#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి, #సీసము

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 14 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 20/03/2025
క్షీరసాగర మథనము - 14 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
ఇక క్షీరసాగర మథనము - 14 చదవండి..
84.
సీసము.
మేఘసమూహముల్ మేనులన్ ధరియించి
మ్రోగించె కాహళా బూరలచట
శంఖనాదంబులు సల్పుచు సిద్దులు
వీణలన్ వాయించ వేడ్కతోడ
నష్టదిగ్గజములు నభిషేకమొనరింప
జలధి తన సుతకు చైలమీయ
వారిజనేత్రికి పరమ భక్తిని జూపి
వైజయంతీమాల వరుణుడొసగె!//
తేటగీతి.
విశ్వకర్మ తా నొసగుచు వివిధవర్ణ
భూషణంబులు దేవికి పూజసేయ
మౌక్తికపు హారమున్ దెచ్చి మాత కిడుచు
పలుకు పూబోడి స్తోత్రాల పఠన జేసె.//
తాత్పర్యము.
నింగిలోని మబ్బుల గుంపులు మనుష్యరూపములతో కాహళాధ్వనులు చేశాయట. సిద్ధులు కొందరు శంఖాలు మోగిస్తే, కొందరు వీణలు వాయించారట. అష్టదిగ్గజాలు ఆ లక్ష్మీదేవికి అభిషేకము చేస్తే, సముద్రుడు తన కుమార్తెకు మంచి వస్త్రములను బహుమానంగా ఇచ్చాడట. వరుణుడు ఆ శ్రీదేవికీ చక్కని వైజయంతి మాలను ఇచ్చాడట. విశ్వకర్మ రకరకాల రంగులతో ఉండే రత్నాల నగలను ఆ తల్లికి ఇచ్చి ఆమెను పూజించాడట. ఆ సమయంలో సరస్వతీదేవి ముత్యాలహారమును లక్ష్మీదేవికిచ్చి ఆమెను స్తుతించిందట.//
85.
తేటగీతి.
కుండలంబుల నీయగన్ గుహనజాతి
బ్రహ్మదేవుండు పూమాల వరుసనొసగ
కమల మందహాసము చిల్కి కాంచుచుండ
జగములన్నియు మురియుచు జయము పలికె.//
తాత్పర్యము.
ఆ లక్ష్మీదేవికీ నాగజాతి చెవులకు పెట్టుకొనే కమ్మలను తెచ్చి ఇవ్వగా, బ్రహ్మదేవుడు పూలమాలలను ఆదేవికీ ఇచ్చాడట. అప్పుడు ఆ రమాదేవి నవ్వుతూ చూస్తూ ఉంటే సర్వజగములు సంతోషంతో 'శ్రీదేవికి జయ'మంటూ పలికాయట.
///

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments