క్షీరసాగర మథనము - 22
- T. V. L. Gayathri
- 4 days ago
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 22 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 11/04/2025
క్షీరసాగర మథనము - 22 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
ఇక క్షీరసాగర మథనము - 22 చదవండి..
115.
తేటగీతి.
విష్ణుమాయ నెఱుంగక వెలదిఁ గాంచి
దేవదానవుల్ తూరుపు దిక్కుయందు
నధివసించిరి ముదముతో నమృతమునట
త్రావబూనుచు సల్పిరి ధర్మవిధులు.//
తాత్పర్యము.
విష్ణుమాయను తెలిసికొనలేని దేవతలు, రాక్షసులు ఆ మోహినిని చూచి, అమృతమును త్రావటానికి ముందు చేయవలసిన పూజలను చేసి తూర్పు దిక్కుగా కూర్చున్నారు.//
116.
తేటగీతి.
క్రూరులైనట్టి దైత్యులన్ గూల్చివేయ
విష్ణు వత్తఱి దివిజలన్ వేరుచేసి
యమృత కలశంబు చేబూని యమరతతికి
పంచిపెట్టుచు నుండెనా పంక్తిలోన!//
తాత్పర్యము.
చెడ్డవాళ్ళైన రాక్షసులను ఓడించటానికి విష్ణుమూర్తి దేవతలనొక వరుసలో, రాక్షసులనొక వరుసలో కూర్చుండబెట్టి అమృతకలశాన్ని తీసికొని దేవతలకు పంచిపెడుతూ ఉన్నాడు.//
117.
తేటగీతి.
మోహినీదేవి చేసెడి మోసకారి
తనము గాంచి రాహువనెడి దైత్యవరుడు
దేవతారూపమున్ గొని దివిజులకడ
చేరి యమృతంబు త్రావగ సిద్ధపడెను.//
తాత్పర్యము.
మోహినీదేవి చేసే మోసమును గమనించి రాహువను రాక్షసుడు దేవతారూపముతో దేవతల ప్రక్కన కూర్చుని అమృతమును త్రావటానికి సిద్ధపడ్డాడు.//
(సశేషం )
క్షీరసాగర మథనము - 23 త్వరలో

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments