'Kshaminchu Nanna' - New Telugu Story Written By Yasoda Pulugurtha
Published In manatelugukathalu.com On 20/07/2024
'క్షమించు నాన్నా' తెలుగు కథ
రచన: యశోద పులుగుర్త
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
"నాన్నా! నాకు హైద్రాబాద్ ఆఫీస్ కు ట్రాన్సుఫర్ చేసారు ప్రమోషన్ మీద. వరేణ్య ను కూడా హైద్రాబాద్ ఆఫీస్ కు బదిలీ చేస్తామన్నారు. మేము వచ్చే ఆదివారం ఉదయం ఫ్లైట్ లో హైద్రాబాద్ వచ్చేస్తున్నాం".
పూనే లో ఉంటున్న కొడుకు ఫోన్ లో చెప్పిన విషయం వినగానే రామకృష్ణకు ఆనందంతో మాటరాలేదు. వెంటనే భార్య ను పిలిచి ఈ విషయం చెప్పేసరికి ఆవిడ ముఖంలో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. "అబ్బ ఎంత సంతోషకరమైన వార్త అండీ" అంటూ ఆవిడ అప్పుడే హడావుడి మొదలు పెట్టేసింది.
రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ లో ఎకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు రామకృష్ణ. అతనికి ఒక కొడుకు, కూతురు. కొడుకు సుధీర్, కోడలు వరేణ్య ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. సుధీర్ తన కొలిగ్ అయిన వరేణ్యను ఇష్టపడి ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వారికి ఒక కొడుకు కూతురు. కూతురు సునీల, అల్లుడు ఆనంద్ ముంబై లో ఉంటారు. అల్లుడు ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లో ఫైనాన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. వారికి ఒక్కడే కొడుకు.
రామకృష్ణ సొంత ఊరు కాకినాడ అయినా కాకినాడలో చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగ రీత్యా హైద్రాబాద్ వచ్చి స్తిరపడిపోయాడు. సొంత ఇల్లు కట్టుకున్నాడు. రామకృష్ణ భార్య అనూరాధ. చాలా సాదాసీదా మనిషి. తన పిల్లల బాగోగులు చూడటం, భర్తకు కావలసినవి సమకూర్చటం తప్ప, ఆవిడకు ఇంకో లోకం లేదు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, అణకువగా మెలుగుతూ, తనపని తానూ చేసుకు పోతుంటుంది. రామకృష్ణకు అన్ని విషయాలలోనూ చేదోడు వాదోడుగా ఉంటుంది.
పిల్లలిద్దరికీ తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గరే చనువెక్కువ. తండ్రి తో దూరంగా ఉండేవారు. తన పిల్లలెప్పుడూ క్రమశిక్షణలోనే ఉండాలన్నదే అతని ఉద్దేశం. పిల్లలు ఎక్కడా తప్పటడుగు వేయకూడదని చెడ్డపేరు తెచ్చుకోకూడదని అనుకునేవాడు. ఈ నేపధ్యంలో పిల్లలకు కొన్ని ఆంక్షలూ, షరతులూ విధించేవాడు. పిల్లలు ఎక్కడకు వెళ్లాలనుకున్నా తండ్రి అనుమతి తీసుకుని చెప్పిన టైమ్ ప్రకారం వచ్చి తీరాలన్న కఠినమైన శాసనాన్నిప్రవేశ పెట్టాడు.
ఇంటర్ చదువుతున్నప్పుడు సుధీర్ తనకు చెప్పకుండా స్నేహితునితో సినిమాకు వెళ్లాడు. రామకృష్ణ ఫేమిలీ ఫ్రెండ్ కూడా ఆ సినిమాకు వచ్చినపుడు సుధీర్ ను చూసాడు. ఏదో కాకతాళీయంగా రామకృష్ణకు చెప్పాడాయన. ఇంక రామకృష్ణ ఆగ్రహం చూడాలి. "చెప్పకుండా సినిమాకు వెడతావా వెధవా" అంటూ తన పేంట్ బెల్ట్ తీసి బెల్ట్ తో చితక్కొట్టాడు. ఇంటర్ ఫస్టియర్ లో ఫిజిక్స్ లో మార్కులు కాస్త తక్కువ వచ్చాయని "వెధవకి నాలుగు రోజులు అన్నం పెట్టకు అనూ" అంటూ కోపంతో చిందులేసాడు.
ఇంటర్ సెకండ్ ఇయర్ లో తొంభై ఆరు శాతం తెచ్చుకున్నప్పుడు కనీసం ఒక చిన్న మెప్పుకోలు కూడా చేయని తండ్రి అంటే అసహనం సుధీర్ కు. ‘మా ఊపిరి మేము తీసుకోడానికి కూడా ఇక్కడ స్వతంత్రం లే’దని పిల్లలిద్దరూ తండ్రి ఇంట్లో లేనప్పుడు తల్లితో ఫిర్యాదు చేసేవారు.
‘ఆయన కొన్న బట్టలే వేసుకోవాలి, ఆయన తినమంటేనే తినాలి, ఆయన చెప్పినట్లే వినాలి అంటే ఎలాగమ్మా’ అంటూ తండ్రి మీద ఫిర్యాదు చేస్తుంటే తల్లి సర్ది చెప్పేది.
‘మీరేమీ శత్రువులు కాదు నాన్నకు, మీమంచి కోరే చెబుతున్నా’రని.
ఇంజనీరింగ్ లో ఎడ్మిషన్ వచ్చినపుడు నేను హాస్టల్ లో ఉంటానని సుధీర్ చాలా గొడవచేసి హాస్టల్ కి వెళ్లిపోయాడు. రామకృష్ణ ఉన్న ఊళ్లో నే కాలేజ్ లో సీట్ వచ్చింది, ఇంటి నుండి కాలేజ్ కు వెళ్లి రావచ్చుకదా, అనవసరంగా డబ్బు దండగ అంటూ ఆపబోయినా సుధీర్ వినలేదు. ఆయన అదుపాజ్నలు, ఆంక్షల మధ్య నేను చదవలేనంటూ తల్లి ద్వారా తన పంతాన్ని సాధించుకున్నాడు.
నిజానికి రామకృష్ణ దుర్మార్గుడు ఏమీ కాదు. పిల్లలు క్రమశిక్షణతో బాధ్యతగా ప్రవర్తించాలని అనుకుంటాడు. సహజంగా పిల్లల్ని పట్టించుకునే తల్లితండ్రులు, ఎప్పుడూ వాళ్ళ బాగు గురించే ఆలోచిస్తుంటారు. ఇది ఒక్కోసారి పిల్లలకి ఇబ్బంది కలిగిస్తుంది, కానీ తల్లితండ్రులు తీసుకునే ఆ జాగ్రత్త పిల్లల మంచికే అని చిన్నప్పుడు తెలుసుకోలేరు.
అనుకున్న ఆదివారం రానే వచ్చింది. సుధీర్ కుటుంబం రాకతో ఆ ఇంట్లో సందడి రాజ్యమేలింది.
"బాగున్నారా నాన్నా" అని ముభావంగా పలకరించాడు సుధీర్ రామకృష్ణను. తల్లితో ఆమె ఆరోగ్యం గురించి చాలా సేపు తరచి తరచి ప్రశ్నించాడు.
అందరూ భోజనాలకు కూర్చున్నారు. అనురాధ సుధీర్ కి ఇష్టమైన వంటకాలన్నీ చేసి కొసరి కొసరి వడ్డించింది. భోజనాలు చేస్తూండగానే సుధీర్ అన్నాడు "అమ్మా నాకూ వరేణ్యకూ ఆఫీస్ కు దగ్గరలో ఉన్న ఎపార్ట్ మెంట్ చూడమని బ్రోకర్ కి చెప్పాను. దొరకగానే వెళ్లిపోతాం".
"అదేమిటి సుధీర్, మీరంతా ఇక్కడే ఉంటారని నేను సంబరపడుతున్నాను. వేరే పెళ్లిపోవడమేమిటిరా" అనూరాధ బాధపడుతూ అంది.
"అవును సుధీర్, మళ్లీ మరో ఎపార్ట్ మెంట్ ఎందుకు? మన ఇల్లు సదుపాయంగానే ఉంటుంది కదా? ఇక్కడ నుండి ఏమంత దూరం మీ ఆఫీసులకు? కాస్త ముందర బయలదేరితే అసలు కష్టమేమీ కాదు. మళ్లీ ఎపార్ట్ మెంట్ కు అద్దె, ఇతర ఖర్చులు దండగకదూ? ఇక్కడే ఉంటే అవన్నీ కలసివస్తాయి. డబ్బు ఖర్చుపెట్టడం కాదు, ఎలా సేవ్ చేయాలో కూడా తెలియకపోతే ఎలా? రేపు పిల్లల చదువులకీ, ఖర్చులకీ ఇప్పటినుండే ప్లేనింగ్ చేయకపోతే ఎలా రా సుధీర్?”
తండ్రి అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించాడు. "నేను చిన్న పిల్లాడినా, నాకు డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలో మీరు చెప్పాలా?” అని చికాకుపడ్డాడు మనసులో.
"ఏం సుధీర్, నాన్న చెబుతున్నది వినిపిస్తోందా?”
"అమ్మా ఇదే ఊళ్లో ఉంటాం కదా? మీరు అక్కడకు వచ్చి ఉండచ్చు, మేము కూడా వస్తూ ఉంటాం కదా? మా సౌకర్యం మేము చూసుకోవద్దా?”
ఇంక సుధీర్ ఎంత చెప్పినా వినడని అర్ధం అయింది. వాడికేదైనా ఆలోచన వస్తే ఎవరి మాటా వినడు. ముఖ్యంగా తను ఏదైనా చెపితే దానికి వ్యతిరేకంగా చేస్తాడు. రామకృష్ణకు కొడుకుతో వాదించాలని అనిపించలేదు. తన అభిప్రాయాలను గౌరవించనప్పుడు ఇంక కొడుక్కి ఎంత చెప్పినా ఉపయోగంలేదు, అనవసరంగా బాంధవ్యాలను దూరం చేసుకోవడం తప్పించితే అని మౌనం వహించాడు.
ఒక నాలుగురోజులు గడిచాయి. బ్రోకర్ సూచిస్తున్న అపార్ట్ మెంట్లు ఏమీ సుధీర్ కూ వరేణ్యకూ నచ్చడం లేదు. వరేణ్యకు అత్తగారింట్లో ఉండడం ఇష్టమే. తను ఆఫీస్ కు వెడితే పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారని, పిల్లలగురించి తనకు చింత ఉండదని. భర్తతో కూడా చెప్పింది ఇదే విషయాన్ని. కానీ భర్తే వ్యతిరేకంగా ఉన్నప్పుడు తనేమి చేయగలననుకుంది. ఆ రోజు ఇంట్లో ఏమీ తోచక షెల్ఫ్స్ లో ఉన్న పాత ఫొటో ఆల్బమ్ ల కోసం వెతుకుతున్నాడు సుధీర్.
ఆ పక్కనే షెల్ఫ్స్ లో తన ఇంజనీరింగ్ బుక్స్ అన్నీ నీట్ గా సర్ది వరుసగా పేర్చి పెట్టారు. నోట్ బుక్స్ కూడా ఆ పక్కనే కనిపించాయి. కుతూహలం కొద్దీ అవన్నీ ఒక్కొక్కటీ తీసి చూస్తున్నాడు. ఇంతలో పుస్తకాల మధ్యలోనుండి ఒక డైరీ కిందపడింది. బ్రౌన్ కలర్ అట్టతో. తెరిచి చూసాడు. తన తండ్రి చేతివ్రాతతో ఉన్న డైరీ. సభ్యత కాకపోయినా ఏదో కుతూహలం. నాన్న డైరీ కూడా వ్రాసుకునేవారా అనుకుంటూ ఆశ్చర్యపోతూ అలవోకగా పేజీలు తిరగవేసాడు. ఒక పేజీ మధ్యలో తన ఫొటో, ఇంటర్ లో తీయించుకున్న ఫొటో. చదవకూడదనుకున్నా అతని కళ్లు ఆ అక్షరాలవెబడి పరుగెత్తసాగాయి.
'ఈ రోజు సుధీర్ ఇంటర్ లో తొంభై ఆరు సాతం తో పాస్ అయ్యాడు. వాడికి ఫస్ట్ ఇయర్ లో మార్కులు తక్కువ వచ్తినప్పుడు ఎంతో బాధ పడ్డాను. ఏనాడు నేను నా పిల్లలని మెచ్చుకోలేదు. కారణం వాళ్లకు దిష్టి తగులుతుందనే కాక, ఏ మాత్రం గర్వం వాళ్లలో కలిగిందంటే, అది వాళ్ళ భవిష్యత్తుకు కూడా అడ్డుతగులుతుంది. దానివల్ల, వాళ్ళు ఎదగాల్సిన ఎత్తుకు ఎదగలేరు.
నేను నా చదువుకునే వయస్సులో స్నేహితులతో ఎక్కువ తిరిగి విలువైన సమయాన్ని వృధాపరుచుకున్నాను. ఫలితం డిగ్రీలో క్లాస్ తెచ్చుకోలేకపోయాను. నా స్నేహితులందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. వాళ్లు గర్వంగా ఆ మాట చెబుతుంటే "అయ్యో నేను కూడా కష్టపడి చదవి ఉండాల్సింది కదా అనుకున్నాను. సమయం చాలా విలువైనది. మన తప్పు గ్రహించేలోపులే కనుమరుగైపోతుంది. తిరిగి దానిని తెచ్చుకోలేం కదా”.
మరో కొన్ని పేజీలు అలా ఆలోచిస్తూనే తిరగవేసాడు. మరో పేజీలో 'సుధీర్ కాలేజ్ హాస్టల్ కి వెళ్లిపోయాడు. చాలా బాధ పడ్డాను. నేను చిన్నప్పటినుంచి కష్టపడి పెరిగాను. అమ్మ, నాన్న స్థితిపరులు కాదు. సరియైన తిండి, బట్టా ఇవ్వలేకపోయినా కష్టపడి నన్ను చదివించ గలిగారు. ఇంకా బాగా చదువుకుని ఉండాలసిందని ఇప్పుడనుకున్నా ప్రయోజనం ఉందా? ఎంత కష్టపడితే అంత గొప్ప ఫలితం ఉంటుందని తరువాత ఎప్పుడో అర్ధం అయింది.
ఉద్యోగం దొరకక చాలా ఇబ్బంది పడ్డాను. ఎన్ని చోట్ల ఇంటర్వ్యూలకు వెళ్లి సెలక్ట్ అవక వచ్చేసానో తలచుకుంటే బాధగా ఉంటుంది. భగవంతుని దయవల్ల ప్రభుత్వ ఉద్యోగమే సంపాదించుకోగలిగాను. పి. జి యూనివర్సిటీ లో చదవాలనుకున్నాను. కానీ డిస్టెంస్ ఎడ్యుకేషన్ లో చదివాను.
నాలాగా నాపిల్లలు కూడా కష్టాలు పడకూడదన్నదే నా ఆలోచన. అందుకనే దుబారా ఖర్చుకు బదులు, వాళ్లు పొదుపు నేర్చుకోవాలనుకున్నాను. రోజూ సుధీర్ కాలేజ్ కు ఇంటినుండి వెళ్లి రావచ్చు. అలా చేస్తే చాలా డబ్బు సేవ్ అవుతుంది. ఇదే విషయం సుధీర్ కి చెపితే కోపంతో నా మీద అంత అంత ఎత్తు ఎగిరాడు. తండ్రిగా నేను కాకపోతే మరెవరు వాడికి చెప్పగలరు. ఆ డబ్బు వాడి హైయ్యర్ ఎడ్యుకేషన్ కో మరి ఏ ఇతర ఖర్చులకో పనికి వస్తుంది కదా అనే నా ఆలోచన వాడికి అర్ధం కాలేదు. నన్ను ఓ పిసినారి తండ్రిగా భావించాడు. సరే అని ఊరుకున్నాను.
నాకు ఏ చెడు అలవాటూ లేదు. డబ్బు వృధా చేయటం ఎందుకని, కనీసం కాఫీ టీలు కూడా బయట తాగను. అలాగే నా కొలిగ్స్ లంచ్ కు మధ్యాహ్నం హొటల్ కి వెడుతుంటే నేను రానని ఇంటినుండి తెచ్చుకున్న నా టిఫిన్ బాక్స్ లోది తింటాను. నా పిల్లలని నేను తప్పుపట్టటంలేదు. అందరు తల్లితండ్రులు, పిల్లలను పట్టించుకోరు. పట్టించుకునే కొద్దిమందిమీద, వాళ్ళ పెంపకాన్నిబట్టి, పిల్లల అభిప్రాయం ఉంటుంది. సుధీర్, సునీల నా పిల్లలని చెప్పుకోవడానికి, నేను గర్వపడుతున్నాను. ఇద్దరూ చక్కగా చదువుకుంటున్నారు’.
ఇంక అక్కడితో ఆపేసాడు. చదవలేకపోయాడు. సుధీర్ కళ్ల నుండి దుఖాశృవులు రాలిపడుతున్నాయి. తండ్రి మనస్సు అతనికి అర్ధం అవుతోంది. తండ్రి తన దృష్టిలో కఠినాత్ముడు, పిల్లలను ప్రేమించడం తెలియడు వాడు ఇంతవరకు. కాని తండ్రి మనస్సు ఎంత ప్రేమమయమో ఆయన డైరీ చదివితేగానీ అర్ధం కాలేదు. తను అనుభవించిన బాధ తన కొడుకు కి కలిగించకూడదన్న తన ఆశయాన్ని ఏదో వ్రతంలా, ఎవరికో నిరూపించడం కోసం కాక అచ్చంగా తమ కోసం జీవించిన తన తండ్రి మనస్సు ఏమిటో అప్పుడే అర్ధం అయింది సుధీర్ కు.
ఆ రోజు రాత్రి తండ్రి గురించే ఆలోచిస్తున్న సుధీర్ కు నిద్రరావడం లేదు. మంచినీళ్లు తాగుదామని వంటింట్లోకి రాబోతూ తల్లీ తండ్రీ మాట్లాడుకుంటున్న మాటలు కొన్ని అతని చెవిలో పడడం తటస్తించింది.
"సుధీర్ నన్నర్ధం చేసుకోలేదంటే, తప్పు నా పెంపకంలోనే ఉందనుకొంటున్నాను అనూ. నేను చాలాసేపు నచ్చచెప్పడానికి చూశాను. కానీ వాడు మనసులో దృఢభిప్రాయానికి వచ్చినట్లున్నాడు. నా మాటలను అసలు పట్టించుకోవటం లేదు. ఇక్కడే వాడు మనతో ఉంటే వాడికి ఎంత డబ్బు కలసివస్తుందో వాడికి అర్ధం కాదా? కోడలు ఆఫీస్ కు వెడితే స్కూల్ అయిపోయిన తరువాత పిల్లలు ఇంటికి వస్తే ఎక్కడుంటారో చెప్పు.
మళ్లీ వరేణ్య వచ్చేవరకు పిల్లలను చూసుకోడానికి ఒక ఆయాను పెట్టాలి. ఆమె ఎలా చూస్తుందో పిల్లలను. నేను ఏదో వాడికి స్వేఛ్చనివ్వకుండా వాడిని బాధపెడుతున్నానని అనుకుంటున్నాడు. ఈ రోజుల్లో అందరూ విడిగా వుందామనుకునే వాళ్ళే. ‘కలసి ఉంటే కలదు సుఖం’ అనేది పాత సామెత అయిపొయింది. ఈ కాలానికి పనికిరాకుండా పోయింది”.
తండ్రి మాటల్లో బాధ ద్యోత్యమౌతోంది.
"మీరు బాధ పడకండి. వాడికి మన అభిమతం తెలిసే రోజు తప్పక వస్తుంది లెండి. ఇక పడుకోండి రాత్రి పన్నెడయింది"
ఇంక తల్లీతండ్రీ మాటలు వినలేక తన గదిలోకి వచ్చేసాడు.
మరునాడు ఉదయం రామకృష్ణ గదిలో ఒంటరిగా కూర్చుని పేపరు చదువుతున్నాడు. గదిలోకి మెల్లగా వచ్చాడు సుధీర్.
"నాన్నా" మెల్లగా పిలిచాడు.
"ఏం సుధీర్ చెప్పు" పలకరించాడు రామకృష్ణ.
"నన్ను క్షమించండి నాన్నా. మీ మనసు కష్ట పెట్టాను. రాత్రి నేను, వరేణ్య మాట్లాడుకున్నాము. మేము వేరే ఫ్లాట్ కి వెళ్లడం లేదు. బ్రోకర్ కి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఇక్కడే మనింట్లోనే ఉంటాము. నేను మిమ్మలని సరిగా అర్ధం చేసుకోలేకపోయాను. నన్ను క్షమిస్తారా నాన్నా" పశ్చాత్తాపంతొ తండ్రి ని కౌగలించుకున్నాడు.
రామకృష్ణకు చాలా సంతోషం వేసింది. సుధీర్ మనస్సులో తను ఒక చెడ్డ తండ్రిగా నిలచిపోనందుకు.
-- సమాప్తం--
యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
Comments