top of page

క్షీరసాగర మథనము - 20

Updated: 7 days ago

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 20 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 08/04/2025

క్షీరసాగర మథనము - 20 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి


ఇక క్షీరసాగర మథనము - 20 చదవండి..


106.

తేటగీతి.


లలన మోమును గాంచుచు లలిని జూపి

నసుర నాయకుల్ ప్రేమతో నడిగిరపుడు 

"పసిడి వన్నెలు కల్గిన పడతి తెలుపు 

నీదు పరిచయంబును మాకు నెనరుతోడ!//


తాత్పర్యము.


రాక్షసులు ప్రేమతో ఆ మోహిని ముఖాన్ని చూస్తూ ఇలా అడిగారు.

"బంగారు వన్నెతో  ఉన్న ఓ యువతీ!నీ పరిచయాన్ని ప్రేమతో మాకు తెలుపు!//


107.

తేటగీతి.


తరుణి!చారణ కిన్నెర దైత్య, దివిజ,

యక్ష జాతుల నీవంటి యతివ కలదె?

నిన్ను పొందెడి వారలు నిశ్చయముగ

జగతి నేలుట తధ్యమౌ జయము కలుగు!//


ఓ తరుణీ!చారణ,కిన్నెర, రాక్షస, దేవ, యక్ష జాతులలో నీ వంటి స్త్రీ ఉందా? (లేదు )నిశ్చయముగా నిన్ను పొందిన వారు ఈ ప్రపంచాన్ని గెలుస్తారనటం కచ్చితంగా జరుగుతుంది.//


108.

తేటగీతి.


అసురజాతికి లభియించె నమృతమిపుడు

తగవు పుట్టెను మాలోన తగిన రీతి

తగవు తీర్చెడి తెలివైన దానవీవు

ప్రతిభ చూపుచు నమృతమున్ బంచిపెట్టు!//


మా రాక్షసజాతి కోరిక మేరకు అమృతం దొరికింది. కానీ దాని కోసం మాలో మాకు తగవు పుట్టింది. ఈ తగవుతీర్చే తెలివైనదానివి నీవు.  నీ ప్రతిభతో మాకు ఈ అమృతాన్ని పంచిపెట్టు!//


109.

తేటగీతి.


నీవు మా వెంట చనుదెంచి నెమ్మితోడ

నమృతమున్ గృపతో పంచి యాదరించ

భువనముల్ గెల్చు కొంచును బొంగిపోయి

పాదముల్ పట్టి కొల్తుము పడతి నిన్ను!"//


ఓ!అమ్మాయీ!నీవు మాతో వచ్చి అమృతమును పంచితే, మేము ఈ లోకాలన్నింటిని గెలుస్తాము!అంతేకాదు నీ పాదాలను ఎప్పుడూ పూజిస్తాము!"//


(సశేషం )



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page