#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 11 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 22/02/2025
క్షీరసాగర మథనము - 11 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
ఇక క్షీరసాగర మథనము - 11 చదవండి..
69.
తేటగీతి.
గరళపానంబు జేయగా పరమశివుని
కరమునుండి జారిన విష కణిక లపుడు
వృశ్చికంబుల జాతులై వృద్ధి చెంది
పుడమి యందున విషమును వెడలగ్రక్కె.//
తాత్పర్యము :
పరమశివుడు గరళమును చేసేటప్పుడు ఆయన చేతి నుండి జారిన విషకణములు జారి పడి తేళ్ల వంటి విషపు జాతులై పుడమిలో పుట్టాయి.//
70.
తేటగీతి.
ఉద్ధతించి దేవాసురులుప్పతిల్లి
జయ జయమని పల్కుచు సాగుచుండి
సాగరంబును మథియించ శక్తితోడ
కామధేనువు ప్రభవించె కలిమినీయ.//
తాత్పర్యము :
దేవదానవులు మరలా శక్తి కొద్దీ పాలసముద్రమును చిలుకుతూ ఉంటే ఆ పాల సముద్రంలో నుండి అన్ని కోరికలు తీర్చే కామదేనువు అనే దేవతాగోవు పుట్టింది.//
71.
తేటగీతి.
వేల్పుటావును గ్రహియించి వేడ్కతోడ
మునిగణంబులు భక్తితో మ్రొక్కుకొనిరి
యజ్ఞధేనువై వెలుగొంది యధ్వరమున
కోర్కెలన్నియు తీర్చునీ గోవు నిలిచి.//
తాత్పర్యము :
ఆ కామధేనువును ఋషిగణాలు తీసికొన్నాయి. వారికి యజ్ఞములకు కావలసిన పదార్థాలనన్నిటినీ ఆ గోవు సమకూరుస్తుంది.//
72.
తేటగీతి.
శ్వేతవర్ణంపు నశ్వంబు చిందులేసి
వచ్చె నుచ్ఛైశ్రవంబుగ వార్థినుండి
బలి పరిగ్రహించె పరమ భక్తితోడ
నసురజాతికి నైశ్వర్య మందెనపుడు.//
తాత్పర్యము :
మరియు ఆ పాలసముద్రములో నుండి ఒక తెల్లని గుర్రము పుట్టింది. దాని పేరు ఉచ్ఛైశ్రవము. దానిని దైత్యరాజైన బలిచక్రవర్తి తీసికోవటంతో రాక్షసులు చాలా సంతోషించారు.//
73.
తేటగీతి.
పిదప కలశాబ్ధి నురగల విచ్చుకొనుచు
దేవగజరాజు పుట్టగన్ దిక్కులందు
వెలుగు వెల్లువై చిందగా వేడ్కతోడ
శక్రు డైరావతంబును సంగ్రహించె.//
తాత్పర్యము :
ఆ తర్వాత ఆ పాలసముద్రము నుండి 'ఐరావతము 'అనే తెల్లని ఏనుగు పుట్టింది. దానిని దేవతల రాజైన ఇంద్రుడు తీసికొన్నాడు.//
74.
తేటగీతి.
నాల్గుదంతములొప్పగ నడిచివచ్చు
శ్వేతవర్ణంపు గజముకు శిరము వంచి
ప్రాంజలించిరి దేవతల్ భక్తిమీర
స్వర్గధామము చేరెనా సంపదపుడు.//
తాత్పర్యము :
ఆ తెల్లని ఏనుగు ఐశ్వర్యానికి గుర్తు.ఆ ఏనుగుకు దేవతలందరూ మ్రొక్కారు. అటువంటి ఆ ఏనుగు స్వర్గాన్ని చేరింది.//
75.
తేటగీతి.
కలశరత్నాకరమునుండి కౌస్తుభంబు
వెలికి వచ్చెను దివ్యమై వెలుగు జిమ్మి
వరదుడౌ హరి గ్రహియించి వక్షమందు
నిల్పుకొనగమణి మెరిసె నిగనిగనుచు.//
తాత్పర్యము :
ఇంకా దేవదానవులు ఆ పాలసముద్రాన్ని చిలుకుతూ ఉంటే' కౌస్తుభము'అనే మణి వెలుగులు జిమ్ముతూ వచ్చింది. దానిని శ్రీహరి తీసికొని తన హృదయంపై అలంకరించుకొన్నాడు.//
76.
తేటగీతి.
పారిజాతంబను తరువు ప్రాభవించి
భూషణంబుగ దివియందు పొలయుచుండి
భోగభాగ్యంబు లీయగా పొంగిపొరలి
సంతసించిరి దివిజులు సంబరముగ.//
తాత్పర్యము :
ఆ పాలసముద్రము నుండి పారిజాతమనే వృక్షము పుట్టింది. అది ఎక్కడ ఉంటే అక్కడ భోగభాగ్యాలు ఉంటాయి. దేవతలందరూ సంబరంతో ఆ వృక్షాన్ని స్వర్గానికి తీసుకొనిపోయారు.//
77.
తేటగీతి.
అప్సరాంగనామణులెల్ల నబ్ధినుండి
నాట్యమాడుచు వచ్చిరి నగవుతోడ
సుందరాంగులు దివ్యమౌ శోభలెగయ
స్వర్గలోకమున్ జేరిరి సంభ్రమముగ.//
తాత్పర్యము :
ఆ తర్వాత పాలసముద్రము నుండి అప్సరసలు పుట్టారు. వారు నాట్యమాడుతూ వచ్చి, స్వర్గాన్ని చేరుకున్నారు.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments