top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 14

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Love Challenge Episode 14' Telugu Web Series Written By


Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్




గత ఎపిసోడ్ లో…

దినకరన్ ఫోన్ చేసిన విషయం జీవన్ తో చెబుతాడు గురుమూర్తి.

రాబోయే ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగిశాక, తనే ఈ విషయం రిత్విక్ తో తేల్చుకుంటానని చెబుతాడు జీవన్.

అదే విషయాన్ని దినకరన్ తో చెప్పమంటాడు.

కాలేజ్ కి వెళ్ళిన జీవన్ ను రిత్విక్ ఎప్పటిలానే పలకరిస్తాడు.

మధ్యాహ్నం క్రికెట్ ప్రాక్టీస్ కోసం కాలేజ్ గ్రౌండ్ కి రమ్మంటాడు రిత్విక్.

ఆద్య, దీప్యలను కూడా కాసేపు వచ్చి తమ ప్రాక్టీస్ మ్యాచ్ చూడమంటాడు.

ఇక చదవండి…



జీవన్ తో మాట్లాడి వచ్చాక కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు గురుమూర్తి.

కొంతసేపటికి అతని భార్య ధనలక్ష్మి అతని దగ్గరకు వచ్చి, “మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెబుతాను” అంది.

చెప్పమన్నట్లు గా తల ఊపాడు గురుమూర్తి.

“జరుగుతున్న సంఘటనలు నాక్కూడా తెలుస్తున్నాయి. మనకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడు తప్పు దారిలో నడిచి దెబ్బతినకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే. కుర్రవాళ్ళు సరదాగా తిరగడం వేరే. డబ్బు పలుకుబడి ఉన్న వాళ్లు మరింత విచ్చలవిడిగా తిరగడం కూడా జరుగుతూనే ఉంటుంది.

కానీ ఒక పద్దెనిమిదేళ్ళ కాలేజ్ స్టూడెంట్ ని పబ్ కి తీసుకుని వెళ్లి మత్తుమందు ఇవ్వడం, ఆమెను ఒక గదిలోకి తీసుకుని వెళ్లి ఫోటోలు తీసుకుని బెదిరించాలి అనుకోవడం- ఎంతవరకు సమంజసం? మంచి చెడ్డల సంగతి పక్కన పెట్టండి.

మనవాడు ఒక క్రిమినల్ గా మారితే మనం ఊహించగలమా? వాడిని రాజకీయాల్లోకి తీసుకొని రావాలి అనుకుంటున్నారు. వాడు మంచి పేరు తెచ్చుకోకపోయినా పరవాలేదు. చెడ్డ పేరు లేకుంటే, కనీసం మీ కొడుకుగా రాజకీయాల్లోకి ప్రవేశించవచ్చు. మీరు వాడు చేసే ప్రతిపనికీ వత్తాసు పలకకండి” అని చెప్పింది అతని భార్య ధనలక్ష్మి.

“చూడు ధనం! వాడి స్వభావం ఎలా ఉందంటే వాడు చెప్పేది కాదంటే ఎవరినైనా ఎదిరిస్తాడు. ఇప్పటి వరకూ వాడు ఏ విషయమైనా నా దగ్గర చెబుతున్నాడు. వాడి మీద ఒత్తిడి తెస్తే నాకు చెప్పడం మానేస్తాడు. అయినా నువ్వు చెప్పినట్లు వీలు చూసుకుని వాడికి నచ్చ చెబుతాను” అన్నాడు గురుమూర్తి.

తరువాత దినకరన్ కి ఫోన్ చేసి కొడుకు చెప్పిన మాటలే చెప్పాడు.

ఆయన “నేను చక్రధరం గారిని కనుక్కొని ఇప్పుడే చెబుతాను” అని ఫోన్ పెట్టేశాడు.

మరో అరగంట గడిచాక ఆయనే ఫోన్ చేసి, “చక్రధరం గారితో మాట్లాడాను. ఆయన కొడుకు క్రికెట్ టీం కెప్టెన్ అట కదా! కాబట్టి ఈ టోర్నమెంట్ ముగిసే వరకు ఈ విషయాన్ని పక్కన పెట్టడానికి ఆయన ఒప్పుకున్నారు. కానీ ఈ లోగా తన కొడుకు జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. నీ కొడుకుతో ఆ అబ్బాయి రిత్విక్ జోలికి వెళ్లవద్దని చెప్పు. కొద్ది రోజులు గడిచాక, విషయం పాతబడి పోతే ఆయన మీ జోలికి రాకపోవచ్చు.

హైకమాండ్ తో నేను మాట్లాడతాను. ఏదైనా అవసరమైతే మళ్లీ నేనే కాల్ చేస్తాను” అని చెప్పాడు దినకరన్.

కాస్త కుదుట పడ్డాడు గురుమూర్తి. ప్రస్తుతానికైతే గండం గట్టెక్కినట్టే అనుకున్నాడు.

‘ధనలక్ష్మి చెప్పినట్లు జీవన్ ను నెమ్మదిగా దారిలోకి తెచ్చుకోవాలి. కానీ వాడు విని చస్తే కదా.. అన్నీ తన బుద్ధులే. కొరకరాని కొయ్యలా ఉంటాడు. ఏ దేవుడో దేవతో దయతలిచి వాడి బుద్ధి మారేటట్లు చేయాలి’.

ఆ ఆలోచన వచ్చిందే తడవుగా “ధనం.. ధనం..” అంటూ భార్యను కేకేసి పిలిచాడు.

“ఏమిటండీ! ఫోన్లో మాట్లాడడం అయిందా?” అంటూ వచ్చింది ధనలక్ష్మి.

“నువ్వు రోజూ దేవుడికి పూజ చేస్తావు కదా! అలా చేసేటప్పుడు మన అబ్బాయి మంచి దారిలో పడాలని కాస్త వేడుకుంటూ ఉండు” అని చెప్పాడు.

“ఆ ఆలోచన మీకు ఇన్నాళ్ళకు వచ్చిందా.. మన పెళ్లి అయిన రోజు నుండి మీ గురించీ , వీడు పుట్టాక మీ ఇద్దరి గురించీ ప్రతిరోజూ దేవుడిని వేడుకుంటున్నాను. ఇది ఏళ్లతరబడి జరుగుతూనే ఉంది” అని చెప్పింది ధనలక్ష్మి.

“ ఎంతైనా నువ్వు భార్యగా దొరకడం నా అదృష్టం ధనలక్ష్మీ” అన్నాడు

గురుమూర్తి.

“పెళ్లి అయ్యాక మొదటి సారి నన్ను పొగిడారు. ఈరోజు ఏవో విచిత్రాలు జరగ బోయేటట్లు అనిపిస్తూ ఉంది” అంది ధనలక్ష్మి.

దినకరన్ తో మాట్లాడిన సంగతి కొడుక్కి చెప్పాలనుకున్నాడు గురుమూర్తి.

వెంటనే కొడుక్కి కాల్ చేద్దాం అనుకుని, క్లాసులో ఉంటాడేమో అని మిస్డ్ కాల్ ఇచ్చాడు.

మరి కొంతసేపటికే జీవన్ ఫోన్ చేసి “చెప్పు నాన్నా! అన్నాడు.

“మరేం లేదు రా. ఆ దినకరన్ తో నువ్వు చెప్పినట్లే చెప్పాను. ఆయన చక్రధరం తో మాట్లాడి ఆయన ఒప్పుకున్నట్లు చెప్పాడు. కాబట్టి ప్రస్తుతానికి సమస్య లేదు” అన్నాడు.

“చాలా సంతోషం నాన్నా! అమ్మ పక్కనే ఉందా?” అడిగాడు జీవన్.

“ఉంది. ఫోన్ ఇవ్వనా” అంటూనే ధన లక్ష్మి కి ఫోన్ అందించాడు గురుమూర్తి.

కాలేజీలో ఉండగా కొడుకు ఇంటికి ఫోన్ చేయడం, అందునా తనతో మాట్లాడాలని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది ఆమెకు.

ఆమె ఫోన్ తీసుకున్న వెంటనే “అమ్మా! నువ్వెప్పుడూ మన ఇంటి దగ్గర ఉండే వినాయకుడి గుడి కి వెళ్తూ ఉంటావు కదా. ఇప్పుడు కూడా నా కోసం ఒకసారి వెళ్లి ఒక టెంకాయ కొట్టి రామ్మా ప్లీజ్” అన్నాడు జీవన్.

తాను ఏం వింటున్నదో కొంత సేపు అర్థం కాలేదు ధనలక్ష్మికి.

తేరుకున్నాక “అలాగే నాన్నా! నీ తరఫున ఏవైనా కోరుకోమంటావా” అని అడిగింది ఆమె.

“అమ్మా! మరో రెండు రోజుల్లో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. దాంట్లో బాగా ఆడడం కోసం ఈ రోజు కాలేజీ లో కాసేపు ప్రాక్టీస్ చేస్తున్నాం. అది చూడడానికి చాలా ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. వాళ్లు మెచ్చుకునేలా నేను బాగా ఆడాలని నా తరఫున ఆ దేవుడిని వేడుకో అమ్మా!” అని రిక్వెస్ట్ చేశాడు.

“అలాగే నాన్నా! తప్పకుండా. ఇప్పుడే వెళ్లి నువ్వు అడిగినట్లు కోరుకుంటాను” అని చెప్పింది ఆమె.

భార్య కొడుకుతో మాట్లాడుతున్నంత సేపూ, కొడుకు ఏం అడిగాడో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్నాడు గురుమూర్తి.

ఆమె ఫోన్ పెట్టగానే “ఏమిటీ.. ఏదో గుడికి వెళ్ళాలి అంటున్నావ్?” అని అడిగాడు.

“మన వాడు ఏదో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాడు. దాని విషయం గా గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టమన్నాడు” అని చెప్పింది ఆమె.

“అలాగా.. అవునులే. నాకు కూడా చెప్పాడు, రాబోయే ఆదివారం నాడు క్రికెట్ మ్యాచ్ ఉందట కదా..” అన్నాడు గురుమూర్తి.

“ఆదివారం నాడా.. నాకు అలాగా చెప్పలేదండీ! ఈరోజు మధ్యాహ్నం ఏదో ప్రాక్టీస్ కోసం ఆడతారట. అది చూడటానికి ఎవరో ముఖ్యమైన వాళ్ళు వస్తారట. అందుకోసం ఈ రోజు తను బాగా ఆడేటట్లు దేవుణ్ణి కోరుకోమన్నాడు” అని చెప్పింది ఆమె.

“ఆదివారం జరిగే మ్యాచ్ కి ప్రముఖులు వచ్చే మాట నిజమే. కానీ ఈ రోజు వీళ్ళు చేసే ప్రాక్టీస్ కి వచ్చే ప్రముఖులు ఎవరు ఉంటారబ్బా..” అన్నాడు గురుమూర్తి.

“మీరు టెన్త్ క్లాస్తో ఆపేశారా లేక కాలేజీ చదివారా?” అడిగింది ధనలక్ష్మి.

“ఈ మాట పెళ్లి సంబంధం కుదరక ముందు మీ నాన్న, మా నాన్న ని అడిగి ఉండాలి. ఇప్పుడు గుర్తొచ్చి అడుగుతున్నావా” నవ్వుతూనే అన్నాడు గురుమూర్తి.

“అది కాదు లెండి. చిన్న విషయం కూడా మీకు తెలియకపోతేనూ..” అంది ధనలక్ష్మి .

“ఏమిటో ఆ చిన్న విషయం?” అన్నాడు గురుమూర్తి.

“కాలేజీ అబ్బాయిల దృష్టిలో ప్రముఖులు ఎవరు ఉంటారు? వాళ్లు వెంటబడే అమ్మాయిలు తప్ప” నవ్వుతూ చెప్పి లోపలికి వెళ్లి పోయింది ధనలక్ష్మి.

విషయం అప్పుడు అర్థమైంది గురుమూర్తి కి.

‘ఆ అమ్మాయి కాలేజీలో చేరి రెండు రోజులు అయిందేమో.. అప్పుడే పూర్తిగా ఆ అమ్మాయి మాయలో పడి పోయాడు. ఎటు పోయి ఎటు వస్తుందో..

ఆ అమ్మాయి కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. ఇప్పటివరకైతే ఆ అమ్మాయి రాఘవేంద్ర గారి కూతురని మాత్రమే తెలుసు. మరిన్ని వివరాలు కనుక్కోవాలి. వీలు చూసుకొని ఆ రాఘవేంద్రని ఒకసారి కలవాలి’ అనుకున్నాడు గురుమూర్తి.

***

ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకల్లా గ్రౌండ్ కి చేరుకున్నారు రిత్విక్, జీవన్, మిగిలిన ప్లేయర్స్. వాళ్ళ మిత్ర బృందం కూడా వచ్చేసారు.

మామూలుగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆటగాళ్లు తప్ప మిగతా వాళ్ళు పెద్దగా రారు.

కానీ ఆ రోజు రిత్విక్, జీవన్ ల స్నేహితులు చాలా మంది వచ్చారు.

ఫైనల్ ఇయర్ అమ్మాయిలు కూడా చాలా మంది వచ్చారు.

వాళ్ళ ఫ్రెండ్స్ మరి కొందరు వచ్చారు.

ఆద్య వస్తుందని తెలియడంతో చూడాలనే ఉత్సాహంతో కొందరు వచ్చారు.

క్వార్ట్రర్ ఫైనల్స్ లో ఓడిపోయిన శోభన్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కి సహకరిస్తామని చెప్పడంతో కొంతమందికి ఇంట్రెస్ట్ కలిగింది.

కొంత సేపటికి దీప్య ఒక్కతే వచ్చి, శాన్వీ పక్కన కూర్చుంది.

పక్కన ఆద్య లేకపోవడం దూరంనుంచే గమనించిన జీవన్ నిరాశ పడ్డాడు.

రిత్విక్ వంక తిరిగి, "ఉదయం మన ఎండి గారి అమ్మాయి ఆద్యను కూడా పిలిచినట్లున్నావు.. తను ఇంకా వచ్చినట్లు లేదు" అన్నాడు.

రిత్విక్ "ఆద్య లంచ్ కి ఇంటికి వెళ్ళింది. వాళ్ళ నాన్నతో కలిసి ఇక్కడికి వస్తుందట" అన్నాడు.

"వాట్? రాఘవేంద్రగారు కూడా వస్తున్నారా.." ఆశ్చర్యంగా అన్నాడు జీవన్, ఆద్య వస్తుందని తెలియగానే తన మొహంలో కలిగిన ఆనందాన్ని కవర్ చేస్తూ.

"అవును. తను వస్తున్నాని తెలిస్తే అందరూ ఇక్కడ గుమికూడతారని ఎవరికీ చెప్పవద్దన్నారట." చెప్పాడు రిత్విక్.

ఆద్య వస్తోందన్న సంతోషంతో పాటు ఆమె ప్రోగ్రాం గురించి తను రిత్విక్ ని అడిగి తెలుసుకోవాల్సి వస్తోందన్న బాధ కూడా కలిగింది జీవన్ కి.

రిత్విక్ ప్రస్తుతం క్రికెట్ టీం కెప్టెన్ కావడం ఇందుకు ఒక కారణం.

గత మూడేళ్ళుగా తనే కెప్టెన్ గా ఉన్నాడు.

మొదటి రెండేళ్లు రిత్విక్ క్రికెట్ టీం లోకి రాలేదు.

కానీ తమ కాలేజీ, సెమీస్ కి కూడా రాలేక పోతోందన్న బాధతో గత సంవత్సరం టీం లోకి వచ్చాడు.

అతనికి అనుభవం లేదన్న కారణంతో టోర్నమెంట్ లో అతన్ని స్పేర్ గా ఉంచాడు తను.

చివరి రెండు లీగ్ మ్యాచ్ లలో మాత్రమే అతనికి అవకాశం దక్కింది.

కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు రిత్విక్.

ఆ రెండు మ్యాచ్ లలో సెంచరీలు చేసాడు.

కానీ పాయింట్ల పట్టికలో దిగువన ఉండడంతో వీళ్ళ టీం కి క్వార్టర్ ఫైనల్స్ కి ఆడే అవకాశం రాలేదు.

రిత్విక్ కి మొదటి మ్యాచ్ నుంచే అవకాశం ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేదని అందరూ అభిప్రాయ పడ్డారు.

తన కెప్టెన్సీ పైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి.

రిత్విక్ ని కెప్టెన్ చెయ్యాలని చాలామంది డిమాండ్ చేశారు.

అప్పట్లో అతనితో వివాదం వద్దని తన తండ్రి కూడా చెప్పడంతో కెప్టెన్సీ అతని పరమైంది.

తను తన చెంచాగాళ్లకు టీం లో అవకాశం ఇచ్చే వాడు.

కానీ రిత్విక్ టాలెంట్ ఉండేవాళ్ళకే అవకాశం ఇచ్చాడు.

మొదటిసారి తమ కాలేజ్ టీం సెమీస్ కి వచ్చింది.

ఒక్కసారిగా అక్కడ వున్న వాళ్లలో సందడి మొదలవడంతో ఆలోచనల లోంచి బయటకు వచ్చాడు జీవన్.

ఎండి రాఘవేంద్ర గారి ఆడి కార్ ఆ గ్రౌండ్ లోకి వచ్చి ఆగింది.

కార్లోంచి రాఘవేంద్ర గారితో పాటు అయన సతీమణి నిత్య, కూతురు ఆద్య కూడా దిగారు.

రిత్విక్, జీవన్ లు కారు దగ్గరికి వెళ్లి వాళ్ళను రిసీవ్ చేసుకున్నారు.

గ్రౌండ్ లోకి వచ్చిన రాఘవేంద్ర ఆటగాళ్లందరినీ తన దగ్గరకు రమ్మన్నారు.

ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


43 views0 comments

Comentarios


bottom of page