#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి
![](https://static.wixstatic.com/media/acb93b_ea1397d771c84a14bdbc0578154b53c5~mv2.jpg/v1/fill/w_940,h_788,al_c,q_85,enc_auto/acb93b_ea1397d771c84a14bdbc0578154b53c5~mv2.jpg)
(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 4 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 30/01/2025
క్షీరసాగర మథనము - 4 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
36.
తేటగీతి.
ఆయుధంబులు లేనట్టి యమరవరుల
గాంచి యసురులు బంధింప కదిలిరపుడు
ఘనుడు బలి మహోన్నతుడంత కరుణతోడ
దైత్యవరులను వారించి దయను జూపె.//
37.
తేటగీతి.
మూడులోకమ్ములఁ జయించి పుణ్యశీలి
భక్తప్రహ్లాద సమ్రాట్టు పౌత్రుడైన
బలి యనఘుడు జూపె తనదు ప్రాభవమును
దానధర్మాది నిరతుడీ దైత్యవిభుడు.//
38.
తేటగీతి.
బుద్ధిశాలియై సురతాణి పూజ్యుడయిన
బలికి నెఱిగించె విష్ణుని పథకమనుచు
ఘనుడు వైరోచనుండు తాన్ గమనికమెయి
సమ్మతించెను తర్షుడై సంధినపుడు.//
39.
తేటగీతి.
క్షీరసాగర మథనంబు జేయగోరి
మిత్రులైరి సురాసురుల్ మేలుపొంద
మందరంబును బెకలించి మార్గమందు
డస్సిపోయిరి వారలు ధైర్యముడుగ./
40.
తేటగీతి.
మందరాచలమును గొని మాటరాక
క్రింద పడవైచి కుమిలిరి క్రుంగి పోయి
గరుడవాహనారూఢుడై కరుణతోడ
నత్తెఱంగున శ్రీహరి యరుగుదెంచె.//
41.
తేటగీతి.
పర్వతంబును లీలగా పట్టుకొనుచు
విష్ణువు జలధిలో పడవేయ నగుచు
సురలు దైత్యులు కలశాబ్ధిఁ బిరబిరనుచు
చిలుకు చుండగా నచలము ములిగి పోయె.//
42.
తేటగీతి.
విఘ్నముల్ తొలగించెడి విష్ణుమూర్తి
కూర్మరూపమున్ దాల్చుచు కొప్పరించి
మందరంబును తానెత్తి మాటనిలిపి
శక్తి చూపెను జగతికి సంతసముగ.//
43.
తేటగీతి.
మందరంబును నిల్పెడి మహితశక్తి
బాహుబలముతో విష్ణుండు పాదుకొనగ
నాకసంబున సిద్ధులు హర్షమొంది
పుష్పవర్షము కురిపించి పొంగిరపుడు.//
క్షీరసాగర మథనము - 5 త్వరలో
![](https://static.wixstatic.com/media/acb93b_5f0667fa4fb2479ba3b15b34f01b0d51~mv2.jpeg/v1/fill/w_980,h_1136,al_c,q_85,usm_0.66_1.00_0.01,enc_auto/acb93b_5f0667fa4fb2479ba3b15b34f01b0d51~mv2.jpeg)
టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments