top of page

కుమార విజయం



'Kumara Vijayam' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

Published In manatelugukathalu.com on 28/07/2024

'కుమార విజయం' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



“కుమార్, నీ పక్క మండలం విలేకరి, పెళ్లి కోసం పదిరోజులు సెలవు పెట్టాడు. అతని డ్యూటీ కూడా నువ్వే చేయాలి. ఆ ప్రాంతం వార్తలు రేపటినుండి నువ్వే చూడు” పత్రికా కార్యాలయం జిల్లా ఇంచార్జి మంగేష్ ఫోన్ లో చెప్పారు. 


“అలాగే” అన్నాడు వీరేంద్ర కుమార్. 


కుమార్, శివపురం మండలానికి పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. డిగ్రీ అయ్యాక జర్నలిజం లో డిప్లొమా చేసి ‘క్రాంతి పథం’ పత్రికలో విలేకరిగా చేరాడు. ఎడిటర్ ముకుందరావుకి కుమార్ అంటే చాలా ఇష్టం. డ్యూటీ సక్రమంగా చేయడమే గాక, ఏ విధమైన ఫిర్యాదులు లేకుండా నాలుగేళ్ల నుండి పనిచేస్తున్నాడు. 


రోజూ ఉదయం, సాయంకాలం హై స్కూల్ పిల్లలకి ట్యూషన్ చెబుతాడు. పత్రిక వాళ్ళు ఇచ్చే జీతం ఎలాగు సరిపోదు. పెద్ద పెద్ద పత్రికల ముందు చిన్న చిన్న పత్రికలు నిలదొక్కు కోవడం కష్టం. అందుకే ముకుందరావు తన రైస్ మిల్ వ్యాపారం లోని లాభాలనుండి కొంత మొత్తం పత్రిక నిర్వహణ కోసం కేటాయిస్తాడు. సమాజానికి సేవ చేయాలి, పేదల పక్షాన నిలబడి, వారి అవసరాలు ప్రభుత్వంకి తెలిపి వారికి న్యాయం జరిగేలా చూడాలని ముకుందరావు ఉద్దేశ్యం. అవే భావాలు కుమార్ కి కూడా ఉండడం వలన, వేరే ఉద్యోగాలకోసం ప్రయత్నించకుండా, పత్రికా రంగం లో ప్రవేశించాడు. 


రెండు రోజులు గడిచాకా, పక్క మండలం పరిషత్ ఆఫీస్ కి వెళ్లి తనని పరిచయం చేసుకున్నాడు. 

కొంత ముఖ్యమైన సమాచారం తీసుకుని బయటకు వచ్చాడు. అప్పుడు కలిసాడు ‘మార్నింగ్’ పత్రిక విలేకరి కృష్ణ. గతంలో పరిచయం ఉంది ఇద్దరికీ. “మా వెంకటరత్నం పెళ్లి కదా. అతను వచ్చేవరకూ ఈ మండలం న్యూస్ కూడా నన్నే చూడమన్నారు” అన్నాడు కుమార్ నవ్వుతూ. 


“బాగుంది మిత్రమా. కొద్దికాలం మనం కలిసి పనిచేస్తామన్నమాట” అన్నాడు కృష్ణ గట్టిగా నవ్వుతూ. 


అతను ఏం మాట్లాడినా గట్టిగా మాట్లాడుతాడు. అందుకే మండలం లోని అధికారులకి అతనంటే కొంచం ‘జంకు’. టీ తాగుదాం రమ్మనమని, సెంటర్ కి తీసుకువచ్చాడు కృష్ణ. హోటల్ దగ్గర ఇద్దరూ టీలు తాగారు. 


“మిత్రమా, నిన్ననే నా దృష్టికి ఒక విషయం వచ్చింది. అది పేదలకి జరిగిన అన్యాయం. నువ్వు వస్తే ఇద్దరం కలిసి ఎంక్వయిరీ చేద్దాం” అన్నాడు కృష్ణ. 


పేదలకి కష్టం వచ్చిందని చెప్పగానే, కుమార్ అలర్ట్ అయ్యాడు. “తప్పకుండా వెళ్దాం. పద” అన్నాడు కుమార్. 


ఇద్దరూ మోపెడ్ల మీద నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నదేవరపల్లి గ్రామం వెళ్ళారు. బలహీన వర్గాల కాలనీకి తీసుకెళ్ళాడు కృష్ణ. 


ఒక ఇంటి ముందు ఆగి, ‘కృష్ణవేణి’ అని పిలిచాడు. ఒకామె బయటకు వచ్చింది. ‘రండి విలేకరి గారూ’ అని, అరుగు మీద చాప వేసింది. కృష్ణ, కుమార్ ఇద్దరూ కూర్చున్నారు.


“ఈయన కుమార్ గారని, క్రాంతి పథం పేపర్ విలేకరి. మీ విషయం చెపుతావని ఇలా వచ్చాము” అన్నాడు కృష్ణ. 


“ఒక్క నిముషం సార్” అని బయటకు వెళ్లి నలుగురిని కేకేసింది కృష్ణవేణి.


అయిదు నిముషాలు గడిచేసరికి పదిమంది మహిళలు అక్కడికి వచ్చారు. కృష్ణవేణి చెప్పడం మొదలుపెట్టింది. 


“సారూ, గత సంవత్సరం మంత్రిగారు కుట్టు మెషన్లు ఇస్తారు రమ్మనమని, మా సర్పంచ్ గారు మమ్మల్ని తణుకు దగ్గర ఉన్న కృష్ణాపురం తీసుకువెళ్ళారు. మంత్రిగారు మధ్యాహ్నం ఆలస్యంగా వచ్చారు. 


వంద మంది ఆడాళ్ళం అక్కడికి వచ్చాం కుట్టు మెషిన్ల కోసం. ఒక పది మందికి మంత్రిగారు కుట్టు మెషిన్లు ఇచ్చి, వేరే మీటింగ్ కి వెళ్లాలని వెళ్ళిపోయారు. మా ఊరు నుండి వెళ్ళిన ఇద్దరు మంత్రిగారి చేతులమీదుగా మిషన్లు తీసుకున్నారు. బ్యాంకు వాళ్ళు మా అందరి దగ్గర ముందుగానే సంతకాలు తీసుకున్నారు. సర్పంచ్ గారు ‘మీకు మన పంచాయతి ఆఫీస్ దగ్గర మిషన్లు ఇస్తాం’ అని చెప్పారు. మేము వెనక్కి వచ్చేసాం. 


తర్వాత ఎన్ని సార్లు పంచాయతి ఆఫీస్ కి వెళ్లి అడిగినా ‘ఇంకా మిషన్లు రాలేదు. రాగానే కబురు చేస్తాం’ అని చెప్పారు సర్పంచ్. నాలుగు రోజుల క్రితం మాకు బ్యాంకు వాళ్ళనుండి నోటీసులు వచ్చాయి ‘మీరు కుట్టు మిషన్లు లోను తీసుకుని ఏడాది దాటింది, బాకీలు కట్టడం లేదు, వెంటనే కట్ట’మని.


మేము బ్యాంకు కి వెళ్లి అడిగితె, మేము సంతకాలు పెట్టిన కాగితాలు చూపించి, మీరు లోను కట్టాల్సిందే అని చెప్పారు. మాకు మిషన్లు ఇవ్వలేదని చెబితే, ‘అది మీరూ, మీ సర్పంచ్ గారు చూసుకోండి. మేము మంత్రిగారు వచ్చిన రోజునే, మిషన్లు అన్నీ అక్కడి వారికి అప్పచెప్పాము’ అని అన్నారు. 


మేము సర్పంచ్ ని అడిగితే ‘చూద్దాం, కంగారు పడకండి’ అని చెప్పారు. 


మాకు తెలిసిన విషయం ఏమిటంటే, సర్పంచ్ ఆయనకి కావాల్సిన వాళ్లకి ఆ కుట్టు మిషన్లు ఇచ్చాడని. 


సర్పంచ్ ని ఏమీ అనలేం. ఆయన ఎంఎల్. ఏ. గారికి బాగా కావాల్సిన మనిషి. కృష్ణ గారికి మా బాధలు చెప్పుకున్నాం” అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంది కృష్ణవేణి. 


మిగతా వాళ్ళు కూడా బ్యాంకు వాళ్ళు ఇచ్చిన నోటీసులు చూపించారు. కృష్ణ, కుమార్ ఇద్దరూ అయిదు నిముషాలు ఆలోచించారు. తర్వాత ఒక పిటిషన్ రాయించి వారిచేత సంతకాలు చేయించారు. 


ఇద్దరూ చెరో కాపీ తీసుకున్నారు. బాధిత మహిళల్ని అందరినీ నిలబెట్టి ఒక ఫోటో తీసుకున్నారు. 

“కంగారు పడకండి అమ్మా. మా పేపర్లో వార్త రాస్తాం. బ్యాంకు వాళ్ళతో మాట్లాడతాం, మిమ్మల్ని వత్తిడి చేయవద్దని చెబుతాం” అన్నాడు కుమార్. 


కృష్ణ కూడా అలాగే చెప్పాడు. వాళ్ళు అందరూ కొంచం స్థిమిత పడ్డారు. 


“తీసుకోని అప్పుకు డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చి కడతాం. మీరే న్యాయం చేయాలి” అని చేతులు జోడించి అన్నారు మహిళలు. 


వాళ్లకి ధైర్యం చెప్పి ఇద్దరూ వచ్చేశారు. 


మర్నాడు, మార్నింగ్, క్రాంతి పథం రెండు పేపర్లలో, ‘అన్న దేవరపల్లి లో కుట్టు మిషన్ల కుంభకోణం’ అని పెద్ద వార్త వచ్చింది. సర్పంచ్ మోసం చేసాడని మహిళలు ఆరోపించి నట్టు. ఆ వార్తలు చూడగానే సర్పంచ్ అప్పారావు కి వళ్ళు మండిపోయింది. వెంటనే ఎం. ఎల్. ఏ. దగ్గరకు వెళ్లి, ప్రతిపక్షం వాళ్ళు నన్ను అల్లరి చేయడానికి, విలేకర్లను తీసుకు వచ్చి ఇదంతా చేసారని చెప్పాడు. 


“అయితే పేపర్ వాళ్లకి ఒక నోటీసు ఇయ్యి, పరువు నష్టం దావా వేస్తామని. మన ప్లీడర్ ఉన్నారుగా. ఆయన్ని కలువు” అని చెప్పారు ఎంఎల్. ఏ. 


సర్పంచ్ అప్పారావు, ప్లీడర్ గారిని కలిసి, మిషన్లు ఇచ్చేసినా తన మీద బురద చల్లుతున్నారని వాపోయాడు. ఆయన వెంటనే, తన క్లైంట్ అప్పారావు పరువుకి భంగం కలిగించే వార్తలు ప్రచురించారని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని, రెండు పత్రికల ఎడిటర్లకి, ప్రింటర్లకి నోటీసులు పంపారు. 


వారం రోజులు గడిచాయి. కుమార్ ని అర్జెంటు గా పత్రిక ఆఫీస్ కి రమ్మనమని కబురు వచ్చింది. 

వెంటనే బయల్దేరి పత్రిక ఆఫీస్కి రాజమండ్రి వెళ్ళాడు. ఎడిటర్ రూమ్ లోకి వెళ్ళాడు. ఎప్పుడూ చాలా ఆదరంగా రిసీవ్ చేసుకునే ఆయన చాలా చిరాగ్గా మొహంపెట్టుకుని ఉన్నాడు. 


“ఏమిటి కుమార్ ఇది? సరిగా చూసుకోకుండా న్యూస్ రాస్తే ఎలా? నీ వలన మాకు కూడా తలవంపులు వస్తున్నాయి? అన్నదేవరపల్లి న్యూస్ పూర్తిగా తెలుసుకునే రాసావా?” కోపంగా అడిగారు ఆయన. 


“మొత్తం ఎంక్వయిరీ చేసే న్యూస్ రాసాను సార్. ఆధారాలు కూడా వున్నాయి” అన్నాడు కుమార్ నెమ్మదిగా. 


“అలా అయితే, మాకు నోటీసు ఎందుకు పంపారు?” అని, ప్లీడర్ పంపిన రిజిస్టర్ నోటీసు ని కుమార్ కి ఇచ్చాడు ఎడిటర్. అది చదివి ఆశ్చర్యపోయాడు కుమార్. సర్పంచ్, గ్రామం లోని మహిళలకు, కుట్టు మిషన్లు సక్రమంగానే అందజేశారని, నిజాలు తెలుసుకోకుండా తమ క్లైంట్ సర్పంచ్ ని అప్రదిష్టపాలు చేసేందుకు తప్పుడు వార్త రాసారని, దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని, సర్పంచ్ తరుపున ప్లీడర్ గారు పంపిన నోటీసు. 


కుమార్ తనకి, అన్నదేవరపల్లి మహిళలు సంతకం చేసి ఇచ్చిన కాగితాలు ఎడిటర్ కి ఇచ్చాడు. 


అది చదివి “మరి సర్పంచ్ ని కూడా అతని సంజాయిషీ అడగక పోయావా?” అని అడిగాడు ఎడిటర్. 


“ఆయన కోసం వెళ్తే ఆయన ఊరిలో లేరని చెప్పా”రని అన్నాడు కుమార్.


ఆయన దీర్ఘంగా ఆలోచించాడు. 

“సరే, మళ్ళీ ఆ ఊరు వెళ్లి ఆ మహిళలని కలిసి, ఇలా నోటీసు వచ్చిన సంగతి చెప్పి, వారి లేటెస్ట్ వెర్షన్ కూడా రాసి పంపించు” అన్నాడు ఎడిటర్ కొంచం ప్రశాంతంగా. 


‘అలాగే’ ఆయనకి నమస్కరించి బయటకు వచ్చాడు. సబ్ ఎడిటర్ రామమూర్తి కనిపించి “హాయ్ కుమార్. నోటీసు గురించి కంగారు పడకు. పూర్తి వివరాలు పంపు” అన్నాడు. అప్పుడు అతని ప్రాణం కుదటపడింది. 


మర్నాడు ఉదయం కృష్ణ తో కలిసి, అన్నదేవరపల్లి వెళ్ళాడు. కృష్ణవేణి వాళ్ళని సాదరంగా ఆహ్వానించింది. “నమస్తే సారూ, మీ దయ వలన మా కుట్టు మిషన్లు మాకు వచ్చాయి” అంది కృష్ణవేణి. 


“ఎప్పుడు?” ఇద్దరూ అడిగారు ఆశ్చర్యంగా ఒకేసారి. 


“పేపర్లో వార్త వచ్చిన రెండో రోజున, సర్పంచ్ మా కాలనీ పెద్ద ద్వారా కబురుచేసి పంచాయతి ఆఫీస్ కి రమ్మనమని చెప్పారు. ఆయన సమక్షంలో మా అందరికీ కుట్టు మిషన్లు ఇచ్చి, మా అందరి దగ్గర సంతకాలు తీసుకున్నారు” అంది కృష్ణవేణి.


కుమార్, కృష్ణ ఇద్దరూ మొహ మొహాలు చూసుకున్నారు. 


అప్పుడు చెప్పారు కుమార్, కృష్ణ, తమ పత్రిక ఆఫీస్ లకి సర్పంచ్ ప్లీడర్ నోటీసు లు పంపారని. ఆమె ఆశ్చర్యపోయింది. వెళ్లి మిగతా మహిళల్ని పిలిచింది. అందరూ విలేకర్లు ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పారు. 


వాళ్లకి, సర్పంచ్ ప్లీడర్ నోటీసులు పంపిన విషయం చెప్పింది కృష్ణవేణి. 


“వాడికి అదేం మాయరోగం? తప్పు చేసింది వాడూ, ఇబ్బంది మీకూనా?”అంది రోహిణి. 


అప్పుడు కుమార్ “మా వార్త రాసిన తర్వాతే, సర్పంచ్ కుట్టు మిషన్లు ఇచ్చారని మీరు రాసివ్వండి” అన్నాడు. 


వెంటనే కృష్ణవేణి ఒక కాగితం తయారు చేసింది. 

‘గౌరవనీయ ఎడిటర్ గారికి, మీ క్రాంతి పథం పత్రికలో మాకు జరిగిన అన్యాయం గురించి రాసినందుకు ధన్య వాదాలు. మీ వార్త వచ్చిన తర్వాత మా గ్రామ సర్పంచ్ మాకు కుట్టు మిషన్లు ఇచ్చి, మా దగ్గర సంతకాలు తీసుకున్నారు” అని రాసి సంతకం చేసి ఆధార కార్డు నెంబర్ కూడా వేసింది. 


అందరూ అలాగే సంతకాలు చేసి తమ ఆధార కార్డు నంబర్లు వేసారు. కుట్టు మిషన్లు తో వారందరినీ కలిపి ఫోటోలు తీసుకున్నారు కుమార్, కృష్ణ. 


మర్నాడు మరో వార్త ప్రముఖంగా వచ్చింది. ”కలం పోటుతో కదిలిన కుట్టు మిషన్లు” అని. అన్నదేవరపల్లి సర్పంచ్ నిర్వాకం అందరికీ తెలిసిపోయింది. ఎం. ఎల్. ఏ. సర్పంచ్ ని మందలించాడు, తనకు అబద్ధం చెప్పినందుకు. తర్వాత కమ్మరి పని చేసుకుంటున్న ఒక దివ్యాంగుడి గురించి తన పత్రికలో రాసి, అతనికి ఒక స్వచ్చంద సంస్థ ద్వారా, మూడు చక్రాల రిక్షా, ఆర్ధిక సాయం కూడా వచ్చేటట్టు చేసాడు కుమార్. 


వెంకటరత్నం మరో నెల సెలవు పెట్టడం వలన కుమారే ఆ మండలం న్యూస్ కవర్ చేస్తున్నాడు. 

ఒకరోజు హై స్కూల్ లో జరిగిన మీటింగ్ న్యూస్ కవర్ చేసి, పేపర్ కి పంపించేసి ఇంటికి వెళ్తున్నాడు. 


చీకటి పడుతోంది. ఒక వ్యక్తి కుమార్ మోపెడ్ ఆపి ‘లిఫ్ట్’ కావాలని అడిగాడు. అతడు ఎక్కుతుండగానే చెట్టు పక్కనుండి ఇద్దరు వచ్చి ‘ఏరా, పెద్ద వాళ్ళ మీద న్యూస్ లు రాసే మొనగాడివా?’ అని కర్రతో నెత్తిమీద కొట్టబోయారు. 


కుమార్ చేతులు అడ్డుపెట్టుకున్నాడు. లిఫ్ట్ అడిగిన వ్యక్తీ పారిపోయాడు. మోపెడ్ పక్కన పడేసి, ఒకడి చేతిలో కర్ర లాక్కోబోయాడు. రెండవ వాడు కుమార్ వీపుమీద కర్రతో గట్టిగా కొట్టాడు. 

‘అమ్మా’ అని కూలబడిపోయాడు. వెంటనే వాళ్ళు ఇద్దరూ కర్రలతో కుమార్ ని కొట్టారు. 

తణుకు కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్న విజయలత అది చూసింది. ఒక మనిషిని ఇద్దరు కర్రలతో కొడుతున్నారు. ఎంత అమానుషం? అని తలచి, వెంటనే “ఎవర్రా అది? ఆగండి. ” అని గట్టిగా అరిచింది. 


వాళ్ళు ఇద్దరూ ఒక్క క్షణం ఆగారు. సైకిల్ స్టాండ్ వేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు ఇద్దరూ తలకి మంకీ కేప్ లు పెట్టుకున్నారు, ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని. మెరుపు వేగంతో, ఒకడి చేతిలోని కర్ర లాక్కుంది విజయలత. వాడు ఖిన్నుడైపోయి, ఆమె కేసి చూస్తూండిపోయాడు. 

రెండో వాడు విజయలతని చూసి, “ఒరేయ్, ఈ పిల్ల వీరి నాయుడు కూతురు. కరాటే కూడా వచ్చు ఈ పిల్లకి. పరిగెత్తు” అని పక్కనున్న అరటి తోట లోకి వెళ్ళిపోయాడు. రెండోవాడు వాడి వెనకే దౌడు తీసాడు. 


కుమార్ తన చేతులు నెత్తిమీద పెట్టుకుని మూల్గడం చూసింది ఆమె. అతని చేయి పక్కనుండి రక్తం కారడం చూసి, తన ‘చున్నీ’ కుమార్ నెత్తికి కట్టులా కట్టింది. కుమార్ మోపెడ్ తీసి స్టాండ్ వేసింది. సైకిల్ మీద ఇంటికి వెళ్తున్న వీరన్న కనిపించాడు.


అతన్ని ఆపి ‘బాబాయ్, నా సైకిల్ మా ఇంటి దగ్గర ఇచ్చేయ్. నేను ఈయనని ఆసుపత్రికి తీసుకువెళ్తాను’ అని చెప్పింది. 


అతను అలాగే అన్నాడు. వెంటనే మోపెడ్ స్టార్ట్ చేసి, “ఎక్కండి సార్. ఆసుపత్రికి వెళ్దాం” అంది విజయలత. 


కుమార్ నెమ్మదిగా ఎక్కగానే, మోపెడ్ మీద పది నిముషాలలో తణుకు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకు వచ్చింది. కుమార్ తన జర్నలిస్ట్ కార్డు చూపించగానే, డాక్టర్ అతన్ని లోపలకు తీసుకువెళ్ళి గాయం శుభ్రం చేసి మందు వేసి కట్టు కట్టాడు. 


విజయలత బయటకు వెళ్లి పాలు తీసుకువచ్చింది. అవి తాగి సేద తీరాడు కుమార్. 

“చాలా థాంక్స్ అండి. నా గురించి శ్రమ తీసుకున్నారు” అన్నాడు కుమార్. 


“భలేవారే. ఇందులో శ్రమ ఏముంది. ఒక సాటిమనిషికి సాయం చేశాను. మీ గురించి విన్నాను. అన్నదేవరపల్లి మహిళలకు మీరు బాసటగా నిలిచి వారికి న్యాయం జరిగేలా చేసారని. ఇందాక మీరు డాక్టర్ గారికి మీ కార్డు ఇస్తుంటే చూసాను. మీరే జర్నలిస్ట్ కుమార్ అని తెలిసింది. మీకు అభినందనలు” అని షేక్ హ్యాండ్ ఇచ్చి “నా పేరు విజయలత. తణుకు ఉమెన్స్ కాలేజీ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మాది ఖండవల్లి” అంది నవ్వుతూ. కుమార్ కూడా చిన్నగా నవ్వాడు. 


“మీరు ఇంటికి ఎలా వెళ్ళగలరు? నీరసంగా ఉన్నారు కదా?” అడిగింది విజయలత. 


“ఇక్కడి జర్నలిస్ట్ బుచ్చిబాబు నాకు ఫ్రెండ్. అతను నన్ను మా ఇంటి దగ్గర దిగబెడతాడు. మరి మీరు. . . ?” అడిగాడు కుమార్. 


“ఫరవాలేదు. నేను ఆటో మీద మా ఊరు వెళ్ళిపోతాను” అని చున్నీ తీసుకుని చూసింది. రక్తం మరకలు అంటుకుని ఉన్నాయి. నర్సుని అడిగి ఒక పేపర్ తీసుకుని, చున్నీని అందులో మడతపెట్టుకుంది విజయలత. కుమార్ కి బై చెప్పి వెళ్ళిపోయింది. కుమార్, బుచ్చిబాబు కి ఫోన్ చేసాడు. అతను రాగానే తన మోపెడ్ మీద అతనితో కలిసి శివపురం వెళ్ళిపోయాడు. 


మర్నాడు బుచ్చిబాబు, సర్పంచ్ మీద కంప్లైంట్ ఇద్దామంటే “వద్దు. గొడవలు పెంచుకోవడం నాకు ఇష్టం లేదు” అన్నాడు కుమార్. 


నెల గడిచింది. కుమార్ గాయం పూర్తిగా తగ్గిపోయింది. ఒకరోజు సర్పంచ్ ఇంటికి వెళ్ళాడు కుమార్. 


“చూడండి సర్పంచ్ గారూ, నా మీద దాడి చేయించింది మీరేనని నాకు తెలుసు. మా జర్నలిస్టులు మీ మీద కంప్లైంట్ ఇమ్మన్నా, నేను ఇవ్వలేదు. ఎందుకంటే మీరు మారాలని, మీ తప్పు తెలుసుకోవాలని. అంతేగానీ నాకు చేతకాదని, పిరికివాడిని అని మీరు భావిస్తే మీ ఖర్మ. మళ్ళీ ఏదైనా దుర్మార్గం చేయాలని ప్రయత్నించారో, మీరు జైలుకి వెళ్ళడం ఖాయం. గుర్తుంచుకొండి” అని హెచ్చరించి వచ్చాడు కుమార్. 


తర్వాత నెలరోజులకి, తణుకు ఉమెన్స్ కాలేజీ డే ఫంక్షన్ కి బుచ్చిబాబుతో కలిసి కాలేజీ కి వెళ్ళాడు కుమార్. అక్కడ విజయలత కనిపించింది. పాటల పోటీలో ఆమెకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆమెకి కంగ్రాట్స్ చెప్పాడు కుమార్. పరీక్షలు అయిపోయాక సెలవులలో, శివపురం అమ్మవారి గుడికి వచ్చింది విజయలత తన స్నేహితులతో కలిసి.


కుమార్ దగ్గరుండి అమ్మవారి దర్సనం చేయించి, తన ఇంటికి తీసుకువచ్చాడు వాళ్ళని. తల్లికి, విజయలతని పరిచయం చేసి ‘ఆ రోజు నన్ను కాపాడి, ఆసుపత్రికి తీసుకువెళ్ళిన అమ్మాయి ‘ అని చెప్పాడు. 


వర్ధనమ్మ చాలా సంతోషించింది ఆమెని చూసి. “నీది చాలా మంచి మనసు తల్లి. ఇద్దరు రౌడీలని నిభాయించి, నా కొడుకుని కాపాడావు. చల్లగా ఉండు తల్లి” అని ఆశీర్వదించింది. 


తర్వాత ఆగష్టు నెలలో, స్వాతంత్ర దినోత్సవం నాడు జిల్లా కలెక్టర్, కుమార్ కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి సత్కరించారు. విజయలత డిగ్రీ పాస్ అయి, కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటోంది. బుచ్చిబాబు బందువులు ఖండవల్లిలో ఉన్నారు. బుచ్చిబాబు రాయబారంలో కుమార్, విజయలత పెళ్ళికి సుముఖత వ్యక్తం చేసారు.


తణుకు రోటరీ హాలులో, కలెక్టర్ సమక్షంలో విజయలత ని ఆదర్శ వివాహం చేసుకున్నాడు కుమార్. 

****

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

 30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





 

 


57 views0 comments

Comments


bottom of page