లోపలి దృశ్యాలు!
- Undavilli M
- Dec 18, 2023
- 6 min read

'Lopali Drusyalu' - New Telugu Story Written By Undavilli M
Published In manatelugukathalu.com On 18/12/2023
'లోపలి దృశ్యాలు' తెలుగు కథ
రచన: ఉండవిల్లి.ఎమ్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ప్రముఖ వెబ్ పత్రికలో నా కథ 'ప్రేమకు అర్ధం తెలిసింది! ' ప్రచురణ జరిగాక, పాఠకుల నుండి నా వాట్సాప్ నంబరుకి అనేక కామెంట్లు వచ్చాయి. విశేష స్పందన వచ్చింది. అన్ని మెసేజెస్ ల లోనూ, దృశ్య రాసిన కామెంట్ నన్ను బాగా ఆకర్షించింది.
"ప్రేమకి చాలా బాగా అర్థం చెప్పారు! మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగొచ్చా! ?ఎప్పుడు ఫ్రీగా ఉంటారు?" అంటూ నంబరు కూడా ఇచ్చింది.
"డే టైమ్ ఫ్రీగా ఉండను, రాత్రి పది దాటాక మెసేజ్ పెట్టండి! " అన్నాను.
ఆరోజు రాత్రి౼
పదిన్నర అయ్యాక దృశ్య నుంచి మెసేజ్ వచ్చింది"హాయ్ సార్! " అంటూ.
"చెప్పండి, ఏదో అడగాలన్నారు! ?"
"మీ ప్రేమ కథ ఇప్పటి వరకు ఎవరూ చెప్పని చాలా విషయాలతో పాటు, చాలా అనుమానాల్ని నివృత్తి చేసింది! " అంది.
"థాంక్యూ! నాకథకి ప్రయోజనం కలిగింది!" అన్నాను.
"అవునండీ, నేను మీ అభిమానినైపోయాను"అంది.
"చాలా సంతోషం"అన్నాను.
"మీరు ఎక్కడ ఉంటారు?"అని అడిగింది.
"వైజాగ్, మీరు! ?" అని అడిగాను.
బెంగుళూరు, ఐ. ఐ. ఎఫ్. సి(indian institute of science)లో సైంటిస్టుని" అంది.
నేనాశ్చార్యపోయాను, "మీలాంటి సైంటిస్టు నా అభిమాని కావడం నా అదృష్టం! "అన్నాను.
"అంతేకదా! చేయి తిరిగిన రచయితలకి, ఎవరైనా ఫిదా అవ్వవలసిందే కదా! " అంది.
సున్నితమైన భావాల్ని నేర్పుగా ప్రయోగిస్తే, కొందరి మనసుల్ని ఎలా మెప్పించవచ్చో అర్ధమైంది నాకు"నా మిగతా కధలూ చదవండి" అన్నాను.
"కథలేమిటి! మిమ్మల్నీ మొత్తం చదివేస్తా! " అంది.
"నేనో సాధారణ వ్యక్తిని" అన్నాను.
"అసాధారణమైన రచనలు చేస్తున్నారు కదా! " అంది.
"అది గాడ్ గిఫ్ట్ అనుకుంటాను" అన్నాను.
"మీకు మ్యారేజ్ అయిందా! ?" అని అడిగింది.
"ఇద్దరు పిల్లలు" అన్నాను.
"నేనొకటి అడుగుతాను! ఏమి అనుకోకుండా చెప్పండి! ?" అంది.
" ష్యూర్! " అన్నాను.
"మీరు ఎవర్నైనా ప్రేమించారా! ?" అని అడిగింది.
"లేదు" అన్నాను.
"అనుభవం లేకుండా, ఈకథని ఇంత బాగా రాశారా! ?" అని అడిగింది.
"చాలామంది పాఠకులు, కధలు చదివి, ఇవన్నీ రచయిత యొక్క స్వీయానుభవం అనుకుంటారు. మామూలు పాఠకులు ఫాంటసీస్ లోకి వెళ్లి ఎలా విహరిస్తారో, రచయిత కూడా తన జీవితానికి సమాంతరంగా ఉన్న పరిస్థితుల్ని, వాస్తవంతో ఊహించి, మేళవించి రాసేవే ఈ అక్షరాలు" అని చెప్పాను.
"నైస్ వర్డ్స్! ఇప్పుడేం రాస్తున్నారు?" అంది.
"స్టార్ట్ చేశాను, కంటిన్యూ చేయాలి" అన్నాను.
"నావల్ల మీకు డిస్టర్బెన్స్ కదా! " అంది.
అభిమానుల్ని తొందరగా హర్ట్ చేయకూడదని "అలా అని కాదు, కొంచెం వర్కు ఉంది ప్లీజ్... " అన్నాను.
"నో ప్రోబ్లెమ్! రేపు నైట్ చేస్తాను" అంది.
ఆమెతో సంభాషణలు ఆపివేసినా, నా ఆలోచన్ల నుండి ఆమె విడిపోలేదు. కధలు, కాకరకాయలు కూడు పెడతాయా! ? ఏమిటి ప్రయోజనం ఉత్త దండగ అనే వాళ్ళు చాలామంది, అవి రాసే వాళ్ళని అపురూపంగా చూసేవాళ్ళు కొంతమంది! అసలు, కధలు రాయడం పిచ్చి కాదు! కళాభిమానం లేని వాళ్ళకి అదొక పిచ్చిగా కనిపిస్తుంది. రచయితలు సున్నిత మనస్కులు. అందుకే, ఎవరు అభిమానంగా పలకరించినా, కధ బావుందని అన్నా, ఏదో సాధించినట్టు, జీవితం ధన్యమైనట్టు తృప్తిపడతాం. ఒక కళ లోని అంశాన్ని నేర్పుగా ఎవరు ప్రదర్శిస్తారో, వాళ్ళని మనం అభిమానిస్తాం! ఒక్కోసారి ఆ అభిమానం వ్యక్తిగత విషయాల వరకు వెళ్ళిపోయి ఆరాధించడం దీనిలోని పరాకాష్ఠ. అలాంటి స్థితిలోకి దృశ్య వెళ్లిపోయినట్టుంది.
మర్నాడు రాత్రి మెసేజ్ వచ్చింది౼
"హాయ్ సార్! ఎలా ఉన్నారు? డిన్నర్ అయిందా?" అని.
"ఫైన్, డిన్నర్ అయింది. మీది! ?" అన్నాను.
"అయింది సార్, ఒకసారి మీ ఫోటో చూపించండి! " అంది.
"అలా! నాకిష్టం ఉండదు. నా ఫొటోస్ ఎక్కడా షేర్ చేయను" అన్నాను.
"నా ఫొటోస్ చూస్తారా! ?" అని అడిగింది.
"నాకు జండర్, అందం వీటితో పనుండదు! ఒక మనసుతో మాట్లాడుతున్నాననుకుంటా" అన్నాను.
"వావ్! సూపర్! ! "అని తన ఫొటోస్ అన్నీ పెట్టింది. ఆమె చాలా అందంగా ఉంది. అత్యంత ఖరీదైన ఇల్లులా ఉంది.
"నైస్ ఫొటోస్" అన్నాను.
"వీటిలో ఏ ఫోటో నచ్చింది?" అని అడిగింది.
నాకేం చెప్పాలో అర్థం కాలేదు! "ఎవరిష్టం వాళ్ళది, నాకు టేస్ట్ లు ఉండవు" అన్నాను.
"ఇప్పుడేం చేస్తున్నారు?" అని అడిగింది.
"సగంలో వదిలేసిన కథని పూర్తి చేస్తున్నాను" అన్నాను.
"నా వద్ద ఒక డిఫరెంట్ లవ్ స్టొరీ ఉంది. మీలాంటి రచయితే దాన్ని బాగా రాయగలరు" అంది.
"అయితే, చెప్పండి! " అన్నాను.
"ఫ్రీగా మీట్ అయినపుడు చెప్తాను" అంది.
"నేను ఆ పై వచ్చే శని, ఆదివారాల్లో బెంగుళూరు వస్తున్నాను. నా నవల కన్నడంలో రిలీజ్ ప్రోగ్రామ్ ఉంది, శనివారం సభకు రండి" అన్నాను.
"వావ్! ష్యూర్, నేను మిమ్మల్ని కలుస్తాను. నాకు, ఆ రెండ్రోజులు సెలవు! " అంది.
"ఓకే, ఆరోజు కలుద్దాం" అని మెసేజ్ కట్ చేశాను. ౼ ౼ ౼
నేను ముందు రోజు సాయంత్రం బెంగుళూరు చేరుకున్నాను. అఖిల సాహితి సంస్థ అధ్యక్షురాలు సవ్య, ఆమెతో పాటు మరో ఇద్దరూ నాకు స్వాగతం చెప్పి, నన్ను రూమ్ కి తీసుకెళ్లి, అట్నుంచి హిల్ నగర్ లోని సవ్య వాళ్ళింటికి తీసుకెళ్లారు.
వాళ్ళింట్లో అంతా నన్ను ఆత్మీయంగా చుట్టుముట్టారు. ఆమె రాసిన రచనలన్నీ చూపించింది. తెలుగు ప్రాంతం నుండి బెంగుళూరు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయారు. భర్త ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, పిల్లలు చదువుతున్నారు. నాగురించి తెలిసినా అన్నీ అడిగింది.
"నా రచనలన్నింటి మీద ఏవోక విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ, మీ నవల అనువాదం చేశాక, ప్రశంసలే కాని, ఒక్క విమర్శా రాలేదు" అంది.
"మనం రాసే రచనలన్నీ విమర్శకుల్ని దృష్టిలో పెట్టుకుని రాయక్కర్లేదు. ప్రతి రచనకు దానికి తగ్గ పాఠకులు ఉంటారు. ఎవరి కోసమో మనం చెప్పాలనుకున్న భావాన్ని చంపుకుని, మరొకరి కోణం లోకి ఒరిగిపోయి రాయకూడదు" అన్నాను.
రెండు చేతుల్తో చప్పట్లు కొట్టింది. "మీ మాటలు విన్నాక నా రచనల మీద ఎంత ప్రశాంతత కల్గిందో! " అంది.
"మన రచనలు చదివే పాఠకులు మనకుంటారు. పరిపక్వతతో మనం ముందుకు వెళుతుంటాం, ఎవరి గురించో భావాల్ని నొక్కి పెట్టుకొక్కర్లేదు! " అన్నాను.
ఆరోజు అక్కడ చాలా సేపయ్యాక, నన్ను రూమ్ లో దింపారు.
మర్నాడు౼
బెంగుళూరు చిత్ర కళా పరిషత్ సాహితీ పరులతో సందడిగా మారిపోయింది. జనం కిక్కిరిసిపోయారు. నా పుస్తకాన్ని కన్నడ ప్రపంచానికి పరిచయం చేసి, నాకు సన్మానం చేశారు, దృశ్య సభకు వచ్చింది. మధ్యాహ్నం లంచ్ అక్కడే ఏర్పాటు చేయడంతో, లంచ్ తర్వాత సవ్య గారికి వీడ్కోలు చెప్పాక, దృశ్య వాళ్ళింటికి తీసుకెళ్లింది.
మహల్ లా ఉంది ఇల్లు. చుట్టూ అనేక పూల మొక్కలతో గ్రీనరీ లాన్. ఇల్లంతా చూపించి, ఫస్ట్ ఫ్లోర్ లాంజ్ లోకి తీసుకెళ్లింది. వ్యూ కనిపించే విధంగా ఖరీదైన సోఫాలు వేసి ఉన్నాయి. అక్కడ్నుంచి చూస్తుంటే చుట్టూ ఉన్న గ్రీనరీ, వాటర్ ఫౌంటెన్, దూరంగా హిల్స్ చాలా అందంగా కన్పిస్తున్నాయి. సోఫాలో కూర్చోమని "ఏం తీసుకుంటారు?" అని అడిగింది.
"ఒక స్ట్రాంగ్ టీ కావాలి" అన్నాను.
చిన్నగా నవ్వింది. మెయిడ్ ని పిలిచి రెండు టీ లు చెప్పింది.
"మీ ఇల్లు చాలా అందంగా ఉంది. ఇక్కడ్నుంచి వ్యూ చూస్తుంటే, మనసు లోంచి అద్భుతమైన భావాలు రావాల్సిందే! " అన్నాను.
"అవును సార్! కావాలనే దీన్ని కొనుక్కున్నాను. ఒంటరిగా ఇక్కడ కూర్చోవడం నాకు చాలా ఇష్టం! " అంది.
మెయిడ్ టీ తెచ్చి ఇచ్చింది. నేను టీ తీసుకుని సిప్ చేశాను. నాకు కావాల్సినట్టుగానే స్ట్రాంగ్ గా ఉంది. "ఇలాంటి టీ తాగుతూ, ఈ వ్యూని చూడటం మనసు గతం లోకి వెళ్లి పోతుంది. " అన్నాను.
"నిజం! నేనెప్పుడూ ఇక్కడ్నుంచే వర్కు చేస్కుంటాను"
"నైస్, చెప్పండి ఇంకేంటి విషయాలు, ఏదో లవ్ స్టొరీ చెప్తానన్నారు! " అని అడిగాను.
"అదా! నేను చదువుకునేటప్పటి విషయం! "అంది.
"చెప్పండి పర్లేదు! "
"క్లుప్తంగా చెప్తాను" అంది.
"ఓకే" అన్నాను.
"నేను పూణెలోని ఫెర్గుసన్ కాలేజ్ ఆఫ్ సైన్సులో చదివేటప్పుడు రణధీర్ అని చాలా అందంగా ఉండేవాడు. హృతిక్ రోషన్ కళ్లలా అతని కళ్ళు ప్రత్యేకమైనవి. నేను అతన్ని అన్ని రకాలుగా పరిశీలించేదాన్ని. మాట్లాడటానికి, ఏవైనా చర్చించడానికి ధైర్యం చాలేది కాదు. కారణం నేను పెరిగిన వాతావరణం. ఓరోజు రణధీర్ నాకు ఎదురుపడి"ఈ వయసులో కెరీర్ ముఖ్యం కానీ, ఆకర్షణలు కాదు, జాగ్రత్తగా చదువుకో" అన్నాడు.
"నేను ఏం! చేశాను?" అని అడిగాను.
"చెయ్యక్కర్లేదు! మనసులోకి రానీయకు" అనేసి వెళ్ళిపోయాడు. నేను ఆశ్చర్యపోయాను. నా ఉద్దేశాన్ని ఎలా గ్రహించాడని, అతని గురించి ఇంకా ఎక్కువ ఆలోచించడం మొదలెట్టాను. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. కొన్ని రోజులు పోయాక, రణధీర్ మరోసారి నాకు తారసపడి"రాత్రిళ్ళు నిద్ర మానేసి ఎన్ని రోజులు ఆలోచిస్తావ్! ప్రయత్నించి మనసుల్ని కలుపుకోవడం వేరు;సమయానుకూలంగా వాటికి అవే మనసులు పెనవేసుకుపోవడం వేరు! రెండో దాంట్లో చాలా బలం ఉంటుంది". అనేసి వెళ్ళిపోయాడు. నేను ఆ ఆలోచన్లతో తచ్చాడుతుండేదాన్ని. నేను చాలా రోజులు అతని ధ్యానంలో ఉండిపోయాను. ఆలోచన్లకి ఆకృతులు తెచ్చుకుని, ఓరోజు ఉదయం అతనికి చెప్పేద్దామనుకున్నాను ‘ఎందుకో నువ్వంటే ఇష్టం!’ అని.
కానీ, ఆరోజు ఉదయమే రణధీర్ హాస్టల్లో మూడో ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యంత తెలివితేటలు ఉండి, అలా దేనికి చేయవలసి వచ్చిందో తెలియదు. నేను భయపడిపోయాను. ఆరోజు నుండి వాళ్ళ క్లాసుల వైపు కూడా వెళ్ళేదాన్ని కాదు". అని ఆగి"సార్, మళ్ళీ ఎప్పుడైనా పూర్తిగా చెప్తాను ప్లీజ్... " అంది. ఆమె నుదురంతా చెమటలు పట్టేశాయి.
"ఓకే, ఓకే" అన్నాను.
"నాకు, ప్రేమ, పెళ్లి ఇలాంటి వాటి మీద ఒక లాంటి భయంతో ఉండిపోయాను. " అంది.
ఒక లాంటి ప్రిజిడిటి అన్నమాట! నేను మాట్లాడుతూ, ఆమెని మామూలు స్థితిలోకి తీసుకువచ్చి, "మీ అభిరుచులు ఏంటి! ?" అని అడిగాను.
"నాకు ఫ్లూట్ అంటే చాలా ఇష్టం! కొంచెం ప్రాక్టీస్ ఉంది" అంది.
"ఓ గ్రేట్! పాలక్ జైన్ ఫ్లూట్ గీతం హే రాతేన్, హో మోసమ్ నాకు చాలా ఇష్టం! " అన్నాను.
"నాక్కూడా" అంది.
ఆమె ఫ్రీగా అన్నిట్లోనూ కల్సిపోయి మాట్లాడేస్తుంది! వ్యక్తిగత ఇష్టాలు, సినిమాలు, దేన్నీ ఆమె విడిచి పెట్టలేదు. ఆఖరుకి ఏ రంగులంటే ఇష్టం! ఎలాంటి డ్రెస్సులు కడితే మీరు ఇష్టపడతారు లాంటివి. కాలాన్ని కుదించి పొడిగిస్తూ మాటల్ని కలుపుతుంది. నాకు అవన్నీ కొంచెం ఇబ్బంది కల్గించాయి. అతి చర్యల్ని ఎవరూ అంగీకరించలేం కదా! ఇబ్బంది పడుతూనే సమాధానాలు చెప్పాను. ఆరోజు ఆమెకి"రేపు ఈవెనింగ్ ఫ్లయిట్ కి వెళతాను, వెళ్ళేలోపు ఒకసారి కలుద్దాం! నేను వెళ్తాను మరి! " అన్నాను.
"ష్యూర్! రేపు లంచ్ కి వచ్చేస్తున్నారు మా ఇంటికి" అంది.
తప్పక "ఓకే" అన్నాను.
అక్కడ్నుంచి నారూమ్ కి కార్ లో డ్రాప్ చేయించింది.
రాత్రి రూములో నా చుట్టూ అనేక ఆలోచన్లు చుట్టేశాయి. ఆరోజు సరిగా నిద్రపట్టలేదు. దృశ్య చర్యల్ని లోపలి కంటా చూడ్డానికి నా దృష్టి కోణం విస్తరించుకుపోయింది.
దృశ్య విషయంలో౼వయసులో ఉన్నపుడు రొమాన్సులో విహరిస్తూ, ఎవర్నో ప్రేమించాలని, ఇంకేవో చేయాలని అవేవి కుదరక, ఎదురించి అలాంటి వాటిని ఆశ్రయించలేక, నైతిక విలువల్ని గౌరవిస్తూ, పిల్లలకూ అవే వల్లెవేస్తూ సాగిపోయే ప్రవాహంలో-ఇలాంటి సంఘటనలేవో గతాన్ని తవ్వుతాయి. జరగని ఎన్నో ఆశలు-సబ్-కాన్షన్ లో నిక్షిప్తం అయి ఉండిపోతాయి. ఎప్పటికీ బయటికి రాని అవి, ఏదోక సంఘటన ద్వారా కాన్షన్ లోకి వచ్చి, బయట తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి. కుటుంబ బంధాల్తో సాధారణంగా ఉండే స్త్రీల కన్నా, విలాసవంతంగా పెద్ద ఉద్యోగాల్లో ఉన్న స్త్రీలకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది.
అలాంటి వాళ్లే దృశ్య. ఒక మూర్తిమత్వం(personality)లోంచి వాంఛలు, ఉత్సుకతలు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, అచేతనం నుండి బయటకు వస్తాయి. స్వేచ్ఛగా ఉండే వాళ్ళకి అవకాశం చిక్కితే, వాళ్ళ ఇగో తృప్తి పడటానికి ఏమి చేయడానికైనా సిద్ధ పడిపోతుంది. ఇన్ని ఆలోచన్లు కలిగే సరికి నాకు చెమటలు పట్టేశాయి. మర్నాడు ఆమెతో ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అయ్యాను.
మర్నాడు ఆమె కారులోనే వాళ్ళింటి దగ్గర దిగాను. మధ్యాహ్నం లంచ్ అయ్యాక, ఇద్దరం ఫస్ట్ ఫ్లోర్ లాంజ్ లోకి వెళ్లి కూర్చున్నాం.
"దృశ్య అని పిలవొచ్చా! " అని అడిగాను.
ఆమె చిన్నగా నవ్వి"తప్పకుండా" అంది.
"నా అభిమానిగా నిన్ను కొన్ని అడుగుతాను దృశ్య, చాలా ఓపెన్ గా జవాబు చెప్పు?" అన్నాను.
"అయ్యో! అడగండి" అంది.
"జీవితంలో నీ గతానికి వెళితే, చదువుకునే రోజుల్లో ఎవర్నైనా ప్రేమించాలని, ఎవర్నీ ప్రేమించలేక, భయపడో, గిల్టీ ఫీలింగ్ తోనో మనసుని బలవంతంగా చంపుకున్న రోజులు నీకున్నాయి కదా! " అన్నాను.
"అలాంటివి చాలా సందర్భాలు. కానీ, నేను ఎవర్నీ ప్రేమించలేకపోయాను. ప్రేమ తాలూకా అనుభూతిని పొందాలని ఎదురు చూసిన రోజులు ఎన్నో! " అంది.
"నాకు అర్ధమయింది ఏంటంటే! అప్పటి మనసు, పరిస్థితి వేరు, ఆరోజు అది దొరుకుండకపోవచ్చు! దానివల్ల జీవితం చిందర వందర అయిపోదు, ఈరోజు స్టేటస్ వేరు, చాలా హుందాయైన ఉద్యోగం, విలాసవంతమైన జీవితం, ప్రేమ కావాలంటే ఇప్పుడూ చాలామంది చూపిస్తారు. ఆశించే వాళ్ళూ ఉంటారు! అవకాశం ఉన్నా, ఇప్పుడు! వాటిని దగ్గరకి రానివ్వని నైతిక బాధ్యత. పెనవేసుకుపోయిన పిల్లల మానసిక అనుబంధాలు, నిబద్ధతతో కూడిన మీ కుటుంబ సింబాలిజం! ఇవన్నీ దాటేసి మనం ముందుకు వెళ్లలేం కదా! " అన్నాను.
"అవును, వాస్తవమే! " అంది.
"వాటిని తీపి గుర్తులుగా ఉంచుకుని, అప్పుడప్పుడు నెమరేసుకోవడంలో అదో అనుభూతి, తృప్తి. మళ్ళీ ఇప్పుడు వాటిని సాధించాలనుకోవడం మన పతనం! స్నేహితులెప్పుడూ ఉంటారు. ఇలాంటివి షేర్ చేసుకునే ఓ మంచి స్నేహితుడిగా నేను ఎప్పుడూ ఉంటాను! " అన్నాను.
"తెర తొలగినట్టుంది! జీవితకాలం మనసుతో మాట్లాడే ఓ మిత్రుడ్ని సాధించాను" అంది.
"సాధించిన నీ లక్ష్యం లాగే, ఇది కూడా ఓ విజయం" అన్నాను.
"మీలాంటి దిక్సూచి దొరికితే విజయాలే కదా! " అంది.
"అర్ధం చేసుకునే కొందరికే అదిసాధ్యం! " అన్నాను.
దృశ్యాలుగా విడిపోయినట్టు దృశ్య ముఖంపై చిరు దరహాసం కనిపించింది.
***
ఉండవిల్లి.ఎమ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: ఉండవిల్లి.ఎమ్
ఇప్పటి వరకు వివిధ దిన, వార, మాస, పక్ష, రేడియోలలో కలిపి 150 కథలు, 200 వరకు కవితలు వచ్చాయి.
'శిధిల స్వరాలు ' కవితా సంపుటి, ' అంకితం ' కథా సంపుటి, నిశ్చల నవల, ' ఒక దేహం - అనేక మనసులు ' నవలలు పుస్తక రూపంలో వచ్చాయి.
నిశ్చల నవల, అంకితం కథా సంపుటి కన్నడంలోకి అనువాదం అయ్యాయి.
చాలా కథా, కవిత సంకలనాల్లో కథలు, కవితలు వచ్చాయి.
అనేక మనసుల్ని కథల్లో, నవలల్లో దృశ్యమానం చేయడం ఇష్టం!
దృశ్య భావాలను మీరు మాకొక చక్కని దృశ్యంలా చూపించారు 👌👍
....."మన రచనలు చదివే పాఠకులు మనకుంటారు. పరిపక్వతతో మనం ముందుకు వెళుతుంటాం, ఎవరి గురించో భావాల్ని నొక్కి పెట్టుకొక్కర్లేదు! " - యిది సత్యం..*