top of page

క్షీరసాగర మథనము - 2

Writer's picture: T. V. L. GayathriT. V. L. Gayathri

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి, #మత్తేభవిక్రీడితము

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 2 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 28/01/2025

క్షీరసాగర మథనము - 2 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి


10. వచనం :


అపుడు బ్రహ్మదేవుండు విష్ణుభగవానుని ఇట్లు స్తుతించె.


  1. మత్తేభ విక్రీడితము //


సురలున్ యోగులు నీదు జాడ కొఱకై శోధించి వేసారి తె /

న్నెఱుగం జాలక చింతవోయిరట నీవేతావునందుందువో!

గరిమన్ తెల్పుమ!పాంచజన్యధర!నీ కారుణ్యమే

చూపుచున్ /

బరమాత్మా!కనుపించవయ్య!కనలేవా! మా మనోవేదనన్ //


  1. మత్తేభ విక్రీడితము //


పరధర్మంబును జేతబట్టి జనుచున్ బాపాత్ములై

నుద్ధతిన్ /

బరహింసాపఱులైన క్రూరమతులన్ వారించి శౌర్యంబుతో /

ధరణిన్ బ్రోచిన శౌరి!భక్తిమెయి మా దైవంబు నీవంచు మా/

శిరమున్ వంచి భజింతుమయ్య!వరదా!సేమంబునే గోరుచున్//


  1. తేటగీతి.


నిర్వికారుడవైనట్టి నిర్మలాత్మ!

ఆదిపురుషుడవై నిల్చి యాదరమున

సకలజీవిహృదయములను చౌకలించు

శ్వాస రూపమై వెల్గెడు చక్రధారి!/


  1. తేటగీతి.


సర్వలోకపాలకుడవై శక్తినిడుచు

ప్రకృతి యందున మాయగా పరిఢవిల్లి

యాది విద్యావికసితుడ

వాత్మజుడవు

ప్రాణికోటికి దిక్కునీ పాదయుగము./



  1. తేటగీతి.


శ్రీనిధరియించి సురలకు శ్రేయమొసగి

యోగివరులకు దీప్తివై యుద్భవించి

జ్ఞానభిక్షనొసంగెడి శాంతమూర్తి

నిన్ను కనలేని వారికి నెలవు కలదె?/


  1. తేటగీతి.


విషయవాసనలందు మున్గి వెతలు పడుచు

జలధి వంటిదౌ సంసార చక్రమందు

తిరుగు చుండెడి జీవులన్ కరుణతోడ

నొడ్డు చేర్చెడి దేవర!యురగ శయన!/


  1. తేటగీతి.


ఆర్తరక్షక!మాయెడ యాదరముగ

వరకటాక్షమొసంగిన భారముడుగు

పెక్కు రూపముల్ దాల్చెడి పృశ్నిశృంగ!

యక్షధరుడవై తొలగించు మాపదలను.//


  1. తేటగీతి.


సంచితంబగు కర్మలన్ జన్మలందు

మోసికొనుచుండి మనుజులు మోసపోవ

నుద్ధరించగ ప్రేమతో నుర్వియందు

పుట్టుచుందువు ప్రజలకు పుణ్యమీయ.//


  1. తేటగీతి.


దుష్టసంతతి ధరణిపై దొరలుచుండ

శిష్టరక్షణ సేయగా సిద్ధమగుచు

పలురకంబుల రూపముల్ బడసి నీవు

కాపుకాయగ వత్తువు కమలనయన!//


  1. తేటగీతి.


పుడమి భారమునొందుచు పొగిలినపుడు

తమమునందున లోకముల్ తరలినపుడు

కాంతిరేఖవై నిలిచెడి కైటభారి!

మొరను వినరావ!వేగమే మోహనాంగ!//


  1. తేటగీతి.


సూక్ష్మరూపివై మనసులో జొచ్చియుండి

చేతనత్వము కలిగించు శ్రీకరుడవు

దివ్యపథమును జూపించు దేవదేవ!

సన్నుతింతుము నీ మ్రోల సాంత్వననిడు!//


  1. తేటగీతి.


కష్టకాలమున్ బోద్రోలి కలిమి నొసగు

చిన్మయాకార!నీవు మా చింతతీర్చి

కేలు పట్టుచు నడిపించి కృపను జూపి

యుద్ధరించగ రావయ్యా!యురికి యురికి.//


  1. తేటగీతి.


సుహృతుడవటంచు నమ్మినీ స్తోత్రములను

సలుపు చుంటిమి భక్తితో నిలిచియుండి

యసుర బాధలన్ బోగొట్టి యభయమిడుచు

దర్శనంబు దయనిడుమో దానవారి!//


  1. తేటగీతి.


బ్రహ్మదేవుడు సురలును పంచముఖుడు

సన్నుతించగ విష్ణుండు సంతసించి

దర్శనంబునొసంగగ తనువు మరచి

ప్రార్థనల్ సల్పిరా సురల్ పరవశమున.//



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




46 views0 comments

Commentaires


bottom of page