#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి, #సీసము

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 13 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 17/03/2025
క్షీరసాగర మథనము - 13 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
ఇక క్షీరసాగర మథనము - 14 చదవండి..
81.
సీసము.
పయ్యెద పైనున్న పసిడి భూషణములు
తళుకులీనంగనా తరుణి మెరసె
గలగలమంచును కరకంకణంబులు
గణగణ మ్రోగంగ కాంతులెగసె
సన్నని కౌనుకు చక్కని మొలనూలు
పట్టియుంచెను కదా వాలిపోక
కింకిణీ ధ్వనివిని కిలకిలా రావముల్
పలుకుటలేదట పక్షిగణము./
తేటగీతి/
ముగ్ధరూపంబు పొలయంగ మోహనముగ
'కన్న తల్లి!యటంచును సన్నుతించి
ముచ్చట పడుచు జలధితాన్ బొంగిపోవ
దేవదుందుభుల్ మ్రోగెను దిక్కులదర.//
తాత్పర్యము.
శ్రీమహాలక్ష్మి వల్లెవాటు పైన ఆమె వేసుకున్న బంగారు హారాలు తళుకు మంటూ ఉంటే ఆమె మెరిసి పోతున్నది.ఆమె చేతికీ ఉన్న గాజులు గలగల మ్రోగుతూ కాంతులను చిలుకుతున్నాయి.ఆమె సన్నని నడుముకు కట్టిన వడ్డాణం ఆ నడుము వంగిపోకుండా కాపడుతుందా అన్నట్లుగా ఉంది.ఆమె పాదముల మువ్వల సవ్వడి విని పక్షులు సిగ్గుతో అస్సలు కిలకిలా రావాలు చేయటం లేదట!ఆ లక్ష్మీదేవి రూపము అంత మోహనంగా ఉంది. అది చూచి సముద్రుడు తన కూతురే అంటూ పొంగి పోతున్నాడు. అటువంటి సమయంలో దేవతలందరూ పెద్ద పెద్ద వాయిద్యాలు మ్రోగించారు.//
82.
తేటగీతి.
పరమపావనమూర్తికి ప్రాంజలించి
యనిమిషేంద్రుడు మేలిమి యాసనమును
సిరుల తల్లికి నొసగంగ శీఘ్రగతిని
యప్సరాంగనల్ ముదముతో నాడిరపుడు.//
తాత్పర్యము.
ఆ పావన మూర్తికి నమస్కారం చేసి దేవేంద్రుడు ఆమెకు మంచి సింహాసనమును బహుమతిగా ఇచ్చాడు.అప్పుడు అప్సరసలు సంతోషంతో నాట్యం చేశారు.//
83.
సీసము.
బంగారు పాత్రల బొంగుచు సింధువుల్
జలముల నిడగ మజ్జనము కొఱకు
ధరణి యౌషధములన్ దండిగా తెచ్చెను
లేపనంబులు పూయ లిప్తలోన
సురభిసంతతి దెచ్చె శుద్ధమైనట్టియా
పంచగవ్యంబులన్ భక్తిమీర
చైత్రఋతువు దెచ్చె చిత్రంపు వర్ణాల
కుసుమంపు మాలలు కూర్చిగట్టి./
తేటగీతి./
మౌనితతిvపఠించగ వేద మంత్రములను
నర్తకీమణులట సేయ నాట్యములను
గాన గాంధర్వ గణములు గమకగతిని
పాడుచుండిరి గీతికల్ పరవశించి.//
తాత్పర్యము.
లక్ష్మీదేవి స్నానం చేయటానికి నదులన్నీ బంగారు పాత్రలతో నీటిని తెచ్చాయి. ఆమె దేహానికి పూయటానికి భూమాత ఒక్క నిమిషంలో మంచి గంధపు లేపనాన్ని తెచ్చి ఇచ్చింది. గోవుల సమూహలు తమ పాలు, పెరుగు, నెయ్యి వంటి పంచ గవ్యములను ఆ దేవికి తెచ్చి పెట్టాయి. వసంత ఋతువు ఆ తల్లిని అలంకరించటానికి విచిత్రమైన రంగు రంగుల పూవులను తెచ్చి ఇచ్చింది. ఆ సమయంలో మునులందరూ మంగళకరంగా వేదాన్ని పఠించారు. నర్తకీమణులు నాట్యం చేశారు. గంధర్వులు పరవశంతో పాటలు పాడారు.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments