top of page

క్షీరసాగర మథనము - 24

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 24 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 19/04/2025

క్షీరసాగర మథనము - 24 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి


ఇక క్షీరసాగర మథనము - 24 చదవండి..


121.

వచనము.

ఇవ్విధంబుగ నా విష్ణుమూర్తి దివిజవరులకు నమృతమును బంచి వారి నుద్ధరించె. అమ్మహాత్ముని కృపాకటాక్షమువలన దేవతలు యమరులైరి. క్షీరసాగరమను వృత్తాంతము నెఱింగిన యా పరీక్షిన్మహీపతి నిర్గుణాత్ముడైన శుకయోగీంద్రునికి మ్రొక్కి పరాత్పరుడా విష్ణుని దివ్యలీలలను మదియందు మరల మరల తల్చి పొంగిపోయెను.//

122.

తేటగీతి.

విష్ణుదేవుని భక్తితో వేడుకొనిన

సురలు పొందిరి సంపదల్ శుభము కలిగె 

దేవదేవుని లీలలు దివ్యమైన

ఫలిత మొసగును భక్తితో పఠనజేయ!//

తాత్పర్యము.

విష్ణుదేవుని భక్తితో వేడుకొని దేవతలు సంపదలను శుభమును పొందారు.ఆ దేవదేవుని లీలలు భక్తితో చదువుకుంటే దివ్యమైనట్టి ఫలము దొరుకుతుంది.//

123.

తేటగీతి.

పరమపథమును జూపెడి పంకజాక్షు 

కథలు శ్రవణము జేసిన కలిభయంబు 

కలగబోదని శుకయోగి పలుకుచుండ 

పుణ్యశీలుని గని రేడు మ్రొక్కెనపుడు.//

తాత్పర్యము.

ముక్తిమార్గము చూపే విష్ణుమూర్తి కథలు విన్నంతమాత్రాన కలిభయము ఉండదని శుకయోగీంద్రుడు తెలుపగానే ఆ పరీక్షిన్మహారాజు ఆ యోగికి భక్తితో మ్రొక్కాడు.//

124.

మత్తకోకిల.

మంగళంబులు.

మంగళంబులు దానవారికి మంగళంబులు ధర్మికిన్

మంగళంబులు చక్రధారికి మంగళంబులు శౌరికిన్

మంగళంబులు వేదరక్షకు మంగళంబులు విష్ణుకున్

మంగళంబులు కేశిహంతకు మంగళంబులు కృష్ణకున్//


(సమాప్తం)


'క్షీరసాగరమథనము' అను విష్ణులీల నేటితో సమాప్తము.


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




Comments


bottom of page