'Kuthuri Puttina Roju' - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 16/04/2024
'కూతురి పుట్టినరోజు' తెలుగు కథ
రచన: L. V. జయ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
శాన్వి పుట్టినరోజు వస్తోంది అంటే చాలు, నెల రోజుల ముందు నుండి హడావిడి పడిపోతూ ఉంటుంది జాగృతి. తన కూతురి కోసం ఏ కేక్ చెయ్యాలి, ఏ గిఫ్ట్స్ కొనాలి, పుట్టినరోజు ఎక్కడ చెయ్యాలి, ఎలా సర్ప్రైజ్ చెయ్యాలి ఇలా రకరకాల ఆలోచనలు. శాన్వి పుట్టినప్పుడు, పుట్టకముందు, ఏమి జరిగాయో గుర్తువస్తుంటాయి జాగృతి కి.
"నువ్వు తల్లివి కాబోతున్నావ్" అని డాక్టర్ జాగృతి కి చెప్పినప్పుడు, చాలా ఆనందంతో అందరికీ ఫోన్లు చేసి చెప్పి, దీవెనలు తీసుకుంది. 'కూతురు పుడితే బాగుణ్ణు' అనుకుంది మనసులో. శాన్వి అని పేరు పెట్టాలని నిర్ణయించుకుంది. అప్పటినుండి ఎటు చూసినా, చిన్న పాపలకి సంబంధించిన వస్తువులే కనపడుతూ ఉండేవి. బుజ్జి బుజ్జి అమ్మాయిల బట్టలు, షూస్ చూసి ఇవన్నీ ఎప్పుడూ కొనేస్తానా అనుకునేది.
బిడ్డ కడుపులో వున్నప్పుడు తను మానసికంగా, శారీరకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బిడ్డ పుట్టాక ఎలా పెంచాలి అని తెలుసుకుంటూ ఉండేది. ఇలా ఇంకా నిజంగా తల్లి కాకుండానే, మాతృత్వాన్ని అనుభవించడం మొదలుపెట్టింది జాగృతి.
తల్లి గర్భంలోనే, విష్ణుభక్తి ని నేర్చుకున్న ప్రహ్లాదుడి కథని, యుద్ధ విద్యని నేర్చుకున్న అభిమన్యుడి కథని గుర్తుచేసుకుని, తనకి పుట్టబోయే బిడ్డకి కూడా మంచి భక్తి, మంచి మనసు, మంచి బుద్ధి, చదువు ఉండాలని, ప్రతిరోజూ లలితాసహస్రం చదివింది. మంచి పాటలు, మంచి పుస్తకాలూ చదువుతూ రోజుని గడిపింది. వీణ, డ్రాయింగ్ క్లాస్ లో జాయిన్ అయ్యింది.
పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంది. మూడో నెల నుండే మార్నింగ్ సిక్నెస్ మొదలు అయ్యాయి జాగృతి కి. తిన్నదంతా బయటకి వచ్చి, ఇక తినాలని అనిపించకపోయినా, లోపల ఉన్న బిడ్డ కోసం తినేది. ఇంజక్షన్ అంటే భయపడే జాగృతి, ఎన్నో ఇంజెక్షన్స్ తీసుకుంది. పాలు తాగడం ఇష్టం లేకపోయినా, కుంకుమపువ్వు వేసుకుని మరీ తాగింది. బరువుతగ్గి, నీరసం పెరిగిపోవడంతో, చేస్తున్న ఉద్యోగం కూడా వదులుకుంది.
నెలలు నిండుతుండగా, తన బిడ్డని ఎప్పుడు చూస్తానా అన్న ఆత్రుత మొదలు అయ్యింది జాగృతి కి. రోజులు లెక్క పెట్టడం మొదలుపెట్టింది. జాగృతి ఆరాటం, దేవుడికి వేరే రకంగా అర్ధం అయ్యిందో ఏమో, ఏడో నెలలోనే బిడ్డ తలక్రిందులు అయ్యింది. ఇక ఎప్పుడైనా పుట్టేయ్యచ్చు అన్నారు డాక్టర్లు. బిడ్డ కడుపులో పెరిగితే మంచిది. కానీ, దాని కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బెడ్ కింద కాళ్ళవైపు ఇటుకలు పెట్టుకుని పాడుకోవాలి అన్నారు.
అవసరం అయితే తప్ప లేవకూడదు, నడవకూడదు అని చెప్పారు. డాక్టర్లు చెప్పిన అన్నీ జాగ్రత్తలు తీసుకుంది.
తొమ్మిది నెలలు నిండాక, జాగృతి కోరుకున్నట్టుగా పాప పుట్టింది. తెల్లగా, అందంగా, కళ్ళమీద పడేంత నల్లటి పొడుగు వెంట్రుకలుతో మెరిసిపోతూ వుంది. జాగృతి ఆనందానికి అంతులేదు. పాపని చూస్తూ మురిసిపోయింది.
అందరూ పుడుతూనే ఏడుస్తారు. కానీ జాగృతి కి పుట్టిన పాప మాత్రం ఏడవలేదు. నర్స్ ఒక్కసారి గట్టిగా కొట్టాక, ఏడవడం మొదలు పెట్టింది. పాప ఏడుపు చూడలేకపోయింది జాగృతి. తనూ ఏడ్చేసింది. పాపని కొట్టి ఏడిపించిన నర్స్ మీద చాలా కోపం వచ్చింది జాగృతి కి. "పుట్టిన వెంటనే ఏడవని పిల్లలకి ఇలాగే చేస్తాము" అని డాక్టర్ నెమ్మదిగా సర్ధిచెప్పాక, కోపం తగ్గి, ఏడుపు ఆపింది జాగృతి.
దగ్గరకి తీసుకుని ముద్దులాడుతుండగా, పాప ఒళ్ళు వేడిగా ఉన్నట్టు అనిపించి, డాక్టర్ ని పిలిచింది. డాక్టర్ వచ్చి చూసి, జాండిస్ వచ్చింది అని చెప్పారు. భయపడిపోయింది జాగృతి. పాపని ఇంక్యూబేటర్లో పెట్టారు. జాగృతిని దగ్గరకి వెళ్లి చూడనివ్వలేదు, ముట్టుకోనివ్వలేదు. రెండు రోజుల తరువాత డిశ్చార్జ్ చేస్తూ, "పాపకి జాండిస్ ఇంకా పూర్తిగా తగ్గలేదు. రోజు ఉదయాన్నే, ఎండలో పాపని పట్టుకుని కూర్చోవాలి" అని చెప్పారు డాక్టర్.
హాస్పిటల్ నుండి బయటకి వస్తున్నప్పుడు, తన మీద పడిన ఎండకి కళ్ళు చిట్లిస్తూ, తన కళ్ళ మీద పడిన జుట్టుని తల అటు ఇటూ ఊపుతూ సరిచేసుకుంటున్న పాపని చూసి, 'అంత చిన్న పిల్లకి అప్పుడే అన్ని తెలుసా' అని ఆశ్చర్యపోయింది జాగృతి.
రోజురోజుకి, ఒళ్ళు తగ్గి, సన్నగా అయిపోతున్న పాపని చూసి కంగారుపడింది జాగృతి. పాపని ఎత్తుకోలేక, ఎత్తుకోవడం రాక కష్టాలు పడింది. తలగడ మీద ఉంచి, తలగడతో పాటు ఎత్తుకునేది. జాండిస్ తగ్గేంత వరకు, ఉదయాన్నే, పాపని పట్టుకుని ఎండలో కూర్చుంది.
నెల రోజుల్లో, పాపకి నెమ్మదిగా కొంచెం ఒళ్ళు వచ్చి, బంగారం లా మెరిసిపోయింది. మొహం లో కళ పూర్తిగా బయపడింది. అందమైన తన పాప మొహాన్ని చూస్తూ, బుజ్జి బుజ్జి చేతులతో, పాదాలతో ఆడుకుంటూ, ' ఈ అద్భుతం కోసం ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు, ఏం వదులుకున్నా పర్వాలేదు, జీవితాంతం దీన్ని చూస్తూ బతికేయచ్చు ' అనుకుంది జాగృతి. తనకి ఇష్టమైన శాన్వి అన్న పేరుని పెట్టుకుంది.
నెల రోజుల తరువాత చూసిన డాక్టర్, " నీ కూతురు పెద్ద అయ్యాక మిస్ యూనివర్స్ అయిపోయినా అయిపోవచ్చు. అంత బాగుంది. జాగ్రత్తగా కాపాడుకో. " అంటుంటే మురిసిపోయింది జాగృతి.
శాన్వి పుట్టినప్పటినుండి, ప్రతి క్షణం శాన్వితో గడుపుతూ, జాగృతి కి వేరే లోకం తెలియదు. ఉద్యోగం చెయ్యటంలేదన్న బాధలేదు.
శాన్వి పెద్దదై, జాగృతి కోరుకున్నట్టు భక్తి, మంచితనం సంపాదించుకుంది. మంచిపిల్లగా గుర్తింపు తెచ్చుకుంది. బాగా చదువుకుని జాగృతి కి పేరుతెచ్చింది. ఎప్పుడూ జాగృతి కి తోడుగా వుంటూ, మంచి సలహాలు ఇస్తూ అమ్మకే అమ్మ అయిపొయింది.
కూతురి పుట్టినరోజుకి, తను కూతురికి ఇచ్చే గిఫ్ట్ కంటే తనకు దేవుడు కూతురి రూపంలో ఇచ్చిన గిఫ్ట్ని చూస్తూ పొంగిపోతుంది జాగృతి.
***సమాప్తం***
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
@lakshminuti7562
• 10 days ago
super koothuru puttina roju.