top of page

క్షీరసాగర మథనము - 1

Writer's picture: T. V. L. GayathriT. V. L. Gayathri

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #ఉత్పలమాల, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 1 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 27/01/2025

క్షీరసాగర మథనము - 1 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి


1.

ఉత్పలమాల.


క్షీరపయోనిధిన్ జిలుక శ్రీకరమౌ సుధకై సురాసురుల్

వారికి తోడుగా నిలిచి వాసిగ కూర్మపు రూపమొంది తాన్

దీరుగ మోసి మందరము దీవెన లిచ్చెను భక్తకోటికా

వారిజనేత్రుడా,హరికి భక్తిగ మ్రొక్కెను విశ్వమంతయున్.//


2.

తేటగీతి.


శ్రోత ‌విష్ణురాతుడువక్త శుకునకెరగి

క్షీరసాగరమున్ దొల్త చిల్కి రెట్లు?

దేవగణములు పొందిన దీనతేమి?

యని యడుగ శుకుడు పలికె ననఘు గాంచి.//


3.

తేటగీతి.


పూర్వకాలమందునబహు పుణ్యులైన

సురసమూహము లోడె నసురుల జేత

తీవ్రమైనట్టి బాధతో తెరలి తెరలి

యమర రాజ్యమున్ గోల్పోయి యడగిరపుడు.//


4.

తేటగీతి.


యజ్ఞ యాగాది కార్యము లాగిపోయె

మునులు యోగులు వగచిరి ముప్పు గనుచు

ధర్మ పరులకు జగతిలో దారిలేక

దుఃఖమొందుచునుదొరలిదొరలిరచట.//


5.

తేటగీతి.


అత్తెఱంగున దేవతలార్తితోడ

బ్రహ్మ దేవుని కడకేగి భక్తికదుర

తలలు వంచుచు తమ బాధ తెలుపు కొనుచు

నిలిచియుండిరి దీనులై నిలువలేక//


6.

తేటగీతి.


చిత్తమందున జిష్ణుని స్థిరము చేసి

నవ్వు మోముతో నప్పుడు నలువ పలికె

''దివిజ వరులార!విష్ణుని దివ్యమైన

శక్తి నిల్పునీ జగతిని శాశ్వతముగ.//


7.

తేటగీతి.


పాదపంబులు గిరులును పక్షి గణము

పశువులున్ మీరు నేనును పంచముఖుడు

జన్మమొందితిమా హరి సంతరించ

జ్ఞాన మయుడైన విష్ణుండు జయము నొసగు.//


8.

తేటగీతి.


సత్త్వగుణముతో నలరారు శార్ఙ్గపాణి

శుభఫలంబుల నొసగునీ శోభనుండు

వాని పాదముల్ బట్టిన భయము తొలగు

మౌని హృదయనివాసుండు మనకు దిక్కు".//


9.

తేటగీతి.


ఇట్లు వచియించి స్రష్టతా నిరవుగాను

సురల గూడి వైకుంఠమున్ జొచ్చెనపుడు

పరమ తేజోమయంబైన పథము గాంచి

నచ్చెరువు నొంది రచ్చట యమర వరులు.//




టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




80 views1 comment

1 commento


క్షీర సాగర మథనం: గాయత్రి టీవీ ఎల్


కొన్ని విషయాలు అర్ధమయ్యి ... పురాణం లోనివి తెలుసుకున్నాం

... చాలా మటుకు సంస్కృత పదాలు అర్థం కాలేదు, కష్టమైన తెలుగు


తేలికైన తెలుగు లో వ్రాయమని మనవి.

పి.వి. పద్మావతి మధు నివ్రితి

Mi piace
bottom of page