'Kuturu' written by Sudhamohan Devarakonda
రచన : సుధామోహన్ దేవరకొండ
"రా.. పర్ణికా! రా.. ఏమిటీ ఇలా సడన్ గా? ఫోన్ అయినా చేయలేదు? ఎలా ఉన్నావు? నిన్ననే ఫోన్ చేసుంటే మీ అన్నయ్య బస్ స్టాప్ కి వచ్చేవారు కదా.." అంటూ పర్నిక చేతిలో బాగ్ అందుకుని ఎంతో ఆప్యాయంగా స్వాగతించింది సుమేధ. వదిన మాటలకు ముక్తసరిగా ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయింది పర్ణిక..
పర్ణిక సరాసరి తన తండ్రి గదిలోకి వెళ్లి తండ్రిని పలకరించింది. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. సుమేధ మామగారికి, ఆడపడుచుకి కాఫీ ఇచ్చి, తన భర్తను నిద్ర లేపింది. అందరూ కాసేపు మాట్లాడుకున్న తరువాత రిషి ఆఫీస్ కి వెళ్ళాడు. శ్యామలరావు గారు గుడికి వెళ్లారు. పర్ణిక స్నానం చేసి, టిఫిన్ తిని, గదిలో నిద్రపోతోంది. ఉదయం తను వచ్చిన దగ్గర్నుంచి గమనిస్తూనే ఉంది సుమేధ, పర్ణికలో ఏదో తేడా కనిపిస్తోంది. తనని పలకరించకపోవడం, మాట్లాడకపోవడం మాత్రం తేడా కాదు. అది ఎప్పుడూ ఉండేదే! తనని చులకనగా చూడటం, కుటుంబ సభ్యురాలిగా నైనా చూడకపోవడం తనకి కొత్తేం కాదు. ఇరవై ఏళ్ల నుంచి తనకి అది మామూలే! అయితే ఈ రోజు తను గమనించింది అంతకుమించి ఏదో..
ఐదేళ్ల క్రితం శ్యామలరావు గారి భార్య చనిపోయింది. రెండేళ్ల క్రితమే పర్ణికకి రిషి,సుమేధ కన్యాదానం చేసి, ఎంతో వైభవంగా పెళ్లి చేశారు
***
గుడి నుంచి వచ్చిన శ్యామలరావు గారు పర్ణిక పడుకోవడం చూసి నెమ్మదిగా తలుపు వేసి, హల్ బయట వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నారు.
"మావయ్యగారూ! ఈరోజు వంట ఏం చెయ్యమంటారు?" సుమేధ కంఠం హాల్ కిటికీ నుంచి నెమ్మదిగా వినిపించింది. “ఏదోకటి చెయ్యి” నిర్లక్ష్యంగా బదులు పలికారు. "ఏమేవ్! మా అమ్మాయికి నచ్చిన కూరలేమైనా చెయ్యి” మళ్లీ చెప్పారు శ్యామలరావు గారు.
మధ్యాహ్నం అందరూ భోజనాలు చేశారు. పర్ణికలో ఏదో అసహనం,వెలితి సుమేధకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేవీ తన తండ్రికి తెలియకుండా జాగ్రత్త పడుతోంది. అది కూడా గమనించింది సుమేధ. ఎంతైనా ఆడదాని మనస్సు కదా, అందులోనూ సుమేధ సున్నిత మనస్కురాలు.
సాయంత్రం అవుతున్నా విషయం అంతుబట్టడం లేదు. రిషి ఆఫీస్ నుంచి వచ్చి కాఫీ తీసుకురమ్మని బయట లాన్ లో కూర్చున్న చెల్లితో తండ్రితో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు.
"ఎంటే.. బావ ఎలా ఉన్నాడు? ఏంటి కబుర్లు.." అడిగాడు రిషి. ముక్తసరిగా సమాధానం చెప్పి మాట మార్చేసింది పర్ణిక. అందరికీ కాఫీలు ఇచ్చి పనంతా చేసి వచ్చి కూర్చుంది సుమేధ. అలా కూర్చుందో లేదో “ఏంటి తీరిగ్గా కూర్చున్నావు? కూర్చుంటే వంటెప్పుడు చేస్తావ్?” అన్న మావగారి మాటలకు వెంటనే లేచి వెళ్ళిపోయింది.
***సశేషం***
Comments