top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 1

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Love Challenge Episode 1' Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar

రచన: మల్లవరపు సీతారాం కుమార్


ఒక అందమైన అమ్మాయి కోసం రిత్విక్, జీవన్ అనే అబ్బాయిల మధ్య పోటీకి నాంది పడింది.

ఆ అమ్మాయి పేరు ఆద్య. అందానికి ప్రతిరూపం. ఆ కుర్రాళ్ళు కూడా సామాన్యులు కాదు.

ఒకరు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు. మరొకతను ఎం పీ. కుమారుడు. ఆ పోటీ ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూద్దాం.

అమ్మాయి మనసు దోచుకునేదెవరో తెలుసుకుందాం.



అది నిత్య ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణం.

స్టూడెంట్స్ అందరూ గుంపులు గుంపులుగా చేరి ఒకే విషయం మాట్లాడుకుంటున్నారు.

రిత్విక్, జీవన్ ల మధ్య లవ్ ఛాలెంజ్....

అమ్మాయి పేరు ఆద్య.

నెల లోగా ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలి.

ఇదీ.. ఆ ఛాలెంజ్.


గెలిచిన వాళ్లకు అమ్మాయి ప్రేమతో పాటు లవర్ బాయ్ బిరుదు దక్కుతుంది.

ఓడిపోయిన వాళ్ళు అరగుండుతో కాలేజ్ కాంపస్ చుట్టూ మూడుసార్లు తిరగాలి.

లెక్చరర్లలో కూడా ఉత్కంఠ నెలకొంది.


ఈ ఛాలెంజ్ ఏ పరిణామాలకు దారితీస్తుందోననే ఆందోళన కూడా చాలామందిలో మొదలైంది.


రిత్విక్, జీవన్ లు బి టెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్.


ఇప్పటి వరకు ఇద్దరి మధ్య పెద్దగా స్నేహం లేకపోయినా శత్రుత్వం కూడా లేదు.

కానీ కొత్తగా ఫస్ట్ ఇయర్ లో ఆద్య జాయిన్ కావడంతో ఈ కథ మొదలైంది.


జాయిన్ అయిన రోజే దాదాపు అందరూ ఆ అమ్మాయిని కాలేజ్ బ్యూటీ అని పిలవడం మొదలు పెట్టారు.


అంతవరకు అందగత్తెలుగా పిలిపించుకున్న అమ్మాయిల్లో అప్పుడే అంతరాంతరాల్లో కాస్త అసూయ మొదలైంది.


మూడేళ్ళుగా హీరో లాంటి రిత్విక్ ను ఆరాధిస్తూ ఇష్టపడే అమ్మాయిలు, కనీసం ఫైనల్ ఇయర్ లో నైనా అతను తమ వైపు చూస్తాడని ఆశతో ఉన్నారు. కానీ అపురూప సౌందర్య రాశి ఆద్య రాకతో ఇక కేవలం కలల్లో మాత్రమే అతనితో డ్యూయెట్ లు పాడుకోవాలనీ, నిజ జీవితంలో రిత్విక్ ను చేరుకోలేమనీ డీలా పడ్డారు.


ఇక ప్లే బాయ్ లాంటి జీవన్ తో ఇన్నాళ్లు డేటింగ్ చేస్తూ, కలిసి తిరుగుతున్న అమ్మాయిలు ఇక మీదట అతను తమను లెక్క చేయడని ఉక్రోషం తో రగిలి పోతున్నారు.

ఆ అమ్మాయి విషయంగా ఇద్దరు కుర్రాళ్ళ మధ్య పోటీ ఏ గొడవలకు దారి తీస్తుందో అనే చర్చ కూడా ఆ కాలేజీలో మొదలైంది.


ఎందుకంటే లవ్ ఛాలెంజ్ చేసుకున్న ఇద్దరు అబ్బాయిలూ, అందుకు కారణమైన అందమైన అమ్మాయి ఆద్య...ముగ్గురూ సామాన్యులు కాదు.


రిత్విక్ ప్రముఖ పారిశ్రామికవేత్త చక్రధరం గారి కొడుకు.

కోట్లకు పడగలెత్తిన వాడు.


రిత్విక్ అందచందాల్లో గానీ, హావభావాలు వ్యక్తీకరించడంలో గానీ ఏ అప్కమింగ్ హీరోకూ తీసిపోడనేది నిజం. అతని బాడీ లాంగ్వేజ్ ఎదుటివారిని యిట్టే ఆకట్టుకుంటుంది.

అతని మాటల్లో, చూపుల్లో.. సభ్యత, సంస్కారం చూస్తే మేన్లీగా ఉండటమంటే మొరటుగా ఉండడం కాదనీ, అతనిలా ఉండటమనీ అతనివంక ఆరాధనాపూర్వకంగా చూసే అమ్మాయిల చూపుల్ని బట్టి తెలుసుకోవచ్చు.


మూడేళ్ళుగా అతనికి దగ్గరవ్వాలని ఎందరో అమ్మాయిలు ప్రయత్నించారు.

అతను ఎవ్వరినీ నిరుత్సాహ పరచలేదు. అందరితో సరదాగా, ఒక మంచి స్నేహితుడిలా ఉండేవాడు. కానీ ఎవరన్నా శృతి మించాలని ప్రయత్నిస్తే దూరం పెట్టేవాడు. తనకు ప్రపోజ్ చేసిన అమ్మాయిలను సున్నితంగా తిరస్కరించే వాడు.


ఇంజనీరింగ్ పూర్తయ్యాక కొడుకును సినిమా హీరో చేయాలని చక్రధరం గారి కోరిక.

కొడుక్కి మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్, షూటింగ్ లతో పాటు కత్తి యుద్ధం, కర్ర సాము కూడా నేర్పించాడు.


స్పోర్ట్స్ లో కూడా రిత్విక్ ముందుంటాడు. కాలేజ్ క్రికెట్ టీం కి అతనే కెప్టెన్.

ఇక డాన్స్ సంగతి చెప్పనక్కర లేదు.

ప్రతి సంవత్సరం కాలేజ్ డే లో అతని డాన్స్ స్పెషల్ అట్రాక్షన్.


కొందరు అమ్మాయిలకు మాత్రం ఆ డాన్స్ నచ్చదు.

ఎందుకంటే అతను పెర్ఫార్మ్ చేసేది సోలో సాంగ్స్ కి.

డ్యూయెట్స్ కి డాన్స్ చేస్తే , తమకు అతనితో కలిసి డాన్స్ చేసే అవకాశం వచ్చేది కదాని వాళ్ళ బాధ.


చక్రధరం తనకు తెలిసిన ప్రముఖ సినీ దర్శకుడితో రిత్విక్ గురించి చెప్పి, ఫైనల్ ఎగ్జామ్స్ కాగానే అతను హీరోగా ఒక సినిమా తియ్యాలని కోరాడు. బడ్జెట్ ఎంతైనా సరే, తానే ప్రొడ్యూస్ చేస్తానని కూడా చెప్పాడు.


ఇలా ఎన్నో టాలెంట్స్ ఉన్న రిత్విక్ తో ఛాలెంజ్ చేసిన జీవన్ కూడా తక్కువేం కాదు.

అతని తండ్రి గురుమూర్తి రూలింగ్ పార్టీ ఎం. పీ. కేంద్రంలో సహాయ మంత్రి కూడా.

చక్రధరంతో పోల్చేంత కాకపోయినా గురుమూర్తి కూడా కోటీశ్వరుడే. ఓ వంద కోట్లకు అధిపతి.


సిటీలో కొన్నవి, కబ్జా చేసినవి కలిపి చాలా స్థలాలు ఉన్నాయి.

పైగా రాజకీయ పలుకుబడి ఉంది.

చాలా మంది గూండాలు గురుమూర్తి కనుసన్నల్లో మెదిలే వాళ్ళే!


జీవన్ రాజకీయాలు పట్టించుకోక పోయినా తండ్రి డబ్బును, పలుకుబడిని అన్ని రకాలుగా ఉపయోగించుకోవడం తెలిసిన వాడు.

అతను, రిత్విక్ తో పోటీ పడలేక పోయినా చక్కగానే ఉంటాడు.


'డబ్బుంటే చాలు, కోతి పిల్లయినా పరవాలేదు'- అనుకునే అమ్మాయిలకు 'అంత అవసరం రాలేదులే.. డబ్బుతో పాటు మంచి కుర్రాడే దొరికాడు' అనిపించేలా ఉంటాడు.

పైగా తన ఖరీదైన కార్లలో అమ్మాయిలను పబ్బులకు, రిసార్ట్ లకు తిప్పుతాడు. డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేస్తాడు. తరచుగా ఫైవ్ స్టార్ హోటళ్లలో పార్టీలు ఇస్తూ ఉంటాడు.

కొత్తగా వచ్చిన ప్రతి మోడల్ బైక్ నూ తన ఫ్రెండ్స్ సర్కిల్ లో అందరి కంటే ముందే కొనేస్తాడు.


రింగ్ రోడ్ లో బైక్ రేస్ లు నిర్వహిస్తూ ఉంటాడు. జనాలను భయపెడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.


'యూత్ ఐకాన్' అని తన స్నేహితులతో పిలిపించు కుంటూ ఉంటాడు.

కాలేజీలో తనకు అడ్డు వచ్చిన వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. సహాయం కోసం తండ్రి తాలూకు గూండాలను వాడుకుంటూ ఉంటాడు.


కాలేజ్ క్రికెట్ టీం కెప్టెన్సీ విషయంలో రిత్విక్ తో ఒకటి రెండు సార్లు గొడవ జరిగింది.

కానీ చక్రధరం, అన్ని పార్టీలకూ భారీగా ఎలక్షన్ సమయంలో డబ్బులు ఇస్తూ ఉంటాడనీ, అతనితో గొడవ పడొద్దనీ తండ్రి వారించడంతో వెనక్కి తగ్గాడు జీవన్.


ఇక వీరిద్దరి మధ్య చాలెంజ్ మొదలవడానికి కారణమైన ఆద్య గురించి తెలుసుకుందాం.

ఆద్య ఆ కాలేజ్ వ్యవస్థాపకుడు, ఎండి అయిన రాఘవేంద్ర గారి ముద్దుల కూతురు. రాఘవేంద్ర కు తెలుగు రాష్ట్రాల్లో ఇరవైకి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు, రెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాలలో మరో పన్నెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దాదాపు పాతికేళ్ల నుండి ఈ రంగంలోనే ఉండడంతో కావలసినంత డబ్బు పలుకుబడి సంపాదించాడు. ఏ రాజకీయ పార్టీకి చెందని వ్యక్తి కావడంతో అన్ని పార్టీల్లో అతనికి మిత్రులు, శ్రేయోభిలాషులు ఉన్నారు.


అతని మొదటి భార్య ఆదిలక్ష్మి కూతురు ఆద్య. కూతురు రెండేళ్ల పాపగా ఉన్నప్పుడే భార్యకు విడాకులు ఇచ్చి, తన పీఏ గా పనిచేస్తున్న నిత్యను పెళ్లి చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాకే తనకు బాగా కలిసి వచ్చిందని తన విద్యా వ్యాపార సంస్థలన్నిటికీ ఆమె పేరే పెట్టాడు. నిత్యను ఒప్పించి, ఆద్య ను తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆర్థికంగా ఏ లోటూ లేకుండా పెంచ గలిగాడు కానీ తల్లి ప్రేమ దొరకకపోవడంతో ఆద్య పెంపకం ఆయాల పైనే ఆధారపడింది.

తనకు తల్లి దూరం కావడానికి స్త్రీ పురుషుల మధ్య ఏర్పడ్డ ప్రేమో ఆకర్షణో కారణం కాబట్టి ఆమె మనసులో ఆ రెండింటికి స్థానం లేదు. పైగా మగవాళ్ళంటే సదభిప్రాయం కూడా లేదు.


ఆద్య అందం గురించి చెప్పాలంటే స్టన్నింగ్ బ్యూటీ అనే పదానికి నిర్వచనం ఆమే!

ఆమెను చూసిన వెంటనే చూపు తిప్పుకోవడం చాలా కష్టం.


చిన్నప్పటి నుంచే తన అందంతో, చలాకీతనంతో అందరినీ ఆకట్టుకున్న ఆద్య యుక్త వయస్సులోకి వచ్చాక అమె అందం మరింత పెరిగింది. అందరితో చక్కగా మాట్లాడే అమె తీరు, ముఖ కవళికలు అమె అందానికి మరింత వన్నె తెచ్చాయి. బహుశా ఈ ప్రపంచంలో ఆమెను ఇష్ట పడని వ్యక్తి అమె సవతి తల్లి నిత్య మాత్రమే కావచ్చు.

ఇప్పుడు రిత్విక్, జీవన్ ల మధ్య లవ్ ఛాలెంజ్ జరగడానికి దారి తీసిన పరిస్థితుల గురించి తెలుసుకుందాం.


ఆ రోజే కాలేజీ రీ ఓపెనింగ్.

ఆ కాలేజీలో ర్యాగింగ్ లేదు. అయినా ఫస్ట్ ఇయర్ లో చేరిన అమ్మాయిల్ని చూడ్డానికి, కామెంట్స్ చెయ్యడానికి అబ్బాయిలు గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు.

అమ్మాయిలు కూడా తమను ఎవరన్నా గమనిస్తున్నారా లేదా అని చూసుకుంటూ వెళ్తున్నారు.


ఎండి రాఘవేంద్ర గారి కారు కాంపస్ లోకి ఎంటర్ అయింది.

పార్కింగ్ ప్లేస్ లో కాకా నేరుగా స్టాఫ్ రూమ్ దగ్గర ఆగింది.

రాఘవేంద్ర గారి అమ్మాయి కాలేజీలో చేరబోతోందని, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందని ముందుగానే తెలిసిన కుర్రాళ్ళు ఆమెను చూడ్డానికి దూరంనుంచే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


కార్లోంచి రాఘవేంద్రగారు, ఆ వెనుకనే ఆద్య దిగారు.

ఆమెను చూసిన స్టూడెంట్స్ తాము విన్నదానికంటే ఎంతో అందంగా ఉందని గుసగుసలుగా చెప్పుకుంటున్నారు.


రాఘవేంద్ర ఆదేశాల మేరకు లెక్చరర్లతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. రాఘవేంద్ర స్టాఫ్ రూమ్ లోకి ఎంటర్ కాగానే అందరూ లేచి నిలుచుని ఆయన్ని విష్ చేశారు. తిరిగి విష్ చేసి తనకు కేటాయించిన సీట్ లో కూర్చున్నాడు రాఘవేంద్ర.


ఆద్య మాత్రం లెక్చరర్స్ అందరూ కూర్చునే వరకూ ఆగి తరువాత కూర్చుంది.

"షీ ఈజ్ ఆద్య. మై ఓన్లీ డాటర్. చదువుకోడానికి ఏ దేశానికైనా పంపిస్తానని చెప్పినా ఇక్కడే హైదరాబాద్ లోనే.. మన కాలేజిలోనే చదువుకుంటానంది. ఆమెను మీకందరికీ పరిచయం చెయ్యడానికి ఇక్కడకు తీసుకొని వచ్చాను" అంటూ పరిచయం చేసాడు.

ఆద్య పైకి లేచి అందరికీ నమస్కారం చేసింది.


"నాన్నగారి పర్మిషన్ తో ఒకమాట చెబుతాను.." అంటూ అనుమతి కోసమన్నట్లు తండ్రి వంక చూసింది.


అయన సరేనన్నట్లు చిరునవ్వుతో తల ఊపగానే ఒకసారి గొంతు సవరించుకొని, "లెక్చరర్లకు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు అందరికీ నా నమస్కారం. మన కాలేజీ క్రమశిక్షణలోనూ, ఇన్ఫ్రా స్ట్రక్చర్ లోను ఏ కాలేజీకి తీసిపోదని మీలాగే నేను కూడా నమ్ముతున్నాను. అందుకే ఇక్కడే చేరాలని పట్టు పట్టాను. మీ అందరికీ నాదో చిన్న విన్నపం" అని ఒక్క క్షణం ఆగింది.


అందరూ అమె ఏం చెబుతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఆద్య తన మాటలు కొనసాగిస్తూ " నాకు చిన్నపాటి నుంచి చదువు చెప్పే గురువులంటే ఎంతో గౌరవం. అలాగే అటెండర్ నైనా మీరు అనే పిలుస్తాను. ఇది మా నాన్న నాకు నేర్పిన సంస్కారం.


దయచేసి నన్ను అందరు స్టూడెంట్స్ లాగే చూడండి. తప్పు చేస్తే అందరిలాగే నన్ను కూడా మందలించండి. ఇదే నేను మిమ్మల్ని కోరేది" అంది.


"పద్దెనిమిదేళ్ల ఈ అమ్మాయి ఎంత మెచ్యూరిటీతో మాట్లాడుతోంది? ఈ సంస్కారం వల్ల ఈమె అందం మరింత పెరిగింది" అనుకున్నారు అక్కడ వున్న వాళ్ళందరూ.

తరువాత అక్కడికి వచ్చిన వాళ్లందరికీ స్నాక్స్, టీ సర్వ్ చేశారు.

ఆద్య కూడా స్వయంగా చాలామందికి చిరునవ్వుతో టీ అందించింది.


పరిచయమైనా కాసేపట్లోనే ఇందర్ని మెస్మరైజ్ చేసిన ఈ అమ్మాయి వల్ల ఎందరు కుర్రాళ్లు ఈమెకు ఫాన్స్ అయిపోతారో అనుకుంది సీనియర్ లెక్చరర్ సామ్రాజ్యం.

అందరి దగ్గర సెలవు తీసుకొని బయటకు వచ్చారు రాఘవేంద్ర, ఆద్యలు.


ఆద్యను క్లాస్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళమని అటెండర్ కి చెప్పబోతున్న రాఘవేంద్ర, అమె తనవంక చిరుకోపంతో చూడ్డంతో అర్థం చేసుకొని,"ఓకే ఆద్యా! నువ్వే క్లాస్ రూమ్ కనుక్కొని వెళ్ళు" అని చెప్పి తను ఇంటికి బయలుదేరాడు.


తనవంక నోరెళ్ళబెట్టి చూస్తున్న కుర్రాళ్లను పట్టించుకోకుండా ముందుకు నడిచింది.

తన స్నేహితులు పదిమందితో కాస్త దూరంగా నిలుచుని, ఆద్య వైపే చూస్తున్న జీవన్ ఆమె తమ వైపు రావడం గమనించాడు.


"ఈ అమ్మాయి నాకోసమే పుట్టినట్లు అనిపిస్తోంది. తొందరపడి ఎవరూ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకండి. ఎముకలు విరగ్గొడతాను" అన్నాడు.


ఆ గ్యాంగ్ లోనే ఉన్న శాన్వీ "ఏంటి? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అంత నచ్చేసిందా?" అంది కాస్త వ్యంగ్యంగా.


"కామెంట్స్ చేస్తే ఎముకలు విరగ్గొడతానన్నది నీక్కూడా వర్తిస్తుంది" అన్నాడు జీవన్.

తిరిగి ఏదో మాట్లాడబోయిన శాన్వీ అతను కోపంగా చూడ్డంతో నోరు మూసుకుంది.

ఆద్య నేరుగా వాళ్ళున్న వైపే వస్తోంది.

జీవన్ గుండె వేగంగా కొట్టుకొంటోంది.


ఎంతో మంది అమ్మాయిల్ని తనతో తిప్పుకున్న అతనికి ఆద్య తన వైపు వస్తోందన్న ఊహే మత్తు కలిగిస్తోంది.


ఆద్య జీవన్ గ్యాంగ్ ను దాటుకొని ముందుకు వెళ్ళింది.

అప్పుడు గమనించాడు జీవన్ తమకు కాస్త దూరంలో తన ఫ్రెండ్స్ తో ఏదో మాట్లాడుతూ వెళుతున్న రిత్విక్ ని.


వెనకనుండి అతన్ని పిలుస్తూ "ఎక్స్క్యూజ్ మీ .. ఫస్ట్ ఇయర్ సి ఈ సి - ఏ సెక్షన్ క్లాస్ రూమ్ కి ఎలా వెళ్లాలో చెబుతారా? ప్లీజ్.." అంది.


వెనక్కి తిరిగి చూసిన రిత్విక్, ఆద్యను చూసి ఆగాడు.

ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి.. అనుకున్నాడు.

కానీ క్షణంలోనే తేరుకొని, "రండి చూపిస్తాను.." అన్నాడు.

అతనివంక పరిశీలనగా చూసింది ఆద్య.


ఇదేమిటి.. ఇతను తననే డిస్టర్బ్ చేసేలాగా ఉన్నాడు అనుకుంది ఓ క్షణం.

"జస్ట్ ఎలా వెళ్లాలో చెప్పండి చాలు... మీరు శ్రమ తీసుకొని రానక్కర లేదు" అంది ఆద్య తన వెంట రావద్దన్నట్లుగా.


చిన్నగా నవ్వాడు రిత్విక్.

తన పక్కనున్న అమ్మాయిని చూపిస్తూ, "మా పక్కింటి అమ్మాయి. పేరు దీప్య. మీ క్లాస్.. మీ సెక్షన్...తనని అక్కడికే తీసుకొని వెడుతున్నాను" అన్నాడు రిత్విక్.


"హాయ్! ఐ యామ్ ఆద్య" అంటూ దీప్యతో చెయ్యి కలిపింది ఆద్య.


రిత్విక్ అన్నయ్య చెప్పాడుగా.. నా పేరు దీప్య. ఇక ఇతను ఈ కాలేజ్ హీరో.. రిత్విక్. ఇండస్ట్రియలిస్ట్ చక్రధరం గారి అబ్బాయి" అంటూ అతన్ని పరిచయం చేసింది దీప్య.

అతను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి జాపితే ఎలా? తనుకూడా చెయ్యి చాపాలా..

తను మాత్రం నమస్కారం పెడితే బావుంటుందా..ఇదేమిటి..? ఎప్పుడూ లేని ఆలోచనలు?..


ఆద్య ఆలోచనలు తెగక ముందే అతను రెండు చేతులూ జోడించి "నమస్తే. మీరు పరిచయమైనందుకు చాలా ఆనందంగా ఉంది. రండి, క్లాస్ రూమ్ చూపిస్తాను" అన్నాడు.

అతని వెంట నడిచింది ఆద్య.


దూరంనుండి ఇదంతా గమనిస్తున్న జీవన్ ఆవేశంతో రగిలిపోయాడు.

శాన్వీ నవ్వుతూ "ఆ అమ్మాయి నీకు పరిచయమే కాలేదు.. అప్పుడే నన్ను దూరం పెట్టేయాలనుకున్నావా.. వెనకటికెవడో మబ్బులో నీళ్లు చూసి..." అంటూ ఇంకా ఏదో చెప్పబోతు ఉంది.


విసురుగా ఆమె చెంప చెళ్లుమనిపించాడు జీవన్.


ఇంకా ఉంది...


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).

















































180 views1 comment

1 Comment


Bala Krishna • 1 day ago

Hai

Like
bottom of page