#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #కందం

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 9 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 17/02/2025
క్షీరసాగర మథనము - 9 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
ఇక క్షీరసాగర మథనము - 9 చదవండి..
61.
కందం.
ఒకపరి సృజించు నీవిష
మొకపరి యమృతంబు దెచ్చు నుద్ధతిమీరన్
సకలంబాతని మాయగ
ప్రకటిత మగుచుండు సర్వపాలకు లీలల్.//
తాత్పర్యము.
ఆ శ్రీహరి ఒకసారి విషాన్ని సృష్టిస్తాడు. మరియొకసారి అమృతాన్ని సృష్టిస్తాడు. అంతా ఆ మురహరి మాయగా విలసిల్లుతూ ఉంటుంది.//
62.
కందం.
హాలాహలమున్ గైకొని
హేలగ భక్షింతు నిప్డు హిమగిరితనయా!
లీలామయుడగు నా హరి
పాలకుడై మనల నేల భయమేలసతీ!//
తాత్పర్యము.
ఓ సతీ!నేను ఈ విషాన్ని భక్షిస్తాను. ఆ శ్రీహరి మన వెంట ఉండగా భయమెందుకు?//
63.
వచనం.
శంభుని పల్కులను విని పార్వతి పరమశివునితో నిట్లనియె.//
64.
కందం.
జగతిని రక్షింపగ వే
గ గరళమున్ గొనుచు మ్రింగి కరుణాసాంద్రా!
వగపును మాన్పగ నీవే
తగువాడవు నిన్ను మించు దైవము కలడే?//
తాత్పర్యము.
ఓ నాథా!జగతిని రక్షించటానికి నీ కంటే సమర్ధులెవరున్నారు? ఈ ప్రపంచానికి చుట్టుకొన్న బాధను నీవే తొలిగించగలవు.//
65.
కందం.
గిరిజాపతియగు శంభుడు
చిఱునగవులు చిల్కు చుండి శీఘ్రగతినితాన్
గరమున ఫలంబు రీతిన్
గరళంబును మ్రింగి చూపె కారుణ్యంబున్.//
తాత్పర్యము.
ఆ గిరిజాపతి యైన శంకరుడు చిరునవ్వుతో త్వరగా చేతిలో చిన్న పండును తీసికొన్నట్లు ఆ విషమును తీసికొని మ్రింగి,జగత్తుపై తన కారుణ్యాన్ని చూపాడు.//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comentarios