసుకోవాలి వగైరా సమాచారాన్ని సేకరించాడు, ఇంటర్ నెట్ లో కూడా తత్సంబంధిత సమాచారం సేకరించి, రెండూ క్రోడీకరించి, కొంత సొంత తెలివి జోడించి, కుక్క భయంనుంచి విముక్తి పొందటానికి కొన్ని కిటుకులు పట్టుకున్నాడు.

&&&

మనవడితో ముచ్చట్లలో మూడు నెలలు సరదాగా గడిచిపోయాయి. ఎప్పుడూ పిల్లల అరుపులూ కేరింతలతో సందడిగా ఉండే ఆనందనిలయం కాలనీ కొద్ది రోజులుగా బావురుమంటోంది.

‘ఊరంతా అకారణ విషజ్వరాలు ప్రబలుతున్న కారణాన జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందనీ అందుకే ఎవ్వరూ పిల్లల్ని గడప దాటనీయడం లేదనీ’ కొడుకు చెప్పడం గుర్తొచ్చి దీర్ఘంగా నిట్టూర్చారు రామయ్య.


!+!+!

కాలనీ పార్కు గేటు బయట దిగులుగా కూర్చునుంది టామీ, ఎప్పుడూ అక్కడే తచ్చట్లాడుతుండే పెద్ద కుక్క.

టామీ కళ్ళల్లోంచి కన్నీరు టపటపా రాలుతోంది...

బహుశః ఎప్పుడూ సరదాగా ఆడుకుంటూ తనను సతాయించే పిల్లలు గత కొన్ని రోజులుగా అసలు ఇళ్ళలోంచి బయటికే రావటం లేదని అనుకుంటోందేమో? వాళ్ళు ఆకతాయితనంతో రాళ్ళు విసిరినప్పుడు కోపం వచ్చినా, ఇప్పుడు ఆ అల్లరీ నవ్వులూ త్రుళ్ళింతలూ లేక పిచ్చెక్కినట్లుందేమో దానికి? పిల్లలు రాళ్ళు విసురుతున్నారనే కోపంతో తిట్టుకోకుండా ఉండాల్సిందేమోననీ, తథాస్తు దేవతలు ఉంటారంటే నమ్మలేదు కానీ నిజంగా ఉన్నారనిపిస్తోందనీ బాధపడుతోందేమో...

అంతలో పిల్లలు ఆడుకోవడానికి వచ్చి ఉదాసీనంగా ఉన్న టామీని చూసారు.

“సన్నీ అదిగోరా టామీ. పదరా దాన్ని తరుముదాము” గోపీ రాయి తీసాడు.

“అవునురా ఎప్పుడూ మనల్ని చూసి అరుస్తూనే ఉంటుంది. ఈసారి మనం దాన్ని ఏడిపిద్దాము” బాబీ కూడా రాయి తీసాడు.

“ఒరేయ్ భార్గవా నువ్వూ రారా” పిల్లలందరూ రాళ్ళు తీసుకుని టామీపై విసరటం మొదలెట్టారు.

“పిల్లలూ నన్నెందుకు కొడుతున్నారు నేను మిమ్మల్నేం చేయలేదుగా. రాళ్ళు తగిలి నొప్పిగా ఉంది” టామీ జాలిగా చూసింది.

“నీ అరుపులకి మాకు మాత్రం భయం వెయ్యదా?”

“మీరంతా అలా ఆడుకోవడం చూస్తుంటే నాకు భలే సరదాగా అనిపిస్తుంది అందుకే అరుస్తాను”

“అన్నీ అబద్ధాలే సరదా అనిపిస్తే కూర్చుని చూడాలిగానీ భయపెట్టేలా అరుస్తారేమిటీ?” మళ్ళీ రాయి విసిరాడు భార్గవ.

“నన్నిలా ఏడిపిస్తున్నారు కదూ చూడండి మీరెవ్వరూ బయటికొచ్చి ఆడుకోవడానికి లేకుండా అయిపోతుంది కొన్ని రోజుల్లో” కోపంతో భయంకరంగా అరిచింది టామీ. ఆ అరుపుకి ఒక్కసారి ఝడుసుకున్నాడు భార్గవ.

!+!+!

“తాతయ్యా తాతయ్యా” భయంతో అరుస్తూ ఉలిక్కిపడి లేచాడు భార్గవ.

ప్రక్కనే నిద్రపోతున్న రామయ్య గబుక్కున లేచారు “ఏమైందిరా బాబూ?” అంటూ.

“మరేమో నాకూ నాకూ పిచ్చి కలొచ్చింది! మరీ జంతువులకి కూడా మనలాగా నొప్పి ఉంటుందా? అవి కూడా ఏడుస్తాయా?”

“తప్పకుండా ఉంటుందిరా. జంతువులకి మాట్లాడడం రాకపోయినా మనలాగే సంతోషం బాధ అన్నీ ఉంటాయి దెబ్బ తగిలితే నొప్పి వేస్తుంది. ఎందుకలా అడిగావు?”

“మరీ నేనూ నా ఫ్రెండ్సూ ఎప్పుడూ టామీని కొట్టేవాళ్ళం రాళ్ళతో”

“టామీనా?”

“అదే మన కాలనీలో తిరుగుతుంటుందే ఆ పెద్ద కుక్క. దాన్ని మేమందరం టామీ అని పిలుస్తాము”

“ఓహో అలాగా!”

తన కల చెప్పి “అయితే మేము దాన్ని ఊరికెనే కొట్టినందుకేనా ఇప్పుడు బయటకి వెళ్ళలేకపోతున్నాము, ఆడుకోలేకపోతున్నాము?” భార్గవ ప్రశ్నలో అమాయకత్వం.

విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో పిల్లలు ఇళ్ళల్లోంచి బయటకి వెళ్ళక వాళ్ళ స్వేచ్ఛా జీవితం కట్టడి అయింది. కానీ టామీ కోపం వచ్చి తమని తిట్టుకున్నందువల్లే ఇలా జరిగిందని మనవడు భావిస్తున్నాడని రామయ్యగారికి అర్థమైంది.

“అదేం కాదుగానీ మరి ఊరికెనే టామీని కొట్టి బాధపెట్టడం తప్పేకదా! ఎందుకలా చేసారు?”

“అది మమ్మల్ని చూసి అరుస్తుంటే సరదాగా కొట్టేవాళ్ళం!” భార్గవలో తప్పు చేసానన్న భావం.

“సరదగా కూడా ఎవ్వరినీ, జంతువులనైనా సరే, బాధ పెట్టకూడదు”

“సారీ తాతయ్యా. ఇంకెప్పుడూ అలా చేయను” ఏడుపు గొంతుతో అన్నాడు.

“ఊరుకో ఊరుకో ఏడవకు. నీ తప్పు తెలుసుకున్నావు అంతే చాలు”

“మరైతే రేపటినుంచీ నేను బయటకి వెళ్ళి ఆడుకోవచ్చా?”

“వెళ్ళొచ్చు కానీ అమ్మ అనుమతి తీసుకునీ అలాగే ముఖ్యమైన కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ”

“అంటే ఎలాగా?”

“ఎలాగంటే ఎవరేమిచ్చినా తినకూడదు. చేతులు మట్టిలో పెట్టి ఆడకూడదు ఇలా ఇంకొన్ని”

“ఎందుకూ? ఇదివరకెప్పుడూ అలా చేయలేదుగా మరి?” సందేహం వెలిబుచ్చాడు.

“కానీ ఇకపై అలానే చేయాలి”

“ఎప్పటిదాకా?”

“కొంతకాలంవరకూ జాగ్రత్తగా ఉండాలి తప్పదు. చాలా రాత్రయ్యింది ఇక పడుకో. రేపు మాట్లాడుకుందాము.”

“మీద చెయ్యి వెయ్యండి నాకింకా భయంగానే ఉంది”

“భయపడకు నీ ప్రక్కనే ఉన్నానుగా” మనవడిని దగ్గరకు తీసుకుని పైన చెయ్యి వేసారు.

మర్నాడు తల్లి అనుమతితో, ఇంటర్ కాం లో స్నేహితులకి, సాయంత్రం కలుసుకుందామని, తల్లి సూచించిన జాగ్రత్తలు కూడా చెప్పాడు.

సాయంత్రం ఐదు గంటలకి, పిల్లలంతా పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

ఇంతలో గేటు బయటనుంచి టామీ అరుపు వినిపించింది.

ఎప్పటిలాగే రాళ్ళు తీసుకుని “పదండిరా చాలా రోజులయ్యింది సరదాగా టామీని కొడదాము” అని పరిగెత్తబోయిన స్నేహితులని వారించాడు భార్గవ.

“ఏమైంది నీకు? ఎప్పుడూ టామీని ఏడ్పించడానికి మాతో కలిసేవాడివి కదా?”

అప్పుడు తనకి వచ్చిన కలా తాతయ్య మాటలూ చెప్పాడు భార్గవ.

“నిజమేరా పాపం” అన్నారు ముక్త కంఠంతో.

ఇంతలో “ఒరేయ్ అటు చూడండిరా” గేటు సందుల్లోంచి తమవైపే జాలిగా చూస్తున్న టామీని చూపిస్తూ అరిచినట్లే పిలిచాడు సన్నీ.

మునుపు చక్కగా బలంగా ఆరోగ్యంగా ఉండే టామీ ఇప్పుడు బక్కచిక్కిపోయి నీరసంగా కనిపించింది.

“అయ్యో పాపం అలా సన్నగా అయిపోయిందేమిట్రా?” బాబీ జాలిపడ్డాడు.

“అవునురా ఇదివరకైతే ఇక్కడికి వచ్చేవాళ్ళందరూ దానికి ఏదో ఒకటి పెట్టేవాళ్ళు. ఇప్పుడెవరూ బయటికి రావటమే లేదుగా పాపం తిండి లేక అలా అయిపోయుంటుందిరా” గోపీ గొంతులో బాధ.

“అయితే అమ్మావాళ్ళనడిగి ఇకనుంచీ టామీకి ఏదో ఒకటి తినడానికి పెడదామురా?” భార్గవ సూచించాడు.

సరే అంటే సరే అనుకుని ఎవరెవరు ఎప్పుడెప్పుడు టామీకి ఏం పెట్టాలో నిర్ణయించుకున్నాక, ఆవేళ్టకి ఆటలు ముగించి, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లలు.

విషజ్వరాల నేపథ్యంలో, పార్కులో రెండువైపులా బల్లలు అమర్చి, వాటిపై ఒక ప్రక్క మంచి నీళ్ళ కాన్ మరో ప్రక్క చేతులు కడుక్కోవడానికి సబ్బూ, శానిటైజరూ అమర్చి, మట్టిని ముట్టుకోకుండా ఆడుకోవాలని పిల్లలకి సూచించారు కాలనీ పెద్దలు.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in



83 views0 comments

Comments


bottom of page