top of page

క్షీరసాగర మథనము - 5

Writer's picture: T. V. L. GayathriT. V. L. Gayathri

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 5 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 01/02/2025

క్షీరసాగర మథనము - 5 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి

44.

తేటగీతి.


దివిజతతి మరి యసురులు స్థిరమతులయి

బలముతో మథియింపంగ జలధినంత

నాగరాజైన వాసుకి నలువుమీర

ఘోరమౌవిష జ్వాలలన్ గురియుచుండె.//


తాత్పర్యము :

దేవతలు, దానవులు కలిసి బలముతో పాలసముద్రమును చిలుకుచుండగా మందరపర్వతమునకు త్రాడుగా చుట్టుకొన్న వాసుకి అను మహాసర్పము విషజ్వాలలను తన నోటినుండి చిమ్ముతూ ఉంది.//


45.

తేటగీతి.


పాము విదిలించు శ్వాసతో బాధనొంది

శక్తిహీనులై దివిజులు జడిసిపోవ

నసుర జాతులు వగపుతో నదరిపడగ

పద్మనాభుండు దయగొని భయముబాపె.//


తాత్పర్యము :

పాము విదిలించెడి విషపుగాలితో దేవతలు, రాక్షసులు తట్టుకొనే శక్తిలేక భయపడుతూ ఉంటే శ్రీమహావిష్ణువు వారి భయాన్ని పోగొట్టాడు.//



46.

తేటగీతి.


వర్షధారలు కురిపించి 

వరదుడగుచు

వారినాదుకొనుచు హరి బ్రాణమొసగ

దివిజ దానవ గణములు స్థిరముగాను

క్షీరసాగరంబును వేగ చిల్కిరపుడు.//


తాత్పర్యము :

ఆ పాలసముద్రముపైన శ్రీహరి వర్షాన్ని కురిపించగా వాతావరణం కాస్త చల్లబడింది.ప్రాణాలు తిరిగి వచ్చాయి.అప్పుడు దేవతలు, దానవులు బలం కలవారై పాలసముద్రాన్ని ఇంకా వేగంగా చిలకసాగారు.//


47.

తేటగీతి.


జలచరంబులు క్షోభతో జరజరయని

తిరుగుచున్నవి కలశాబ్ధి తెరలుచుండ

నట్టి కాలము నందు విషాగ్ని పుట్టి

సర్వదిక్కులఁ  వ్యాపించె సత్వరముగ.//


తాత్పర్యము :


ఇలా దేవ దానవులు పాలసముద్రాన్ని చిలుకుతూ ఉంటే,పాలసముద్రంలో ఉండే చేపలు, తాబేళ్ల వంటి జలచరాలు చాలా బాధపడుతూ, అవి కూడా గిరగిరా తిరుగుతున్నాయి. ఆ సమయంలో ఆ పాలసముద్రంలో ఘోరమైన విషము అగ్ని వలె మండుతూ పుట్టుకొచ్చింది.ఆ అగ్ని జ్వాలలు వెంటనే నలుదిక్కులకూ వ్యాపించాయి.//


48.

తేటగీతి.


దుర్భరంబైన విషకీల దుస్తరముగ

జగతి పైబడి పీడింప జనులు వగచి

త్రాహిపాహి యటంచును తల్లడిల్లి

శరణు వేడిరి శివునిసచ్ఛాంతి

కొఱకు.//


తాత్పర్యము :


భరించలేనటువంటి విషజ్వాలలు  జగతిపైన పడ్డాయి.. వాటిని చూచి ప్రజలు చాలా భయపడ్డారు.దేవతలు, రాక్షసులు, జనులు కలిసి పరమశివుని వద్దకు వెళ్లి రక్షించమని వేడుకొన్నారు.//


49.

తేటగీతి.


సతిని కూడిన శంభుడు జపతపంబు

సల్పుచుండెను జగతికి జయమునొసగ

పరమ శివునిని దర్శించి బ్రహ్మమరియు

సకల దేవతల్ మ్రొక్కిరి సాగిలపడి.//


తాత్పర్యము :


ఆ సమయంలో పరమశివుడు కైలాసంలో పార్వతీదేవితో కూడి విశ్వశాంతి కొఱకు తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ మరియు సకల దేవతలు శంకరునికి సాగిలిపడి మ్రొక్కారు.//


క్షీరసాగర మథనము - 6 త్వరలో


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




37 views0 comments

Komentarai


bottom of page