top of page

క్షీరసాగర మథనము - 6

Writer's picture: T. V. L. GayathriT. V. L. Gayathri

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 6 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 03/02/2025

క్షీరసాగర మథనము - 6 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి


50.

వచనం.


బ్రహ్మ,దేవతలు మరియు ప్రజాపతులు సదాశివుని యిట్లు స్తుతించిరి.


51.

ఉత్పలమాల.


పాలన జేయు దేవరవు భక్తవశంకర!లోకపాలకా!

తాలిమి జూపరావ వరదానము నీయవ!జాగుసేయగా

తాళగలేము స్వామి!పరితాపము  దీర్పగ వేగరావ!మా

పాలిటి ప్రాణబంధుడవు బాధలుబాపెడిదారిచూపుమా!//


తాత్పర్యము :


జగతిని పాలన చేయు దేవుడవు!భక్తులకు బందీయైనవాడా!దయను జూపవా!వరముననుగ్రహించవా!నీవు ఆలస్యము చేస్తే తాళలేము స్వామీ!వేడిని తగ్గించగా రావా !మాకు ప్రాణబంధువుడవు!బాధలు తొలిగిపోవు దారిచూపవా!శంకరా!//


52.

మత్తకోకిల.


కాలకూటవిషంబు కాల్చెను గాంచుమా స్థితి శంకరా!

జాలి చూపుమ!భీతిమాన్పుమ!చంద్రశేఖర!పాహిమామ్!

వేళమించిన భస్మరాశిగ విశ్వమంతయు దగ్ధమౌ!

ఫాలలోచన!రమ్ము!వేగమె!ప్రార్థనల్ విని కావుమా!//


తాత్పర్యము.


కాలకూట విషము కాల్చు చున్నది మా పరిస్థితిని చూడుమా!కాస్త జాలిని చూపుమా!భయాన్ని తొలగించు!చంద్రశేఖరా!నిన్ను శరణు వేడితిమి!నువ్వు ఆలస్యం చేస్తే విశ్వమంతా దగ్ధమై భస్మరాశిగా మిగులుతుంది. ఫాలలోచనా!మా ప్రార్థనలు విని వేగమే రావయ్యా!//


53.

మత్తకోకిల.


జీవదాతవు విశ్వరక్షక!సిద్ధసేవిత!శ్రేయమీయుమా!

స్థావరంబుల, వృక్షరాశుల జన్మబీజము నీవెగా!

దేవనాయక!యీ జగంబుల తీరు తెన్నులు గాంచుచున్

ద్రోవజూపుచు నాది దేవుడ!తొల్గ జేయవె కష్టమున్.//


తాత్పర్యము.


జీవమునిచ్చే వాడవు!విశ్వరక్షక!క్షేమాన్ని కలుగచెయ్యి!ఈ జగతిలో సర్వమైన జడ చైతన్య రూపములకు నీవే మూలము. దేవతల నాయకుడవు!ఈ జగత్తును ఎలా నడిపించాలో తెలిసిన ఆదిదేవా!మా కష్టమును పోగొట్టుము!//



54.

ధ్రువకోకిల.


కలుషితంబగు మిత్తి పుట్టెను కాటువేయగ మమ్ములన్

బ్రళయ నాట్యము సల్పుచుందువు ప్రాణికోటిని కూల్చగన్

విలయతాండవ మాపి జూతువు విశ్వసృష్టికి మూలమౌ

కళలు పెంచెడి శంకరా!మము కన్నతండ్రిగ బ్రోవుమా!//


తాత్పర్యం.


మమ్మల్ని కాటు వేయగా కలుషితమైన మృత్యువు పుట్టింది. ఈ జగత్తును లయము చేయటానికి ప్రళయతాండవమును చేస్తూ ఉంటావు. మరల ఆ విలయతాండవము ఆపివేసి విశ్వసృష్టిని చేయటానికి మూలమౌ చైతన్య కళలను వెదజల్లుతావు. ఓ శంకరా!మమ్ము తండ్రివలె కాపాడుకోవయ్యా!//



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




22 views0 comments

Comments


bottom of page