కోతి కొమ్మచ్చి
- Srinivasarao Jeedigunta
- Jan 10, 2023
- 2 min read

'Kothi Kommachhi' New Telugu Story
Written By Jidigunta Srinivasa Rao
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“ఒరేయ్ ధన్వి! కొద్దిగా యిటు రారా” అని పిలిచాడు మనవడిని, రంగనాధం.
“నేను చదుకుంటున్నా తాతయ్యా” అని జవాబు.
“యిదిగో. . ఒకసారి యిటు వస్తావా, కాళ్ళు పీకేస్తున్నాయి. కొద్దిగా నొక్కి వెళ్ళు” అని భార్య ని పిలిచాడు.
“వుండండి, బట్టలు ఆరేస్తున్నాను” అని జవాబు.
“ఒరేయ్ అబ్బాయి! ఒకసారి వచ్చి వెళ్ళరా” అని కొడుకుని పిలిచాడు.
“ఆఫీస్ కాల్ లో వున్నాను నాన్నా” అని జవాబు.
“ఛీ. . పాడు జీవితం! దురదృష్టం వెంటాడి నడుం విరగడం తో డాక్టర్ గారి సలహాతో మంచానికి అతుక్కుపోయాను. నడక లేకపోవడం తో కాళ్ళలో రక్తప్రసరణ తగ్గి, కాళ్ళు ఒకటే నొప్పి.
మనవడు పైక్లాస్ కి రావడంతో, ఎప్పుడూ చదువుతోనే వుంటాడు.
ఎక్కువ జీతం అని పేరేగాని, అన్నం తినటానికి కూడా టైం వుండదు కొడుకుకి.
కోడలు కి సహాయంగా తను వంటగది వదిలి రాదు. అందులో ఆదివారం అవడంతో టిఫిన్ రెడీ చేస్తున్నట్టు వున్నారు.
రిటైర్ అయ్యేటప్పుడు, తోటివాళ్ళు అందరూ "మీకేమి సార్, పిల్లలు చేతికి అంది వచ్చారు. హాయిగా విశ్రాంతి తీసుకోండి " అని. .
‘పిల్లలు చేతికి అందిరావడం కాదు, వాళ్ళ పనులతో చేతికి అందకుండా వున్నారు’ అనుకున్నాడు రంగనాధం.
70 వచ్చిన తరువాత జీవించాలని అనుకోవడం బుద్ది తక్కువ. ఓపిక వుండదు, నడిచివెళ్లి కావలిసినవి తెచ్చుకోలేడు. ఈ బిజీ కాలంలో ఎవరి పనులు వాళ్ళకి. యిహ ముసలితనం తో ఒంటరిగా గడపటం ఎంత కష్టమో అనుభవిస్తే కాని తెలియదు.
ఛీ. . విసుగేస్తోంది జీవితం. . అనుకుంటూ అప్పటికే రెండుసారులు చూసిన, పేపర్ లో మిగిలిపోయిన ‘తప్పిపోయిన వాళ్ళ ప్రకటన’ చదవటం మొదలుపెట్టాడు.
“ఏమిటి మామయ్యగారూ పిలిచారు. . ” అంటూ అట్లకాడ పట్టుకొని వచ్చింది కోడలు.
“ఆ. . ఏమిటో అమ్మా, రాత్రి నుంచి కాళ్ళు ఒకటే నొప్పి. , ధన్వి చదువుకుంటున్నాడుట. మీ ఆయన ఆఫీస్ మీటింగ్ లో వున్నాడు, పాపం నువ్వు ఏమి చేయగలవు తల్లి” అన్నాడు రంగనాధం.
“అయ్యో అలాగా! అత్తయ్య ని పంపుతాను వుండండి” అని వెళ్లిపోయింది.
తల్లితో చెపుతున్న మాటలు విన్న మనవడు పుస్తకంతో పాటు వచ్చి, “నేను నీ కాళ్ళమీద కూర్చొని చదుకుంటాలే” అని కాళ్ళ మీద కూర్చున్నాడు.
యింతలో కొడుకు కర్పూరతైలం సీసా పట్టుకుని వచ్చి, “లే! తాతయ్య కాళ్ళు విరగకొడతావు, అలా కూర్చోకూడదు” అన్నాడు కొడుకుని.
“ఏమిటి నాన్న! పెద్ద వయసు వచ్చిన తరువాత ఏదో ఒక బాధ వుంటోనే వుంటుంది. మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టేస్తారు” అంటూ మెల్లగా తండ్రిని కూర్చోపెట్టి, వీపుకి తలగడా సపోర్ట్ పెట్టి, రెండు కాళ్ళకి కర్పూరతైలం రాయడం మొదలుపెట్టాడు.
ఇంతలో కోడలు ప్లేట్ తో వచ్చి, “యిదిగో మామయ్యగారూ! మీకు యిష్టం అని ఉల్లి రవ్వదోశ, కొబ్బరి చట్నీ చేసాను. మెల్లగా తినండి, యింకోటి తీసుకొని వస్తా” అంది.
కొంతసేపటికి ముందు నాది ఒంటరి జీవితం అనుకుని, ఎక్కువ ఏళ్ళు బ్రతక్కుడదు అనుకున్నాను. , యిప్పుడు అందరూ నా చుట్టూ వున్నారు. కోడలు వేడి వేడిగా నాకు యిష్టమని, ఉల్లి రవ్వదోశ చేసి పెట్టింది. మనిషి ఈ సుఖాలు వదులుకుని ముందుగా పోయి ఏంచేస్తాడు? హాయిగా తిని కుటుంబసభ్యులతో గడపక. . అనుకుంటూ రవ్వదోశ ప్లేట్ వంక చూస్తో వుంటే, మనవడు ధన్వి, “తిను తాతా, సాంబార్ లేదని చూస్తున్నావా” అన్నాడు.
“లేదురా, చిన్నపిల్లాడివి నీకు పెట్టకుండా ముందు నేను ఎలా తినాలని చూస్తున్నా. యిటురా నోరు తెరువు” అనగానే, చిన్ని కృష్ణుడిలా నోరు తెరిచిన మనవడి నోట్లో ఒక ముక్కా, అదే చేత్తో కొడుకు నోట్లో ఒక ముక్కా పెట్టి, తను తినడం మొదలెట్టాడు.
.... శుభం......
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Sai Praveena jeedigunta • 54 minutes ago
Chala bagundi