top of page

లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 5



'Life Is Love - Episode 5'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 08/02/2024

'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ: 


ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు. మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి, భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు.


తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు.


ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజులు నాయుడుగారి కొడుకు దీపక్ కి, తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు.


యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్ లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడుగారు వెంటనే అంగీకరించక పోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.


దీపక్ ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామిని.

యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్.

చిన్ననాటి స్నేహితుడు జగన్నాథ్ ని కలుస్తారు నాయుడుగారు.


ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 5 చదవండి.



టిఫిన్ తిన్న తర్వాత మిత్రులు నాయుడుగారు, జగన్నాథ్ అతని రూములో కూర్చున్నారు. నాయుడుగారు తన పిల్లల గురించి, వారి చదువుల గురించి ప్రస్తుతంలో వారు ఎక్కడ? ఏం చేస్తున్నదీ? ఆస్తి పంపకాలను గురించి స్నేహితునికి వివరించారు. 


అంతా విన్న జగన్నాథ్....

"నాయుడూ! నా జీవితానుభవంలో మనం మనకంటూ మనకోసం బ్రతికేది విద్యార్థి దశ మనుగడ వరకే. మగవాడి జీవితంలోకి మరో ఇంటి అమ్మాయి భార్యగా ప్రవేశించిన తర్వాత తనకి బాధ్యతలు పెరుగుతాయి. ఇటు కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను, అటు జీవిత భాగస్వామిగా వచ్చిన ఆ స్త్రీ మూర్తినీ ఆనందపరిచేలా విచక్షణతో సమయస్ఫూర్తితో.... ఎవరినీ నొప్పించకుండా.... ద్విపాత్రాభినయం చేయవలసి ఉంటుంది. 


తల్లితండ్రి లేనివాడైతే.... అతనికి సమస్యలు తక్కువ. వారు బ్రతికివుంటే..... చాలా లౌక్యంగా... మితభాషిగా... సహనమూర్తిగా వర్తించవలసి ఉంటుంది. నేను రెండో వర్గానికి చెందినవాడిని. నీకు తెలుసుగా! అమ్మా నాన్నలు నా వయస్సు పదేళ్ళుగా ఉన్నప్పుడు కారు యాక్సిడెంటులో నాకు దూరమైపోయారు. మామయ్య శ్రీనివాస్ నన్ను పెంచి పెద్దచేశారు. డాక్టర్ చదివించారు. పెండ్లి కూడా చేశారు. 


నేను అమెరికా వెళ్ళిపోయాను. పార్వతి గురించి నీకు బాగా తెలుసు. ఇంతవరకు మా మధ్య అభిప్రాయ బేధాలు లేవు. ఇకపై రావు కూడా... తమిళ భాషలో ఓ సామెత ఉంది ’మనవి అమియదెల్లా.... ఇరవన్‍మీడుత వరం’ జీవిత భాగస్వామి సరి అయినదిగా లభించడం అనేది ఆ దైవం మనకు ప్రసాదించిన వరం అవుతుంది. 


నా మగపిల్లల విషయంలో వారుగా మా ఇరువురి ప్రమేయం లేకుండా చేపట్టిన వనితలు సవ్యంగా లేరు. వారికై వారు మాతో చెప్పకుండా తీసుకున్న నిర్ణయాలు, ఆవేశంలో ఉడుకురక్తంతో విచక్షణా రహితంగా తీసుకున్న ఆ నిర్ణయాలు నేడు ఇరువురిని బాధిస్తున్నాయి. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి.


జీవితంలో అర్ధాంగిగా ఎన్నుకొన్న వారితో రాజీ జీవితం గడపటం వారి వంతైంది. మనకు పొద్దు తిరిగింది. వారు నడిపొద్దులో వున్నారు. మన మాటలు వారికి రుచించవు. దానికి మరొక కారణం.... వారు పుట్టిపెరిగిన పాశ్చాత్య నాగరికతే...!" విరక్తిగా నవ్వాడు జగన్నాథ్.


"అవునన్నా! పాతికేళ్ళ ప్రాయంలోకి వచ్చిన పిల్లలకు మనతరం మనస్తత్వం లేదు చాలామందికి. వారి కాళ్ళమీద వారు నిలబడేటప్పటికి వారి మనస్తత్వాలు మారిపోతున్నాయి. తల్లిదండ్రులు వారికి పరాయి వారవుతున్నారు. వారి ఆనందం వారిది... పుట్టిన వంశం, కీర్తి, గౌరవాలతో వారికి పనిలేదు. స్వతంత్ర భావాలు. సొంత నిర్ణయాలు వారి ఆ చర్యలు తల్లిదండ్రులను ఎంతగా బాధిస్తాయనే విచారం వారికి లేకుండా పోతుంది. 


చిన్నవాడు దీపక్ విషయంలో నాకు అనుమానం. వాడికి ముకుందరావుగారి అమ్మాయికి ఏదో సంబంధం వుందని... దాన్ని గురించి వాడితో మాట్లాడేందుకే ఇక్కడికి వచ్చాను. పెద్దవాడు భాస్కర్‍కి ఇంకా పెళ్ళి కాలేదు. త్వరలో వస్తున్నాడట. రెండు మూడు సంబంధాలు చూచాను. వాడు వచ్చి... అమ్మాయిని చూచి.... వాడికి నచ్చితేనే కదా ఆ వివాహం జరిగేది. వారంరోజుల క్రితం చిన్నవాడు ఇంటికి వచ్చాడు. 


ఆ మరుసటి దినమే ముకుందరావు మన ఇంటికి వచ్చాడు. తన కూతుర్ని దీపక్‍కు ఇచ్చి వివాహం చేయాలనేది తన సంకల్పం అని చెప్పాడు. పెద్దవాడి పెండ్లి చేయకుండా చిన్నవాడికి ఎలా చేస్తామన్నా! మనవాడి వాలకం... నేను ముందు చెప్పినట్టుగా అనుమానాస్పదంగా ఉంది. అందుకే వాడితో మాట్లాడి ఇష్టపడితే కొంతకాలం ఆగాలని వారితో కూడా చెప్పాలని వచ్చాను. మనం ఎన్నో తలుస్తాము. కానీ... ఆ దేవుడు నిర్ణయానికి అతీతంగా ఏదీ జరుగదుగా!!" విచారంగా చెప్పారు నాయుడుగారు.


సెల్ మ్రోగింది.

"హలో!"


"నాన్నా.... నేను!"


"అమ్మా... వాణీ... ఏమ్మా!"


"పత్రాలను చూచి బ్యాంకు వారు మా వారడిగిన మొత్తాన్ని ఇవ్వలేము అన్నారట నాన్నా" దీనంగా చెప్పింది వాణి.


"అలాగా మరి నేను ఏం చేయాలమ్మా?"


"నాన్నా! వారు మాకు వీలునామా పత్రాలు అవసరం లేదు. డబ్బు కావాలి అన్నారు నాన్నా."


నాయుడుగారి తలపై పిడుగుపడినట్టు అయింది. తడబడ్డారు.... అయినా తమాయించుకొని...

"ఎంత కావాలమ్మా!"


"యాభై లక్షలు..."


"యాభై లక్షలా!!!" ఆశ్చర్యంతో అడిగారు నాయుడుగారు.


"అవును నాన్నా" దీనంగా చెప్పింది వాణి.


"ఏంట్రా... యాభై లక్షలు" అడిగారు జగన్నాథ్.


"అదే... చెప్పానుగా వాణి వాటాను పత్రపూర్వకంగా సంతకం చేసి ఇచ్చానని, ఆ పత్రాలు బ్యాంకులో వుంచుకొని అల్లుడుగారు కోరినంత డబ్బును ఇవ్వలేమని చెప్పారట. ఆ కారణంగా అమ్మాయి నన్ను డబ్బు అడుగుతోంది" దీనంగా చెప్పారు నాయుడుగారు.


"ఎంత?" అడిగారు జగన్నాథ్.


"యాభై లక్షలు"


"నీవు హైదరాబాదు వచ్చిన విషయం ఆమెకు తెలుసా"


"తెలీదు వస్తున్నట్టు చెప్పలేదు."


"ముందు చెప్పు... నేను హైదరాబాదులోనే ఉన్నాను. మీ ఇంటికి వస్తాను.... మాట్లాడుతాను. నీ సమస్యను తీరుస్తానని చెప్పరా."


"అమ్మా వాణీ! నేను ఇప్పుడు హైదరాబాదులోనే ఉన్నాను. నేను మీ ఇంటికి వచ్చి నిన్ను కలుస్తాను."


"డబ్బు లేకుండా మీరు మా ఇంటికి రావద్దు నాన్నా. మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అక్కడికి నేనే వస్తాను."


నాయుడుగారు వాణికి జగన్నాథ్ ఇంటి అడ్రస్ గురించి చెప్పారు.

"అరగంటలో వస్తాను నాన్నా" అంది వాణి.


నిట్టూర్చి సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు నాయుడుగారు.

"నాయుడూ ఏమిట్రా నీ ఆలోచన" అడిగాడు జగన్నాథ్.


"యాభై లక్షలు సమకూర్చటం ఎలా అని ఆలోచిస్తున్నాను."


"ఆ విషయం నాకు వదిలెయ్. దీపక్‍కు ఫోన్ చెయ్యి. వాడిని ఇక్కడికి రమ్మను" చెప్పారు జగన్నాథ్.


నాయుడుగారు దీపక్‍కు ఫోన్ చేశారు. జగన్నాథ్ ఇంటి అడ్రస్ చెప్పి రమ్మన్నాడు.


అకస్మాత్తుగా తండ్రి ఫోన్ కాల్ విన్న దీపక్ భయపడ్డాడు.

”ఈయన ఇక్కడికి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు’ అనుకొన్నాడు.


"వస్తాను నాన్నా" అన్నాడు.


"ఓ సమస్య విషయంలో నేను వస్తే.... మరో సమస్య ముందు నిలిచింది అన్నా!" విచారంగా చెప్పారు నాయుడుగారు.


"భయపడకు..... బాధపడకు... ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది. పద కిందకు వెళ్ళి టీవీ చూద్దాం" 


నవ్వుతూ చెప్పాడు జగన్నాథ్. నాయుడుగారు తలాడించారు. ఇరువురూ క్రిందకి నడిచారు.

అరగంట తర్వాత వాణి జగన్నాథ్ ఇంటికి వచ్చింది. ఆమె వదనం చాలా విచారంగ ఉంది. నాయుడుగారిని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండాయి. 

"అమ్మా! వీరు నా ప్రాణమిత్రులు జగన్నాథ్ గారు. ఇరువురం ముఫ్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు ఉదయం స్టేషన్‍లో కలిశాము. నన్ను గుర్తుపట్టి బలవంతంగా తన ఇంటికి తీసుకొని వచ్చారు. అమెరికాలో డాక్టర్‍గా పనిచేసి ఆరునెలల క్రిందట స్వదేశాభిమానంతో ఇండియాకు తిరిగి వచ్చారు. వారిని నీవు పెదనాన్నా అని పిలవాలి... కన్నీళ్ళు తుడుచుకో" ప్రీతిగా చెప్పారు నాయుడుగారు.


"పెదనాన్నగారూ! నమస్కారం" కన్నీళ్ళతోనే చేతులు జోడించింది వాణి.


"అమ్మా! వాణీ ఎందుకా కన్నీరు మేమున్నాముగా తల్లీ! ఏమిటి నీ సమస్య" అడిగాడు జగన్నాథ్.


పార్వతి, దీపిక హాల్లోకి వచ్చారు. జగన్నాథ్ వారికి వాణిని పరిచయం చేశారు.


పార్వతి వాణి భుజంపై చేయి వేసి "నీవు లాయర్‍వి కదమ్మా" అడిగింది.


"అవును పెద్దమ్మా!"


నాయుడు, జగన్నాథ్‍లు ఒకరి ప్రక్కన ఒకరు సోఫాలో కూర్చున్నారు. వారి ఎదురు సోఫాలో పార్వతి కూర్చుంది. వాణి వైపు చూచి "కూర్చో అమ్మా" ప్రేమగా అంది.


వాణి ఆమె ప్రక్కన సోఫాలో కూర్చుంది. 

"టిఫిన్ తిన్నావా అమ్మా" అడిగింది పార్వతి.


తలాడించింది వాణి.

"దీపూ! అక్కయ్యకు కాఫీ తీసుకురా!"


"అలాగే అమ్మా" దీపిక వంటగదివైపునకు నడిచింది.


"అమ్మా.... నీ ప్రస్తుత సమస్య మీవారు నీ వాటా పత్రాలను వద్దని యాభై లక్షలు డబ్బు కావాలంటున్నారు అంతేగా" అడిగారు జగన్నాథ్.


"అవును పెదనాన్నా"దీనంగా హీన స్వరంతో మెల్లగా చెప్పింది వాణి.


జగన్నాథ్ నాయుడుగారి ముఖంలోనికి చూచాడు. 

"నాయుడూ! ఏం చేయాలనుకొంటున్నావ్?"


"ఏం చేయాలో వాణికి ఏం చెప్పాలో తోచటం లేదు జగ్గన్నా"


"నేను చెప్పనా"


"చెప్పన్నా"


"వాణీ! ఆ పత్రాలను నా పేరుకు మార్చి మీవారు, నీవు సంతకాలు చేసి నాకు ఇవ్వాలి. ఆ యాభై లక్షలు నేను మీకు ఇస్తాను" చెప్పాడు జగన్నాథ్.


వాణి, నాయుడుగారు ఇరువురూ ఆశ్చర్యపోయారు.


"అంతగా ఆశ్చర్యపడకండి. ఆ ప్రాపర్టీ వుండేది మనం పుట్టిన వూర్లోనే కదరా. అందువల్లనే నేను తీసుకొంటానని చెప్పాను. మన తల్లిదండ్రుల పేర భావితరానికి ఉపయోగపడేలా ఏదైనా మంచి కార్యం చేస్తాను."


వాణి నిట్టూర్చింది. ఆమె ముఖంలో ఆనందం. చిరునవ్వుతో జగన్నాథ్ నాయుడిగారి ముఖాల్లోకి చూచింది.

"ధన్యవాదాలు పెదనాన్నా" చేతులు మరోసారి జోడించింది.


"నా భావనలో ఆత్మీయుల మధ్య అలాంటి పదాలకు తావు లేదమ్మా" నవ్వుతూ చెప్పాడు జగన్నాథ్.


"అన్నా...." పరవశంతో పిలిచాడు నాయుడు.


"ఏంట్రా" నవ్వుతూ అడిగారు జగన్నాథ్.


"నీవు నా నెత్తిన పాలు పోశావు"


"దానికి నీవు అర్హుడవే! అందులో నా స్వార్థం కూడా ఉందిరా."


"ముఫ్ఫయి సంవత్సరాల తర్వాత మనం కలిసి మూడుగంటలైంది. నా సమస్యను నీ సమస్యగా భావించి, ఆ చిన్ననాటిలా నీవు నన్ను అభిమానించి సమస్యను పరిష్కరించిన తీరు అందరికీ సాధ్యం కాదు అన్నా" కృతజ్ఞతాపూర్వకంగా చెప్పారు నాయుడుగారు.


"అది నా దృష్టిలో నా ధర్మంరా!! అతిశయోక్తి కాదు"


నాయుడుగారు జగన్నాథ్ చేతులు పట్టుకొని "నీవు చేసిన ఈ మేలును నేను జీవితాంతం మరిచిపోలేను జగ్గన్నా!" 

ఆనందంతో హృదయపూర్వకంగా చెప్పారు.


"వాణీ! రేపు వీడూ, నేను మీ ఇంటికి వస్తాము. నేను చెప్పిన విధంగా పత్రాలను రెడీ చేయించు. నీవు లాయర్‍వి కదా. ఆ పని చేయడంలో నీకు కష్టం ఉండదు. మరోసారి చెబుతున్నాను అందులో మీవారూ, నీవు సంతకం చేయాలి. మీనుండి వాటిని నేను అందుకొని యాభైలక్షల చెక్కుని మీకు ఇస్తాను సరేనా!" చెప్పాడు జగన్నాథ్.


"అలాగే బాబాయ్! ఇక నేను వెళతాను" అని చెప్పి తండ్రివైపు తిరిగి "నాన్నా నే వెళ్ళొస్తాను" అంది వాణి.


"మంచిదమ్మా"


"పెద్దమ్మా.... దీపికా! వస్తాను" చిరునవ్వుతో చెప్పింది వాణి.


"అమ్మా వాణీ! ఇది నీ పుట్టినిల్లుగా భావించు. అప్పుడప్పుడూ ఫోన్ చెయ్యి. ఇంటికి రా సరేనా" అభిమానంతో చెప్పింది పార్వతి.


"అలాగే పెద్దమ్మా!"


"అక్కా! అమ్మ చెప్పిన మాటలను మరిచిపోకు" నవ్వుతూ చెప్పింది దీపిక.


జగన్నాథ్ డ్రైవర్‍ను పిలిచాడు. మస్తాన్ వారిముందు నిలిచాడు. 

"అమ్మాయిని వారి ఇంటి దగ్గర దించిరా మస్తాన్"


మస్తాన్ తలాడించాడు. అందరూ వరండాలోనికి వచ్చారు.

మస్తాన్ కారు డోర్ తెరిచాడు. వాణి అందరికీ చెప్పి కార్లో కూర్చుంది.


మస్తాన్ కారును స్టార్ట్ చేసి వీధి వైపునకు నడిపాడు.

వాణి వెళ్ళిన పావుగంటకు దీపక్ వచ్చాడు. నాయుడుగారు దీపక్‍ను జగన్నాథ్‍కు పరిచయం చేశారు.


దీపక్ సవినయంగా జగన్నాథ్‍కు, వారి అర్థాంగి పార్వతికి నమస్కరించాడు.


వారందరినీ చూచిన దీపక్ వదనంలో కాంతిహీనత. వీరు నన్ను ఏమడుగుతారో! అసలు ఎందుకు పిలిచారు. 


నాన్నగారు ఆకస్మికంగా హైదరాబాదు రావటానికి కారణం ఏమిటో! అంతా అయోమయం..... ఒకవేళ నాన్నగారికి తనకు యామినీకి సంబంధించిన ప్రేమ విషయం తెలిసిందా! ఎవరు చెప్పి ఉంటారు? ఆ రోజు ముకుందరావు ’మా అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి వివాహం చేయాలని మా నిర్ణయం అన్నారుగాని, మేమిరువురం ప్రేమించుకొన్నట్టు ఆయన నాన్నగారితో చెప్పలేదే!... అసలు ముకుందరావుగారికి యామిని, నేను ప్రేమించుకొన్నట్టు తెలుసునో... తెలియదో! అనుకొన్నాడు దీపక్.


నిలబడి ఉన్న దీపక్‍ను చూచి జగన్నాథ్

"దీపక్ కూర్చో" అన్నారు.


అతను మౌనంగా సోఫాలో కూర్చున్నాడు. 

"మీ ఆఫీస్ ఎన్నిగంటలకి" అడిగారు జగన్నాథ్.


"9.30కి"



"వెళ్ళాలిగా!"

"వెళ్ళాలి సార్! ఓ గంట పర్మిషన్ అడిగాను."


"అంటే వెంటనే వెళ్ళిపోవాలంటావ్" నవ్వాడు జగన్నాథ్.


ఔనన్నట్టు తలాడించాడు దీపక్.


"చిన్నా! దీపక్.... నీవు వెళ్ళాలన్నావుగా! నా ఈ ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు" సౌమ్యంగా అడిగారు నాయుడుగారు.


దీపక్ ఆశ్చర్యంతో తండ్రి ముఖంలోనికి చూచాడు "అడగండీ నాన్నా!.." మెల్లగా చెప్పాడు దీపక్. 


"నీవు ఆ ముకుందరావు గారి అమ్మాయిని ప్రేమిస్తున్నావా?"


తండ్రి నుండి తాను ఎదురు చూడని ప్రశ్న విని దీపక్ బెదిరిపోయాడు. వెంటనే జవాబు చెప్పలేక తలదించుకున్నాడు.


జగన్నాథ్ చిరునవ్వు నవ్వారు.

"మౌనం అంగీకారం అని ఎక్కడో చదివాము కదరా నాయుడు" అన్నారు.


దీపక్ తలెత్తి ఇరువురి ముఖాల్లోకి క్షణంసేపు చూచి తలదించుకున్నాడు.

"అన్నయ్యకు పెండ్లి కాకముందే నీవు పెండ్లి చేసుకోవాలనుకుంటున్నావా?" సౌమ్యంగానే అడిగారు నాయుడుగారు.


దీపక్ నిట్టూర్చి "అవును" అన్నాడు.


మిత్రులిరువురూ ఒకరి ముఖం ఒకరు చూచుకొన్నారు.

"బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చావా దీపక్" 

అనునయంగా అడిగారు నాయుడుగారు.


"అవును. మీరు ముకుందరావుగారితో మాట్లాడి మా వివాహం జరిపించకపోతే మేము రిజిష్టర్ మ్యారేజి చేసుకొంటాము" 

తెగించి తన నిర్ణయాన్ని చెప్పాడు దీపక్.


మిత్రులిరువురూ ఆశ్చర్యపోయారు.

దీపక్ లేచి నిలబడ్డాడు.

"నాన్నా! నా నిర్ణయాన్ని చెప్పాను. ఆఫీసుకు వెళ్ళాలి. నేను వెళుతున్నాను." నాయుడుగారి సమాధానాన్ని వినకుండానే దీపక్ వేగంగా వెళ్ళిపోయాడు.


నాయుడు, జగన్నాథ్ అచేతనంగా వెళుతున్న దీపక్‍ను చూస్తూ వుండిపోయారు.


హాల్లోకి వచ్చిన పార్వతి "ఏంటీ అదోలా వున్నారు?" అడిగింది నిశితంగా ఇరువురి ముఖాల్లోకి చూస్తూ. క్షణం తర్వాత "దీపక్ వెళ్ళిపోయాడా! భోజనం చేసి వెళతాడనుకున్నాను" అంది.

"పారూ! వీడి దీపక్ కూడా మన కుమారుల్లానే తయారైనాడు. ఎవరినో ఓ పిల్లను ప్రేమించాడట. ఆ పిల్ల నాన్నగారితో మాట్లాడి మాకు పెండ్లి జరిపిస్తారా... లేదా...మీరు కాదంటే నేను ఆమెను రిజిస్టరు మ్యారేజ్ చేసుకొంటానని చెప్పి... కాదు... కాదు... బెదిరించి మరీ వెళ్ళిపోయాడు" విచారంగా చెప్పాడు జగన్నాథ్.


తలవంచుకొని కళ్ళు మూసుకొని వున్న నాయుడు గారు మెల్లగా కళ్ళు తెరిచాడు.


"జగ్గన్నా! ఈ కాలపు మగపిల్లలు ఏంటన్నా ఇలా తయారైనారు? వాళ్ళను ఇంతవాళ్ళను చేసిన మనం వారికి మన కుటుంబానికి తగిన పిల్లను చూచి వారి ఇష్టానుసారంగా వారి వివాహాన్ని సాంప్రదాయబద్దంగా మనం జరిపించలేమనుకుంటున్నారే అది వారికబ్బిన విజ్ఞానంలోని అజ్ఞానమా!!


మనం సంపాదిస్తున్నాం. ఇకపై ఒకరి దయాదక్షిణ్యాలతో బతకాల్సిన అవసరం మనకు లేదనే అహంకారమా! తల్లిదండ్రులమైన మనలను ఎందుకు పరాయివారిలా చూచి నిర్లక్ష్యం చేస్తున్నారు!" దీనంగా అడిగారు నాయుడుగారు.


"కాల వైపరీత్యం. నేటి యువతరంలో చాలామందికి పెద్దా చిన్నా గౌరవం లేదు. తల్లిదండ్రులకు ఇష్టంలేని పనిచేస్తే వారు ఎంతగా బాధపడతారో అనే ఆలోచనే లేదు. అంతా స్వార్థం... అర్ధరహిత ఆవేశం" విచారంగా చెప్పాడు జగన్నాథ్.

"అన్నా! నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు మీ సలహా ఏమిటి?" ఆవేదనగా అడిగారు నాయుడుగారు.


"నాయుడూ! వృత్తిరీత్యా ఉపాధ్యాయుడవు. కొన్ని వందల మందికి విద్యను చెప్పి మంచిచెడ్డలు చెప్పినవాడివి నీకు నేను చెప్పాలా?" విరక్తిగా నవ్వాడు జగన్నాథ్.


"ఇది నేను ఊహించనిది. దీపక్ అంతటి నిర్ణయం తీసుకోవడం నాకు ఆశ్చర్యం, ఆవేదన కలిగిస్తున్నాయి. ఏం చేయాలో తోచటం లేదు" దీనంగా చెప్పారు నాయుడుగారు.


"ఇప్పుడు నీకు ఉండేది రెండే రెండు ఆప్షన్స్."


"ఏమిటన్నా అవి" ఆత్రంగా అడిగారు నాయుడుగారు.


"నీ బ్రతుకు నీవు బ్రతుకు అని దీపక్‍ను వదిలేయడం, రెండవది వాడి కోరిక ప్రకారం ముకుందరావుగారిని కలిసి వారి అమ్మాయిని మనవాడికిచ్చి పెండ్లి చేయమని కోరడం, సావధానంగా నీవు ఆలోచించి నిర్ణయించుకోవాలి."


"పెద్దవాడికి ఇంకా పెండ్లి కాలేదు కదా అన్నా"


"ఒకవేళ వాడి పెళ్ళి అయివుంటే నీ నిర్ణయం ఏమిటి?"


నాయుడుగారు నిట్టూర్చారు. "ముకుందరావుగారితో మాట్లాడి వుండేవాణ్ణి"


"అంటే.... నీ కొడుకు చేసిన తప్పును నీవు క్షమించావన్నమాట" ప్రశ్నార్థకంగా నాయుడుగారి ముఖంలోనికి చూచాడు జగన్నాథ్.


"అవునన్నా! పిల్లలు బాధపడితే అనురాధ తట్టుకోలేదన్నా" దీనంగా చెప్పారు నాయుడుగారు.


"తల్లులకు బిడ్డమీద ఉండే మమకారం... ఈ రోజుల్లో పిల్లలకు తల్లులపై లేదు" సాలోచనగా మెల్లగా చెప్పింది పార్వతి.


ఆమె మనోవేధనను ఎరిగిన జగన్నాథ్.

"ఈ నీ నిర్ణయాన్ని నా మరదలు అంగీకరిస్తుందా!!"

"అన్నా! అనురాధ ఇంతవరకు ఏనాడూ నా నిర్ణయానికి వ్యతిరేకత తెలియజేయలేదన్నా"


"అయితే ఇంకేం! అవనసరంగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోకు. రేపు మనం ముకుందరావు గారిని కలిసి మాట్లాడుదాం."


భార్యవైపు చూచి "పారూ! దీపూని పిలు. నలుగురం వెళ్ళి హాస్పిటల్ నిర్మాణాన్ని చూచి వద్దాం" అన్నారు జగన్నాథ్.

పార్వతి పిలుపుతో దీపిక క్రిందికి వచ్చింది. నలుగురూ కార్లో కూర్చున్నారు. కారు బయలుదేరింది.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

33 views0 comments

Comentarios


bottom of page