top of page

క్షీరసాగర మథనము - 3

Writer's picture: T. V. L. GayathriT. V. L. Gayathri

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి, #కందం

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 3 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 29/01/2025

క్షీరసాగర మథనము - 3 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి



25.

తేటగీతి.


దేవదేవుండు విష్ణుండు దివ్యమైన

పీతవస్త్రమున్ దనువున వివిధరత్న

భూషణంబులన్ మురియుచు పుణ్యమొసగు

వైజయంతిమాల ధరించి వచ్చి నిలిచె.//



26.

కందం.


శివుడును బ్రహ్మయు సురలును

స్తవములు సల్పుచును తాము సాగిలపడగన్

ప్రవిమల హృదయుండగు హరి

జవసత్త్వముల నిడువాడు సంతసమొందెన్.//


27.

తేటగీతి.


చిరుమందహాసంబును జిల్కు చుండి

చిన్మయాకారుడు సురలన్ జేరబిలిచి

బోధ సేయ దొడంగె తా బుణ్యమలర

'ధర్మగతిలోన చరియించి తరల వలయు.//


28.

తేటగీతి.


కార్యసాధకు లెంచరు కాలగతిని

గుణము కల్గిన వారలు కూర్మి తోడ

శత్రువర్గంబు తోడుతన్ సంధి పొసగి 

యుండునట్లుగ జూచుట నుత్తమంబు.//


29.

తేటగీతి.


గూఢమతులౌచు కార్యమున్ గొఱతలేక

సాధనంబుతో మేలుగన్ సల్పవలయు

నమృతంబును బొందంగ నసుర జాతి

కలిసి వచ్చును మీతోడ కరము కలిపి.//


30.

తేటగీతి.


క్షీరజలనిధిన్ జిల్కంగ సిద్ధ పడుచు

మొట్టమొదటగా నౌషధమూలికలను

వృక్ష రాశులన్ ధాన్యముల్ వెదికి దెచ్చి

జలము లందున కలుపుడు జయముకోరి.//



31.

తేటగీతి.


మందరాచలమున్ గొని యబ్ధి నిలిపి

వాసుకిన్ రజ్జువుగ జేసి వాసితోడ

మీర లసురుల నోర్మిమై చేరియుండి

సాగరంబును మథియింప జయము కలుగు.//



32.

తేటగీతి.


శాంతగుణముతో కార్యమున్ జక్కబెట్టి

శ్రమను ధారగా బోసిన సత్ఫలితము

పొంది సుఖముగా జీవించి పుణ్యమలర

జాతి రక్షణ జేయుడు సంతసముగ.//


33.

తేటగీతి.


క్రోధగుణమును విడనాడి కూర్మితోడ

నసుర జాతితో మైత్రిని పొసగుచుండ

నమృతంబును సాధించి యమరతతికి

జీవమీయగా మీకున్న చింత దీరు.//


34.

తేటగీతి.


దివిజవరుల నాదేశించి దీవెనలిడి

చక్రధరుడుతా నగవుతో సాగిపోవ

శంకరుండును బ్రహ్మయు సంతసముగ

వెడలిపోయిరి కీర్తించి వెన్నునపుడు.//


35.

వచనము:


తదనంతరమున ఇంద్రాది దేవతలు అసుర చక్రవర్తియగు బలి యొద్దకు వెళ్ళిరి.//



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




24 views0 comments

Comments


bottom of page