top of page
Writer's pictureGanga Koumudi

కోవిదార సుమం


'Kovidara Sumam' - New Telugu Story Written By Ganga Koumudi

'కోవిదార సుమం' తెలుగు కథ

రచన: గంగా కౌముది

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"అమ్మా! విద్యావతి, నాకు పూజకి వేళ అవుతొంది. గంగమ్మను అర్చించి వస్తాను. అంతవరకు పిల్లలను చూస్తూ ఉండమ్మ" అంటూ జాగ్రత్త చెబుతోంది ఓ వనిత.


చూడటానికి తపస్వినిలా ఉన్నా ఆమె స్వరం కోకిలకి పాఠాలు నేర్పేటంత మధురంగా ఉంది. ప్రపంచంలో ఉన్న పూలన్నీ కలిపి తయారు చేసినట్లు ఆమె ముఖం కాంతి వెదజల్లుతొంది. కోటి సూర్యులు, శత కోటి చంద్రులు ప్రకాశించినా ఆ కాంతి ముందు తక్కువే అనిపిస్తోంది. ఆమె నడక హంసలకి పాఠాలు చెప్పే విధంగా ఉంది. సాక్షాత్తు ఆదిలక్ష్మీ దేవి భువిపైకి వచ్చినట్లున్న ఆమె గంగా నదికి బయలు దేరుతూ తోటి చెలికి తన పిల్లలను అప్పగిస్తోంది.


"అలాగే లోకపావనీ దేవి! నాకు అంతగా చెప్పాలా! నువ్వు పూజ చేసుకుని రా తల్లీ! నేను పిల్లలను చూసుకుంటాను" అన్నది ఆమె చెలి విద్యావతి.


తూర్పు తెల్లవారింది. బాల భానుని నునులేత కిరణాలు పద్మాలను ముద్దాడుతున్నాయి. విరిసీ విరియని కుసుమాలు అరవిరిసిన అరవిందాలతో మకరందాలు చిందుతున్నాయి. ప్రకృతి అంతా శరత్కాల శోభని సంతరించుకుంది. ఆ నగర ప్రాంగణంలో అంత శోభ విరిసినా ఓ మందిరంలో ఎవ్వరూ పోల్చలేని చీకటి తాండవిస్తూనే ఉంది. ఐదేళ్లుగా ఆ చక్రవర్తి హృదయాంతరాళంలో కమ్ముకున్న విషాద మేఘాలు కరిగి కన్నీరై వర్షిస్తోంది. ఇంతలో ఏవో అడుగుల సవ్వడి విని అటువైపు చూసాడు.


"అన్నా ! వందనం" అంటూ ఒక శుభ లక్షణ మూర్తి ఆ చక్రవర్తికి పాదాభివందనం చేసాడు. ఆ శుభ లక్షణ మూర్తి సర్వ శోభితుడైన లక్ష్మణ స్వామి. ఆ చక్రవర్తి భువనైక మోహన జగదాభి మూర్తి యైన శ్రీరామ చంద్రమూర్తి.


"అన్నా! గురువులైన వశిష్టుల వారి ఆనతి ప్రకారం మనం ఈ శరత్కాల వేళ వేటకు బయలుదేరాలి. అరణ్య ప్రాంత సంరక్షణా బాధ్యత నిర్వర్తించవలెనని గురువుల కోరిక. కనుక తమ ఆనతి అయితే రేపే సిద్ధం చేస్తాను అన్నయ్య!" అని సవినయంగా విన్నవించుకున్నాడు లక్ష్మణ స్వామి.


"లక్ష్మణా! సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం అపవాదు కారణంగా మీ వదినను కానలకు పంపిన కఠినాత్ముడను. నన్నూ ఆ కానల పాలు చేసే తరుణం మంచిదే నాయనా! గురువులు ఎటుల చెప్తే అట్లే కానీ నాయనా" అన్నాడు రామయ్య.


ఆ మాటలు వింటూనే "లేదు అన్నయ్య! మనుష్యులు కేవలం నిమిత్తమాత్రులు. సర్వం దైవాధీనం. తమరు అన్యదా చింతించకండి" అన్నాడు.


"సరే! రేపే భాగీరదీ అరణ్యానికి ప్రయాణం సిద్ధం చేయి" అంటూ తన లోకంలో తాను ములిగిపోయాడు శ్రీరాముడు. ����������������������������������


గంగా తీరంలో పూజ చేసి గంగమ్మకి పూలమాల సమర్పించి, లోకపావనీ దేవి తన ఆశ్రమానికి బయలుదేరింది. ఇంతలో ఐదేళ్ల పిల్లాడు ఆమెని చూసి "అమ్మా! అప్పుడే పూజ అయిపోయిందా! మరి పసాదం ఏదీ" అంటూ తన బుజ్జి చేతులతో ఆమెని చుట్టేసాడు. అప్పుడు గ్యాపకం వచ్చింది ఆమెకు ప్రసాదం అక్కడే మరిచానని.


"నాయనా! కుశా! నీవు తమ్ముడిని చూస్తూ ఉండు. నేనిప్పుడే ప్రసాదం తీసుకువస్తాను" అంటూ మరలా గంగా తీరానికి వెళ్ళింది. ����������������������������������


"లక్ష్మణా ! ఈ భాగీరధీ తీరాన కాస్త రధం నిలుపు నాయనా! గంగా నదీమ తల్లిని సేవించి వద్దాం" అని రామస్వామి చెప్పాడు. అది విన్న లక్ష్మణుడు రధం నిలిపివేశాడు. అన్నదమ్ములిద్దరూ గంగ వైపు నడిచారు. ఎప్పుడూ లేనిది రామయ్యకి ఆనాడు ఏదో వింత అనుభూతి కలుగుతోంది. సీతావియోగ దుఃఖాన్ని మరువలేని స్వామికి ఆనాటి ప్రక్రుతి ఏవో తలంపుకి తెస్తోంది. అయోమయంలోనే గంగలో దిగి అర్ఘ్య పూజ చేసే సమయంలో ఒక పూల మాల స్వామి కాలికి చుట్టుకొంది. అది తీసి ఆ మాల పట్టుకుని ఆశ్చర్య పోయాడు రఘురామమూర్తి.

అది చూసి "అదేమిటి అన్నా! ఆ పూల మాల వంక అంత వింతగా చూస్తారేమి? అదేమంత విచిత్రం అన్నయ్యా" అని లక్ష్మణుడు అడిగే సరికి ఒకసారి తల పంకించి "ఇది కోవిదార పూల మాల తమ్ముడూ! ఈ కోవిదార వృక్షం మన ఇక్ష్వాకు వంశానికి గుర్తు. ఈ మాల అందరికీ చేయడం రాదు" అంటూ ఏవో ఆలోచనలో మునిగిపోయాడు.


����������������������������������


సుగంధ పరిమళాలు విరజిమ్మే ఉద్యానవనంలో ఆమె ఒక్కర్తే కూర్చొని పూలమాల కడుతూ ఉంది. ఆ పూలెంత సుకుమారమో, ఆమె అంతకంటే సుకుమారి. మిథిలా రాజకుమారి. శ్రీరామ చంద్రుని సుధా సరసి సీతా దేవి. ఇంతలో శత కోటి మన్మధకార మూర్తి, హిమశైల మలయానిల మధురాధర మూర్తి, శ్రీరామచంద్ర మూర్తి అక్కడికి వచ్చాడు.


"సీతా! ఏమిటీ మనోహర పరిమళం. ఈ పూలను మునుపెన్నడూ చూడలేదే, ఏమిటీ పూలు" అంటూ లేత పసుపు, అరవిరిసిన ఎరుపు కలిసిన సుకుమార కుసుమాన్ని ఒకటి చేతిలోకి తీసుకుంటూ అన్నాడు రామస్వామి. ఎంత సుకుమారంగా తీసుకున్నా, ఆ కాస్తకే ఆ పూవు వాడిపోయింది. కానీ సీతమ్మ ఆ పూలను మాల చేయడంతో మరింత ఆశ్చర్యపోయాడు రామయ్య.


"స్వామీ! ఇవి కోవిదార పూలు. ఈ పూల పరిమళం ఎంత ఉన్నతమో, ఇవీ అంతే సౌకుమార్యం. ఈ కోవిదార వృక్షం మీ అయోధ్యా నగర రాజులకు ధ్వజ పతాక చిహ్నం కదా!. ఒక్కసారి తాకితేనే కందిపోయే ఈ పూలను చాలా జాగ్రత్తగా మాల కట్టాలి. మన వివాహానికి పూర్వం మా తండ్రి జనక మహారాజు వీటిని నా కోసం మీ కోసల దేశం నుండి తెప్పించేవారు. వీటి మాలలో కూడా ఒక అద్భుతం ఉంది నాధా! ఈ పూలు కుడివైపుకి విచ్చుకుంటే మన ఎదురుగా ఉన్న వారికోసం మాల కడుతున్నట్టు, ఎడమవైపుకు విచ్చుకుంటే మనకోసం కడుతున్నట్టు" అంటూ అమాయకంగా చెప్పుకుంటూ పోయింది చక్కదనాల జానకమ్మ.


"ఓహో! వీటిలో ఇంత ఆంతర్యం ఉందా! నాకు తెలీదే! అయితే ఇప్పుడు ఇవి కుడివైపునకు విచ్చుకున్నాయి. అయితే ఈ మాల నాకేనా" అంటూ సీతపై చూపుల బాణాలు సంధించాడు. అవి విరి తూపులై (సుమ బాణాలు) సీతమ్మను కలవర పెట్టసాగాయి.


"హా! మీకే ఈ మాల. స్వయంవర మంటపాన ఆనాడు వీర చూడామణి యైన మీకు మన కళ్యాణ మాల అలంకరించాను. నేడు రాకా సుధాకర మూర్తియైన తమకు ఈ కోవిదార మాల అలంకరిస్తున్నాను" అంటూ రాముని గళసీమను ఆ మాల ని అలంకరిచింది సీతాదేవి. అంతవరకు పచ్చగా ఉన్న పూలు బంగారంలా రాముని కంఠాన మెరుస్తున్నాయి. అంతకంటే వజ్రంలా సీతమ్మ కళ్ళు మెరుస్తున్నాయి.


ఆనంద పారవశ్యం తో రామచంద్ర మూర్తి "సీతా! ఈ పూలమాల ధరించగానే ప్రియసమాగమంలో కలిగే చల్లని స్పర్శ నన్ను ఆనంద పరవశున్ని చేస్తోంది. చిన్ననాడు చందమామ కై మారాము చేస్తే మా తల్లి కైకా దేవి అద్దంలో చందమామ ను చూపి నన్ను బుజ్జగించింది. కానీ ఆ దేవుడు చందమామ ను మించిన ఈ భామను నా దేవేరి గా అనుగ్రహించాడు. ఇంతటి కానుక ఇచ్చిన నీకు ఏం వరం కావాలో అడుగు" అన్నాడు.


అసలే కెంపు రంగులో నున్న సీతమ్మ ముఖం రామయ్య మాటలకి పగడంలా మారి సిగ్గుపడసాగింది. "అయోధ్యా నగర చక్రవర్తులు, ఎంతకైనా సమర్థులే. అడిగారు కనుక అడుగుతున్నాను. మీ చేతులతో ఒక కోవిదార సుమాన్ని ఇవ్వండి. అంతకంటే మరేదీ వద్దు" అన్నది సీతాదేవి.


ఆమాటకి ఒక్కసారి ఆలోచనలో మునిగిపోయాడు రామస్వామి.


"స్వామీ! ఏమైంది. ఏదేని కోరరాని వరం అడిగి మీ మనసు నొప్పించానా" అంటూ కలవరపడుతున్న సీతమ్మ తో " లేదు దేవీ! కానీ ఈ కోవిదార సుమం గురించి నీకు తెలియని ఒక విషయం నన్ను కలవరపెట్టింది. ఈ సుమం విరహానికి గుర్తు. ఇది ధరిస్తే వచ్చే ఎడబాటు గురించి ఆలోచించాను" అంటూ వివరించాడు రాముడు.


ఆ మాటవిన్న సీత ప్రశాంతంగా "స్వామీ! ఎడబాటు కలగాలంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలి. కానీ మనం ఇరువురం కాదు. ఒక్కరమే. సీత మదిలో రాముడు, రాముని మదిలో సీత, లోకం మదిలో సీతారాములు ఎప్పుడూ ఉంటారు" అన్నది.


వెంటనే ఓ కోవిదార సుమాన్ని రామచంద్రమూర్తి సీతాదేవి జడలో అలంకరించాడు. సీతమ్మ జడలో మెరిసిపోతున్న కోవిదార సుమం తనకు తానే రత్నమణిలా మెరిసిపోతోంది. ����������������������������������


"అన్నా! " అన్న లక్ష్మణ స్వామి పిలుపుతో ఒక్కసారిగా తన ఆలోచనల నుండి బయటకు వచ్చి తనకు దొరికిన ఆ మాలని పరికించి చూసాడు రామయ్య. అది కుడివైపునకు విచ్చుకుంది. శీతల గంగా స్రవంతిలో రామయ్య వెచ్చని కన్నీటి బొట్టు ప్రవహించింది. ఆ మాలని గంగలో విడిచిపెట్టి పక్కనే ఉన్న ఒక రాతి గట్టుపై ఒక కోవిదార సుమాన్ని విడిచిపెట్టి రథంపై లక్ష్మణునితో కలిసి వెళ్ళిపోయాడు.

����������������������������������


అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్న లోకపావనీ దేవి కళ్ళు చెమర్చడం మొదలుపెట్టాయి. ఆనందమో, బాధో తెలియని కన్నీళ్లు వర్షపు జల్లులా జాలువారుతున్నాయి. వెంటనే రామయ్య అడుగు పడిన చోట ఉన్న ఇసుక రేణువులను ఆమె తన సింధూరం గా నుదుట దిద్దుకుంది. ఆ కోవిదార సుమం కళ్ళకి అద్దుకుని సిగన అలంకరించుకుంది ఆ లోకపావనీ దేవిగా ఉన్న సీతమ్మ. ��������������������������������


ఇలా విరహానికి గుర్తుగా నిలిచి, సీతారాముల ఆదర్శ దాంపత్యాన్ని చాటిన ఆ కోవిదార సుమం చరిత్రలో నిలిచి పోయింది.

***

గంగా కౌముది గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత్రి పరిచయం:

కలం పేరు - గంగా కౌముది

నేను ఒక సాహిత్యాభిమానిని. సాహిత్య సాగరాన ఒక చిన్న రచనాభిలాషిని.

వెన్నెలలో వెలిగే నిండు జాబిల్లి నా కవనం

వన్నె చిన్నెల శ్రీ కృష్ణ జాబిల్లి నా జీవనం


74 views0 comments

Comments


bottom of page