కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసినట్లు
'Kuchamma Kuchobedithe' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 31/01/2024
'కూచమ్మ కూడబెడితే' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“ఏరా! నిన్న పనిలోకి ఎందుకు రాలేదు ?” గదమాయించి అడిగాడు తన పాలేరు రాంబాబుని, శేషయ్య.
“నిన్న నా పానం బాలేదయ్యా. తమరు సల్లంగ మన్నించాల” భయపడుతూ రెండు చేతులు కట్టుకుని వినయంగా అన్నాడు రాంబాబు.
“ఏం మాయరోగం? బాగానే ఉన్నావుగా. పని దగ్గరకొచ్చేటప్పటికి నీకు ఎక్కడ లేని రోగాలు గుర్తొస్తాయి” అని తిట్ల దండకం ఎత్తుకున్నాడు శేషయ్య.
రాంబాబుకు ఇది అలవాటే అయినా మనసుకు బాధకలుగుతోంది. చనిపోయే ముందు తన తండ్రికి జబ్బు చేస్తే తను పనిచేసే ఆసామి అయిన శేషయ్య వద్ద కొంతడబ్బులని ప్రామిసరీనోటు వ్రాసి తీసుకున్నాడు రాంబాబు. ఆ డబ్బుతో తన తండ్రికి మంచి వైద్యం చేయించి బ్రతికించుకున్నాడు రాంబాబు.
అక్షరం ముక్క చదువురాని రాంబాబు చేత ఆ నోటుమీద వేలిముద్ర వేయించాడు శేషయ్య. తను కూలీగా వెళ్లి తన కుటుంబాన్ని పోషిద్దామన్నా ఆ సంపాదన చాలీచాలని సంపాదనే. అందుకని శేషయ్య వద్ధే సంవత్సరానికి కొన్ని బస్తాలు ధాన్యం కౌలుగా శేషయ్య ఇచ్చేట్టుగా ఆ గ్రామ పెద్దలముందు ఒప్పందం చేసుకుని పాలేరుగా చేరాడు. ప్రతినెలా తనకు జీతం ఇవ్వకుండా ఆ అప్పుకు కట్టుకుంటున్నాడు శేషయ్య.
శేషయ్య ఆ ఊరి ప్రెసిడెంట్. పెద్దలు తనకిచ్చిన ఎకరం పొలానికి ఆ ఊరిలో అన్యాక్రాంతపొలాలని ఆక్రమించి కొంత పొలాలు, మరికొంత డబ్బులను అధిక వడ్డీకి తిప్పుతూ వాళ్లను బ్లాక్ మెయిల్ చేసి వాళ్ల భూములను వ్రాయించుకొంటూ ఇలా కాసులకు కక్కుర్తి పడుతూ ఐదెకరాల పొలంగా పోగుచేశాడు శేషయ్య.
ఆ ఊరివాళ్లందరికీ అతని నీచబుధ్ధి తెలిసికూడా అతని దౌర్జన్యాలకు నోరుమెదపలేరు. అతని ఆగడాలకు మనసులోనే శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటారు. తన మీద ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా వాటినేమీ పట్టించుకోకుండా దులుపుకుని తిరిగేరకం శేషయ్య. శవం మీద కాసులు కూడా ఏరుకునే రకమని అతనికి పేరు.
శేషయ్య భార్య వరమ్మ. కొడుకుని కని పురిటిలో వాతంకమ్మి చనిపోయింది. భార్య వియోగానికి చాలా దుఃఖించి ఆమె తదుపరి కార్యక్రమాలన్నిటినీ సక్రమంగా నిర్వర్తించాడు శేషయ్య. ఆతర్వాత ఆ బాబుకి ‘ఆనంద్’ అని పేరుపెట్టి తన అత్తగారైన సీతమ్మ వద్ద ఉంచాడు. ఆవిడకి వరమ్మకాక, సరోజ అనే మరొక కూతురు ఉంది. ఆమె యుక్త వయసులో ఉంది. సీతమ్మ సరోజకు పెళ్లి సంబంధాలు చూసే ప్రయత్నంలో ఉండగా ఆ కుటుంబంలో వరమ్మ చనిపోయిన దుర్ఘటన జరిగింది.
సరోజ ఆనంద్ ని చాలా గారాబంగా పెంచుతోంది. అప్పుడప్పుడు శేషయ్య తన కొడుకుని వచ్చి చూసిపోతున్నాడు. అతని దృష్టి సరోజ మీద పడింది. ఆమెని తన సొంతం చేసుకోవాలని మనసులో అనుకుని తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకరోజు సీతమ్మ ఏది పనిమీద వేరే ఊరు వెళ్లవలసి వచ్చింది. ఆ విషయాన్ని శేషయ్య పసిగట్టి తన కొడుకుని చూసే నెపంతో వచ్చి సరోజను లొంగదీసుకుని తన దాన్నిగా చేసుకున్నాడు. సరోజ పెనుగులాడినా ఫలితం దక్కలేదు.
ఆ మరురోజున ఊరినుంచి వచ్చిన సీతమ్మకి విషయం తెలిసి తన అల్లుడిని నిలదీసింది. ఆ ఊరి పెద్దలముందు నీవు చేసిన అఘా యిత్యాన్ని బయటపెడతానని గట్టిగా అరిచింది.
“ఊర్లోవాళ్లకు చెప్పి నామీద పంచాయతీ పెడితే నీ పరువే కాక, నీ కూతురికి జీవితంలో పెళ్లికాదు. చెడిపోయిందనే నింద పడితే నీకూతురు నీవు, నీ కూతురు బ్రతుకగలరా? “ ఆలోచించుకోమన్నాడు శేషయ్య.
మగదిక్కు అండలేని సీతమ్మ మనసులో జంకి వెనక్కి తగ్గింది. ఇది అలుసుగా తీసుకున్నాడు శేషయ్య.
“సరోజను నేను పెళ్లిచేసుకుని నీ కూతురికి మొగుడునవుతాను. సరోజ నీ మనవడికి తల్లయి వాడిని సాకుతుంది. సరోజ ఆస్తిమంతురాలవుతుంది. తల్లీ, కూతురు బాగా ఆలోచించుకోండి. మీకొక బంపరాఫర్.” అన్నాడు శేషయ్య.
చేసేదిలేక సరోజ, సీతమ్మ అందుకు అంగీకరించారు. శేషయ్య సరోజని పెళ్లిచేసుకుని ఆనంద్ తో తనింటికి వెళ్లాడు. శేషయ్య సరోజతో సంసారం చేస్తున్నాడు. ఆనంద్ పెరిగి పెద్దవాడయి చదువబ్బక జులాయిలా తిరుగుతున్నాడు. శేషయ్య, సరోజలు మందలించినా వాళ్ల మాటలను ఖాతరు చేయకపోగా వాళ్లకే ఎదురు తిరుగుతున్నాడు ఆనంద్. తన కొడుకు తన చేయిదాటి పోయాడనే వ్యధతో కుమిలిపోతూ ఉన్నారు సరోజ దంపతులు. మనోవ్యాధికి మందులేదన్నట్లుగా తన కొడుకు మీద దిగులుతో కొంత కాలానికి శేషయ్య కన్నుమూశాడు. ఆ ఊరివాళ్లందరూ శేషయ్యకి తగిన శాస్తి జరిగిందనుకున్నారు.
కొంతకాలం తర్వాత విచ్చలవిడి తిరుగుళ్లని మానుకోమని సరోజ ఆనంద్ కు చెప్పగా ఆరోజున పెద్ద గొడవయ్యి సరోజని ఇంట్లోంచి వెళ్లగొట్టాడు ఆనంద్. గతిలేక సరోజ వేరే ఊరిలో వంటలు చేసుకుని బ్రతుకుతోంది.
ఆనంద్ క్రమేపీ తన ఆస్తినంతా హారతికర్పూరంలా కరిగించేశాడు.ఇప్పుడతను దేశదిమ్మరై ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు.
“కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయం చేసినట్లు శేషయ్య అక్రమంగా పోగుచేసిన ఆస్తిని ఆయన కొడుకు ఆనంద్ పోగొట్టాడు” అని ఆ ఊరిజనమంతా అనుకున్నారు.
…..సమాప్తం.
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
Video link
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Kommentare