top of page

లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 1


శ్రీ సిహెచ్. సీఎస్. శర్మ గారి ధారావాహిక ప్రారంభం


'Life Is Love - Episode 1  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 17/01/2024

'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సంక్రాంతి....

సంబరాల సంక్రాంతి... అది ఒక కవిగారు అన్నమాటలు... ముత్యాల మూటలు.


కాలేజి ప్రిన్సిపాల్ వరదరాజుల నాయుడుగారు మూడుమాసాల క్రిందట పెద్దకూతురు వాణికి హైదరాబాదులో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న నవీన్‍తో తనకు ఉన్నంతలో ఎంతో ఘనంగా వివాహం జరిపించారు.


సంక్రాంతి మనకు పెద్దపండుగ.

అన్ని పండుగలకన్నా ఎంతో విశిష్టత కలది. ఆంధ్రావనిలో ఆ సమయంలో ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా యధాశక్తితో ఈ పండుగను జరుపుకొంటారు, అందరూ.... 


క్రొత్తగా పెండ్లి అయిన అల్లుడుగారు సతీసమేతంగా అత్తవారింటికి రావడం.... వారి సత్కారాలు అందుకోవడం మన అనవాయితీ.


కలిగినవారు.... అల్లుడుగారు అడిగిన దాన్ని ఇస్తారు. మధ్య తరగతి, అంతకంటే క్రింది వర్గీయులు యధాశక్తి.... అల్లుడు కూతురులను ఆహ్వానించి వస్త్రాలు ఇచ్చి సత్కరించడం ఆచారం. ఈ విధానం ఆరేళ్ళ కిందట విడదీయబడ్డ తెలుగు తెలంగాణా రాష్ట్రానికి వర్తిస్తుంది.


పండుగకు వచ్చిన అల్లుడు నవీన్ గారిని గురించి వాణి..... 

’నాన్నా! మావారు ఆఫీసుకు బస్సులో వెళతారు’ అన్న కూతురు మాటను మనస్సున ఉంచుకొని పండుగకు తన మాట ప్రకారం వచ్చిన అల్లుడికి బులెట్‍బండిని కానుకగా ఇచ్చి సత్కరించారు నాయుడుగారు.... వారి సతీమణి అనురాధ. 


వారిది ఎంతో అన్యోన్య దాంపత్యం. నలుగురు పిల్లలు. వాణి రెండో సంతతి. ఇద్దరు ఆడ పిల్లలు. ఇరువురు మగపిల్లలు. వరుస క్రమం మగ, ఆడ, మగ,ఆడ. పెద్ద కొడుకు భాస్కర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. వివాహం కాలేదు. రెండో సంతతి వాణి లాయర్. వివాహం అయింది. మూడవ సంతతి దీపక్. యం.టెక్, సివిల్ ఇంజనీర్. హైదరాబాదులో ఉద్యోగంలో చేరి నాలుగు నెలలైంది. నాల్గవ సంతతి అమృత. సూరత్‍లో చదువుతోంది. చివరి సంవత్సరం.

నాయుడుగారి తల్లి తండ్రి గతించారు. వారిరువురూ ఆరునెలల వ్యత్యాసంతో పరమపదించారు.


పండుగకు వచ్చి మూడురోజులున్న అల్లుడు నవీన్‍ను అత్తమామలైన నాయుడుగారు, అనురాధ, బావమరిది దీపక్ ఎంతో ప్రేమాభిమానాలతో చూచుకొన్నారు. ఆరోజు ఆదివారం. నవీన్ సోమవారం ఆఫీస్ అటండ్ కావాల్సి వుంది.

మధ్యాహ్నం భోజనాల సమయంలో...

"మామయ్యా!... నేను... వాణి... ఈ రాత్రికి బస్సులో హైదరాబాదు వెళతాము. నేను రేపు ఆఫీసులో అటెండ్ కావాలి" ప్రాధేయపూర్వకంగా చెప్పాడు నవీన్.


"వెళ్ళక తప్పదా అల్లుడుగారూ!" సౌమ్యంగా అడిగారు నాయుడుగారు.


"తప్పదు మామయ్యగారూ!" అనునయంగా చెప్పాడు నవీన్.


"అల్లుడుగారూ!" పిలిచింది అనూరాధ.


"దీపక్ మరో రెండు రోజులు వుంటాడట. వాణిని దీపక్‍తో పంపిస్తాము. మీకు అభ్యంతరం లేదుకదా" దీనంగా అడిగింది అనురాధ.


"నాకు ఏమీ అభ్యంతరం లేదు. వాణి ఇష్టమే నా ఇష్టం."


"అమ్మా! వాణీ! అల్లుడుగారు చెప్పింది విన్నావుగా! మరో రెండురోజులుండి దీపక్‍తో వెళ్ళమ్మా" అంది అనురాధ.


"అత్తయ్యా! వాణి వుంటుంది. ఇది చాలా చిన్న విషయం. ఎందుకు మీరు అంతగా ప్రాధేయపడతారు" అని వాణి వైపు చూచి "వాణీ! రెండుమూడు రోజులు వుండి దీపక్‍తో కలిసి రా. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు" నవ్వుతూ చెప్పాడు నవీన్.


"అలాగేనండీ అమ్మ ఆశపడుతూ వుంది!"


"అవును. వారు పెద్దవారు. వారి ఈ చిన్న చిన్న కోర్కెలను తీర్చడం మన ధర్మం వాణి" అనునయంగా చెప్పాడు నవీన్.

అతని మృదుమధుర మాటలకు నాయుడుగారు, అనురాధ ఎంతగానో ఆనందించారు. 


దీపక్ బులెట్ బండిని ట్రాన్స్ పోర్ట్ సర్వీసులో ఎక్కించి వచ్చి బావగారికి రిసిప్ట్ అందించాడు.


ఆ రాత్రి భోజనానంతరం... నవీన్ హైదరాబాద్ వెళ్ళేదానికి బయలుదేరాడు. తండ్రి, తల్లి, వాణి, దీపక్‍లు బస్టాండుకు నవీన్‍తో కలిసి వచ్చారు. 


నవీన్ అందరికి వీడ్కోలుచెప్పి బస్సు ఎక్కాడు. కొద్ది నిముషాల తర్వాత అతను ఎక్కిన బస్సు బయలుదేరింది.

"మన అల్లుడుగారు బంగారం అండీ" అంది అనురాధ ఆనందంగా.


"అంతా ఆపైవాడి దయ అనూ. మనం నిమిత్తమాత్రులం" నవ్వుతు చెప్పాడు నాయుడుగారు.


మూడురోజులు తాము పుట్టిన ఇంట తల్లిదండ్రుల సమక్షంలో వాణి, దీపక్‍లు ఎంతో ఆనందంగా గడిపారు. ఆ తల్లిదండ్రుల ఆనందం... మాటలకు అందనిది.

మూడవరోజు రాత్రి దీపక్, వాణిలు రైల్లో హైదరాబాద్ బయలుదేరారు.


ప్రిన్సిపాల్ వరదరాజులు నాయుడుగారు ఆరోజు రిటైర్ అయినారు. తోటి అధ్యాపకులు.... విద్యార్థులు వారికి వీడ్కోలు చెప్పారు. క్యాంపస్ దాటి వీధిలోకి ప్రవేశించారు. ఆ క్యాంపస్‍కు వారి ఇంటికి మధ్య దూరం అరకిలోమీటరు. వారు రోజూ కాలేజీకి నడిచే వెళ్ళేవారు. స్నేహితులు బండి ఏదైనా కొనుక్కోకూడదా నాయుడూగారూ అని అడిగినప్పుడు వారు చిరునవ్వుతో....

"మిత్రమా!.... అన్ని వ్యాయామ క్రీడలలో ఉత్తమమైనది నడక. ఇంటికి, కాలేజీకి మధ్య అరకిలోమీటరు దూరం. అందుకని నడవడం మంచిదని నడుస్తున్నా. చూడండీ మనం బ్రతికి ఉన్నంతవరకు ఎవరికీ భారం కాకూడదు. అందుకుగాను మన ఆరోగ్యాన్ని గురించి... తగిన నిర్ణయాలు మనమే తీసుకోవాలి" నవ్వుతూ చెప్పేవారు శ్రీ వరదరాజులు నాయుడుగారు.


వారి వెనుక పదిమంది విద్యార్థులు... వారి ప్రియశిష్యులు అనుసరించారు. నాయుడుగారు వారి యింటిని సమీపించారు. తలతిప్పి వెనుక వున్న శిష్యులను చూచారు.


"బాబులూ!... ఇక మీరు ఇండ్లకు వెళ్ళండి. శ్రద్ధగా చదవండి. జాతికీ, రీతికీ, నీతికీ ఆదర్శప్రాయంగా నిలవాలనే ఆకాంక్షతో జీవిత విధానాన్ని చిత్రించుకోండి. తల్లిదండ్రుల యెడల వారి జీవితాంతం ప్రేమాభిమానాలు చూపండి. వారికి ఆనందాన్ని కలిగించండి. మీ అందరికి నా శుభాశీస్సులు... వెళ్ళిరండి..."ఎంతో ఆప్యాయతతో నాయుడుగారు చెప్పారు.


ఆ పిల్లలందరూ నాయుడుగారికి నమస్కరించి వెళ్ళిపోయారు.

వీధిగేటు తెరుచుకొని నాయుడుగారు గృహప్రాంగణంలోకి ప్రవేశించారు. 

వారి ధర్మపత్ని అనురాధ... వరండాలో నిలబడి వారి రాకకోసం ఎదురుచూస్తూ వుంది.


నాయుడుగారు వరండాను సమీపించారు. చిరునవ్వుతో వారికి స్వాగతం పలికింది ఆ ఇల్లాలు. కానీ.... ఆ క్షణంలో ఆమె కనులనిండా కన్నీరు....


నాయుడుగారు గమనించారు. మెట్లు ఎక్కి తన చేతిలో వున్న పూలమాలను ఆమె మెడలో వేసి... తనపైవున్న శాలువాలను ఆమెకు కప్పారు చిరునవ్వుతో. 


ఆ క్షణంలో ఆ అనురాధమ్మ కనుల నుండి కన్నీళ్ళు క్రిందికి చెక్కిళ్ళ మీదకు జారాయి. తలను ప్రక్కకు తిప్పుకుంది.

నాయుడుగారు తన పైపంచతో ఆమె కన్నీటిని తుడుస్తూ... "అనూ! ఉద్యోగం ఊడిపోయిందని బాధపడుతున్నావా" ఆమె ముఖంలోకి చూస్తూ మెల్లగా అడిగారు.


కళ్ళు పెద్దవి చేసి అనురాధ వారి ముఖంలో చూచింది జాలిగా....

"నాకు ఎందుకు బాధ. నావారు నన్ను ముఫ్ఫై ఎనిమిది సంవత్సరాలుగా కంటికి రెప్పలా చూచుకొంటున్నప్పుడు ఈ నా కన్నీరు ఆనంద భాష్పాలండీ... ఇకమీదట మీకు విశ్రాంతి అనే ఆనందం..." నవ్వుతూ చెప్పింది అనురాధ.


నాయుడుగారు అనురాధ కుడిచేతిని తన చేతిలోనికి తీసుకొన్నారు. ప్రీతిగా ఆమె ముఖంలోకి చూచారు. "నా సాధన.... నా సంపత్తి... అంతా నీవేగా అనూ!...." 

చిరునవ్వుతో ఆమె ముఖంలోకి చూచాడు.

సెల్ మ్రోగింది.

జేబులోంచి చేతిలోకి తీసుకున్నారు నాయుడుగారు.

"హలో! నాన్నా... నేను..."


"వాణీ!"


"అవున్నాన్నా!"


"ఏమిటమ్మా విషయం?"


"రేపు నేను మనవూరికి వస్తున్నాను."


"అల్లుడుగారూ!"


"రావటం లేదు."


"ఏంటి?"


"వారు రావటం లేదు నాన్నా!"

ఆమె స్వరంలో విసుగు....


"తల్లీ!... మీ అమ్మతో మాట్లాడు."


సెల్‍ను అను చేతికి అందించారు నాయుడుగారు. వరండాలో వున్న వాలుకుర్చీలో కూర్చున్నారు. 

"వాణీ! ఏమిట్రా విషయం?" ఆందోళనతో అడిగింది అనురాధ.


"నేను రేపు ఉదయం ఆరుగంటలకల్లా మన ఇంటికి వచ్చేస్తాను. వచ్చి అన్ని విషయాలు చెబుతాను. సరేనా! నాన్నకు చెప్పు" సెల్ కట్ చేసింది వాణి.


అనురాధ ఆశ్చర్యంతో నాయుడుగారి ముఖంలోకి చూచింది.

"ఏంటండీ!... అది ఒంటరిగా వస్తూవుందట!" విచారంగా అంది అనురాధ.


"ఆ..... రానీ అనూ!... ఈ కాలపు పిల్లలు కదా! వారికి వారు నమ్మిందే వేదం" విరక్తిగా నవ్వారు నాయుడుగారు.


"నాకు అయోమయంగా వుందండి!.... భార్యాభర్తల మధ్య ఏదైనా!???"


"ఆగు... అనూ! ఎందుకు అలా ఆలోచిస్తావు? ప్రశాంతంగా ఉండు. ఉదయం ఆరుగంటల కల్లా వస్తుందిగా! అన్ని వివరాలు తెలుస్తాయిగా!!" సౌమ్యంగా అనురాధకు చెప్పాడు.


అనురాధ దిగాలుపడి నాయుడిగారి ముఖంలోకి చూస్తూ "మీకు వున్నంత మనోనిబ్బరం... నాకు లేదు కదండీ" విచారంగా చెప్పింది అనురాధ.


"సహనం సర్వదా రక్ష అనూ! తెలుసుగా!.. అనుమానంతో మనసు పాడుచేసుకోకు" అనునయంగా చెప్పారు నాయుడుగారు.


"సరేనండీ... బట్టలు మార్చుకొని భోజనానికి రండి" కూతురు వాణిని గురించిన ఆలోచనలతో ఇంట్లోకి వెళ్ళిపోయింది.


నాయుడుగారు భార్యామణి బాధపడుతుందని అలా గాంభీర్యాన్ని ప్రదర్శించారు. కాని వారి హృదయంలో ’వాణి ఈ ఆకస్మిక ఒంటరి రాకకు ఏదో కారణం వుండి ఉంటుంది. అది ఆమె వస్తేగాని తెలియదు. అల్లుడి గారికి ఆమెకు ఏ కారణంగానైనా బేధాభిప్రాయం ఏర్పడిందా! ఏమో! మొత్తానికి కారణం బలమైందే! కాకపోతే వాణి ఒంటరిగా బస్సులో హైదరాబాద్ నుంచి నెల్లూరికి రావడం ఏమిటి?’ అనుకొన్నారు.


నాయుడుగారి మనస్సు కీడును శంకిస్తూంది.

అనురాధ పిలుపు విని కుర్చీలోంచి లేచి ఇంట్లో ప్రవేశించి తమ గదికి వెళ్ళి బట్టలు మార్చుకొని డైనింగ్ హాల్లో ప్రవేశించారు.


అనురాధ మౌనంగా వడ్డించింది. 

"అనూ!... నీవూ తిను" ప్రీతిగా చెప్పారు నాయుడుగారు.

"మనస్సు వ్యాకులంగా వుందండీ" విచారంగా చెప్పింది అనురాధ.


పరిశీలనగా ఆమె ముఖంలోకి చూచాడు కొన్నిక్షణాలు నాయుడుగారు... చిరునవ్వుతో....

"తల్లివి గదా!... అది సహజమే!... మన వాణి చాలా తెలివైంది నాలాగే. త్వరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోదు. కూర్చొని ప్రశాంతంగా భోజనం చేయి" చిరునవ్వుతో చెప్పారు నాయుడుగారు.


అనురాధ కంచంలో వడ్డించుకొంది.

ఇరువురూ భోజనం చేయడం ప్రారంభించారు. వారిరువురి మనస్సుల్లో ఒకే ప్రశ్న!!... ’వాణి రాత్రిపూట ఒంటరిగా బయలుదేరి రావటానికి కారణమేమైవుంటుంది???"

సెల్ మ్రోగింది.


టేబుల్‍ పైని సెల్‍ను చేతికి తీసుకొన్నారు నాయుడుగారు.

"హలో..."


"ఎవరు?"


"దీపక్‍ని"


"ఎందిరా! గొంతు మారింది?"


"జలుబు... దగ్గు! రేపు ఉదయం ఇంటికి వస్తున్నాను. వారంరోజులు శలవు పెట్టాను."


"అలాగా!"


"అవును నాన్నా!"


"ఎవరండీ... దీపక్‍నా!"


"అవును అనూ!...." అనురాధకు జవాబు చెప్పి.

"ఆ....ఆ.... సరే జాగ్రత్తగా రా నాన్నా...!"


"బై నాన్నా"


"బై" సెల్ కట్ చేసి డైనింగ్ టేబుల్ మీద వుంచి....

"వారంరోజులు శలవుతో దీపక్ ఇంటికి వస్తున్నాడట అనూ! మూడు నెలల తర్వాత పిల్లలు ఇంటికి వస్తున్నారులే. ఆనందం ఇరువురికి"


"ఏమండీ... వాణీ" అనురాధ పూర్తిచేయకమునుపే "అబ్బా!... అనూ... అనుమానపడకు. పిల్లలు వస్తున్నారుగా!.... ఆనందంగా వుండు" అనునయంగా చెప్పారు నాయుడుగారు.

భోజనం ముగిసింది.

నాయుడుగారు హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నారు.

పావుగంటలో గిన్నెలు సర్దేసి అనురాధ హాల్లోకి వచ్చింది.


"పదిన్నర అయింది. అనూ పద పడుకుందాం" టీవిని ఆఫ్ చేసి నాయుడుగారు సోఫాలోంచి లేచారు.


ఇరువురూ వారి పడకగదిలో ప్రవేశించారు.

వరదరాజుల నాయుడుగారు... అర్ధాంగి అనురాధ మంచంపై వాలారు. ఇరువురి మనస్సుల్లో కలత. వాణి చేసిన ప్రసంగం కారణంగా.... ఎవరి ఆలోచనలు వారివి.

పావుగంట గడచింది.

"ఏమండీ!" మెల్లగా పిలిచింది అను.


"అనూ! నిద్రరావడం లేదా?"


"అవునండీ!"


"నీకు తెలుసుగా!.... మనస్సు అశాంతిగా వున్నప్పుడు ప్రశాంతతను కలిగించేది ఆ సర్వేశ్వర నామ జపమేనని. ఆ జగత్ పితను స్మరిస్తూ కళ్ళు మూసుకో. నిద్రమ్మ నిన్ను తన ఒడిలోకి తీసుకొంటుంది" నవ్వుతూ చెప్పారు నాయుడుగారు.


అనురాధ వారు చెప్పినట్టుగానే చేయసాగింది.

సెల్ మ్రోగింది. సమయం రాత్రి పదకొండు.

వీరి పెద్దకుమారుడు భాస్కర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఫోన్ అతనే చేశాడు. అక్కడికి అతను వెళ్ళి రెండు సంవత్సరాలయింది. నాయుడుగారు లేచి కూర్చొని ఫోన్ చేతికి తీసుకొన్నారు.

"హలో!"


"నాన్నా... నేను"


"ఆ...ఆ.. చెప్పు భాస్కర్!"

అనురాధ ’భాస్కర్’ అన్న నాయుడుగారి మాట విని తనూ మంచంపైనుంచి లేచి కూర్చుంది.


"నేను పై నెల ఆఖరులో మన వూరికి వస్తున్నా నాన్నా!"


"అలాగా చాలా సంతోషం నాన్నా! జాగ్రత్తగా వచ్చేయి."


"అమ్మ ఎక్కడ నాన్నా!"


"నా ప్రక్కనే వుంది. ఇదిగో ఫోన్ అమ్మకిస్తున్నాను మాట్లాడు."


నాయుడుగారు ఫోన్ అనురాధ చేతికి ఇస్తూ....

"మన భాస్కర్. మాట్లాడు" అన్నారు.


అనురాధ ఫోన్ అందుకొంది.

"అమ్మా బాగున్నావా? ఆరోగ్యం బాగుందా!"


"ఆ.....ఆ.... నేను బాగున్నా నాన్నా!... అక్కడ నీవు ఎలా వున్నావు?" ఆత్రంగా అడిగింది అనురాధ.


"ఇక్కడ అంతా బాగుందమ్మా!.... నేను చాలా ఆనందంగా వున్నాను. నాన్నగారు ఎలా వున్నారు? వాణి చెల్లి, దీపక్, అమృత ఎలా వున్నారు?"


"అందరూ బాగున్నారు నాన్నా!.... నీవు ఎప్పుడు వస్తున్నావు?"


"పై నెల డిశంబరు ముప్పై ఒకటవ తేదీన వస్తున్నా అమ్మా!"


"చాలా సంతోషం నాన్నా. ఈరోజే మీ నాన్నగారు రిటైర్ అయినారు."


"అలాగా!"


"అవును నాన్నా!"


"అమ్మా! నీ ఆరోగ్యం జాగ్రత్త!!"


"సరే నాన్నా!"


"ఉంటా. ఫోన్ కట్ చేస్తున్నా అమ్మా!"


"మంచిది నాన్నా! జాగ్రత్తగా రా!"


భాస్కర్ ఫోన్ కట్ చేశాడు.


అనురాధ నిట్టూర్చి "పెద్దవాడు వస్తున్నాడంటే మనస్సుకు చాలా ఆనందంగా వుందండి."


"నీకే కాదు... నాకూనూ!" చిరునవ్వుతో చెప్పాడు నాయుడుగారు.


గంట పన్నెండు....

ఆపై ఇరువురూ... ప్రశాంతంగా నిద్రపోయారు.

కార్తీకమాసం... వరదరాజులు నాయుడుగారు... ధర్మపత్ని అనురాధ....

తెల్లవారుఘామున నాలుగున్నరకు లేచారు. స్నానం చేసి నాయుడుగారు పూజాగదిలోకి, అనురాధ వంటగదిలోకి ప్రవేశించారు. నాయుడుగారు శివసహస్రనామ జపంతో అభిషేకం చేశారు సర్వేశ్వరమూర్తి శివలింగానికి. 

అనురాధ, వాణికి, భాస్కర్‍కు ఎంతో ఇష్టమైన పాయసాన్ని, మినప వడలను చేసి దైవ నివేదనకు తీసుకొని వచ్చింది. నాయుడుగారు పూజముగించి, ఆ పదార్థాలను దైవానికి నైవేధ్యం పెట్టారు.


ఆలూమగలు ఆ సర్వేశ్వరున్ని వాణి... మూలంగా ఎలాంటి జటిల సమస్య తమపాలు కాకూడదని వేడుకొన్నారు.

సమయం ఆరుగంటలు....

వాకిట్లో ఆటో ఆగింది. వాణి దిగింది.


ఆటో సవ్వడి వినగానే ఆ దంపతులు వీధి గేటును సమీపించారు.


"రామ్మా!.... రా!!" ప్రీతిగా పలుకరించి నాయుడుగారు ఆమె చేతిలోవున్న బ్యాగ్‍ను తన చేతిలోనికి తీసుకొన్నారు.


"రా తల్లీ... రా!" ఆప్యాయంగా కూతురి చేతిని తన చేతిలోనికి తీసుకొంది అనురాధ.


"అమ్మా! అల్లుడుగారు బాగున్నారా?" అడిగారు నాయుడుగారు ఇంటివైపునకు నడుస్తూ....

"బాగున్నారు నాన్నా" అంది వాణి ఏదో ఆలోచనతో.


"అమ్మడూ! మీవారు నీతో రాలేదేం?" సందేహంతోనే అడిగింది అనురాధ.


"వారికి శలవు దొరకలేదమ్మా" ముక్తసరిగా జవాబు చెప్పింది వాణి.


నాయుడుగారు అనురాధ ముఖంలోకి చూచారు.

ఆ చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన అనురాధ మారుమాట్లాడలేదు.


ముగ్గురూ ఇంట్లోకి ప్రవేశించారు. 

"కాగులో వేన్నీళ్ళు ఉన్నాయి అమ్మా! బస్సు ప్రయాణంలో ఎంతో అలసిపోయి వుంటావు. వెళ్ళి స్నానం చెయ్యి. నీకు ఎంతో ఇష్టమైన మినపవడలు, పాయసం తయారు చేశాను. స్నానం చేసిరా తిందువుగాని" ఎంతో ఆప్యాయంగా చెప్పింది అనురాధ.


వాణి క్షణంసేపు తల్లి ముఖంలోకి చూసింది. ఆమె చిరునవ్వుతో తననే చూస్తుందని గ్రహించింది.

"అలాగే అమ్మా!" నవ్వుతూ చెప్పింది వాణి. ఆ నవ్వులో జీవం లేదు.


"ఈరోజు మీ తమ్ముడు దీపక్ కూడా వస్తున్నాడు రా!" చెప్పారు నాయుడుగారు. 


"అలాగా! వాణ్ని చూచి మూడునెలలు అయ్యింది. వాడు వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది నాన్నా! స్నానం చేసి వస్తాను" వాణి స్నానాల గదిలోకి వెళ్ళిపోయింది.


వెళుతున్న ఆమెను పరిశీలనగా చూచి అనురాధ "ఏమండీ! మీరేమనుకుంటున్నారు" మెల్లగా అడిగింది.


"అనూ! ఏ విషయాన్ని గురించి?"


"అదే.... వాణి రాకను గురించి"


"తినబోతూ రుచి అడిగినట్టుంది నీ ఈ మాట. అరగంటలో నీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది" హేళనగా నవ్వుతూ చెప్పారు నాయుడుగారు.


అనురాధ రోషంతో తలదించుకుంది.

"నా బాధను మీరుగాక మరెవరు పంచుకుంటారు?" మెల్లగా గద్గద స్వరంతో అంది అనురాధ.


"అనూ! అనవసరంగా బాధపడకు. ప్రతి సమస్యకూ పరిష్కారమార్గం వుంటుంది. ముప్ఫై ఎనిమిది సంవత్సరాలుగా నాతో సహాజీవనం చేసిన నీవు ఈ చిన్న విషయానికి ఎందుకు అంతగా భయపడుతున్నావు. సమస్య ఏదైనా పరిష్కరించే శక్తి నీ ఈ మనిషికి వుందనే విషయాన్ని మరచిపోయావా!" నవ్వుతూ అడిగారు నాయుడుగారు.


అనురాధ ఓరకంట వారి ముఖంలోకి చూచింది. ఆ క్షణంలో ఆమె బుగ్గలపై సొట్టలు, పెదవులపై చిరునవ్వు, వదనంలో సిగ్గు!!


"సార్..."


"ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారండీ" వీధిగేటువైపు చూస్తూ అంది అనురాధ.


నాయుడుగారు పైపంచను సరిచేసుకొని సింహద్వారాన్ని సమీపించి... వీధిగేటువైపు చూచారు.

వచ్చింది వారి శిష్యుడు శివ.


"సార్... నమస్కారం లోనికి రావచ్చా!" అడిగాడు శివ.


"ఓ... శివా... నీవా... రా...రా...!"


వరండాలోనికి వచ్చి శివను పిలిచారు నాయుడుగారు. 

శివ గేటు తెరుచుకొని వరండాను సమీపించాడు.

"సార్! నమస్కారం" వినయంగా గురువుగారికి నమస్కరించాడు.


"ఎప్పుడు వచ్చావు శివా?"


"ఇదే రావడం."


"ఇంటికి వెళ్ళలేదా?"


"మిమ్మల్ని చూచి పలకరించి వెళ్ళాలని బస్టాండు నుంచి నేరుగా వచ్చాను సార్. అమ్మగారు, మీరు బావున్నారా సార్" ప్రీతిగా అడిగాడు శివ.


"ఆ... అంతా కుశలమే"


"బెంగుళూరులో ఎలా వుంది నీ ఉద్యోగం?"


"బాగుంది సార్. మా ఎం.డీ గారు చాలా మంచివారు. వారు ఒకప్పుడు మీ శిష్యుడేనట" నవ్వుతూ చెప్పాడు శివ.


"వారి పేరు?" అడిగారు నాయుడుగారు.


"గంగాధరరావుగారు"


నాయుడుగారు కొన్నిక్షణాలు ఆలోచించి...

"ఆ... అవును.. గుర్తుకొచ్చాడు" చిరునవ్వుతో చెప్పాడు నాయుడుగారు.


"సార్... ఇంక నే వెళతాను. సాయంత్రం మిమ్మల్ని కలుస్తాను. ఫ్రీగా వుంటారుగా సార్!"


"ఓసారి ఫోన్ చేయి" సాలోచనగా చెప్పారు నాయుడుగారు. 

"అలాగేసార్ వెళ్ళి వస్తాను" వినయంగా చెప్పి శివ తన ఇంటివైపునకు నడిచాడు. 


నాయుడుగారు భార్యకు చెప్పి వ్యాహ్యాళికి బయలుదేరారు.

వాణి స్నానం చేసి అలంకరించుకొని హాల్లోకి వచ్చింది.

"అమ్మా" పిలిచింది.


వంటగదిలో ఉన్న అనురాధ ఆ పిలుపు విని బయటికి వచ్చి "అమ్మడూ! టిఫిన్ తింటావా ఇవ్వనా" అడిగింది.


"ఇవ్వమ్మా" వాణి డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంది.


"డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో. తీసుకొని వస్తాను" అని చెప్పి అనురాధ వంటగదిలోకి వెళ్ళి నాలుగు మినపవడలు గ్లాసు పాయసంతో డైనింగ్ టేబిల్‍ను సమీపించి ప్లేటును గ్లాసును కూతురు ముందు ఉంచింది.


వాణి వడను తింటూ....

"అమ్మా.... నాన్న మరి?"


"వారు జాగింగుకు వెళ్ళారమ్మా"


"ఎప్పుడు వస్తారు?"


"అరగంటలో వస్తారు" అని కూతురు ముఖంలోకి చూచింది.


వాణి ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆనందంగా టిఫిన్ తింటూ వుంది. ఆమెకు తన తల్లిదండ్రుల మీద ఎంతో నమ్మకం, గౌరవం. నిన్నటినుంచి తన మనస్సుకు ప్రశాంతత లేకుండా చేసిన వాణి ఫోన్ కాల్, ఆమె రాకకు కారణం గురించి అడగాలనుకొంది. కానీ... మరుక్షణంలోనే బిడ్డ ఆనందంగా తనకు ఇష్టమైన గారెలను తింటూ ఉంది. ఈ సమయంలో ఆ విషయాన్ని గురించి అడిగి ఆమె మనస్సును కలవరపెట్టడం తగదు అనుకొంది. 


అదే.... తల్లి మనస్సు. ఆ అభిమానం, ఆదరణ బిడ్డలకు తల్లి దగ్గర తప్ప మరెవరి వద్ద లభించదు.


"అమ్మూ! మరో రెండు ఇవ్వనా" కూతురి ముఖంలోకి చూస్తూ ప్రీతిగా అడిగింది అనురాధ.


"చాలమ్మా. పాయసం ఉందిగా" చిరునవ్వుతో చెప్పింది వాణి.


పాయసం గ్లాసును చేతిలోనికి తీసుకొని త్రాగడం ప్రారంభించింది.

వాకిట్లో టాక్సీ ఆగిన సవ్వడి. 


అనురాధ ముఖద్వారాన్ని సమీపించి వీధివైపు చూచింది. ఆమె ముఖంలో ఆనందం. గబగబా వీధి గేటువైపునకు నడిచింది.

వచ్చింది చిన్నకొడుకు దీపక్.


తల్లిని చూచి "అమ్మా! నేను వచ్చేశా" నవ్వుతూ చెప్పాడు దీపక్.


"రా నాన్నా! రా...!" కొడుకును పరిశీలనగా చూచి...

"ఏరా నాన్నా తగ్గిపోయావు" కొడుకు చేతిని తన చేతిలోనికి తీసుకొని ప్రీతిగా అడిగింది.


"ఈ మధ్య యోగా, ఆసనాలు చేస్తున్నానమ్మా!"


పాయసం తాగిన వాణి వరండాలోకి వచ్చి తమ్ముణ్ణి చూచి "రేయ్ చిన్నా! దీపక్! ఎలా వున్నావురా?" అంటూ అతన్ని సమీపించి నవ్వుతూ అడిగింది.


"బాగున్నావా అక్కా. నీవు ఎప్పుడు వచ్చావు?"


"వచ్చి గంటయింది."


"బావగారు రాలేదా?"


"లేదురా!" ఆ క్షణంలో అంతవరకూ ఆమె ముఖంలో ఉన్న ఆనందం మాయమైంది. విచారం చోటుచేసుకుంది.


దాన్ని గమనించిన అనురాధ "పదండి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం" అంది.


ముగ్గురూ గృహంలోకి ప్రవేశించారు. 

"నాన్న ఏరమ్మా"

"వ్యాహ్యాళికి వెళ్ళారు"


"ఎంత సేపైంది?"


"అర్ధగంటయింది. ఈపాటికి తిరిగి వస్తూంటారు. మీ అక్క స్నానం చేసి టిఫిన్ కూడా తిన్నది. నీవూ వెళ్ళి స్నానంచేసిరా! నీకిష్టమైన మినపవడలు, పాయసం చేశాను తిందువుగాని" చిరునవ్వుతో దీపక్ ముఖంలోకి చూస్తూ చెప్పింది.


"అలాగే అమ్మా"


దీపక్ తన గదిలోనికి వెళ్ళి బ్యాగ్‍ను టేబుల్ పై వుంచి రెస్టు రూంలోకి ప్రవేశించాడు.


"అమ్మా! భాస్కర్ అన్నయ్యకు పెండ్లి ఎప్పుడు చేయాలనుకొంటున్నారు?" సోఫాలో కూర్చుంటూ అడిగింది వాణి.


"ఇంకా అనుకోలేదమ్మా."


"అన్నయ్యకు ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్ళు."


"అవును."


"ఆ విషయాన్ని గురించి నీవు నాన్నగారితో ఈమధ్య ఎప్పుడూ మాట్లాడలేదా?"


"లేదురా"


"ఈరోజు నేను మాట్లాడుతాను" నవ్వుతూ చెప్పింది వాణి.


’ముందు నీ ఆకస్మిక రాకకు కారణం ఏమిటో చెప్పి నా హృదయ భారాన్ని తగ్గించు తల్లీ!!’ అని మనసున అనుకొని. 

"సరే.... మాట్లాడు" అంది అనురాధ.


నాయుడుగారు ఇంటికి తిరిగి వచ్చారు.

వారిని చూచిన అనురాధ "దీపక్ వచ్చాడండి" ఆనందంగా చెప్పింది.


"అలాగా... ఎప్పుడు?" వరండాలోని కుర్చీలో కూర్చుంటూ అడిగారు నాయుడుగారు.


"పావుగంట అయింది స్నానం చేస్తున్నాడు" అంది అనురాధ.


"వాణీ ఏదీ?"


"స్నానం చేసి టిఫిన్ తిని హాల్లో కూర్చొని టీవీ చూస్తూ వుంది."


చేతిని పైకెత్తి సౌంజ్ఞతో అనురాధను రమ్మని పిలిచారు నాయుడుగారు.


అనురాధ వంగి వారి ముందుకు వచ్చింది.

"వాణి ఏమైనా చెప్పిందా" మెల్లగా అడిగారు నాయుడుగారు.


"లేదు" తనూ మెల్లగానే చెప్పింది అనురాధ.


కొన్నిక్షణాలు కళ్ళుమూసుకొని... తెరిచి... నిట్టూర్చి....

"నీవు ఆమెను ఏమీ అడగలేదుగా"


"లేదండీ" అంది అనురాధ.


స్నానం చేసి డ్రెస్ మార్చుకొని హాల్లోకి వచ్చిన దీపక్....

"అమ్మా" అని పిలిచాడు.


"వరండాలో ఉన్నారా"

దీపక్ వరండాలోకి వచ్చాడు. నాయుడుగారిని చూచాడు.

సమీపించి "గుడ్ మార్నింగ్ నాన్నా" చిరునవ్వుతో చెప్పాడు దీపక్.


"గుడ్ మార్నింగ్ దీపూ. ఆరోగ్యం బాగుందిగా"


"సూపర్ నాన్నా."


"లేవండీ.... మీరూ.... దీపక్ టిఫిన్ తిందురుగాని."


"రండి నాన్నా! ఆకలి దంచేస్తూంది" నవ్వుతూ చెప్పాడు దీపక్.


"పద తిందాం" కుర్చీలోంచి లేచారు నాయుడుగారు.


దీపక్, నాయుడుగారు, అనురాధ టిఫిన్ తిని హాల్లోకి వచ్చారు. 

వాణి టీవీ చూస్తూవుంది.

నాయుడుగారు ఆమె పక్కన కూర్చున్నారు. ఎదుటి సోఫాలో దీపక్, అనురాధ కూర్చున్నారు.


"అమ్మడూ! టీవిని ఆపరా" అన్నారు నాయుడుగారు.


వాణి టీవీని ఆపి తండ్రిగారి ముఖంలోకి చూచింది.


"అమ్మా! ఏదో విషయం చెప్పాలన్నావుకదా చెప్పు" ఎంతో ప్రశంతంగా అడిగారు నాయుడుగారు.


"నాన్నా!" దీనంగా చూచింది వాణి నాయుడుగారి ముఖంలోకి.

దీపక్, అనురాధ వాణీ ఎం చెప్పబోతుందా అని ఆమెనే పరీక్షగా చూస్తున్నారు.


"చెప్పు తల్లీ"


"మావారు...." సందేహంతో ఆపింది వాణి.


"సందేహించకు... విషయం ఏమిటో చెప్పు."


"నా...!"


"నీ...." ఆశ్చర్యంతో చూచారు వాణి ముఖంలోకి నాయుడుగారు.


"చెప్పవే... మా ముందు నీకు భయం ఎందుకు?" చిరాగ్గా అంది అనురాధ. వాణి ఎలాంటి వార్తను వినిపిస్తుందో అని ఆమె మనస్సులో కలవరం.


నాయుడుగారు అర్థాంగి ముఖంలోకి క్షణంసేపు నిశితంగా చూచి....

"నిర్భయంగా చెప్పరా" అన్నారు. 

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


75 views0 comments

Comments


bottom of page