కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Love Challenge Episode 12' Telugu Web Series Written By
Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
ఏసీపీ ప్రతాప్ హెచ్చరికతో టివి స్క్రోలింగ్ మారుస్తారు బాకా టివి ఛానల్ వాళ్ళు.
గురుమూర్తి తీరుపై మండిపడతాడు చక్రధరం.
తమ ప్లాన్ లీక్ చేసింది శాన్వీ అని అనుమానించిన జీవన్ రాత్రిపూట ఆమె ఉంటున్న లేడీస్ హాస్టల్ గదిలోకి తన అనుచరులతో వెడతాడు.
ఇక చదవండి…
"హాయ్ జీవన్! ఏమిటి ఈ సమయంలో..ఇలా.. " ప్రశ్నిస్తోన్న శాన్వీ గొంతు రెండు చేతులతో పట్టుకొని గట్టిగా అదుముతున్నాడు జీవన్.
సాగరిక, "ప్లీజ్ జీవన్! వదిలెయ్యి. ఏమైంది అసలు.." అంటూ అతని చేతులు విడిపించడానికి ప్రయత్నించింది.
జీవన్, శాన్వీని అలాగే వెనక్కి నెట్టాడు.
నేల మీద పడబోతున్న శాన్వీని పడకుండా పట్టుకుంది సాగరిక.
"బిహేవ్ యువర్ సెల్ఫ్ మిస్టర్ జీవన్.." కోపంగా అంది సాగరిక.
"నీకు తెలుసా సాగరికా..ఒకప్పుడు శాన్వీ వంక ఎవరైనా కన్నెత్తి చూస్తే వాళ్ళను చంపడానికి కూడా సిద్ధ పడేవాడిని. అలాంటి నన్ను మోసం చేసింది. తనను కొట్టాననే కోపంతో నా ప్లాన్ రిత్విక్ గాడికి చెప్పేసింది. షీ ఈజ్ ఏ చీటర్.." ఆవేశంతో ఊగిపోతున్నాడు జీవన్.
"లేదు జీవన్.. నాకేం తెలీదు. నేను ఆ రిత్విక్ ని అసలు కాంటాక్ట్ చెయ్యలేదు.." అంది శాన్వీ కళ్ళు తుడుచుకుంటూ.
"అది తెలుసుకుందామనే ఇలా సడన్ గా వచ్చాము. ముందుగా చెప్పి వస్తే, జాగ్రత్త పడతావు. నీ ఫోన్ ఇలా ఇవ్వు. చెక్ చేయాలి" అన్నాడు మోటూ.
"మరొకరి ఫోన్ చూడ్డం మ్యానర్స్ కాదు. ఎన్నో పర్సనల్ విషయాలు ఉంటాయి. అవన్నీ మీకెందుకు? అంది సాగరిక.
"ఈ సీన్ లో నీకు డైలాగులు లేవు. మేము వచ్చింది శాన్వీ సంగతి తేల్చుకుందామని. " అన్నాడు చందూ.
కోపంగా సమాధానం ఇవ్వబోతున్న సాగరికను ఆగమని సైగ చేసి, తన ఫోన్ మోటూకి అందించింది శాన్వీ.
అతను ఆ ఫోన్ జీవన్ కి ఇవ్వబోతుంటే "నువ్వే చూడు. కాల్ లాగ్ తో పాటు, వాట్స్ అప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్.. అన్నిట్లో చెక్ చెయ్యి..ఎక్కడో ఒక చోట దొరక్క పోదు.." అన్నాడు అతను.
మోటూ ఆ ఫోన్ చూస్తూ ఉండగా "నీ లాప్టాప్ ఓపెన్ చెయ్యి" అని శాన్వీతో అన్నాడు జీవన్.
లాప్టాప్ ఆన్ కాగానే దగ్గరకు లాక్కుని "పాస్వర్డ్ చెప్పు " అన్నాడు జీవన్.
"జీవన్.."అంది సాన్వీ.
"వింటున్నాను.. పాస్వర్డ్ చెప్పు" అన్నాడతను.
"జీవన్.. అదే నా పాస్వర్డ్ " చిన్నగా చెప్పింది సాన్వీ.
మనసులో ఏమూలో కాస్త బాధ కలిగింది జీవన్ కి.
అనవసరంగా శాన్వీని అనుమానిస్తున్నానా.. అనిపించింది.
కానీ మరెవరు చేసి ఉంటారు..? శాన్వీ బాధ పడితే ఓ సారీ చెప్పేద్దాం.
తనెందుకు సారీ చెప్పడం? మోటూ చేతనో చందూ చేతనో చెప్పిస్తే సరి..
ఇలా ఆలోచిస్తూ లాప్టాప్ చెక్ చేస్తున్నాడు జీవన్.
ఎక్కడా అనుమానించదగ్గ వివరాలు కనిపించలేదు.
పైపెచ్చు ఆమె గ్యాలరీ లో ఉన్నవన్నీ తను, శాన్వీతో ఉన్న ఫొటోలే.
లాప్టాప్ మూసేసి "చెక్ చేసావా.." అని మోటూని అడిగాడు జీవన్.
"చూసాను. రిత్విక్ ని గానీ, దీప్య ఆద్యలను గానీ అసలు కాంటాక్ట్ చెయ్యలేదు. సాగరికకు, మరో అమ్మాయి భవ్యకు కొన్ని వాట్స్ అప్ మెసేజ్ లు ఉన్నాయి. కానీ.."
"కానీ..? చదువు.." అన్నాడు జీవన్.
"ఏమీ లేవు. ఐ లవ్ జీవన్.. అంటూ చాలా మెసేజ్ లు ఉన్నాయి" చెప్పాడు మోటూ.
"పాతవి కాదు . లేటెస్ట్ వి చదువు" అన్నాడు జీవన్.
రెండు మూడు మెసేజ్ లు ఉన్నాయి గానీ .. నువ్వే చదువు.." అంటూ ఫోన్ జీవన్ కి అందించాడు మోటూ.
అవి శాన్వీ, సాగరికకు చేసిన మెసేజ్ లు.
"ఈ రోజు జీవన్ నన్ను చెంపదెబ్బ కొట్టాడు. కానీ నాకెందుకో అతని మీద కోపం రావడం లేదు.."
"జీవన్ నాకు దూరం అవుతున్నాడు.. ఐ మిస్ యు జీవన్.." ఇలా ఉన్నాయి ఆ మెసేజ్ లు.
ఫోన్ శాన్వీకి ఇచ్చి, "నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను శాన్వీ! కానీ ఆద్యను చూసాక నాకు ఇంకెవ్వరూ కనిపించడం లేదు. ఆద్య కోసం ఏమైనా చేస్తాను. ఆమెను ప్రేమిస్తున్నాను" అన్నాడు జీవన్..
మౌనంగా ఉంది శాన్వీ.
సాగరిక మాట్లాడుతూ "ఈ సీన్ లో నాకు డైలాగ్ లేదన్నాడు చందూ. ఐనా ధైర్యం చేసి మాట్లాడుతున్నాను. జీవన్! నువ్వు ఎంతోమంది అమ్మాయిలను నీతో తిప్పుకున్నావ్. వాళ్ళు ఇష్టపడేలా ప్రవర్తించి ఆకట్టుకున్నావ్. కానీ ఆద్య విషయంలో ఆలా ఎందుకు చెయ్యలేక పోతున్నావ్?
ఆమె ఇష్టాలు ఏమిటి..అబ్బాయిలు ఎలా ప్రవర్తిస్తే ఆమెకు నచ్చుతారు.. ఇలా ఆలోచించావా? ఏదో ఒక ప్లాన్ చేసిగానీ ఆమెను ఆకట్టుకోలేవా?" అంది.
"బలవంతుడైన శత్రువును గెలవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. అది మోసమైన సరే.. ద్రోహమైన సరే.. ఇది నా పాలసీ. ఎనీ హౌ.. మోటూ అండ్ చందూ..శాన్వీకి సారీ చెప్పండి" అన్నాడు జీవన్ బయటకు వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ.
శాన్వీ, సాగరికలకు సారీ చెప్పాడు మోటూ.
చందూ మాత్రం, "ఈ సారికి తప్పించుకున్నారు. కానీ ఏదో ఒకరోజు దొరికిపోతారు" అన్నాడు.
"దొరికిపోయింది నువ్వు. సోషల్ మీడియాలో నీ బర్త్ డే ఎప్పుడన్నది తెలిసిపోతుంది. ఒకవేళ అందులో తప్పు పెట్టినట్లు కవర్ చేసినా, లాస్ట్ ఇయర్ గణేష్ నిమజ్జనం రోజు నీ బర్త్ డే పార్టీ జరిగింది. ఆ రోజు ట్రాఫిక్ జాం అయి, వచ్చిన వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు. రిత్విక్ కూడా అటెండ్ అయ్యాడు. మరి ఇప్పుడు రెండు నెలలు ముందుగా సెలెబ్రేట్ చేస్తూ వుంటే డౌట్ రాదా?" అంది శాన్వీ.
"అది జీవన్ ప్లాన్" అన్నాడు చందూ.
"జీవన్ చెప్పినా నువ్వు సరైన సలహా ఇవ్వాలి. బర్త్ డే నీది కదా" అంది శాన్వీ.
"ఓకే . లీవ్ ఇట్" అంటూ తన అనుచరులతో బయటకు నడిచాడు జీవన్.
జీవన్ వాళ్లు బయటకు వెళ్ళగానే అంతవరకూ పక్కగదిలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు లోపలికి వచ్చి గడియ పెట్టారు.
"ఏమవుతుందోనని చాలా భయపడ్డాము. ఏవైనా కేకలు వినిపిస్తే పోలీసులకు ఫోన్ చేద్దామని కూడా అనుకున్నాము. అదృష్టవశాత్తు ఏ గొడవా జరగలేదు" అన్నారు.
అయినా ఇలా అమ్మాయిలుండే హాస్టల్ కి రాత్రిపూట నలుగురైదుగురు మగవాళ్ళు రావడమేమిటి? విమెన్స్ కాలేజీ ముందు పచార్లు చేస్తేనే పోలీసులు తరిమి కొడతారు కదా! వీళ్ళను అడిగేవాళ్ళు లేరా?" అంది మరో అమ్మాయి.
ఆ రాత్రి పడుకున్నాక ముందు రోజు తను మోటూ తో మాట్లాడిన విషయం గుర్తుకు తెచ్చుకుంది శాన్వీ.
జీవన్, ఆద్యను ఇష్ట పడుతూ ఉండటం, ఆమెకు దగ్గర కావడానికి దీప్యను వాడుకోవాలనుకోవడం, అందుకోసం ఆమెను పబ్ కి తీసుకొని వెళ్లాలనుకోవడం.. ఇవన్నీ గమనించిన శాన్వీ రిత్విక్ ని కాంటాక్ట్ చేయాలనుకుంది. జీవన్ అనుమానం తన మీదే ఉంటుంది కాబట్టి అందుకోసం మోటూని వాడుకోవాలని అనుకుంది.
నిన్న కాలేజీ ముగిశాక తనను కలవమని మోటూతో చెప్పింది. ఆమె చెప్పినట్లే ఆ సాయంత్రం శాన్వీని పార్కులో కలిశాడు మోటూ. అతని చేతిలో చేయి వేసి నడుస్తూ "ఏమిటి సంగతులు? ఎన్నాళ్లు ఇలా గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉంటావు.." అని నవ్వుతూ అడిగింది.
సమాధానం చెప్పలేదు మోటూ.
"ఈ రోజు కొత్తగా దీప్య అనే అమ్మాయి చేరింది కదా! నాకైతే ఆ అమ్మాయి నీకు సరిగ్గా సరిపోతుందని పించింది" అంది.
"విషయం డైరెక్ట్ గా చెప్పు శాన్వీ" అన్నాడతను.
అర్థం కానట్టు చూసింది శాన్వీ.
"జీవన్ ఆద్య పట్ల అట్రాక్ట్ అవుతున్నాడు. అతని నిజ స్వరూపం ఆ అమ్మాయికి తెలియాలి. అతని ప్లాన్స్ రిత్విక్ కి తెలియాలి. ఇలాంటి విషయాలు ఆద్యకు, రిత్విక్ కు చెప్పగలిగే చనువు దీప్యకు మాత్రమే ఉంది.
సో.. నేను దీప్యతో పరిచయం పెంచుకొని ఆమెతో ఇవన్నీ రిత్విక్ కి చెప్పించాలి.
ఇదంతా నాకు నచ్చదు శాన్వీ. వేరే ఉద్దేశంతో ఒక అమ్మాయికి దగ్గర కావడం నాకిష్టం లేదు. ఆ అమ్మాయంటే నాకు ఇంటరెస్ట్ లేదు. నేను ఇష్టపడే అమ్మాయి నన్నసలు పట్టించుకోదు" అన్నాడు మోటూ బాధగా.
"వ్వాట్! నువ్వు ఒక అమ్మాయిని ఇష్ట పడుతున్నావా! ఎవరా లక్కీ గర్ల్?" అడిగింది శాన్వీ ఆసక్తిగా.
"అదృష్టం ఆ అమ్మాయిది కాదు. తను ఒప్పుకుంటే నేనే ఆ లక్కీబాయ్" అన్నాడు మోటూ.
"ఊరికే ఊరించక ఆ అమ్మాయెవరో చెప్పు" అంది శాన్వీ.
"శాన్వీ.." అన్నాడు మోటూ.
"చెప్పు" అందమే.
"చెప్పాగా. ఆ అమ్మాయి పేరు శాన్వీ" ఏమాత్రం భయపడకుండా చెప్పాడు మోటూ.
నమ్మలేనట్లు చూసింది శాన్వీ.
"నిజం శాన్వీ! కాలేజీలో చేరినప్పటి నుండి నాకు నువ్వంటే ఇష్టం, చెప్పలేని ఆరాధన. కానీ హీరో పక్కనో, విలన్ పక్కనో ఉండే కామెడీ పీస్ లాంటి నాక్కూడా ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయని ఎవ్వరు అనుకోరు" అన్నాడు మోటూ బాధపడుతూ.
"ఈ మాట ఫైనల్ ఇయర్ వచ్చాకా చెప్పడం? ఈ మూడేళ్లు వృధా చేసావ్" అంది శాన్వీ నవ్వుతూ.
లైఫంటే ఈ కాలేజీ తోనే ముగుస్తోందా.. నిన్ను జీవితాంతం కోరుకుంటున్నాను" అన్నాడు మోటూ.
"వామ్మో! యాభై యేళ్ళనాటి మూవీ ఏదైనా చూసావా? తట్టుకోలేక పోతున్నాను" అంది శాన్వీ.
నవ్వేసాడు మోటూ.
హఠాత్తుగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది శాన్వీ.
నిజం చెబుతున్నాను మోటూ.
ప్రవర్తన సరిగ్గా లేకుంటే ఎంతవాడైనా చీప్ గా కనిపిస్తాడు.
చక్కటి వ్యక్తిత్వంతో నాకు ఈ రోజు నువ్వు ఎంతో ఎత్తులో కనిపిస్తున్నావు.
నేను కూడా ఎదిగితే కానీ నీ ప్రేమను అర్థం చేసుకోలేనేమో" అంది మనస్ఫూర్తిగా.
"జీవన్ చేసే మోసాలు. కుట్రలు జరగనివ్వను శాన్వీ. రిత్విక్ కి ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. ప్రామిస్" అన్నాడు మోటూ.
అన్నట్లుగానే విక్కీ పబ్ లో ఏదో ప్లాన్ చేస్తున్నట్లు రిత్విక్ కి తెలియజేసాడు.
విక్కీకి డ్రగ్స్ సరఫరా చేసే మనిషి వివరాలు కూడా చెప్పాడు. దాంతో పోలీసులు ఆ మనిషిని అదుపులోకి తీసుకొన్నారు.
మోటూ ఏమీ తేలినట్లు ఇందాక జీవన్ తో పాటు తన రూమ్ కి వచ్చాడు.
లైఫ్ లో మొదటిసారిగా మోటూ గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది శాన్వీ.
***
ఆ రోజు అర్థరాత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారాలు చూసే దినకరన్ దగ్గర్నుండి ఫోన్ వచ్చింది గురు మూర్తికి.
అప్పటికే పూర్తి మైకంలో ఉన్నాడు గురుమూర్తి.
ఇదేమిటి.. ఈ సమయంలో కాల్ చేసాడాయన.. అనుకున్నాడు.
ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ముందు నిలబడి 'నమస్తే సర్.. బాగున్నారా' అన్నాడు.
తన మాటలు బాగానే వస్తున్నాయని, తను కంట్రోల్ లోనే ఉన్నానని నిశ్చయించుకొని ఫోన్ తీసాడు.
"ఇదిగో గురుమూర్తి.. ఆ చక్రధరం గారి అబ్బాయి మీద టివిలో ఏదో బాడ్ గా వేయించావట?
అయన మన పార్టీకి బిగ్ డోనార్. ఆయనతో ఎందుకు పెట్టుకున్నావయ్యా? అయన హై కమాండ్ కి చెప్పాడట. వాళ్లు ఒకటే తోముతున్నారు" ఎడాపెడా చివాట్లు పెట్టడం మొదలెట్టాడు దినకరన్.
"ఛానల్ అన్నాక ఏవో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. అప్పుడే సవరణ వేసాము. మా అబ్బాయి స్వయంగా స్టేట్ మెంట్ ఇచ్చాడు" చెప్పాడు గురుమూర్తి.
"ఆ చక్రధరం చాలా తెలివైన వ్యక్తి. అయన నీ జోలికి రాలేదు. కానీ నువ్వు ఆయన్ని రెచ్చగొట్టావ్. అయన నీతో ముఖాముఖీ మాట్లాడాలట. నన్ను ఏర్పాటు చెయ్యమన్నాడు. లేదంటే ఆయనే నేరుగా మీ ఇంటికి వచ్చేస్తాడట." హెచ్చరికగా అన్నాడు దినకరన్.
"చూడండి సార్! ఆ చక్రధరం ప్రతిపక్షంలో చేరేట్టు ఉన్నాడు. అయన గురించి మనం బాధ పడటం దేనికి?" అన్నాడు గురుమూర్తి.
"చేరనివ్వకూడదనే మన వాళ్ళ ప్లాన్. అవసరమైతే నీ ఎంపీ సీటు ఆయనకు కేటాయిస్తారట.
అయన ఒప్పుకోకుంటే కనీసం న్యూట్రల్ గా ఉండమని బ్రతిమలాడు కుంటారట.
అందుకే ఆయనతో మీటింగ్ కి ఒప్పుకో. కాస్త తగ్గి అయినా అతనితో రాజీ చేసుకో. నువ్వు చెబితే నేనే మధ్యవర్తిగా ఉంటాను" వివరించాడు దినకరన్.
నాకు కాస్త టైం ఇవ్వండి. రేపు ఉదయాన్నే మా అబ్బాయితో మాట్లాడి చెబుతాను" అన్నాడు గురుమూర్తి.
"సరే. రేపు పదిగంటలకు నాకు కాల్ హై కమాండ్ నుండి కాల్ వస్తుంది. ఆ లోగా ఏ విషయం నాకు చెప్పు" అని ఫోన్ పెట్టేసాడాయన.
ఇంకా ఉంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Commentaires