'Lankaku Chetu Vibhishanuda' New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ధర్మ సందేహాలు 1: లంకకు చేటు విభీషణుడా?
ఇటీవలి కాలంలో పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న దుష్ట పాత్రల్ని నాయకులుగా చూపడం, సన్మార్గులను చెడ్డవారిగా చిత్రీకరించడం పరిపాటి అయింది.
కొందరు తమ వాదనా పటిమతో భక్తుల్లో కూడా ఎన్నో సందేహాలు రేకెత్తిస్తున్నారు. అలాంటి సందేహాలకు సమాధానాలను చక్కటి కథల రూపంలో అందించాలనే నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
ఆ టీచర్స్ కాలనీలో వాళ్ళందరూ సాయంత్రమైతే రామాలయం దగ్గర సమావేశమౌతారు. రిటైర్డ్ హైస్కూల్ హెడ్ మాస్టర్ రాధాకృష్ణ మూర్తి గారు, తన స్వంత డబ్బులతో ఆ ఆలయాన్ని నిర్మించారు.
సాయంత్రమైతే గుడి ప్రాంగణంలో కూర్చొని, భక్తులకు కలిగే సందేహాలకు సమాధానం ఇస్తుంటారు అయన. ఎప్పటిలా ఆ రోజు కూడా చాలా మంది అక్కడ గుమికూడారు.
అందులో సోమసుందరం అనే వ్యక్తి పైకి లేచి, రాధాకృష్ణ మూర్తి గారికి నమస్కరించి, "గురువుగారూ! నిన్న మా ఆఫీసులో లంచ్ టైం లో రామాయణం గురించి చర్చ వచ్చింది. అందులో విభీషణుడి వల్లే రావణుడు ఓడిపోయాడని, లంక నాశనమైందని కొందరు వాదించారు. వారి వాదన తప్పని నాకు తెలిసినా తిరిగి వాదించలేక పోయాను. మీతో మాట్లాడితే నాకు వారితో ఎలా వాదించి ఓడించాలో తెలుస్తుంది. దయచేసి చెప్పండి" అని అడిగాడు.
అతన్ని కూర్చోమని చెప్పి, సమాధానం చెప్పడానికి ఉపక్రమించారు రాధాకృష్ణ మూర్తి గారు.
"ముందుగా మీరందరూ తెలుసుకోవలసింది ఏమిటంటే ఇలాంటి వాదనలు చేసేవారు మీకంటే ఎక్కువగా పురాణాలను చదువుతారు. దాంట్లో లొసుగులు వెదికి మిమ్మల్ని పెడత్రోవ పట్టిస్తారు. వారితో వాదించాలంటే ముందుగా మీకు తగిన ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి.
ఈ రోజు ధర్మ నిర్ణయం ఎలా చేయాలో మీకు చెబుతాను.
అంతకంటే ముందు విభీషణుడి కథను క్లుప్తంగా చెబుతాను. శ్రద్ధగా వినండి.
బ్రహ్మ మానస పుత్రులలో పులస్త్యుడు ఒకరు.
ఇతని కుమారుడు విశ్రవసుడు.
ఇతనికి, కైకసి అనే రాక్షస కన్యకు నలుగురు పిల్లలు పుడతారు.
వాళ్ళు రావణుడు, కుంభ కర్ణుడు, విభీషణుడు అనే ముగ్గురు కుమారులు, శూర్పణఖ అనే ఒక కుమార్తె.
పెద్దవాడైన రావణుడు అహంకారమనే రజో గుణం చేత, మూర్ఖత్వం చేత, తనకున్న జ్ఞానం కోల్పోయాడు. ఇక పరస్త్రీ వ్యామోహంతో తనకు, తన రాజ్యానికీ ముప్పు తెచ్చుకున్నాడు. హిత వాక్యాలు అతనికి రుచించవు. సీతను విడిచి పెట్టమని శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు అతని తలకెక్కలేదు.
ఇక రెండవ వాడైన కుంభకర్ణుడు తమో గుణానికి లోనైనవాడు. అతనికి రావణుడు చేసే తప్పులు తెలిసినా ఎదిరించలేదు. తన నిద్ర, తన తిండి గురించి ఎక్కువ ఆలోచించే వాడు. వాటిని సమకూర్చిన అన్న పక్షానే నిలబడ్డాడు.
శూర్పణఖ, రావణుడిలాగే రజోగుణం కలిగినది.
రాముడి మీద వ్యామోహం, అతడు దక్కలేదన్న ఉక్రోషం. సీత మీద ఈర్ష్య, తన భర్తను చంపిన తన అన్న రావణుడి పై కక్ష... ఇవన్నీ ఆమెను పెడదారి పట్టించాయి. రావణుడికి సీత మీద ఆసక్తి కలిగేలా అతనితో చెప్పింది. అతని నాశనానికి పరోక్షంగా కారణమయింది.
ఇక విభీషణుడి సంగతి మాట్లాడుకుందాం.
విభీషణుడు నలుగురిలో వివేకవంతుడు, సజ్జనుడు, ధర్మ విచక్షణ తెలిసిన వాడు.
ఒక వ్యక్తి గుణగణాలకు, అతని పుట్టుకకు సంబంధం లేదని చెప్పడానికి ఉదాహరణ విభీషణుడు. రాక్షస స్త్రీకి జన్మించినా సత్వ గుణం కలిగిన వాడు.
కుటుంబంలో ఒక బలవంతుడైన వ్యక్తి వుంటే అతని చాటున ఎన్నో తప్పులు చెయ్యవచ్చు. అతని అండతో ఎవ్వరినీ లెక్క చెయ్యకుండా చెలరేగి పోవచ్చు. అన్నకు వంత పాడితే అందలం ఎక్కిస్తాడని అతనికి తెలుసు.
కానీ విభీషణుడు అలా చెయ్యలేదు. రావణుడు మూర్ఖుడని తెలిసినా, నిండు సభలో అతను చేసిన తప్పును వ్యతిరేకించాడు. సీతను వదిలిపెట్టి శ్రీరాముడిని శరణు వేడమన్నాడు.
కానీ అహంకారి రావణుడు అందుకు అంగీకరించలేదు. విభీషణుడిని భయస్తుడిగా లెక్కకట్టి అవమానించాడు. తన వంధిమాగధుల మాటలకు విలువనిచ్చి, విభీషణుడిని సభనుండి వెళ్ళగొట్టాడు.
విభీషణుడు శ్రీరాముడిని శరణు వేడుకున్నాడు. ఆశ్రిత వత్సలుడైన శ్రీరాముడు విభీషణుడికి అభయం ఇచ్చాడు. లంకకు రాజుగా ప్రకటించాడు.
విభీషణుడు, లంక కోటకు సంబంధించిన రహస్యాలు రాముడికి తెలియజేశాడు. తరువాత రాముడు వానర సేనతో లంక పైన దండెత్తాడు. రామ రావణులకు భీకర యుద్ధం జరిగింది. రావణుడి శిరస్సును రాముడు ఎన్నిమార్లు ఖండించినా తిరిగి మరొక శిరస్సు మొలిచేది.
రావణుడి ఉదరంలో ఉన్న అమృత భాండాన్ని ఛేదించమని విభీషణుడు రాముడికి సూచించాడు. అమృత భాండం ఛేదించబడ్డాక రావణుడు రాముడి బాణాలకు హతుడయ్యాడు. తన మాట ప్రకారం రాముడు, విభీషణుడిని లంకకు రాజుని చేసాడు.
“ఇదీ క్లుప్తంగా విభీషణుడి కథ..” అంటూ కథను ముగించారు రాధాకృష్ణ మూర్తి గారు.
తరువాత శ్రోతల వైపు తిరిగి, "ఇప్పుడు విభీషణుడి గురించి మీకు కలిగిన సందేహాలూ, లేదా మిమ్మల్ని ఎవరైనా అడిగి మీరు సమాధానం చెప్పలేక పోయిన ప్రశ్నలూ నిస్సంకోచంగా నన్ను అడగవచ్చు" అని చెప్పారు.
ఇంతకు ముందు మాట్లాడిన సోమసుందరం "గురువుగారూ! మీ దగ్గర ఉన్న సుగుణమేమంటే ఏ విషయమైనా 'అదంతే...' అంటూ దాటవేయ్యారు. 'ఇప్పుడు సమయం లేదు. మరోసారి మాట్లాడుకుందాం' అని చెప్పి తప్పించుకోరు. 'నన్నే ప్రశ్నలూ అడుగుతావా?' అని కోప్పడరు. అందుకే మీరంటే మాకందరికీ మాటల్లో చెప్పలేనంత గౌరవం. ఇక అసలు విషయానికి వస్తాను. ఇది మా ఆఫీసులో నన్ను కొందరు అడిగిన ప్రశ్న. వాళ్ళు చెప్పినదాని ప్రకారం రావణుడు శ్రీరాముడికన్నా బలవంతుడు. విభీషణుడు ద్రోహం చేయకుంటే యుద్ధంలో రావణాసురుడే గెలిచేవాడు. విభీషణుడి వల్లనే లంకానగరం నాశనం అయ్యింది. ఇదీ వాళ్ళ వాదన. అందుకు ఎలా సమాధానం చెప్పాలో మీరే సెలవివ్వండి" అని అడిగాడు.
"విషయంలోకి వెళ్లే ముందు మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. సమాధానం చెప్పండి. ఈ గుడి నిర్వహణ ఎవరు చూసుకుంటారు?" అని అడిగారు రాధాకృష్ణమూర్తి గారు.
"గుడి కట్టించింది మీరు. నిర్వహిస్తున్నది కూడా మీరే.." అందరూ ముక్త కంఠంతో చెప్పారు.
"ఈ గుడి నిర్వహణలో ఏదైనా పొరపాటు జరిగితే ఎవరిది బాధ్యత?" తిరిగి ప్రశ్నించారాయన.
ఎవరూ సమాధానం చెప్పలేదు.
"మొహమాటం లేకుండా చెప్పండి.." అంటూ ఆయన ధైర్యం చెప్పాక "మీ నిర్వహణలో పొరపాట్లు జరగడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. అయినా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాం. అలాంటిదేదైనా జరిగితే మీరే బాధ్యత వహించాలి" అన్నారు కొందరు.
"సరిగ్గా చెప్పారు. అలాగే ఒక రాష్ట్ర పరిస్థితి ముఖ్య మంత్రిని బట్టి, దేశ పరిస్థితి ఆ దేశ ప్రధాని లేదా అధ్యక్షుని మీద ఆధార పడి ఉంటుంది. అది అభివృద్ధి అయినా సరే.. తిరోగమనమైనా సరే! అలాగే లంక నాశనానికి లంకాధిపతి రావణుడే బాధ్యుడు. ప్రతి నిర్ణయం అతని ఇష్ట ప్రకారమే జరిగింది. సీతను విడిచి పెట్టమని రావణుడి మంత్రులు, సోదరుడు కుంభకర్ణుడు, భార్య మండోదరి, ఇంకా ఎందరో విజ్ఞులు అతడికి చెప్పారు. కానీ చెడుకాలం దాపురించిన రావణుడు ఎవ్వరి మాటా వినలేదు.
విభీషణుడు యుద్ధానికి ముందే శ్రీరాముడిని శరణు కోరాడు. అంతేగానీ, రావణుడి సైన్యంలో కొనసాగుతూ రాముడికి సహాయం చెయ్యలేదు.
అందువల్ల లంకా వినాశనానికి ముమ్మాటికీ రావణుడే కారకుడు. ఒకవేళ విభీషణుడు కూడా రావణుడి పక్షానే వుండి వుంటే, శ్రీరాముడి క్రోధాగ్నికి లంక పూర్తిగా భస్మీపటలం అయి ఉండేది. ఒకరకంగా లంక సమూలంగా నాశనం కాకుండా విభీషణుడే కాపాడాడు”
చెప్పడం ముగించారు రాధాకృష్ణమూర్తి గారు.
అక్కడ వున్న వారందరూ అయన చెప్పినదాన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.
అక్కడ ఉన్న జనాల్లోంచి ఇంచుమించు యాభయ్యేళ్ళ వయస్సున్న ఒక వ్యక్తి పైకి లేచి, కాస్త సందేహిస్తూ.."నేను అన్య మతస్థుడిని. కేవలం మీ ప్రవచనాలు వినడానికి మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటాను. నాకు కూడా ఒక సందేహం వుంది. కానీ ఇది మతాల మధ్య వివాదానికి దారి తీస్తుందనుకుంటే విరమించుకుంటాను. లేదా మీరు అనుమతిస్తే మిమ్మల్ని మీ ఇంటివద్ద వ్యక్తిగతంగా కలిసి నా సందేహం తీర్చుకుంటాను" అని వినయంగా అడిగారు.
రాధాకృష్ణమూర్తి గారు సభాముఖంగా అయన పేరు అందరికీ చెప్పి, ఆయనను పరిచయం చేస్తూ "ఈయన నాకు తెలిసిన వ్యక్తి. వీరు డ్రాయింగ్ మాష్టారుగా పని చేస్తున్నారు. తన మతం వేరైనా మన దేవుళ్ళ బొమ్మలు చాలా చక్కగా గీస్తారు. చాలా గుళ్ళలో అయన గీచిన చిత్రాలు ఫ్రేమ్ కట్టించి ఉంచారు.
ఇక అయన ఒక సందేహం అడిగినంత మాత్రాన అది మనకు, మన మతానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు అనుకోరాదు. బదులుగా మనం కూడా ఆయనను ప్రశ్నలు అడగాలని భావించరాదు. చర్చ జరిగినప్పుడే సత్యం బయటకు వస్తుంది. పూర్వకాలంలో ప్రతి పురాణం గురించి, ప్రతి ఉపనిషత్తు గురించి రోజుల తరబడి, నెలల తరబడి చర్చలు, వాదోపవాదాలు జరిగేవి.
నచికేతుడు, సాక్షాత్తు యమ ధర్మ రాజుతో వాగ్వాదం చేసి చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఇక జగద్గురువు శంకరాచార్యులవారు దేశమంతా పర్యటించి, తన వాదనాపటిమతో ఎందరో పండితులను ఓడించాడు.
అంతేగానీ, ఎవరినీ ప్రలోభపెట్టో, భయపెట్టో తన మార్గాన్ని అనుసరించేలా చెయ్యలేదు.
కాబట్టి వీరు అడిగే సందేహాన్ని ఎవరూ తప్పుగా భావించవద్దు. ఒకవేళ ఇదే సందేహం మీలో కొందరికి ఇదివరకే కలిగి, అడగడానికి సందేహించి ఉండవచ్చు. లేదా మరొక రోజైనా మీకు ఈ సందేహం కలగవచ్చు. దయచేసి ప్రశ్నను, సమాధానాన్ని వివాదం చెయ్యవద్దు" అని అందరికీ విజ్ఞప్తి చేశారు. సభికులందరూ ఆమోదసూచకంగా తలలు ఊపారు.
అప్పుడు రాధాకృష్ణమూర్తి గారు, డ్రాయింగ్ మాస్టారి వైపు తిరిగి, "ఇక మీరు నిరభ్యంతరంగా మీ సందేహాన్ని అడగండి. మీలాంటి విజ్ఞులకు కలిగిన సందేహమంటే, జవాబు చెప్పడం కష్టమే అనిపిస్తోంది. కానీ దైవానుగ్రహంతో సమాధానం ఇవ్వడానికి ప్రయతిస్తాను" అని వినమ్రతతో అన్నారు.
డ్రాయింగ్ మాష్టారు మాట్లాడుతూ "నా చిన్నప్పుడు ఒక పండితుడి కొడుకు నా స్నేహితుడిగా ఉండేవాడు. నేను తరచుగా వాళ్ళింటికి వెళ్ళేవాడిని. వారి కుటుంబ సభ్యుల మధ్య జరిగే చర్చలు ఆసక్తిగా వినేవాడిని. అన్ని మాటలూ అర్థం కాకపోయినా ధర్మ నిర్ణయం ఎలా చెయ్యాలనే దానిపైన అయన చెప్పిన మాటలు నాపై బాగా ప్రభావం చూపాయి.
ఏది ధర్మమో, ఏది కాదో తెలియడానికి పెద్దగా శాస్త్ర పరిజ్ఞానం అవసరం లేదని అయన చెప్పేవారు. మనం ఇతరులకు సంబంధించి ప్రవర్తించే తీరు, వాళ్ళు మనతో ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ముందుగా ఆలోచించాలని చెప్పేవారు అయన.
ఉదాహరణకు మనతో ఎవరైనా కటువుగా మాట్లాడితే మనం బాధ పడతాం. కాబట్టి మనం ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు. అలాగే మన ధనం ఎవరైనా అపహరిస్తే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి మనం ఇతరుల ధనం అపహరించి కూడదు.. ఇలా అయన చెప్పిన మాటలు నేను జీవితంలో పాటిస్తూ ఉన్నాను." చెప్పడం ఆపాడు అయన.
జనాల్లో నిశ్శబ్దం ఆవరించింది. ఆయనేం అడుగుతాడోనని అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
"ఇలా అడుగుతున్నందుకు కోపగించుకోకండి. శ్రీరాముడు విభీషణుడిని చేరదీసే ముందు, ఒకవేళ లక్ష్మణుడు రావణుడివైపు చేరితే ఎలా ఉంటుంది.. అని ఆలోచించాలి కదా.." తన సందేహాన్ని బయట పెట్టాడాయన.
సభ్యుల్లో కలకలం రేగింది. కొంతమంది పైకి లేచి మాట్లాడబోయారు.
రాధాకృష్ణమూర్తి గారు అందరినీ కూర్చోమని చెప్పి, "ఇందుకు సరైన సమాధానం నా వద్ద వుంది. మీరు అడిగిన ప్రశ్న వల్ల, ఇతరులకు కూడా సందేహ నివృత్తి కలుగుతుంది. ఇందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.
ఇక ధర్మ నిర్ణయం ఎలా చెయ్యాలనే విషయంగా మీరు పండితుడి వద్ద నేర్చుకొని, ఆచరించడం ఎంతో గొప్ప విషయం.
మీ వాదన నుండే మీకు సమాధానం ఇస్తాను.
ముందుగా రావణుడు చేసిన చర్య గురించి..
అతడు చేసింది పరస్త్రీని చెరపట్టడం. అతడు ధర్మ మీమాంస చేసి వుంటే ఆ పని చేసివుండే వాడు కాదు.
ఇక మన కుటుంబాల నుండో లేక మనకు తెలిసిన వారి కుటుంబాల నుండో ఒక స్త్రీ అపహరణకు గురయితే మనం దానిని ఆమోదించం. అపహరించిన వ్యక్తి శిక్షింప బడాలని కోరుకుంటాం.
మన కుటుంబంలో ఒక వ్యక్తి.. ఉదాహరణకు మన సోదరుడు రావణుడిలా ప్రవర్తిస్తే ఏంచేస్తాం…?
మనుషులు మూడు రకాలుగా ప్రవర్తించడానికి అవకాశం వుంది.
మొదటిది దానవ ప్రవృత్తి.
ఈ ప్రవృత్తి ఉన్నవారు తమవారు పదవిలోనో అధికారంలోనో వుంటే, వారికి సహకరిస్తూ, వారి ప్రాపున తాము కూడా సుఖభోగాలను అనుభవిస్తారు. పాపం పండినప్పుడు వారితో పాటు శిక్షకు గురవుతారు. వీరి స్వభావం రావణాసురుడిని సమర్థించిన ఇతర రాక్షసుల లాంటిది.
ఇక రెండవది మానుష ప్రవృత్తి
వాస్తవానికి మనుషులు మూడు ప్రవృత్తులనూ కలిగి ఉంటారు.
కానీ సాధారణ మనుష్యులు, తమ వాళ్ళు తప్పు చేస్తే ఆమోదించరు. అలాగని పూర్తిగా ఎదిరించరు. తాము స్వయంగా అధర్మం చేయకపోయినా, పరోక్షంగా అధర్మపరులకు సహకరించిన వారవుతారు. వీళ్ళు రావణుడిని పూర్తిగా వదులుకోలేని కుంభకర్ణుడి కోవలోకి చెందుతారు.
ఇక మూడవది దైవ ప్రవృత్తి లేదా ధర్మ ప్రవృత్తి.
వీళ్ళు తరతమ భేదాలు చూడరు. ధర్మం ఎవరి వైపు వుంటే వీళ్ళు కూడా అటువైపు ఉంటారు.
రాక్షసుడిగా పుట్టినా విభీషణుడు ఈ కోవకే చెందుతాడు.
ఇక ధర్మస్వరూపుడైన రాముడి పక్షాన నిలబడ్డ లక్ష్మణుడు, వానరులు, భల్లూకులు, రావణుడి వైభోగాన్ని తృణప్రాయంగా ఎంచిన సీతామాత.. వీళ్లంతా దైవ స్వరూపులే.
డ్రాయింగ్ మాస్టారుగారూ!
శ్రీరాముడు రావణ సంహారం చేసి, సీతామాతను విడిపించి, ధర్మరక్షణ చేయాలనుకున్నాడు.
విభీషణుడు తన అన్నను విడిచి ధర్మం వైపు నిలిచాడు.
లక్ష్మణుడు కూడా ధర్మ స్వరూపుడైన తన అన్న వైపే నిలిచాడు.
ఇక్కడ ఎవరు ఎవరి వైపు అన్నది ప్రశ్న కాదు.
లక్ష్మణ విభీషణులిద్దరూ ధర్మం వైపే నిలిచారు.
ఇక రామాయణంలో భగవంతుడు ఒక సాధారణ వ్యక్తిగా జన్మించి, తన రాజ్యం, సైనికుల సహకారం లేక పోయినా ధర్మానికి కట్టుబడి, బలవంతుడైన శత్రువును ఎలా జయించాడో చూపబడింది. ధర్మాన్ని వెతుక్కుంటూ విజయం వస్తుంది అని చెప్పబడింది.
మీరు చెప్పిన ధర్మ చింతన ప్రకారం కూడా ఎవరైనా మనల్ని శరణు వేడి సహాయం కోరితే చేస్తాము కదా. శ్రీరాముడు అదే చేసాడు. రాక్షసులను నమ్మవద్దని కొందరు చెప్పినా, జాతి వివక్షతో సహాయం కోరిన వారిని కాదనకూడదని ఆ ధర్మ మూర్తి భావించాడు. ఇప్పుడు మీరే చెప్పండి. రాముడు చేసింది ధర్మమేనా... " చెప్పడం ముగిస్తూ ప్రశ్నించారు రాధాకృష్ణమూర్తి గారు.
"ముమ్మాటికీ ధర్మమే" చెప్పారు డ్రాయింగ్ మాష్టారు.
అందరూ అభినందన పూర్వకంగా చప్పట్లు కొట్టారు.
చర్చను ప్రారంభించిన సోమసుందరం మాట్లాడుతూ "ఇలాగే వీలున్నప్పుడు మా సందేహాలు తీరుస్తూ ఉండండి" అని అభ్యర్థించాడు.
అంగీకారంగా తల ఊపారు రాధాకృష్ణ మూర్తి గారు.
శుభం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
raja babu • 12 hours ago
Excellent