#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 8 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 11/02/2025
క్షీరసాగర మథనము - 8 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
ఇక క్షీరసాగర మథనము - 8 చదవండి..
58.
తేటగీతి.
ఇట్లు స్తుతియించు నమరుల నెఱిగి నట్టి
ఫాలనేత్రుండు కరుణతో ప్రాపు నిడుచు
జగము శ్రేయములన్ గోరి సంతసముగ
పార్వతివదనంబును గని పలికెనిట్లు.//
తాత్పర్యము :
ఇట్లు దేవతలు స్తుతి చేయగా, పరమశివుడు వారలను కరుణించి, రక్షణనిడుచు, పార్వతీదేవిని చూస్తూ ఇలా అన్నాడు.//
59.
తేటగీతి.
'దీనమౌ స్థితి నొందిరి దేవగణము
విశ్వమంతయు క్రుంగెనీ విషము వలన
వీరి కష్టమున్ బోద్రోలి వెఱపు మాన్పి
మేలు సేయంగ వలయును మిక్కుటముగ.//
తాత్పర్యము :
దేవతలు చాలా దీనమైన స్థితిని పొందారు.విషము వలన ఈ జగత్తు అంతా భయముతో క్రుంగిపోయింది. వీరి భయాన్ని పోగొట్టి మనము వీరికి మేలు చెయ్యాలి!//
60.
తేటగీతి.
మాయలో బడి లోకులు మఱతు రెపుడు
దైవ నామమున్ మరి యేది దారి తెన్ను?
మాయను సృజించు వాడగు మహితశక్తి
విష్ణుమూర్తికి తెలియని విధియె కలదె?//
తాత్పర్యము :
మనుషుల హృదయంలో మాయ క్రమ్ముకొనటం వలన, వాళ్ళు దైవనామమును పలకటం మరచిపోతారు. వీరు బాగుపడటానికి వేరే దారే లేదు కదా!ఆ మాయను సృష్టించువాడే శ్రీహరి. అతనికి తెలియని కార్యం ఏమైనా ఉంటుందా? (ఉండదు అని భావం )//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments