#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 12 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 12/03/2025
క్షీరసాగర మథనము - 12 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
ఇక క్షీరసాగర మథనము - 12 చదవండి..
78.
వచనము.
శ్రీమహాలక్ష్మీదేవి యావిర్భావము./
తాత్పర్యము.
పాలసముద్రము నుండి శ్రీమహాలక్ష్మీదేవి పుట్టుట.
79.
చంపకమాల.
చిఱుచిఱు హాసముల్ జిలికి శ్రీకరమౌ సిరి దృశ్యమానమై
మెరిసెను కోమలాంగి తన మేనున శోభలు నివ్వటిల్లగా
సరసుహ నేత్రి సౌరుగని స్థాణువులైరట లోకులెల్లరున్
వరములనిచ్చు తల్లియని ప్రార్థన సల్పిరినారదాదులున్/
తాత్పర్యము :
ఆ మహాలక్ష్మీదేవి చిన్నగా నవ్వుతూ పాలసముద్రము నుండి వెలికివచ్చి అందరికీ కనిపించింది.ఆమె దివ్యమైన శరీరకాంతితో మెరిసిపోతూ ఉంది. ఆ తల్లి అందాన్ని చూచి లోకులందరూ నిశ్చేష్టులైనారు. 'జగతికి వరాల నిచ్చే తల్లి 'అంటూ ఆమెను భక్తిగా ప్రార్థన చేశారు.//
80.
సీసము.
తరుణి లావణ్యము ధగధగలాడుచు
వెలుగులు నింపెనీ విశ్వమందు
నల్లని ముంగురు లల్లన పైబడి
ఫాలభాగమునందు గ్రాలుచుండ
శశికితోబుట్టువై చక్కదిద్దగ మోము
చంద్రవదనయని జగతి పిల్చె
కమలాలు సిగ్గుతో కమిలిపోయినవట
కన్నుల చిందెడి కాంతిగనుచు./
తేటగీతి /
పసిడి చెక్కిలి నిగనిగల్ పరిఢవిల్ల
చుబుక మొక్కటి తనరారె శోభనముగ
కంఠసీమరేఖలకాంతి కలియతిరిగి
గానకళయందు భాసిల్లె గ్రామములుగ.//
తాత్పర్యము.
ఆ లక్ష్మీదేవి యొక్క లావణ్యము ధగధగలాడుతూ ఉంది. ఆ వెలుగులు విశ్వమంతటా నిండిపోయాయి. నల్లని ముంగురులు నుదుటిమీద వాలుతూ ఉన్నాయి.చంద్రునికి తోడబుట్టినది కదా ఆమె ముఖము అందంగా గుండ్రంగా ఉంది.అప్పుడు లోకులు ఆమెను 'చంద్రవదనా!'అని పిలిచారు.తామరపూవులు ఆ తల్లి యొక్క కనుల కాంతి చూచి సిగ్గుతో ఎఱ్ఱబడ్డాయట.ఆమె చెక్కిలి నిగనిగలాడుతూ ఉంటే అక్కడ ఆమె చిన్న చుబుకము (గడ్డము) చూడటానికి చాలా అందంగా ఉందట.
ఆమె కంఠము మీద మూడు రేఖలు గానకళలోని మూడు స్థాయిలను సూచిస్తోందట.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments