top of page

క్షీరసాగర మథనము - 16

Writer: T. V. L. GayathriT. V. L. Gayathri

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి, #సీసము

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 16 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 25/03/2025

క్షీరసాగర మథనము - 16 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి



ఇక క్షీరసాగర మథనము - 16 చదవండి..

88.

తేటగీతి.


దేవగంధర్వ యక్షులన్ దేఱి చూచి

విసువుకొనుచును తుదకట విష్ణునిగని

త్రిగుణ రహితుండు జిష్ణుండు తగిన వరుడు

పరమపథమును జూపెడి వరదుడతడు!//


తాత్పర్యము.


ఆ లక్ష్మీదేవి దేవతలను,గంధర్వజాతివారిని, యక్షులను తేరిపార చూస్తూ, విసుగ్గా వెళుతూ చివరకు విష్ణువును చూసింది. ఆ విష్ణుమూర్తి ఆమెకు తగిన వరుడు. పరమపథమును చూపే పరమాత్మ. కోరిన వారి కోరికలు తీర్చేవాడు. గుణదోషములు లేనివాడు.//


89.

తేటగీతి.


యనుచు వరమాల గైకొని యబ్దితనయ

శ్రీశు కంఠమందున వేసి సిగ్గుపడెను

ప్రేమ నిండిన కనులతో ప్రీతితోడ

చూపు ద్రిప్పక నాహరిన్ జూచుచుండె!//


తాత్పర్యము.


ఈ విష్ణువు తనకు తగినవాడనుకొంటూ లక్ష్మీదేవి తన చేతిలోని పూమాలను శ్రీహరి మెడలో వేసి సిగ్గుపడింది. చాలా ప్రేమగా హరి వైపు చూస్తూ ఉంది.//


90.

తేటగీతి.


అతివ మానసంబును గెల్చి యక్షధరుడు

తనదు వక్షమందునసిరిని దాల్చెనపుడు

జగములేలెడి జంటకు జయమటంచు

ముజ్జగంబులు భక్తితో మ్రొక్కెనపుడు.//


తాత్పర్యము.


లక్ష్మీదేవి మనసు గెల్చుకొన్న విష్ణుమూర్తి తన హృదయంలో సిరిని నిలుపుకొన్నాడు. అప్పుడు  జగములను పరిపాలించే లక్ష్మీనారాయణులకు 'జయము !జయము!'అని ముల్లోకములు మొక్కుతూ ఉన్నాయి.//


91.

తేటగీతి.


శంఖనాదముల్ మ్రోగెనా సమయమందు 

నృత్యముల్ జేసి పాడుచు నివ్వటిల్లి 

యప్సరాంగనామణులెల్ల యమితమైన

సంతసంబును బొందిరా స్వర్గమందు.//


తాత్పర్యము.


ఆ సమయంలో శంఖనాదములు మ్రోగాయి. స్వర్గంలోని అప్సరసలు చాలా సంతోషంతో పాటలు పాడుచు, నృత్యాలు చేశారు.//


92.

తేటగీతి.


పుష్పవృష్టిని కురిపించి మొయిలునుండి

బ్రహ్మదేవుండు, దేవతల్, పరమశివుడు

ఘనులు ప్రజాపతులు గూడి కరములెత్తి

స్తుతులు పఠియించి భక్తితో సొక్కిరంత.//


దేవతలు ఆకాశంనుండి పుష్పవర్షం కురిపించారు. బ్రహ్మదేవుడు, పరమశివుడు, ప్రజాపతులు, దేవతలు అందరూ చేతులెత్తి లక్ష్మీనారాయణులను భక్తితో స్తుతించారు.//


(సశేషం ).


క్షీరసాగర మథనము - 17 త్వరలో


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page