top of page

కొత్త గౌను

Updated: Jan 13, 2024

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'Kotha Gownu' - New Telugu Story Written By Pudipeddi Venkata Sudha Ramana

'కొత్త గౌను' తెలుగు కథ

రచన : పూడిపెద్ది వెంకట సుధారమణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

“ఏమండీ జానూ గారు..” అన్న పిలుపు విని, ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి, నవ్వుకుంటున్న జానూ, ఏమిటన్నట్టు చూసింది తన స్నేహితురాలైన సుజాత వైపు.

"ఏమిటే.. , నీలో నువ్వే నవ్వుకోకపోతే మాకు చెప్పొచ్చు కదా మేమూ నవ్వుతాం" అంది సుజాత.


"అదిగో ఆ పాపని చూడు, గౌను వేసుకుందుకి, మారాం చేస్తుంటే నాకు నా చిన్ననాటి సంగతి ఒకటి గుర్తొచ్చి, నవ్వొచ్చిందే" అంది జానూ అనబడే జాహ్నవి.


జాహ్నవి, సుజాత చిన్ననాటి స్నేహితులు, ఎక్కడికైనా కలిసే వెళతారు, ఏపనైనా కలిసే చేస్తారు. అందువలన ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. వారిది అరమరికలు లేని

స్నేహం అనడంలో సందేహం లేదు.


"అబ్బో! ఏమిటో, నాకు తెలియని ఆ చిన్ననాటి విషయం" అంది సుజాత ఆశ్చర్యంగా, నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఉన్నాయా అన్నట్టుగా ఒక రవ్వంత విచారంగా.


"ఈ విషయం నీకు తెలీదులే, మన పరిచయానికి ముందు జరిగింది" అంది జానూ.

"ఓహో! సరే గాని, చెప్పు చెప్పు అదేమిటో, విని నేనూ నవ్వుతాను" అంది సుజాత.


"అయితే విను చెప్తాను, కానీ మధ్యలో నువ్వు అసలు మాట్లాడాను అంటేనే " అంది జానూ.


"ఓకే, అలాగే" అంది సుజాత.


జానూ, అలా గతం తలుచుకుంటూ..

"నేను అప్ప్పుడు 3 వ తరగతి చదువుతున్నా. అక్క 5వ తరగతి, మా చెల్లి పద్మ యూకేజీ. అది ఫిబ్రవరి నెల. చలికాలం పోయి ఎండాకాలం ప్రారంభమైంది. నాన్న హెల్త్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్న రోజులవి. ఒకరోజు మా ముగ్గురు అక్కచెల్లెళ్ళం భోజనం అయ్యేక, బయట వరండాలో ఆడుకుంటున్నాం.


అప్పుడు "ఏమోయ్.. ఇలారా " అంటూ వచ్చేరు నాన్న.

ఏమిటండీ అంటూ వచ్చింది అమ్మ.


"ఇదిగో శుభలేఖ మా చిన్నక్క కూతురు జానకి పెళ్లిట, శ్రీకాకుళంలో" అన్నారు నాన్న.


"అవునా, మా పిన్నమ్మ కూతురు జానకి పెళ్లా! ఎవరి పిల్లడు, ఏ ఊరివారు", అంటూ శుభలేఖ తీసుకొని చదువుతూ, " ఓహో! శ్రీరంగం వారా, వీళ్ళు మీకు తెలుసా".


"ఆ, తెలుసు.. మా చిన్నక్క చిన్నాడపడుచు, వాళ్ళది బరంపురం, ఒక్కడే కొడుకు. నేను వాళ్ళని మా చిన్నక్క పెళ్ళిలో చూడ్డమే కానీ వాళ్ళ వివరాలన్నీ తెలుసు, చిన్నక్క చెప్తూ ఉంటుంది ఎప్పుడూ ".


"ఓహో వాళ్ళా, వాళ్ళని నేనూ ఎరుగుదును. మా అమ్మ వాళ్ళు చెప్పుకోగా విన్నాను, అయితే మరి ఎప్పుడూ బయలుదేరుదాం".


"పెళ్ళికి ఒక్కరోజు ముందు బయలుదేరుదాం, పెళ్లి అయ్యిన వెంటనే వచ్చేద్దాం. నాకు అంత కన్నా ఎక్కువ సెలవు దొరకదు" అన్నారు..


సరే అంది అమ్మ. ఇదంతా నేనూ, అక్క వింటున్నాం. నాకైతే ఏం అర్ధం కాలేదు.


అప్ప్పుడే అక్క "ఓహో! అయితే అమ్మా.. మనం పెళ్ళికి వెళుతున్నాం అన్నమాట" అంది.


"అవును, ఇదో పెద్ద ఆరిందా మాకు, దీనికి అన్నీ అర్ధం అయిపోతాయి ఇట్టే" అంటూ నవ్వుకుంటూ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది.


"అక్కా.. ఏమిటి, నాకు కూడా చెప్పు, ప్లీజ్" అన్నాను నేను.


అప్పుడు అక్క ఆనందంగా మొహం పెట్టి "మనమందరం జానకి పిన్ని పెళ్ళికి శ్రీకాకుళం వెళుతున్నాం" అంది. "ఓహో! భలే భలే "


అది విన్న అమ్మ "ఇదో పెద్ద పేరక్క ఇక్కడ, ఏదో అర్థం అయినట్టు, పేద్ద "అంది.


"అవునక్కా పెళ్లంటే ఏమిటి, మనం ఏం చేస్తాం అక్కడ".


"పెళ్లి అంటే అదో పేద్ద పండగ, మనం పండక్కి అమ్మమ్మ ఇంటికి వెళ్తామా, అక్కడ అందరం కలసి ఆడుకుంటామా, ఇంకా అమ్మమ్మ బోలెడన్ని అప్పచ్చులు చేస్తుంది,

తాతగారు కొత్తబట్టలు తెస్తారా, అలాగే పెళ్ళికి కూడా బోలెడంత మంది వస్తారన్నమాట.


మామ్మ తాతగారు, అమ్మమ్మ తాతగారు. పిన్నమ్నలు, మామయ్యలు. పెదనాన్నలు. మన అత్తలు, ఇంకా అక్కలు, అన్నలు అందరు వస్తారు. ఇంకా మనకి అమ్మ పట్టు లంగా జాకెట్టు వేస్తుంది, జడ వేసి పువ్వులు పెట్టి, ఇంకా గాజులు, గొలుసులు వేసి బాగా ముస్తాబు చేస్తుంది".


"అవునా, పండక్కి కూడా అలాగే ముస్తాబు చేస్తుంది కదా అమ్మ, అయితే ఇది నిజంగా పెద్ద పండగే " అన్నాను.


"అవునక్కా, మరి నీకు, నాకు జడ వేసి, పువ్వులు పెడుతుంది అమ్మ. పద్మకి ఎలా పువ్వులు పెడుతుంది జడ లేదు, కదా",


“ ఏమో మరి నాకూ తెలీదు, సరే పద ఆడుకుందాం" అంది అక్క.


ఇంట్లో ప్రయాణ సన్నాహాలు మొదలయ్యాయి. అమ్మ, పిన్ని కలసి జంతికలు, చేగోడీలు, స్వీట్స్ చేసారు. అమ్మ సాయంత్రం కూర్చోని బట్టలు అన్నీ ముందు పెట్టుకొని సర్దడం మొదలు పెట్టింది. ఒక్కొక్కటి తీసి ఇవి లగ్గానికి, ఇవి తోట సంబరానికి, ఇవి బండిలోకి అంటూ సర్దుతోంది.


అప్పుడే మా చెల్లి పద్మ వచ్చి దానికి ఇష్టమైన గౌను తీసి పట్టుకొని, "ఇది నాది" అంది.


"అవును నీదే. ఇలా ఇయ్యి పెట్లో పెడతాను, పెళ్లి నుండి వచ్చేటప్పుడు బండిలోకి ఇది" అంది అమ్మ.


"కాదు, నాకు ఇప్పుడే కావాలి" అని ఏడుస్తోంది పద్మ.

"చూడు పద్మా, మనం పెళ్ళికి వెళుతున్నాం కదా, అప్పుడు బండిలోకి ఈ గౌను" అంటూ అమ్మ ఆ గౌను తీసుకొని పెట్టెలో పెట్టేసింది.


"అయితే నాకు కొత్త గౌను బండిలో వేస్తావా" అంది పద్మ. ఊ అంది అమ్మ. నేనూ, అక్క అక్కడే కూర్చొని అన్నీ గమనిస్తున్నాం, అమ్మ మాటలు వింటూ. అమ్మ సర్దడం పూర్తయ్యింది.


అప్పుడు అక్క " అమ్మా.. మనం బండిలో వెళతామా పెళ్ళికి" అంది.


"కాదు తల్లీ, బస్సులో వెళతాం" అంది అమ్మ.


"మరి బండిలోకి బట్టలు అన్నావూ ".


"బండిలోకి అంటే మనం బయలుదేరినప్పుడు ఆ బట్టలు వేస్తాను మీకు, అందుకే అవి సంచిలో మీదనే పెట్టాను చూడు, పెళ్లి అయ్యేక వచ్చేటప్పుడు బండిలోకి బట్టలు పెట్టెలో పెట్టేసాను".


"అయితే పద్మకి కొత్త గౌను వచ్చేటప్పుడు బండిలోకా" అంది అక్క.


"అవును ఆ గౌను మెత్తగా ఉంటుంది, మంచి ఎండలో బయలుదేరుతాం కదా, అప్పుడు ఆ గౌను అయితేనే దానికి హాయిగా ఉంటుంది" అంది అమ్మ.


"ప్రయాణం రోజు రానే వచ్చింది. అందరం పెళ్ళికి బయలుదేరాం. బస్ స్టాండ్ కి వెళ్లి శ్రీకాకుళం బస్ ఎక్కి కూర్చున్నాం. కాసేపటికి బస్ బయలుదేరింది.


మేమ్ముగ్గురం అన్నీ ఆనందంగా, ఆశ్చర్యంగా చూస్తున్నాం. కొన్ని వింతగా అనిపించి కేరింతలు కొడుతున్నాం. పద్మ మెల్లిగా నిద్రలోకి జారుకుంది. బస్సులో తినడానికి అమ్మ చాలా తెచ్చింది. ఒక్కొక్కటి మాకు ఇస్తోంది, మేము తింటూ అన్నీ చూస్తున్నాము. చాలా దూరం ప్రయాణం

సాగిపోయింది. మధ్య మధ్యలో ప్రశ్నలు వేస్తుంటే అమ్మ అన్నీ వివరిస్తోంది.


ఇంతలో పద్మ నిద్ర లేచింది. అమ్మ పద్మకి కూడా తినడానికి పెట్టి మంచినీళ్లు పట్టింది.


నాన్న "ఏమేవ్, సామానులన్నీ సర్దు, ఇంకాసేపటిలో దిగిపోవడమే" అన్నారు.


అలాగే అని అమ్మ సామాన్లు సర్దుతోంది దిగడానికి వీలుగా.


అప్పుడు పద్మ “అమ్మా.. నాకు కొత్త గౌను వెయ్యి" అంది.


అమ్మ వినిపించుకోలేదు, సామాన్లు సర్దుతోంది. అంతే, పద్మ ఏడుపు లంకించుకుంది.


"పద్మకన్న ఎందుకేడుస్తోందో చూడు" అన్నారు నాన్న.


అది విని పద్మ "నాకు కొత్త గౌను వెయ్యలేదు అమ్మ, ఊ ఊ" అని ఏడుస్తోంది.


"ఇప్పుడెందుకు కొత్త గౌను? తర్వాత వేస్తాను, ముందా ఏడుపు ఆపు" అంది అమ్మ. అయినా పద్మ ఏడుస్తూనే ఉంది. బండిలో కొత్త గౌను వేస్తాను అని పద్మకి చెప్పిన విషయం అమ్మ మరచిపోయింది. అమ్మ మమ్మల్ని, సామానుల్ని దించడంలో మునిగిపోయింది.

బస్సు దగ్గరికి పెద్ద మామయ్య వచ్చేడు. మామయ్య, పద్మని ఎత్తుకున్నాడు. అమ్మ వేస్తున్న ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానాలు చెప్తున్నాడు మామయ్య, మధ్య మధ్యలో

పద్మని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తూ. పద్మ ఏడుస్తూనే ఉంది. కల్యాణ మంటపానికి చేరుకున్నాం అందరం.


అక్కడ అందరూఎదురు వచ్చి కుశల ప్రశ్నలు వేశారు. పద్మ ఏడుపు ఆపి వాళ్ళని చూస్తూ ఉంటే హమ్మయ్య అనుకున్నాం అందరం.


ఇంతలో పాపత్త, "ఇదిగోండి పిల్లలు మీ రూమ్ అక్కడ ఉంది. వెళ్లి బట్టలు మార్చుకొని కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని రండి, టిఫిన్లు తిందురుగాని" అంది.


అంతే! మళ్ళీ పద్మ నా కొత్త గౌను.. అంటూ రాగాలు మొదలు పెట్టింది. అక్కడ ఎవ్వరికీ అర్థం కాలేదు అప్పుడు అక్క "అమ్మ.. పద్మకి బస్సులో కొత్త గౌను వేస్తానని చెప్పింది కానీ

వెయ్యలేదు, అందుకే అది ఏడుస్తోంది" అంది.


అందరూ ఒకేసారి "అయ్యో!" అన్నారు.


"అవునవును, నేను దానికి బండిలోకి కొత్త గౌను వేస్తాను అని చెప్పేను. ఇటు నుండి వెళ్ళేటప్పుడు వేద్దామని పెట్టెలో పెట్టేసాను. అయితే అది అప్పుడే అడిగింది సుమా,

బండిలో కొత్త గౌను వేస్తావా అని, నేను పరాకుగా ఊ, అనేశాను. ఆ విషయమే మర్చిపోయాను" అంది అమ్మ.


అమ్మమ్మ, పద్మని ఎత్తుకొని "ఎంత పని అయ్యింది, పద్మకన్నా! తాతగారికి చెప్పి అమ్మని కొట్టమందాం, సరేనా!, ఇంక ఊరుకో బంగారు తల్లీ" అంది.


"వద్దు వద్దు.. తాతగారికి చెప్పకు పద్మ కన్నా.. నేనే మరచిపోయాను నీకు కొత్త గౌను వెయ్యడం" అంటూ ఏడుపు నటిస్తూ అమ్మ గబ గబా పెట్టేలోనుండి కొత్త గౌను తీసి పద్మకి

వేసింది. కొత్త గౌను చూసుకుంటూ, పద్మ అందరినీ చూసి నవ్వేసింది"


అంటూ నవ్వుతున్న జానూతో “ఓహొ! ఇదన్నమాట కొత్త గౌను కధ” అంటూ సుజాత కూడా శృతి కలిపింది. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.

*****

పూడిపెద్ది వెంకట సుధారమణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వెంకట సుధా రమణ పూడిపెద్ది. నేను రాంభట్ల వారింట పుట్టి, పూడిపెద్ది వారింట మెట్టాను. నేను ఎప్పటినుంచో కథలు, కథానికలు రాస్తున్నా, ఈ మధ్యనే వాటిని పత్రికలకి పంపడం ప్రారంభించాను. నేను ఇంకా ఓనమాలు దిద్దుతున్నాను రచనావిభాగంలో.


నా అక్షర ప్రయాణానికి అడుగులు పడిన మా ఇంటి నేపధ్యం.. Dr . రాంభట్ల నృసింహ శర్మ (ప్రముఖ కవి ) నాకు స్వయంగా అన్నయ్య మరియు Dr . రాంభట్ల వెంకట రాయ శర్మ ( పద్యకవి. రచయిత ) నాకు స్వయానా మేనల్లుడు, అలాగే, మెట్టినింటి నేపధ్యం ఏంటంటే, శ్రీశ్రీ గారు,పూడిపెద్ది లక్ష్మణ మూర్తి గారు (పూలమూర్తి గారు ) (శ్రీశ్రీగారికి స్వయానా తమ్ముడు), ఆరుద్రగారు, మొదలగు ప్రముఖులు నాకు తాతగార్లు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఉగాది వసంత పూడిపెద్ది నాకు స్వయానా పిన్ని.


ఓనామాలతో ప్రారంభమైన నా ఈ అక్షర ప్రయాణం, సుదూరయానంగా మారాలని ఆశిస్తున్నాను.


జన్నస్థలం: కుప్పిలి, శ్రీకాకుళం జిల్లా

జననీ జనకులు: వెంకట రత్నం, బాలకృష్ణ శర్మ.

విద్యార్హతలు : ఎం. ఏ తెలుగు, ఎం. ఏ పాలిటిక్స్, బి. ఈ డీ

వృత్తి : ఉపాధ్యాయిని గా 15 సంవత్సరాలు.

ప్రస్తుతం: గృహ నిర్వహణ

భర్త : వెంకటరామ్, రిటైర్డ్ ఆఫీసర్, హెచ్. పి.సి ఎల్

సంతానం : అబ్బాయి డాక్టర్, ( స్వంత హాస్పిటల్ )

అమ్మాయి సాఫ్టవేర్ ఇంజనీర్, U. S. A

అభిరుచులు : సాహిత్యం పై మక్కువ, పుస్తక పఠనం, కథలు వ్రాయటం.

అభిలాష : నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని,

వీలైనప్పుడు దైవ దర్శనం, బంధు దర్శనం చేసుకోవడం.

చిరునామా : విశాఖపట్నం





24 opmerkingen


@sudharamanapudipeddi7857 • 3 days ago (edited)

అందరికీ ధన్యవాదములు.

Like

@madhurirambhatla629 • 1 hour ago

Chala chakati kadhnikani andinchina sudha ramana gariki abinandanallu

Like

@bharathpvsr • 12 hours ago

Nice story & good narration

Like

@vijayp-oh2yn • 4 hours ago

Chala Bhagundi.

Like

@rambhatlanarasimhasarma680 • 5 hours ago

Chakkaga Vundi kadha

Like
bottom of page