top of page

కౌసల్య

#పురాణం #ఆధ్యాత్మికం #devotional #TeluguMythologicalStories


'Kousalya' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 26/09/2024

'కౌసల్య' తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


పుష్టి మహారాజు కుమార్తె కౌసల్య. అప్పటికి సమాజంలో ఉన్న చతుర్వేదాల తేజస్సు ను ఔపాసన పట్టిన విదుషీ మణి. కౌసల్య, వేదాలను పఠించడానికి, వాటిని పదుగురికి చెప్పడానికి మాత్రమే పరిమితం కాలేదు. వేద మూల తేజాలను ప్రయోగ శాలలో నిరూపించడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయోగాలు కొన్ని ఫలించాయి. మంచి ఫలితాలనిచ్చాయి. వికటించిన ప్రయోగాలు కొన్ని కాల గర్భంలో కలిసిపోయాయి. కౌసల్య ఫలించిన మంచి వేద ఫలితాలతో సాధ్యమైనంత మేర ప్రజాభివృద్ది చేసింది. 


 వేద సృష్టి కర్తలలో కొందరు కౌసల్యకు బాగా తెలిసిన వారు ఉన్నారు.. వారితో కౌసల్య వేద మంత్రోచ్ఛారణ మాటున ఉన్న వధూ పీఠాది గణితం గురించి చర్చించింది. ఆయా మంత్రాలలో ఉన్న భావాల గురించి చర్చించింది. 


"కాలాన్ని బట్టి భావం ఉపయోగ పడవచ్చు. ఉపయోగ పడకపోవచ్చు. వధూపీఠాది గణితం మాత్రం సర్వకాల సర్వావస్థలయందు ఉపయోగ పడుతుంది" అని అనుకుంది. తన తండ్రి పుష్టి మహారాజు గురించి కూడా వేదాలలో ప్రస్తావించడడం ఆమెకు మహదానందం కలిగించింది. నిజం చెప్పాలంటే అప్పటికి వేదాలకు ఇంకా పూర్తి స్వరూపం రాలేదు. 


 ఋగ్వేదం ఏడవ మండలంలో పది రాజుల యుద్దం లో పురువంశం, తుర్వశ వంశం, ద్రుహ్యు వంశం, అనువంశం వారు ఉన్నారు. వారంతా అన్నదమ్ములు మరియు వారి వారి సంతానమే. అయినా పది దిక్కుల నుండి సైన్యమును నడిపి యుద్దం చేసారు. అప్పుడు పుష్టి మహారాజు వారందరిని శాంతింప చేసాడు. సాధ్యమైనంత వరకు అహింస మార్గానే సంచరించాలన్నాడు. అహింసను మించిన ఆయుధం మరొకటి లేదన్నాడు. 


ఒకనాడు పుష్టి మహారాజు కుమార్తె కౌసల్య తన తండ్రి పుష్టి మహారాజును, " జనకా.. ఋగ్వేదం ఏడవ మండలంలో దశరజ్ఞ సమరం గురించి కొంత మాత్రమే చెప్పడం జరిగింది. అప్పుడసలేం జరిగింది?" అని అడిగింది. 


 కౌసల్య మాటలను విన్న పుష్టి మహారాజు, " అమ్మా కౌసల్య! యయాతి మహారాజు మహా శౌర్యవంతుడు. మహా విజ్ఞానవంతుడు. అతడు తన కోరికల మీద వ్యామోహం చావక, తన ముసలి శరీరాన్ని స్వీకరించి, యువ శరీరాన్ని తనకివ్వమని తన కొడుకులను అడిగాడు. అందుకు అతని పెద్ద కుమారులు ఎవరూ సమ్మతించలేదు. చివరివాడు శర్మిష్ట పుత్రుడు పురు సమ్మతించాడు. 


 యయాతి పురు శరీరంతో కొంత కాలం గడిపాడు. అలా తన కోరికలన్నిటినీ తీర్చుకున్నాడు. అటు పిమ్మ ట పురు శరీరాన్ని పురుకు ఇచ్చేసాడు. అలా జీవశరీరాలను మార్చగల విజ్ఞాన సామర్థ్యం యయాతి మహారాజు కు ఉంది. 


అయితే యయాతి మహారాజు తన విజ్ఞానాన్ని మంచి కంటే తన కామ కోర్కెలు తీర్చుకోవడానికే అధికంగా వినియోగించాడు. చేసిన పాపం చెబితే పోతుందని కొందరు అంటారు. అది అవకాశ వాదులు, కామవ్యామోహ చరితులు చెప్పేమాట. కాల చక్రం లోని ధర్మ సూక్ష్మం ముందు రాజైన పేదైన అందరూ ఒకటే. యయాతి మహారాజు ముసలితనంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. వారి వలన వారి కుమార్తె మాధవి బలిపశువు కావల్సి వచ్చింది. 


యయాతి మహారాజు పురుకు తన ప్రధాన రాజ్యం ప్రతిష్టాన పురానికి రాజును చేసాడు. తను జయించిన చిన్న చిన్న రాజ్యాలను మిగతా పుత్రులకు ఇచ్చాడు. 


తన తండ్రికి తన యువ శరీరాన్నే ఇచ్చేసి తండ్రి వృద్ద శరీరాన్ని స్వీకరించిన పురు మహారాజు ఎందరో మహానుభావులైన మహారాజుల కంటే గొప్పవాడని చెప్పవచ్చును. పురు మహారాజు పేరు మీద పూరు వంశం ఏర్పడింది. నాటినుండి పురు పూరుడు అయ్యాడు. పూర వంశమే పౌర వంశం. అయితే అతని సోదరులకు పూరుని మీద అసూయా ద్వేషాలు ఏర్పడి పూరుని రాజ్యం స్వంతం చేసుకోవాలని పూరుని మీద యుద్దం ప్రకటించారు. 


 కొంతకాలం తన తండ్రి యయాతి కి తన శరీరం ఇవ్వడం వలన పూరుని దేహంలో పరాక్రమ తేజం కొంత అలసత్వానికి గురయ్యింది. అయినా పూరుడు సోదరులతో సమరం చేసాడు. పది దిక్కుల నుండి వచ్చిన సైన్యాన్ని చాలా వరకు చీల్చి చెండాడాడు. సుధాస్ మహారాజు వంటివారిని మట్టి కరిపించారు.. అయితే అతని తనువులోని తేజస్సు కొంచెం కొంచెం క్షీణించ సాగింది. అది గమనించిన సుధాస్ మహారాజు పూరుని మీద పలు అస్త్రాలను ప్రదర్శించాడు. 


అప్పుడు నేను ఆ అస్త్రాలను బూడిద పాలు చేసాను. ఆ తర్వాత నేను ఆ సోదరుల నడుమ సమరం ఆపాను. తండ్రి కోసం తన తేజం కొంత కోల్పోయిన పూరుని మీరు రాజ్యం కోసం హింసించరాదన్నాను. కాదు కూడదు అని మీరు పూరుని హింసిస్తే నరకంలో వారు ఎలాంటి శిక్షలకు గురవుతా రన్నది వారికి వివరించాను. 


నా మాటల మీద ఉన్న గౌరవంతో ముందుగా యదు మహారాజు యుద్దాన్ని విరమించుకున్నాడు. యదు మహారాజును చూసి మిగతావారు కూడా యుద్దాన్ని విరమించుకున్నారు. " అని జరిగిన సంగతులన్నీ కుమార్తె కౌసల్య కు పుష్టి మహా రాజు చెప్పాడు. 


"ఆరు రోజులలో మహీమండలాన్నంత జయించిన యయాతి మహారాజు గారి కుమార్తె గదా మాధవి ?" తండ్రి పుష్టి మహారాజును అడిగింది కౌసల్య. 


 "అవును. మాధవి యయాతి మహారాజు కుమార్తే.. ఆమె ప్రస్తుతం వన సంచారిణిగ విష్ణు సేవన కాలం గడుపుతుందని విన్నాను. పూరుడు చాల మంచి మహారాజు. గంధర్వ కాంతలను పరాభవించబోయిన రావణబ్రహ్మకు ఎదురునిలిచాడు. 


ఆ యుద్దంలో పూరుడు ఓడిపోయినప్పటికి గంధర్వ కాంతలను రక్షించాడు. అలాగే మాంధాత మహారాజు చేతిలో కూడా పూరుడు ఓడిపోయాడు. అయితే పుర రక్షణ చేయగలిగాడు. పూరుని మేథో సామర్థ్యం, సంకల్ప సామర్థ్యం మహోన్నతమైనవి. కాకపోతే తన తనువు కొంత కాలం తండ్రి దగ్గర ఉండటం వలన సమరంలో చిన్న చిన్న సమస్యలను కొన్ని సార్లు ఎదుర్కొనలేకపోతున్నాడు. ", కూతురితో అన్నాడు పుష్టి మహారాజు ‌. 


"అలాంటి మంచి మహారాజులకు మనకు చేతనయినంత సహాయం చేస్తే బాగుంటుంది తండ్రిగారు. " పుష్టి మహారాజు తో అంది కౌసల్య. 


"చేయవలసిన అవకాశం వస్తే తప్పకుండా చేద్దాం పౌష్టి. " కూతురుతో అన్నాడు పుష్టి మహారాజు. 


"పౌష్టి.. పుష్టి మహారాజు కుమార్తె పౌష్టి. పరోపకార విషయ చర్చలు వచ్చినప్పుడు తండ్రి గారు నన్ను కౌసల్య అని నా అసలు పేరుతో పిలవకుండా పౌష్టి అని పిలుస్తారు. ఏదేమైనా తండ్రిగారికి సాటి నా తండ్రిగారే. " అనుకుంది కౌసల్య. 


 కౌసల్య మునివాటికలకు వెళ్ళింది. అక్కడ అనేక మంది మునుల శరీరాలను పరిశీలించింది. తపస్సు చేసి చేసి క్షీణించిన మునుల శరీరాలను తన ఆకు పసరుల వైద్యం తో ఆయా తనువుల సామర్థ్యం పెంచింది. తమ తనువుకు పెరిగిన సామర్థ్యం చూసుకుని మునులు మురిసిపోయారు. కౌసల్యను పలు రీతుల్లో స్తుతించారు. నీ యిష్టం వచ్చిన వరాలను కోరుకోమన్నారు. 


అప్పుడు "సకాలంలో వర్షాలు పడేందుకు యాగాలు చేయండి. ప్రజలు రోగాల బారిన పడకుండా యాగాలు చేయండి. గోసంపద దినదినాభివృద్ధి చెందాలని యాగాలు చేయండి. అమలిన విజ్ఞానం, ప్రజోపయోగ విజ్ఞానం ప్రజలకు పుష్కలంగా రావాలని యాగాలు చేయండి" అని కౌసల్య ప్రజల కోసం మునులను వరాలను అడిగింది.. 


పూరు మహారాజు పరిపాలనలో ప్రజలందరు సిరిసంపదలతో ఆనందంగా జీవించసాగారు. ప్రతిష్టాన పుర ప్రతిష్ట మరింత పెరిగింది. ప్రజలంతా పూరుని త్యాగ గుణాలను పలురీతుల్లో  పొగడ సాగారు. 


పూరుని శరీరం కొంత కాలం తన తండ్రి యయాతి మహారాజు దగ్గర ఉండటంతో పూరుని మంచి మనసును వేనోళ్ళ ప్రశంసించిన మహారాజులే అతని తనువును దృష్టిలో పెట్టుకొని అతనికి తమ కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.

 

ఇది తెలిసిన పుష్టి మహారాజు పూరు మహారాజు ను తన అల్లుని గా చేసుకోవాలనుకున్నాడు. అంత పుష్టి మహారాజు తన కూతురు కౌసల్య తో మాట్లాడాడు. పూరునితో మాట్లాడాడు. కౌసల్య పూరుల సమ్మతితో పుష్టి మహారాజు ఇద్దరి పెళ్ళి జరిపించాడు. 


కౌసల్య తన భర్త పూరుని తనువులోని అణువణువును పరిశీలించింది. పూరుని అనేక ఆశ్రమాలు తిప్పింది. ఆయా ఆశ్రమాలలో ఉన్న దళాలతో భర్త శరీరానికి పుష్టిని పెంచింది. మునులతో వివిధ యాగాలు చేయించి భర్త శరీర తేజస్సును పెంచింది. 


పూరుని శరీరం యజ్ఞయాగాదుల తేజస్సుతో నవ సామర్థ్యం పొందింది. శతకోటి కవచకుండలాల సామర్థ్యం పూరుని శరీరానికి వచ్చింది. అంత పూరుడు మాంధాత మీద యుద్దం ప్రకటించాడు. మాంధాత పూరునితో యుద్దానికి సిద్దం సిద్దం అన్నాడు. పూరుడు దశ దిక్కులనుండి వచ్చిన మాంధాత సైన్యాన్ని మట్టి కరిపించాడు. అతని వక్ష స్థలాన్ని తాకి కొండల్లాంటి గదలు పిండి పిండి అయ్యాయి. అతని పిడి గుద్దులకు శత్రువుల తలలు మొండెములలోనికి చొరబడ్డాయి. పూరుడు ఆ మహా సంగ్రామం లో మాంధాత మహారాజు ను ఓడించాడు. 


యుద్దం లో ఓడిపోయిన మాంధాత మహారాజును పూరుడు తగిన విధంగా సత్కరించాడు. అనంతరం పూరుడు తన విజయ ఖడ్గాలలో ఒక విజయ ఖడ్గాన్ని మాంధాత మహారాజు కు బహుమతిగా ఇచ్చా డు. పూరుని మంచి మనసును గ్రహించిన మాంధాత మహారాజు పూరుని ముందు శిరస్సు వుంచాడు. మాంధాత మహారాజును సమరంలో ఓడించిన పూరుని పరాక్రమం గురించి సమస్త లోకాలు ముచ్చటించు కున్నాయి. తన ధర్మపత్ని కౌసల్య వలననే తనకంత పేరు వచ్చిందని పూరుడు సభా సాక్షి గా సమస్త లోకాలకు తెలియ చేసాడు. 


ఒకసారి పూరుని రాజ్యంలో ఒక సంవత్సరం పాటు వర్షాలు కురవలేదు. పూరుడు, "ఇందుకు కారణం ఏమిటి?" అని మహర్షులను అడిగాడు. 


 కొందరు మహర్షులు "శర్మిష్ట పుత్ర !పూరు మహారాజ!మీ రాజ్యం లో ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. అందుకే వర్షాలు పడటం లేదు " అని అన్నారు. 


మహర్షుల మాటలను విన్న కౌసల్య" మహర్షులారా! మీ మాటలు సమంజసంగా లేవు. మీ మాటలు, మీ ఆలోచనలు నిజం కాదు. శూద్ర తపం వలన వర్షాలు పడవనడం మీ తపోజ్ఞాన అవివేకం. నేను కులమత వర్గ విచక్షణారహితంగా మీ మీ కృశించిన శరీర సామర్థ్యాలను పెంచాను. మీరు పెరిగిన మీ శరీర సామర్థ్యాలను చూసుకుని అహంకారం ప్రదర్శిస్తున్నారు.. ఆ అహంకారంతోనే మీరు మనసు తప్పి, వచస్సు తప్పి, యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నారు. 


దానివలన వాతావరణ కాలుష్యం పెరిగిపోయింది. దానితో సంవత్సరం నుండి సకాలంలో వర్షాలు పడటం లేదు. శూద్రుని తపస్సు వలననే ఇంకా ప్రకృతి లో పచ్చదనం తగ్గలేదు. కొంత కాలం పాటు మీరంతా యజ్ఞ యాగాదులను ఆపివేయండి. " అని మహర్షు లతో అంది. 


 పూరు మహారాజు కౌసల్య చెప్పినట్లు చెయ్యమని మహర్షులను ఆదేశించాడు. కౌసల్య తపో శక్తి గల వెయ్యి మంది శూద్రులతో యజ్ఞ యాగాదులను చేయించింది. వెంటనే వర్షాలు పడినవి. అంతకు ముందు ఎన్నడూ పండని రీతిలో పంటలు పది సంవత్సరాలకు సరిపడ పండాయి. మహర్షులు తమ తప్పులను తెలుసుకుని శూద్ర తపశ్శీలుర దగ్గర శిష్యరికం చేసారు. 


 "మహర్షులారా! కదిలే కాల తీరులో మానవ సంచారం గమనించి మాట్లాడండి. కాలం కులమత వర్గాలకు అతీతంగా సాగిపోతుంది. ఇప్పటివరకు వేద మంత్రాలను చెప్పినవారిలో, రాజ్యాలను పరిపాలించిన వారిలో, సర్వ కులాలవారూ ఉన్నారు. ఇది గమనించకుండా మీరు చెప్పే మాటలు కాల గమనం ముందు నిలబడవు. అది గుర్తు ఉంచుకోండి" అని మహర్షులతో కౌసల్య అంది. 


 పూరుడు తన భార్య కౌసల్య తో అనేక యజ్ఞయాగ శాలలను సందర్శించాడు. అక్కడి మునులందరిని కౌసల్య పూరులు తగిన విధంగా సత్కరించారు. 


 కౌసల్య పూరులు యాగవనం ను సందర్శిస్తున్నప్పు వారికి అక్కడ మాధవి కనపడింది. యోగిని అయిన సోదరి మాధవిని పూరుడు తగిన విధంగా సత్కరించాడు. మాధవి అభ్యర్థనను అనుసరించి కౌసల్య మునులతో యజ్ఞం చేయించి, మాధవి తనువును జింక తనువుగా మలచింది. 


మాధవి మునులకు, కౌసల్య పూరులకు నమస్కరించి జింక తనువుతో వనంలోకి వెళ్ళిపోయిం ది. కౌసల్యపూరుల సంతానం జనమేజయుడు, ఈశ్వరుడు, రౌద్రశ్వుడు మొదలైనవారు. 

 పూరుడు కౌసల్య చెప్పినట్లు ఇంద్ర దైవత యాగాదులను చేసి ఒకరోజు లో ప్రపంచం మొత్తాన్ని జయించాడు. తన రాజ్యంలోని వారందరికి గోదానం చేసాడు. 


 కౌసల్య రాజ్యంలోని వారందరి చేత గోపూజ చేయించింది. ఇంద్రపూజ చేయించింది. జల పూజ చేయించింది. కౌసల్య జల పూజకు మెచ్చిన సరస్వతీ నది జల దేవత రూపంలో కౌసల్య పూరులను ఆశీర్వదించింది. 


 కౌసల్య పూరులు తమ సంతానాన్ని చక్కగా పెంచారు. పూర వంశం పౌరులై వర్థిల్లారు. అటుపిమ్మట మహా సమర్థుడైన జనమేజయ రాజుని ప్రతిష్టాన పురానికి రాజును చేసారు. 

 కురుక్షేత్ర యుద్ద సమయంలో కౌరవులను అర్జునుడు చీల్చి చెండాడే దృశ్యాన్ని పూరు మహారాజు ఇంద్రునితో కలిసి ఆకాశంనుండి సందర్శించాడు. 


   శుభం భూయాత్ 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








68 views0 comments

Comments


bottom of page